మందర చెప్పిన చెప్పుడు మాటలు విని దశరధుని మూడవ భార్య కైకేయి శ్రీరాముడిని అడవులకి పంపించాలని, తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరిపించాలని దశరథుడిని కోరుతుంది అన్న సంగతి తెలిసిందే. తండ్రి ఆజ్ఞ ప్రకారమే శ్రీరాముడు వనవాసానికి వెళ్తాడు. అతని వెంట లక్ష్మణుడు, సీతాదేవి కూడా వెళ్లారు. అయితే.. ఈ సమయంలో అక్కడ భరతుడు ఉండడు. భరతుడు వచ్చిన తరువాత జరిగినది తెలుసుకుని దుఃఖిస్తాడు. తన తల్లి కైకేయి పట్ల కోపం తెచ్చుకుని.. తన అన్న శ్రీరాముడే పట్టాభిషేకానికి అర్హుడని.. అతడిని వెళ్లి తీసుకొస్తానని చెప్పి శ్రీరాముడిని వెతుక్కుంటూ అడవికి వెళ్తాడు.
భరతుడు కోపం తెచ్చుకుంటే, దశరధుని మరణాన్ని చూస్తే తప్ప.. కైకేయికి తానూ చేసిన తప్పు ఏమిటో అర్ధం కాదు. భరతుడి మాటలను అర్ధం చేసుకుని అతని వెంట కైకేయి, వసిష్ఠుడు, మంత్రులు, సైన్యం కూడా వెంట వెళతారు. అయితే.. రాముడిని కలవాలన్న ఆత్రుత కొద్దీ.. భరతుడు మిగిలిన వారి కంటే వేగంగానే ముందుకు వెళ్తాడు. అన్నగారిని చూడగానే భరతుడు పాదాభివందనం చేస్తాడు. తండ్రి గారి మరణ వార్తని అన్నగారికి తెలియచెబుతాడు. దుఃఖించిన రాముడు, సోదరులతో పాటు కలిసి తండ్రికి తర్పణాలు వదులుతాడు.
ఆ తరువాత రోజు ప్రభాత ప్రార్ధన తరువాత భరతుడు శ్రీరామునికి నమస్కరించి ఈ వనవాసానికి నా తల్లే కారణమని.. ఆమె ప్రవర్తనకు క్షమాపణ కోరుతున్నానని తెలిపి… తిరిగి రాజ్యానికి వచ్చి పట్టాభిషేకం చేయించుకోవాలని కోరతాడు. అందుకు రాముడు ఒప్పుకోడు. కారణమేంటో ఇలా చెప్పాడు. భరతా, మన తండ్రి భార్య ప్రేమలో పడి స్పృహ కోల్పోయిన గుడ్డివాడు కాదని, సత్యానికి భయపడే నాకు అరణ్యాన్ని, నీకు రాజ్యాన్ని ఇచ్చాడని, ఆయన మరణం తరువాత సింహాసనాన్ని అధిష్టిస్తే నేను ఆయన మాట జవదాటినట్లేనని.. ఆ పని నేను చెయ్యలేను కనుక నేను వనవాసం కొనసాగిస్తానని చెబుతాడు. స్వయంగా కైకేయి వచ్చి క్షమాపణలు చెప్పినా శ్రీరాముడు ఒప్పుకోడు. నాకు రాజ్యంపై ఆశలేదని, తండ్రి మాటకి కట్టుబడి ఉంటానని చెబుతాడు. అప్పుడు భరతుడు కూడా నాకు కూడా రాజ్యంపై ఆశలేదని.. మీరు వచ్చేవరకు మీ పాదుకలు పాలిస్తాయని చెప్పి.. ఆ పాదుకలనే సింహాసనంపై ఉంచి.. చిత్తశుద్దిగా రాముడు వచ్చే వరకు రాజ్యాన్ని పాలించాడు.