ఆయన కేవలం నాదస్వర విద్యాంసుడే కాదు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు కూడా. మారుమూల ప్రాంతంలో జన్మించి సంగీతాన్నే దైవంగా భావించి చివరి వరకు సంగీత ప్రపంచంలోనే జీవించారు ఆయన. ఎన్ని సత్కారాలు అందుకున్న సామాన్య జీవితాన్ని గడిపారు. ఆయనే పద్మ శ్రీ పురస్కారం వరించిన షేక్ హసన్ సాహెబ్. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం గోసవీడులో 1928 జనవరి 01న మీరా సాహెబ్, హసన్ బీ దంపతులకు చివరి సంతానంగా ఆయన జన్మించారు. ఎనిమిదవ ఏట నుంచే సంగీత సాధన ప్రారంభించారు. 14వ ఏటా బ్రిటీషు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేసి జైలు పాలయ్యారు. జైలులో కూడా గీతాలాపన చేసేవారు. ఆయన స్వర మాదుర్యానికి అధికారులు మెచ్చుకొని జైలునుంచి విడుదల చేసారు.
Advertisement
Advertisement
గుంటూరు జిల్లా చిలుకలూరిపేటలో ప్రముఖ సంగీతవిద్యాంసుడు చిన మౌలాసాహెబ్ వద్ద వాద్య సంగీతాన్ని, ప్రముఖ గాయకుడు బాల మురళీకృష్ణ తండ్రి పట్టాబిరామయ్య వద్ద గాత్రం నేర్చుకున్నాడు. 1950 నుంచి 1996 వరకు భద్రాచలం రామాలయంలో ఆస్థాన విద్వంసకుడిగా పని చేశారు. 1983 తిరుమల, తిరుపతి దేవస్తానంలో నాదస్వరం వినిపించారు. స్వయంగా విద్వంసుడే కాక ఎంతో మందికి నాదస్వరంలో శిక్షణ ఇచ్చారు. హిందూ, ముస్లింల ఐక్యత కోసం కృషి చేశారు. రాముడు, అల్లా ఒక్కరే అని ఎప్పుడూ చెబుతుండేవారు. తవ్ర అనారోగ్యంతో 2021 జూన్ 23న తిరువూరులో తుదిశ్వాస విడిచారు. కేంద్ర ప్రభుత్వం 2022 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇటీవల ఆయన మరణాంతరం పద్మ శ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. మంచి మాటే ప్రతి మనిషికి ఆభరణమని ఇచ్చిన మాట తప్పడం అంటే మనిషి మరణించడంతో సమానం అని ఆయన ఎప్పుడు పేర్కొనేవారు. షేక్ హసన్ ఓ ధన్యజీవి.