మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరగడంతో తూటలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. జవాన్లు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు చోటు చేసుకోవడంతో భారీగానే ప్రాణనష్టం జరిగినట్టు తెలుస్తోంది. శనివారం ఉదయం నుంచి జరిగిన ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు దాదాపు 20 మంది మావోయిస్టులు మరణించినట్టు సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Advertisement
Advertisement
ఈ ఘటనలో నలుగురు జవాన్లు కూడ గాయపడ్డారని గడ్చిరోలి ఎస్పీ వెల్లడించారు. మహారాష్ట్ర, ఛతీస్గడ్ సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీప్రాంతంలో జవాన్లు శనివారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో జవాన్లు, మావోయిస్టుల మధ్య పరస్పరం దాడులు ప్రతి దాడులు జరిగాయి. ఘటన స్థలంలో ఇప్పటివరకు 26 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమాకోరేగావ్ అల్లర్ల కేసులో నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొన్న మావోయిస్టు నేత మిలింద్ తెల్తుంబ్డే కూడ ఎదురు కాల్పుల్లో మరణించినట్టు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్గార్ పరిషత్-బీమా కొరెగావ్ అల్లర్ల కేసులో పుణే పోలీసులు తెల్తుంబ్డేను వాంటెడ్ నిందితుల జాబితాలో చేర్చారు .