మొక్కై వంగనిదే మానై వంగునా అనే సామెత చాలామందికి తెలుసు. చిన్నప్పుడే పిల్లలను సరైన దారిలో పెట్టకపోతే జీవితాంతం వారి తీరు మారదని అంటూ ఉంటారు. సాధారణంగా పిల్లలు చెప్పినమాట వినడం లేదని తల్లిదండ్రులు ఎప్పుడూ ఆందోళన చెందుతూనే ఉంటారు. తినాలని చెబితే తినడం లేదని..సరిగా చదవడం లేదని ఇలా అన్ని విషయాలలోనూ తమ పిల్లలు మాట వినడం లేదని పేరెంట్స్ ఆందోళన చెందుతూనే ఉంటారు. ఇక చెప్పిన మాట వినకపోవడంతో కొట్టడం తిట్టడం లాంటివి కూడా చేస్తుంటారు. అయితే ఈ నాలుగు నియమాలు పాటిస్తే పిల్లలు దారికి వస్తారని చెప్పిన మాట వింటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
ముందుగా పిల్లలను అర్థం చేసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఏ విషయంలో మారాం చేస్తున్నారు.. ఏ విషయాల్లో చెప్పిన మాట వినడం లేదు అనే విషయాలను పూర్తిగా అర్థం చేసుకొని వారికి సున్నితంగా చెప్పాలని చెబుతున్నారు.
Advertisement
పిల్లలు మాట వినడం లేదని తల్లిదండ్రులు భయపెడుతూ ఉంటారు. కానీ పిల్లలను కొట్టడం తిట్టడం వంటివి చేస్తే తల్లిదండ్రులు మాట్లాడే మాటలు నేర్చుకోవడం ఇతరులను కొట్టడం లాంటివి చేసే అవకాశం ఉందట. అంతేకాకుండా చివరకు మొండిగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు కఠినమైన రూల్స్ పెడుతూ ఉంటారు. బయటకు వెళ్ళద్దు… అది ఆడుకోవద్దు..ఇలా చాలా రూల్స్ పెడతారు. కానీ వారికి చిన్న చిన్న రూల్స్ పెడుతూ కాస్త స్వేచ్ఛను ఇవ్వాలని చెబుతున్నారు. ఎప్పుడూ చదవడం రాయడం వల్ల వాళ్లు సైతం స్ట్రెస్ కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
పిల్లలు ఏదైనా సాధించినప్పుడు మెచ్చుకోవడం బహుమతులు ఇవ్వడం లాంటివి చేయాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తే వారికి ఏదో ఒక బహుమతి ఇచ్చి సంతోష పెట్టాలని చెబుతున్నారు. అదేవిధంగా ఫెయిల్ అయిన వారిని కూడా తిట్టకుండా ఏదో ఒక బహుమతి ఇచ్చి రాబోయే పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే మరిన్ని బహుమతులు కొనిపెడతానని ప్రోత్సహించాలని చెబుతున్నారు.