టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ జరిగినట్టు మంచు విష్ణు మేనేజర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు కీలక మలుపు తిరిగింది. మంచు విష్ణు ఆఫీస్ లో చోరీ జరిగిందని విష్ణు హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీను ఈ చోరీకి పాల్పడ్డారని విష్ణు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాజాగా దొంగతనం చేసినట్లు ఆరోపణలు చేసిన నాగ శ్రీను ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. వీడియో లో మోహన్ బాబు పై నాగ శ్రీను సంచలన ఆరోపణలు చేశారు.
Advertisement
వీడియోలో నాగ శ్రీను మాట్లాడుతూ మోహన్ బాబు మంచు విష్ణు కలిసి తనను చిత్రహింసలు పెట్టారని అన్నారు. చెప్పుకోలేని విధంగా బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. కులం పేరుతో దూషించారని అదే కారణంతో తను ఉద్యోగం మానేశానని అన్నారు. ఉద్యోగం మానేసినందుకు ఐదు లక్షల విలువచేసే హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని చోరీ చేసినట్టుగా ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు పెట్టారని అన్నారు.
Advertisement
మోహన్ బాబు తనను తిట్టడంతో పాటూ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కొట్టడం సీసీటీవీ లో రికార్డ్ అయిందని నాగశ్రీను అన్నారు. ఈ ఘటన ఫిబ్రవరి 17న మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగిందని అన్నారు. కావాలంటే సిసి టివి ఫుటేజ్ చెక్ చేయాలని తెలిపారు. తనపై లేనిపోని కేసులు పెట్టడంతో ఆ విషయం తెలిసి తన తల్లికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని అన్నారు.
పదేళ్లుగా మోహన్ బాబు దగ్గర నమ్మకంగా పని చేస్తున్నానని తనపై నిందలు వేయడం భావ్యం కాదని నాగ శ్రీను అన్నారు. విష్ణు బాబు తనపై అనవసరంగా కేసు పెట్టించారని వారు తిట్టిన బూతులు ఇక్కడ చెప్పలేనని అన్నారు. ఆ మాటలు పడలేక ఉద్యోగం మానేశానని అన్నారు. తన లాంటి చిన్నవాళ్ల జీవితాలతో ఆడుకోవడం పెద్దవాళ్లకు సరికాదన్నారు. దయచేసి తనను వదిలేయాలని అన్నారు. ఈ వీడియో చూసి పెద్దలు తనకు న్యాయం చేయాలని కోరుతున్నట్టు నాగశ్రీను తెలిపాడు. ఇక ప్రస్తుతం నాగ శ్రీను సెల్ఫీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.