సాధారణంగా ఒక ఏడాదిలో చాలా పండుగలు ఉంటాయి. దసరా, దీపావళి, ఉగాది, సంక్రాంతి, తొలి ఏకాదశమి, శివరాత్రి, సంక్రాంతి ఇలా రకరకాల పండుగలుంటాయి. ఇన్ని పండుగలున్నప్పటికీ అందరూ సంక్రాంతి పండుగనే పెద్ద పండుగ అని పిలుస్తుంటారు. ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. అందుకే దీనిని మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి అంటే.. నూతన కాంతి.. ప్రతీ ఒక్కరి జీవితంలో నూతన అధ్యాయం మొదలు కాబోతుందని సంకేతం.
Advertisement
పూర్వకాలంలో సంక్రాంతి పండుగ సమయానికి రైతులు ఎంతో కష్టపడి శ్రమించిన పంట చేతికి వచ్చేది. కొత్త బియ్యంతో నిండైన మనసుతో పొంగల్ పెట్టుకొని అందరికీ పంచిపెట్టేవారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు అనుకోండి. సంక్రాంతి పండుగ అంటే కచ్చితంగా ప్రతి పదార్థంలో నువ్వులు ఉంటాయి. సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణాలు వదలడం తప్పనిసరిగా చేస్తారు. ఉత్తరాయణ కాలం మొదలైన ఆరోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని పితృదేవతలకి స్వర్గ ప్రాప్తి లభించడం కోసం ఇలా చేస్తారు. ఈరోజు పెద్దలని స్మరించుకుంటూ వారిని సంతోష పెట్టె విధంగా వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేస్తారు.
Advertisement
తెలుగు రాష్ట్రాలకి సంక్రాంతి చాలా ప్రత్యేకం. కొత్తగా పెళ్ళైన కూతురు, అల్లుడిని ఇంటికి పిలిచి తమ ఆతిధ్యంతో ఔరా అనిపిస్తారు. అల్లుడికి అన్ని రకాల వంటలు చేసి తమకి వారి మీద ఉన్న ప్రేమ, గౌరవం చాటుకుంటారు. కొత్త అల్లుళ్ల రాకతో ఇల్లు కళకళాడిపోతాయి. మరదళ్ళు బావలని సరదాగా ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక మహిళలు ఇళ్ల ముందు పెద్ద పెద్ద రంగవల్లులు వేసి మురిసిపోతారు. గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ పాటలు పాడుకుంటూ డాన్స్ వేస్తారు.