సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తరవాత అన్ లైన్ లో పరిచయాలు కూడా పెరిగిపోయాయి. అంతే కాకుండా ఆన్ లైన్ లో పరిచయం తరవాత ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే అన్ లైన్ ప్రేమలు అంటే డేటింగ్ యాప్ లోనో…ఫేస్ బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ లోనో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ తాజాగా పాకిస్థాన్ అమ్మాయి ఇండియా అబ్బాయి లుడో గేమ్ ఆడుతూ ప్రేమించుకుని ఆ తరవాత పెళ్లి చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే…పాక్ లోని హైదరాబాద్ కు చెందిన ఇక్రా జివానీకి యూపీకి చెందిన ములాయాంసింగ్ అనే యువకుడు లుడో గేమ్ లో పరిచయం అయ్యాడు. పరిచయం అయిన కొద్దిరోజులకు ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. తరచూ లుడో గేమ్ ఆడుతూ మధ్యలో చాటింగ్ చేసుకునేవారు. కాగా ఇక్రాకు ఇంట్లో సంబంధాలు చూడటం మొదలు పెట్టారు.
దాంతో ఇక్రా ఆ విషయం ములాయాం సింగ్ కు చెప్పగా పాక్ నుండి దుబాయ్ వెళ్లి అక్కడ నుండి నేపాల్ రావాలని చెప్పాడు. ఆ తరవాత భారత్ లోకి అక్రమంగా తీసుకువచ్చాడు. అంతే కాకుండా ములాయాంసిగ్ నేపాల్ లోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరవాత బెంగుళూరులో కాపురం పెట్టారు. ములాయాంసింగ్ ఇక్రా కు రియా యాదవ్ పేరుతో ఆధార్ కార్డ్ కూడా ఇప్పించాడు. కాగా ఇటీవల అధికారులు ఇక్రా పాక్ నుండి అక్రమంగా ప్రవేశించినట్టు గుర్తించి ఇద్దరి పై కేసులు నమోదు చేశారు.