Home » స్టార్స్ ఎవ్వరూ లేకున్నా.. ఆ సినిమా సంవత్సరం ఆడిందనే విషయం మీకు తెలుసా ?

స్టార్స్ ఎవ్వరూ లేకున్నా.. ఆ సినిమా సంవత్సరం ఆడిందనే విషయం మీకు తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

ఒకప్పుడు మనుషుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉండేవి. కుటుంబంలో బంధాలకు, అనుబంధాలకు విలువ వుండేది. రాను రాను అవి అంతరించిపోతూ ఉన్న తరుణం, తల్లిదండ్రులను పట్టించుకోకుండా తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకులు సమాజంలో వేళ్ళూనుకుంటున్న రోజులు, చివరి దశలో ఉన్న తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టడానికి కూడా ఆలోచించే కొడుకులు పుట్టుకొస్తున్న రోజులు అవి.. ఈ పరిస్థితిని సరైన సమయంలో ఒడిసి పట్టుకొని ఓ కొత్త దర్శకుడు తీసిన సినిమా అందర్నీ ఆలోచింపజేసింది.  ఆ సినిమానే తాత-మనవడు.

Advertisement

ఈ సినిమా విచిత్రమైన ప్రయాణం అనే చెప్పాలి. ఈ సినిమా ద్వారానే డైరెక్టర్ దాసరి నారాయణరావు దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పటికే దాదాపు 50 సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, కథకుడిగా, మాటల రచయితగా పనిచేసిన దాసరి నారాయణరావులోని ప్రతిభను గుర్తించిన కె. రాఘవ.. మంచి కథ తెచ్చుకుంటే డైరెక్టర్‌గా అవకాశం ఇస్తానని చెప్పారు.  ఆరోజుల్లో దర్శకుడిగా ఛాన్స్‌ రావాలంటే నిర్మాతను మెప్పించడమే కాదు.. డిస్ట్రిబ్యూటర్‌ని కూడా ఒప్పించాలి. దర్శకుడు కొత్తవాడు కావడంతో ఎందుకొచ్చిన రిస్క్‌ అనుకున్న ఆ పంపిణీదారుడు కథ నచ్చలేదని రాఘవకు చెప్పారు. మరో డిస్ట్రిబ్యూటర్‌ కథ విని ఓకే అన్నారు. ఇలా ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని 1972లో ‘తాతమనవడు’ షూటింగ్‌ మొదలైంది.  తొలుత తాత పాత్రకి ఎస్.వీ.రంగారావు, మనవడి పాత్రకు శోభన్ బాబు అనుకున్నారు.

Advertisement

కానీ చివరికీ మనవడి పాత్రలో రాజబాబు నటించాడు. హాస్యపాత్రలు చేసే రాజబాబుకి సినిమాలోని ప్రధాన పాత్ర ఇవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమాలో నాగభూషణం కోసం ఓ క్యారెక్టర్‌ సృష్టించారు దాసరి. ఆ క్యారెక్టర్‌ని అతనితోనే చేయించాలనుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత రాఘవకు చెప్పారు దాసరి. ఆయన దానికి ఓకే చెప్పారు. రాఘవ నిర్మించిన సినిమాలన్నింటికీ ఎస్‌.పి.కోదండపాణి సంగీతాన్ని అందించారు. అయితే ‘తాతమనవడు’ చిత్రానికి మాత్రం రమేష్‌ నాయుడుని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పెట్టుకున్నారు దాసరి. ఈ సినిమాలోని ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం..’ ‘ఈనాడే బాబు నీ పుట్టినరోజు..’ వంటి పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి.  ఈ సినిమాకి దాసరి నారాయణరావు అందుకున్న పారితోషికం నెలకు 200 రూపాయలు. ఈ సినిమాకి ఎస్‌.వి.రంగారావు అందుకున్న పారితోషికం 2,000 రూపాయలు. రూ.5 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను 35 రోజుల్లో పూర్తి చేశారు.

 

డిసెంబర్‌ 27, 1972న ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకొని 1973 మార్చి 23న విడుదలైంది. తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసింది. ఇద్దరు అగ్ర హీరోల సినిమాల మధ్య విడుదలైన ఈ సినిమాకి మొదటి వారం కలెక్షన్స్‌ లేవు.  రెండో వారం నుంచి కలెక్షన్లు పుంజుకున్నాయి. రజతోత్సవం జరుపుకునే స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. కొన్ని కేంద్రాల్లో సంవత్సరం పాటు ఈ సినిమాను ప్రదర్శించారు. 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతిలలో ఈ సినిమా శతదినోత్సవాన్ని నిర్వహించారు. మద్రాస్‌లోని సవేరా హోటల్‌లో రజతోత్సవాన్ని చేశారు. ‘తాతమనవడు’ చిత్రంతో దాసరి తిరుగులేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ‘తాతమనవడు’ చిత్రానికి ప్రేక్షకుల రివార్డులే కాదు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు కూడా దక్కాయి. ఉత్తమ ద్వితీయ చిత్రంగా వెండి నందిని గెలుచుకుందీ చిత్రం. ఉత్తమ రచయితగా, ఉత్తమ దర్శకుడిగా దాసరి నారాయణరావు అవార్డులు అందుకోగా, ఉత్తమ నటుడిగా కైకాల సత్యనారాయణ ఎంపికయ్యారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading