తొలిసారిగా అత్యంత అధునాతనమైన ‘బ్రీతింగ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ను హైదరాబాద్ నగరంలోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు నిర్వహించారు. బ్రీతింగ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే.. దాత నుంచి సేకరించిన ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్లను తొలగించి, వాయుమార్గాలను శుభ్రం చేసి, వెంటిలేటర్ సాయంతో కృత్రిమంగా శ్వాసించేలా చేసి.. మరింత మెరుగైన స్థితిలో ఉంచి బాధితులకు అమర్చడం. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఆగస్టు నుంచి ఆక్సిజన్‌పైనే ఆధారపడి జీవిస్తున్న ఒక వ్యక్తికి కిమ్స్ వైద్యులు ఈ ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స నిర్వహించారు.
Advertisement
ఆగస్టు నుంచి అతడు రోజూ 10 లీటర్ల ఆక్సిజన్ తీసుకుంటున్నాడని వైద్యులు వివరించారు. సాధారణంగా దాత నుంచి సేకరించిన ఊపిరితిత్తులను బాధితులకు చేర్చే క్రమంలో మార్గమధ్యంలోనే అవి దెబ్బతినడం, ఇన్ఫెక్షన్ బారిన పడడం వంటి సమస్యలుంటాయి. దీనివల్ల.. సేకరించిన ఊపిరితిత్తుల్లో కొన్ని నిరుపయోగమవుతుంటాయి. కొన్నింటి పనితీరు తగ్గుతుంది. అందుకే మార్పిడి అవయవాలను గ్రీన్‌కారిడార్లు ఏర్పరచి మరీ ఆగమేఘాల మీద ఆస్పత్రులకు చేరుస్తుంటారు. ఈ సమస్యలేవీ లేకుండా ఉండడానికే ఈ విధానాన్ని ఎంచుకున్నట్టు కిమ్స్ వైద్యులు తెలిపారు.
Advertisement
దాతల నుంచి సేకరించిన ఊపిరితిత్తులను బాధితులకు అమర్చడానికి తీసుకెళ్లే క్రమంలో భాగంగా వాటిని ‘ఆర్గాన్ రీకండిషనింగ్ బాక్స్’ అనే పెట్టెలో పెడతారు. ఈ పెట్టెలు.. హెర్మెటికల్లీ సీల్డ్. అంటే గాలి కూడా చొరబడనంత పటిష్ఠమైనవి. ఆ బాక్సుల్లో ఊపిరితిత్తులను పోషకాలు, యాంటీబయాటిక్స్‌తో కూడిన ద్రవంలో ఉంచుతారు. అప్పటికే ఆ లంగ్స్‌లో ఏవైనా ఇన్ఫెక్షన్లుంటే యాంటీబయాటిక్స్ వల్ల పోతాయి. అనంతరం వెంటిలేటర్ సాయంతో ఆ ఊపిరితిత్తులను కృత్రిమంగా శ్వాసించేలా చేస్తారు. ఊపిరితిత్తుల్లోని వాయుమార్గాలను బ్రాంకోస్కోపీ ద్వారా శుభ్రం చేస్తారు. ఆ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి పలు పరీక్షలు చేస్తారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యనిపుణుల బృందం పర్యవేక్షణలోనే ఇదంతా చేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల.. బాధితులకు మెరుగైన ఊపిరితిత్తులు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా వారి శరీరం ఆ అవయవాన్ని సజావుగానే స్వీకరిస్తుంది.
బాధితుల శరీరాల్లో అది ఎక్కువకాలం పనిచేస్తుంది. ఈ పరిజ్ఞానంపై ఆయన 50 మంది స్పెషలిస్టులతో ఆరునెలలుగా కృషిచేస్తున్నారు. అమెరికా, ఆస్ట్రియా, కెనడా వంటి కొన్ని దేశాల్లో, అతి కొద్ది ఆస్పత్రుల్లోనే ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నట్టు డాక్టర్ సందీప్ వెల్లడించారు. ఈ పద్ధతిలో ఊపిరితిత్తులను కండిషనింగ్ చేయడం వల్ల బాధితుల్లో అవి ఎక్కువకాలం పనిచేస్తాయని కిమ్స్ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ విజిల్ రాహులన్ తెలిపారు. తమ వైద్యులను కిమ్స్ ఆస్పత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ అభినయ్ బొల్లినేని అభినందించారు. దాత నుంచి సేకరించిన ఊపిరితిత్తులను ఆరు నుంచి ఎనిమిది గంటలలో మార్పిడి చేయాలి. కాస్త ఆలస్యమైనా ఆ అవయం దెబ్బతింటుంది. అలా కొద్దిగా ఆలస్యమైనా ఈ పద్ధతి వల్ల.. అవయవాలు ఉపయోగపడతాయని డాక్టర్ శ్రీనివాస్ రాయపాటి వివరించారు. ఊపిరితిత్తులను అనుకున్న సమయంలో రోగి వద్దకు చేర్చని పక్షంలో ఈ టెక్నాలజీ ఏ మేరకు పనిచేస్తుందో పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు.