నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ సీట్లకు పోటీ పడే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని నేషనల్ మెడికల్ కమిషన్ తొలగించింది. ఇప్పటివరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయించిన గరిష్ట వయోపరిమితి ఎంబీబీఎస్ సీట్లకు పోటీపడే అభ్యర్థుల వయస్సు 25 ఏళ్ల లోపుగా ఉండగా.. ఎస్సీ, ఎస్టీలకు మరొక అయిదేళ్లు అంటే 30 ఏళ్లుగా ఉంది. అక్టోబర్ 21, 2021న జరిగిన 4వ ఎన్ఎంసీ సమావేశంలో NEET-UG పరీక్షలో హాజరయ్యేందుకు ఎటువంటి నిర్ణీత గరిష్ట వయోపరిమితి ఉండకూడదు అని నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
ఈమేరకు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్, 1997 పై నిబంధనలను సవరించడానికి అధికారిక నోటిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించామని నేషనల్ మెడికల్ కమిషన్ తెలిపింది. ఎన్ఎంసీ చైర్ పర్సన్ డాక్టర్ సురేశ్ చంద్ర ఆమోదం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నది. విదేశాల్లో వైద్య విద్య అభ్యసించాలనుకునేవారికి ఈ వయస్సు అర్హతల సడలింపు బాగా ఉపయోగపడే అవకాశముంది. ఈ నిర్ణయం ఔత్సాహిక వైద్యులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. దేశంలో వైద్య విద్యను బలోపేతం చేయడంలో మరింత సహాయపడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ట్వీట్ చేశారు.