తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంగళవారం అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలు, డిసిహెచ్వోలు, సూపర్డెంట్ లు, పి.హెచ్.సి ల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హరీష్ రావు మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని దవాఖానాల్లో అన్ని రకాల వసతులు కల్పించిందని తెలిపారు. వాటిని పూర్తిగా వినియోగించుకోవాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప హైదరాబాద్ కు రిఫర్ చేయవద్దని సూచించారు.
Advertisement
Advertisement
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గర్భిణీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కరోనా బాధితుల కోసం కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, వార్డు ఏర్పాటు చేయాలని సూచించారు. బాధితులకు అత్యవసర సేవల కోసం కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు వార్డులు కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా జిల్లాలో వ్యాక్సినేషన్ మరియు కరోనా పరిస్థితులను హరీష్ రావు సమీక్షించారు.
అదేవిధంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టే వరకు రాష్ట్రంలోని బస్తీ దవాఖానలు, పీహెచ్సీలు ఆదివారం కూడా పని చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు రాత్రి పది గంటల వరకు వ్యాక్సినేషన్ చేపట్టాలని ఆదేశించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వైద్య సిబ్బంది ఖచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. కరోనా లక్షణాలతో ఎవరు వచ్చినా కూడా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారికి కుట్లు ఇవ్వడంతో పాటు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఉండాలని వైద్య అధికారులకు సూచించారు.