టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ల పెళ్లి చేసుకోనున్నారు అంటూ నెట్టింట పుకార్లు మళ్ళీ షికార్లు చేస్తున్నాయి. వీరి ప్రేమను ఇరు పెద్దలు కూడా ఆశీర్వదించారని ఇక వెళ్లే తర్వాయి అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఫిబ్రవరిలోనే విజయ్ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం జరగనుంది అంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు, కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లపై విజయ్ దేవరకొండ టీమ్ స్పందించింది.విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఏమాత్రం నమ్మవద్దని కోరింది.
Advertisement
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో జంటగా కనిపించారు విజయ్, రష్మిక. ఈ రెండు సినిమాల్లో రష్మిక, విజయ్ లు స్క్రీన్ ప్రజెన్స్ అందరినీ ఆకట్టుకుంది. చాలామందికి ఈ జోడి ఫేవరెట్ గా మారిపోయింది. అదే సమయంలో విజయ్, రష్మికలు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. వీరు తరచూ పార్టీలు, ఫంక్షన్లు, డిన్నర్లకు కలిసి వెళుతుండటంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు తమ డేటింగ్ వార్తలను ఖండిస్తూ వస్తున్నారు విజయ్, రష్మిక. తామిద్దరం మంచి స్నేహితులమంటూ పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. అయినా ఈ వార్తలు ఆగడం లేదు. తాజాగా మరోసారి విజయ్, రష్మికల ఎంగేజ్మెంట్, పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఎప్పటిలాగే విజయ్ టీమ్ వీటిని కొట్టి పారేసింది.
Advertisement
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఖుషి సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు విజయ్ దేవరకొండ. గతేడాది విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ గా రానున్నాడు రౌడీ బాయ్. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రష్మిక విషయానికొస్తే.. ప్రస్తుతం ఇండియాలో ది మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ ఈ ముద్దుగుమ్మేనని చెప్పుకోవచ్చు. ఇటీవల యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక, రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా ఏకంగా రూ.800 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో రష్మిక నటిస్తున్న పుష్ప 2 పైనే అందరి దృష్టి ఉంది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!