దేశంలో హిజాబ్ వివాదం రగిలిపోతున్న సంగతి తెలిసిందే. కర్నాటక రాష్ట్రంలో హిజాబ్ పై వివాదం మొదలైంది. ఈ వివాదం కారణంగా అక్కడ పాఠశాలలకు సైతం సెలవులు ప్రకటించాల్సిన స్థితి వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ వివాదం పై హైకోర్ట్ లో విచారణ జరుగుతోంది. అయితే ఈ వివాదం కారణంగా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని బిజేపీ మతాల మధ్య చిచ్చు పెడుతోందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే మొదటి సారి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ వివాదం పై పెదవి విప్పారు. ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Advertisement
అమిత్ షా మాట్లాడుతూ….నా వరకు అయితే విద్యార్థులు యూనిఫామ్ ధరించి పాఠశాలకు రావడమే సరైనది. ఒకవేళ కోర్టు గనక ఈ అంశంపై తీర్పు ఇస్తే ఆ తరవాత నా అభిప్రాయంలో మార్పు రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది నా వ్యక్తిగత అభిప్రాయం. న్యాయస్థానం తీర్పును ఎవరైనా గైరవించాల్సిందే. అంతిమంగా దేశం రాజ్యాంగం లేదంటే ఇష్టానుసారంగా నడుస్తుందా అనేది మనమే నిర్ణయించుకోవాలి అంటూ అమిత్ షా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా హిజాబ్ రద్దుకు కర్నాటక ప్రభుత్వం మొగ్గు చూపుతుండగా ఇప్పుడు కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.