ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ప్రస్తుతం చాలా రసవత్తరంగా మారాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి ఈ సారి అధికారం మాదంటే మాది అని పేర్కొంటున్నాయి. వైసీపీ 175 సీట్లు మావే అంటే.. టీడీపీ-జనసేన కూటమి ప్రజలు మా వైపే ఉన్నారని.. అధికారంలోకి మేమే వస్తామని చెబుతున్నారు. అయితే త్వరలో ఏపీలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Advertisement
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఏపీ ప్రజల ఉచిత పథకాల కంటే అభివృద్ధికి పట్టం కడతారని జోస్యం చెప్పారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావుని జగన్ ఫాలో అవుతున్నారని.. తెలంగాణలో కేసీఆర్ కి ఎదురైన పరాభవమే ఆంధ్రలో జగన్ కూడా ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఉచిత పథకాల ద్వారా ప్రజలకు డబ్బు పంచి ఎన్నికల్లో గెలుస్తామని అనుకోవడం మూర్ఖత్వం అంటూ కౌంటర్ విసిరారు.
Advertisement
ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైఎస్సార్ సీపీ గెలుపు కోసం పని చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన టీమ్ బాధ్యతల నుంచి దూరంగా ఉంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనుండటంతో జగన్ పై ప్రశాంత్ కిషోర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి కోసం పని చేస్తున్నట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో జరుగబోయే ఎన్నికల్లో ఏపీలో ఎవ్వరూ విజయం సాధిస్తారో వేచి చూడాలి మరీ.
Also Read : తల్లిదండ్రులపై అమానుషంగా ప్రవర్తించిన కొడుకు.. తల్లి చాతిపై తన్నీ మరీ..!