కూతురి వివాహం అంటే ఓ తండ్రికి ఎంతో ఆనందం ఉంటుంది. చిన్ననాటి నుండి తమ చేతుల పై పెంచిన ముద్దుల కూతురు మరో ఇంటికి వెళ్లబోతుంది అనే ఆనందం ఉంటుంది. కూతురు ఇంటి నుండి వెళ్లి పోతుంది అనే బాధ ఉన్నప్పటికీ మరో కుటుంబానికి తమ కూతురు యజమాని కాబోతుంది అన్న సంతోషం కూడా ఉంటుంది. ఇక అదే ఆనందంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ తన కూతురు పెళ్లిలో డాన్స్ లతో అదరగొట్టారు. సై సినిమాలోని ఓ పాటకు కూతురు సృష్టి తో కలిసి ఆదిమూలపు సురేష్ డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మంత్రి సురేష్ కూతురు వివాహం హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో జరిగింది.
Advertisement
Advertisement
అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. అంతే కాకుండా ఏపీ సీఎం జగన్ సతీమణి భారతి రెడ్డి కూడా ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా ఈ పెళ్లి వేడుకలో అందరిముందు మంత్రి సురేష్ చేసిన డాన్స్ తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడూ రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా ఉండే సురేష్ తన కూతురు పెళ్లి వేడుకలో సరదాగా గడపడంతో అందరూ అవాక్కయ్యారు. మంత్రి సురేష్ దగ్గర ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోయారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన అభిమానులు కార్యకర్తలు వాట్సాప్ గ్రూపులు, ఫేస్ బుక్ పేజీలలో తెగ షేర్ చేస్తున్నారు.