సిడిఎస్ చీఫ్ బిపిన్ రావత్ తో పాటు మరో 13 మంది ప్రయాణిస్తున్నహెలికాప్టర్ తమిళనాడు ఊటీ కొండల్లో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ సతీమణి మధులిక తో పాటు మరో 11 మంది మృతి చెందారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో చూసిన ప్రత్యక్ష సాక్షి శివకుమార్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో తన సోదరుడి కోసం కాఫీ తోటలోకి వెళ్లినట్టు శివ కుమార్ చెప్పారు. అంతలోనే పెద్ద శబ్దం వచ్చిందని దాంతో తామంతా కలిసి అక్కడకు వెళ్లామని శివకుమార్ వెల్లడించారు. హెలికాప్టర్ మొదట చెట్టును ఢీకొట్టింది… దాంతో పెద్దగా మంటలు అంటుకున్నాయని తెలిపారు.
ఆ సమయంలో ఒక్కసారిగా అంతా పొగతో నిండిపోయిందని తర్వాత తమకు ఏమీ కనిపించలేదు అని అన్నారు. పొగ తగ్గిన తర్వాత హెలికాప్టర్ నుండి ముగ్గురు వ్యక్తులు కిందపడిపోయారని చెప్పారు మరో వ్యక్తి ప్రాణాలతోనే ఉన్నాడని అన్నారు. ఆయన ను తాము బెడ్ షీట్ సాయంతో తీసుకు వెళ్లామని శివకుమార్ చెప్పాడు. అతడు తమను నీళ్లు అడిగాడని కానీ ఇవ్వలేకపోయాను అని తెలిపారు. అంతలోనే అధికారులు వచ్చి ఆ వ్యక్తిని తీసుకువెళ్లారిని తెలిపారు. ఆ తర్వాత తనను నీళ్లు అడిగింది బిపిన్ రావత్ అని అతడికి ఫోటోను చూపించారని అన్నారు.
Advertisement
Advertisement
also read: వీఐపీలకు అచ్చిరాని హెలికాప్టర్లు.. ఇప్పటికి ఎంత మంది మరణించారంటే?
బిపిన్ రావత్ గొప్ప వ్యక్తి అని ఆయన దేశానికి సేవ చేశారని…. అలాంటి వ్యక్తికి తాను నీళ్లు ఇవ్వలేకపోయాను అంటూ శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాత్రంతా నిద్ర పట్టలేదు అని శివకుమార్ కన్నీరు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఘటనా స్థలానికి చేరుకునే సరికి అక్కడ ఇద్దరు మాత్రమే ప్రాణాలతో ఉన్నట్టు సీనియర్ ఫైర్ మాన్ ఒకరు మీడియాకు తెలిపారు. అందులో ఒకరు సిడిఎస్ ఛీఫ్ బిపిన్ రావత్ అని అన్నారు.
బిపిన్ రావత్ ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా సిబ్బందికి లోగొంతుకతో తన పేరును హిందీలో చెప్పారని తెలిపారు. కానీ మార్గమధ్యంలోనే ఆయన మరణించారని అన్నారు. ఇక గాయపడిన మరో వ్యక్తి కెప్టెన్ వరుణ్ సింగ్ అని గుర్తించేందుకు చాలా సమయం పట్టింది అని చెప్పారు. ఇక ప్రస్తుతం కెప్టెన్ వరుణ్ సింగ్ చికిత్స తీసుకుంటున్నారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను బెంగళూరుకు తరలిస్తున్నారు. మరో 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు వెల్లడించారు.