తెలంగాణ కి చెందిన పదో తరగతి విద్యార్థులకు ఓ శుభవార్త అనే చెప్పాలి. ఇటీవల పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రశ్న పత్రాలలో మార్పులు చేర్పులను నిర్ణయించిన విషయం విధితమే. ఈ మేరకు ప్రశ్న పత్రాల్లో మార్పులతో కూడిన కొత్త మోడల్ పేపర్లను విడుదల చేశారు. NCERT అధికారిక వెబ్ సైట్ లో మోడల్ పేపర్లు అందుబాటులో ఉంచారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం కొత్త మోడల్ పేపర్లను, బ్లూ ప్రింట్ ని సరఫరా చేయనున్నట్టు సమాచారం. గతంలో పదోతరగతి పరీక్షలో ఉన్నటువంటి 11 పేపర్లను 6 పేపర్లకు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ 6 పేపర్లకు సంబంధించి మోడల్ పేపర్లను బ్లూ ప్రింట్ ని విద్యాశాఖ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.
Advertisement
ముఖ్యంగా వ్యాసరూప, సూక్ష్మరూప ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయంటూ.. విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి తీసుకురావడంతో పదోతరగతి ప్రశ్నపత్రంలో మార్పులను తీసుకొచ్చారు. పరీక్షకు సంబంధించినటువంటి పలు ప్రశ్నలు, సమాధానాలకు మార్కులను తెలియజేసే బ్లూ ప్రింట్ కూడా విడుదల చేసారు. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు రెండేళ్లు పరీక్షలను రాయలేదు. దీంతో విద్యార్థుల సామర్థ్యాలు తగ్గిపోయాయని.. పరీక్ష విధానంలో మార్పులు చేయాలని.. ఛాయిస్ పెంచాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో.. విద్యాశాఖ తాజాగా ఇంటర్నల్ ఛాయిస్ ని తొలగించింది. వ్యాసరూప ప్రశ్నలకు సంబంధించి.. 6 ప్రశ్నలలో కేవలం 4 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలని కొత్త ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో మిగిలిన రెండు సెక్షన్లలో ఒక్కో ప్రశ్నకు మార్కుల కేటాయింపు మారిపోయింది. ఈ మార్పు తెలుగు, ఇంగ్లీషు, హిందీ సబ్జెక్టులకు మాత్రం వర్తించదు. గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్ట్ లకు మాత్రం వర్తిస్తుంది. ఏప్రిల్ లో నిర్వహించే వార్షిక పరీక్షలతో పాటు 2023-24 విద్యాసంవత్సరానికి మాత్రమే ఈ రూల్ వర్తిస్తుందని ఉత్తర్వులలో వెల్లడించారు.
Advertisement
ఇక ప్రశ్నల మార్పులు పదో తరగతితో పాటు 9వ తరగతికి కూడా వర్తించనున్నాయి. డిసెంబర్ 28, 2022న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. వ్యాసరూప ప్రశ్నల సెక్షన్ లో గతంలో ఇంటర్నల్ ఛాయిస్ మాత్రమే ఉండేది. గతంలో 12 ప్రశ్నలు ఉండగా.. వాటిలో కేవలం 6 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉండేది. ప్రస్తుతం ప్రశ్నల సంఖ్యను 6 కి తగ్గించారు. అందులో కేవలం 4 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాస్తే సరిపోతుంది. గతంలో 5 మార్కులుండగా.. వీటికి ప్రస్తుతం 6 మార్కులకు పెంచారు. గతంలో 3 మార్కులున్నటువంటి ప్రశ్నలకు ప్రస్తుతం 4 మార్కులు పెంచారు. ఇక అతి స్వల్ప ప్రశ్నల విభాగంలో గతంలో మాదిరిగానే 6 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కలిపారు. ఆబ్జెక్టివ్ విభాగంలో గతంలో మాదిరిగా 20 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో దానికి ఒక మార్కు కేటాయించారు.
సాధారణంగా పదో తరగతి పరీక్షలు అంటే విద్యార్థుల్లో భయం ఉంటుంది. విద్యార్థుల తల్లి దండ్రులు కొంచెం భయపడుతుంటారు. అప్పటివరకు బోర్డు ఎగ్జామ్స్ రాయని విద్యార్థులు తొలిసారిగా బోర్డు ఎగ్జామ్స్ రాయడంతో కాస్త టెన్షన్ పడుతుంటారు. ఎప్పుడైనా జనవరి తొలి వారంలోనే పదోతరగతి మాదిరి ప్రశ్న పత్రాలను రూపకల్పన చేపడుతున్నారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి సబ్జెక్ట్ నిపుణులతో గోప్యంగా మొత్తం 12 సెట్ల ప్రశ్న పత్రాలను రూపొందిస్తారు. ఇందులో నుంచి మూడింటిని ఎంపిక చేస్తారు. పేపర్ లో మార్పులు చేపట్టాల్సి ఉండడంతో ఈ ప్రక్రియ ఇంతవరకు చేపట్టలేదు. చాయిస్ పెంచడంతో పాటు వ్యాసరూప ప్రశ్నల సంఖ్యను కుదించడంతో ఈ మేరకు పేపర్ల రూపకల్పన చేపట్టనున్నారు. పదోతరగతి పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్ 03 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఎంపిక చేసే మూడు సెట్ల ప్రశ్న పత్రాలను ఫిబ్రవరి నెలలో చివరి నాటికి ప్రింటింగ్ కి పంపించాలని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ప్రశ్న పత్రాల రూపకల్పన చేపట్టి.. ఫిబ్రవరి మొదటి వారం కల్లా ఒక్కో సబ్జెక్ట్ లో 12 సెట్ల నుంచి మూడింటిని ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి నెలాఖరి వరకు ఎంపిక చేసిన ప్రింటింగ్ ప్రెస్ కి పంపించనున్నారు. మార్చి మొదటి వారం వరకు పేపర్ ముద్రణ పూర్తి చేసే ఆలోచనలో అధికారులు కసరత్తులు చేపడుతున్నారు.