సాధారణంగా ఒక్క తేలును చూస్తేనే ఏదోలా అవుతుంది. అలాంటిది కప్పలు కుప్పలుగా తేళ్లు సంచరిస్తే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈజిప్టులోని ప్రజలకు అలాంటి పరిస్థితే వచ్చింది. ఒక్కసారిగా తమ నివాసాల్లోకి పాములు తేళ్లు కుప్పలు కుప్పలుగా రావడం మొదలయ్యింది. అంతే కాకుండా చాలామంది తేలు కుట్టడంతో ఆస్పత్రి పాలయ్యారు. వివరాల్లోకి వెళితే….. ఈజిప్టులో ఇటీవల వచ్చిన ఓ తుఫాన్ ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈ తుఫాన్ కారణంగా ఈజిప్ట్ లోని దక్షిణ నగరమైన అస్వాన్ లో వందలాది మంది తేలుకాటుకు గురయ్యారు.
Advertisement
తుఫాన్ ఎఫెక్ట్ తో ఓ తేళ్ల గుంపు బయటకు వచ్చి జనాలపై కాటు వేయడం షురూ చేసింది. ఇక ఆ నగరంలో ఏకంగా 450 మందిని తేళ్లు కుట్టినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తేలు కుట్టడం కారణంగా ముగ్గురి పరిస్థితి విషమించి మరణించినట్టు సమాచారం. ఇక భారీ తేళ్లు బయటకు రావడంతో అస్వాన్ సమీప గ్రామాలకు ప్రభుత్వాలు అదనంగా యాంటీ వీనమ్ మందులను సరఫరా చేసింది. అంతే కాకుండా తేలు కుట్టిన వారికి చికిత్స అందించేందుకు కరోనా టీకాలు ఇస్తున్న వైద్యులను రంగంలోకి దించారు.
Advertisement
ఇక తేళ్లు ఎక్కడ పడితే అక్కడ సంచరిస్తుండటంతో ప్రజలు చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉండకూండదని…చెట్లకు దూరంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. నైలు నదికి సమీపంలో భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయి. ఈ వరదల్లో పాములు తేళ్లు జనావాసాల్లోకి కొట్టుకువచ్చాయి. ఈ క్రమంలోనే తేళ్లు ప్రజలపై దాడి చేశాయి. ఇదిలా ఉండగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన స్కార్పియన్ జాతులలో ఒకటైన కొవ్వు తోక గల తేళ్లు ఈజిప్ట్ దేశంలో ఉంటాయి.