ప్రస్తుతం టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ధరలతో టమాట కొనాలంటే సామాన్యుల గుండెలో భయం మొదలవుతుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కిలో టొమాటో 100 రూపాయలకు పైగానే విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 160 రూపాయలకు పైగా ధర పలకడంతో సామాన్యులు కొనటానికి ముందుకు రావడం లేదు. ప్రస్తుతం టొమాటో ధర పెట్రోలు ధరను మించిపోయిందని… బంగారం ధరతో పోటీపడిందని సోషల్ మీడియాలో అనేక మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి.
Advertisement
ఓ భర్త తన భార్య పుట్టినరోజు సందర్భంగా టమాటా బహుమతిగా ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో సోనాల్ బోర్సే అనే వివాహితకు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె భర్త మరియు బంధువులు టమోటాలు బహుమతిగా ఇచ్చారు. 4 కేజీలకు పైగా టమోటాలు ఆమెకు కానుకగా ఇచ్చి వాటి ధరలగానే నువ్వు కూడా ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు.
Advertisement
కళ్యాణ్ పట్టణంలోని కొచ్చాడి ప్రాంతంలో నివసించే సోనాల్ బోర్స్, ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం జూలై 9 వేడుకలు జరుపుకున్నారు. బర్త్ డే గిఫ్ట్ గా వచ్చిన టమాటాలను చుట్టి కేక్ కట్ చేశారు. తన భర్త, సోదరుడు, బంధువులు ఇచ్చిన ఈ బహుమతి తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆమె తెలిపింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారడంతో నెటిజన్లు కూడా మీ ఐడియా చాలా బాగుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు రూ.10 నుంచి 20కి లభించిన కేజీ టమాటా ఒక్కసారిగా రూ.100 దాటింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడింది. రోజూ తినే టమాటా ధరలు ఒక్కసారిగా పెరగడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టమాటా కొనేందుకు వెనుదిరిగి వెళ్తున్నారు. ఇదిలా ఉంటే టమాటా ధర పెరగడం వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై నెటిజన్లు తమదైన శైలిలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఆన్ లైన్ లో టమాటా సాస్ ధరలను మార్కెట్ లో టమాట ధరలతో పోల్చి చూస్తే.. ‘టమాటా ధర కంటే సాస్ ధర తక్కువ’ అంటూ పోస్ట్ చేస్తున్నారు. మరికొందరు బంగారం ధరలతో పోల్చుతున్నారు.