కిరాణా షాప్‌కి వెళ్లి పది రూపాయల కాయిన్ ఇస్తే చెల్లదని వెనక్కి ఇస్తుంటారు. కూరగాయలకు వెళ్లినప్పుడు షాప్ యజమాని రూ.10 నాణెం ఇస్తే తీసుకునేందుకు సామాన్యులు వెనకాడుతుంటారు. రూ.10 కాయిన్ చెల్లుతుందని కొందరు, చెల్లదని మరికొందరూ ఇలా వాదనలు చాలాకాలంగా ఉన్నవే. వాదనలు మాత్రమే కాదు.. కొన్నిసార్లు గొడవలు కూడా జరుగుతున్నాయి. రూ.10 నాణెం చెల్లుబాటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలాసార్లు ఓ క్లారిటీ కూడా ఇచ్చింది.
దేశవ్యాప్తంగా పది రూపాయల నాణాన్ని ఎవ్వరూ కూడా తీసుకోవడం లేదు. ముఖ్యంగా రూపాయి, రెండు, ఐదు రూపాయల నాణాలు చెల్లుతున్నప్పుడు రూ.10 నాణాన్ని ఎందుకు చెల్లుతలేవంటే. . ముఖ్యంగా వాటిని బ్యాంకులు తీసుకోకపోవడమే అని తెలుస్తోంది. నాణాలలో భారీ ఎత్తున నకిలీవి తయారవుతున్నాయనే అనుమానం రావడంతో ఈ నాణాన్ని తీసుకోవడం లేదు. తేలికగా ఉన్న రూ.10 నోటు ఉండగా.. కాయిన్ ఎందుకు అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. నకిలీవి తయారవుతున్నాయని బ్యాంకులు పేర్కొంటే.. కేవలం రూ.10 కాకుండా కాయినన్స్ అన్నీ నకిలీవి అని పేర్కొంటే ప్రమాదంలో పడుతారని బ్యాంకులు వెల్లడించడం లేదు.
Advertisement
Advertisement
కిరాణ షాపులు చెల్లవని.. ప్రజలు చెల్లుతాయి అని అయోమయానికి గురవుతుండగా.. రూ.10 నాణెం చెల్లుబాటు అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటనలు చేస్తూనే ఉంది. అయితే రూ.10 నాణెం చెల్లదంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కూడా ఆర్బీఐ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్ బంకుల్లో రూ.10 కాయిన్స్ చాలా రోజుల నుంచి మూలిగిపోతున్నాయని పేర్కొంటున్నారు. కాయిన్స్ తీసుకోకుంటే చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ అధికారులు ప్రకటించినా కానీ ఎవ్వరు పట్టనట్టే వ్యవహరించడం గమనార్హం.
అయితే తాజాగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు ఇచ్చే రూ.10 నాణాలను తీసుకోవాలని కండక్టర్లకు టీఎస్ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. రూ.10 నాణాలు చెల్లడం లేదని.. కొంతమంది కండక్టర్లు వాటిని నిరాకరిస్తున్నారు అని.. సంస్థకు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు రావడం, సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తుండడంతో మరొకసారి అన్నీ డిపో మేనేజర్లను అలెర్ట్ చేసింది. అన్ని ఆర్టీసీ బస్సుల్లో రూ.10 కాయిన్ తీసుకోవాల్సిందే అని ఆ సంస్థ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.