దసరా పండుగను ప్రతీ ఒక్కరూ పెద్ద ఎత్తున జరుపుకుంటుంటారు. విజయదశమి తమ జీవితాల్లో కొత్త విజయాలను తీసుకురావాలని కోరుకుంటారు. దసరా అనగానే గుర్తుకు వచ్చేది జమ్మిచెట్టు. కొన్ని ప్రాంతాల్లో జమ్మి ఆకులు ఇచ్చి పుచ్చుకునే సాంప్రదాయం ఉంటుంది. అదేవిధంగా పాలపిట్ట దర్శనానికి కూడా ప్రాముఖ్యత ఉంటుంది. దసరా రోజు కచ్చితంగా పాలపిట్టనే చూడాలని భావిస్తుంటారు.సాధారణంగా చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే పాలపిట్టలు కనిపిస్తుంటాయి. అందుకే జమ్మి ఆకుల కోసం వెళ్లినప్పుడు ఈ పక్షులు చూస్తుంటారు.
Advertisement
నీలం, పసుపు రంగులో ఉండే ఈ పక్షి రూపం కూడా చూడడానికి చాలా బాగుంటుంది. పాలపిట్టను ఆ పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తుంటారు. అందుకే దసరా రోజు పాలపిట్టని చూస్తే ఆ ఏడాది అంతా విజయం అందుతుందని ఒక నమ్మకం. అంతేకాదు.. పాలపిట్టను చూడడం వెనుక పురాణ గాథలు కూడా ఉన్నాయి. త్రేతా యుగంలో శ్రీరాముడు రావణాసురుడుతో యుద్ధం చేయడానికి బయలుదేరిన సమయంలో దసరా రోజునే పాలపిట్ట ఎదురువస్తుంది. ఆ తరువాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించి సీతమ్మను రావణుడి దగ్గర నుంచి తీసుకొస్తాడు. ఆ తరువాత అయోధ్యకి రాజు అవుతాడు. పాలపిట్టను విజయానికి గుర్తుగా భావించడానికి ఇది ఒక కారణం.
Advertisement
ఇక మహాభారతం ఆధారంగా పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు జమ్మిచెట్టు మీద ఆయుధాలను దాచి పెడుతారు. ఆ ఆయుధాలకు ఇంద్రుడు పాలపిట్ట రూపంలో ఉండి కాపలా కాశాడని పురాణ గాథలు చెబుతున్నాయి. అలాగే అజ్ఞాతవాసం ముగించుకొని రాజ్యానికి తిరుగు ప్రయాణమైన సమయంలో పాలపిట్ట దర్శనమిస్తుంది. ఇక అప్పటి నుంచి పాండవుల కష్టాలన్ని తొలగిపోయి కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని తిరిగి పొందుతారు. దీంతో పాలపిట్ట విజయానికి ప్రతీక అని భావిస్తూ దసరా రోజున పాలపిట్టను చూడడం పూర్వ కాలం నుంచి ఆచారంగా వస్తుంది.
Also Read : మిస్సమ్మ సినిమాను మిస్ చేసుకున్న అలనాటి స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?