ఉమ్మడి రాజధాని విషయంలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది మా పార్టీ విధానం కాదన్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు బొత్స సత్యనారాయణ. రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. తాను ముఖ్యమంత్రిని కాకుండా చిరంజీవి అడ్డుకున్నారని ఆరోపించారు.
Advertisement
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత రోషయ్యను సీఎం చేశారని.. ఆ పదవీలో తాను కొనసాగలేనని పెద్దాయన చెప్పిన తరువాత పార్టీ నేతలు చాలా మంది సీఎం అవ్వాలని చూశారని.. ప్రయత్నించారని తెలిపారు. సీనియర్ మంత్రిగా, పీసీసీ చీఫ్ గా ఉన్న తనకు సీఎం పదవీ వస్తుందనుకున్నానని.. కానీ అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారని గుర్తు చేశారు. సీఎం ఎంపిక విషయంలో తెర వెనుక ఏదో జరిగిందనే అర్థం బొత్స మాటలతో అర్థం అవుతోంది. సీఎం ఎంపిక ప్రస్తావన వచ్చినప్పుడు ప్రజారాజ్యం పార్టీని పరిగణలోకి తీసుకున్నారని.. ఆ సమయంలో చిరంజీవి తనకు మద్దతుగా నిలవలేదన్నది బొత్స కోపానికి కారణం అని తెలుస్తోంది.
Advertisement
మరోవైపు కాంగ్రెస్ లో ప్రజారాజ్యం అప్పటికీ విలీనం కాలేదని.. తరువాత తానే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించానని సత్తిబాబు గుర్తు చేశారు. ఒకవేళ కాంగ్రెస్ లో చేరకపోయి ఉంటే చిరంజీవి సీఎం అయ్యేవారన్నది బొత్స అభిప్రాయమేమో. రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమాల వైపు వెళ్లిన చిరంజీవి పేరును దాదాపు పదేళ్ల తరువాత బొత్స ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యల వెనుక వైసీపీ వ్యూహం ఏమైనా దాగి ఉందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : ఆసరా పెన్షన్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి.. కాగ్ సంచలన రిపోర్ట్