ప్రకృతి ఎప్పుడు ఏ విధంగా మారుతుందో ఎవరు ఊహించలేము. ఒకపక్క భానుడు ఎండ ప్రతాపంతో చుక్కలు చూపిస్తుంటే.. ఊహించని అతిథిలా ఆకాశంలో మబ్బులు కమ్ముకొని వర్షాలు కురిపిస్తున్నాయి. హమ్మయ్య.. వాతావరణం చల్లబడింది అనేకునేలోపే అధిక ఉష్ణోగ్రతలతో సమస్త జీవకోటిని వాతావరణంలో మార్పు సతమతం చేస్తుంది. ప్రస్తుతం జనాలు ఎదుర్కొంటున్న సమస్యలో వాతావరణ మార్పు కూడా ఒకటి. ఇలా వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు ఏర్పడటం వలన ప్రజల ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు వెల్లడిస్తున్నారు. సాధారణంగా మానవ శరీరం వాతావరణ మార్పులకు అనుగుణంగా మారడానికి కొంత సమయం తీసుకుంటుంది. కానీ తరుచు ఏర్పడే వాతావరణ మార్పుల వలన ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతారు. వాతావరణంలో ఆకస్మాత్తుగా ఏర్పడే మార్పుల వలన మన ఆరోగ్యం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మరియు వాటికి తీసుకోవలసిన నివారణ చర్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
అకస్మాత్తుగా వచ్చే వాతావరణ మార్పుల వలన గాలి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల రేటు పెరుగుతుంది. దుమ్ము, వేడిగాలి మరియు తేమతో కూడిన గాలి తీవ్రమైన సైనస్ మరియు గొంతు సమస్యలకు దారితీస్తాయి. ప్రధానంగా వాతావరణ మార్పుల వల్ల కలిగే ఒక సమస్యలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు కూడా ఒకటి. దీని కారణంగా ఈ మారుతున్న వాతావరణ పరిస్థితులు బట్టి ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. వేడి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారడం వలన చాలా మందిలో దగ్గు, జలుబు, అలర్జీ, గొంతు ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విషయంలో ఎక్కువగా పిల్లలు, వృద్ధులు ప్రభావితమవుతారు. దీనిని నివారించడానికి చిన్నపాటి ఆరోగ్య సూత్రాలు అనుసరించడం ద్వారా మన ఆరోగ్యాన్ని పదలంగా కాపాడుకోవచ్చు.
Advertisement
వాతావరణ మార్పుల వలన తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
#1. బాగా మరిగిన వేడి నీటిలో 4-5 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ కలిపి ఆవిరి పీల్చడం వలన గొంతునొప్పి, జలుబు వంటి సమస్యలకు మంచి ఉపశమనం లభిస్తుంది.
#2. ఐస్‌క్రీమ్‌లు, కూల్ డ్రింక్స్, మిల్క్‌షేక్‌లు వంటి చల్లని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అతిగా వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆకుకూరలు, సులువుగా జీర్ణం అయ్యో పౌష్టికాహారం తీసుకోండి
#3. అల్లం, యాలకులు, దాల్చినచెక్క వంటి పదార్థాలతో టీని తయారు చేసుకుని తాగడం వల్ల గొంతుకు ఉపశమనం లభిస్తుంది.
#4. మీ పరిసరాల్లో ఫ్లూ బారిన పడిన వ్యక్తులు ఉన్నట్లయితే, వారినుంచి దూరాన్ని పాటించండి. అంతేకాకుండా తరచుగా మీ చేతులను శుభ్రం చేసుకోండి. ఫ్లూ బారిన పడకుండా తగిన సమయంలో టీకాలు వేయించుకోవాలి.
#5. కొన్ని సమయాలలో చల్లటి వాతావరణం ఏర్పడటం వలన మీకు దాహం వేయదు. అలాంటి పరిస్థితులలో శరీరం డిహైడ్రేషన్ కు గురవుతుంది. కాబట్టి మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం కోసం కాచి చల్లార్చిన నీటిని ఎక్కువగా తీసుకోవాలి.
#6. మీ ఇంటిలోకి గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. మీ ఇంటిని పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
ఇలాంటి చిన్న చిన్న పరిష్కారాలను పాటించడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే తీవ్రమైన అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.