Telugu News » మే 12 నుంచి ప‌దోత‌ర‌గ‌తి హాల్‌టికెట్లు.. విద్యార్థులు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..!

మే 12 నుంచి ప‌దోత‌ర‌గ‌తి హాల్‌టికెట్లు.. విద్యార్థులు ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..!

by Anji

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తి సంవ‌త్స‌రం మార్చి నెల‌లో పదోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌రుగుతుంటాయి. కానీ ఈసారి కరోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా మే నెల‌లో నిర్వ‌హిస్తున్నారు. గ‌త రెండు సంవ‌త్స‌రాలు క‌రోనా కార‌ణంగా ప‌రీక్ష‌లను నిర్వ‌హించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మే 23 నుంచి జూన్ 01 వ‌ర‌కు ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.45వ‌ర‌కు ప‌రీక్ష‌లు కొన‌సాగుతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,09,275 మంది ప‌రీక్ష ఫీజును చెల్లించారు. ఈనెల 12 నుంచి ఆయా పాఠ‌శాల‌ల్లో హాల్‌టికెట్‌ను తీసుకోగ‌ల‌ర‌ని తెలంగాణ ప్ర‌భుత్వ ఎగ్జామినేష‌న్స్ డైరెక్ట‌ర్ వెల్ల‌డించారు. ఒక వేళ ఎవ‌రైనా పాఠ‌శాల‌లో హాల్‌టికెట్ ఇవ్వ‌న‌ట్ట‌యితే www.bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా మే 12 నుంచి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

Ads

]

మే 23 నుంచి ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్న త‌రుణంలో.. ఇప్ప‌టికే విద్యార్థులు ప్రిప‌రేష‌న్ పూర్తి చేసుకుని ప‌రీక్ష‌లు రాయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. విద్యార్థుల‌కు కీల‌క‌మైన ద‌శ అనే చెప్ప‌వ‌చ్చు. సంవ‌త్స‌రం పాటు కొన‌సాగిన ప్రిప‌రేష‌న్ ఒక ఎత్త‌యితే.. చ‌దివిన అంశాల‌న్నింటిని ఎలాంటి ఆందోళ‌ణ‌కు గురికాకుండా ప‌రీక్ష‌లో రాయ‌డం మ‌రొక ఎత్తు. ఈ త‌రుణంలో ప‌రీక్ష‌ల వేళ 10వ‌త‌ర‌గ‌తి విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా విద్యార్థులు త‌మ‌కు ఎంతో కీల‌క‌మైన స‌మ‌యంలో కేవ‌లం స‌బ్జెక్టులో ఉన్న‌టువంటి అంశాల‌పైనే కాకుండా ఆహారం, నిద్ర వంటి ఆరోగ్య‌ప‌ర‌మైన అంశాల‌పై కూడా శ్ర‌ద్ధ పెట్టాలి. శారీర‌కంగానే కాకుండా మాన‌సికంగా కూడా అన్ని విధాలుగా సిద్ధ‌మై ఉండాలి. ఎలాంటి ఒత్త‌డి, ఆందోళ‌న ద‌రిచేర‌నీయ‌కూడదు. కొంత మంది ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఎన్నో అపోహ‌లు సృష్టిస్తుంటారు. అలాంటి వాటిని అస‌లు న‌మ్మ‌కండి.


ఇంట‌ర్‌లో మాదిరిగా ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో ప‌రీక్ష‌కు ప‌రీక్ష‌కు పెద్ద‌గా స‌మ‌యం ఉండ‌దు. ప్ర‌తి రోజు ప‌రీక్ష జ‌రుగుతుంది. కొద్ది రోజులు హాఫ్ డే ఉంటే.. సెల‌వు దినాల్లో 1 రోజు స‌మ‌యం అద‌నంగా ఉంటుంది. ఈ త‌రుణంలో సంబంధిత స‌బ్జెక్టుల‌కు ల‌భించిన స‌మ‌యం ఆధారంగా విద్యార్థులు రివిజ‌న్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకోవాలి. ప్ర‌తి స‌బ్జెక్టులోనూ ప్రిప‌రేష‌న్ సంద‌ర్భంగా చ‌దివిన అంశాల‌ను మాత్ర‌మే రివిజ‌న్ చేసుకోవాలి. ప‌రీక్ష రేపు ఉంద‌ని హ‌డావిడిగా కొత్త విష‌యాల జోలికి అస‌లు వెళ్ల‌కూడ‌దు. అలా వెళ్లితే అన‌వ‌స‌ర ఆందోళ‌న‌కు గుర‌య్యే ప్ర‌మాద‌ముంది.

కీల‌క స‌మ‌యంలో విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడే ప‌రీక్ష‌లు ఆత్మ‌విశ్వాసంతో రాయ‌గ‌లుగుతారు. మంచి మార్కులు కూడా సాధించ‌గ‌లుగుతారు. ఆరోగ్యంగా ఉండాలంటే కంటి నిండ నిద్ర ఎంతో అవ‌స‌రం. రోజుకు ఆరు గంట‌ల‌కు త‌క్కువ కాకుండా నిద్ర‌కు స‌మ‌యం కేటాయించాలి. రివిజ‌న్‌కు స‌మ‌యం స‌రిపోద‌ని నిద్ర పోకుండా చదివితే త‌రువాత ప‌రీక్ష హాల్‌లో త‌ల‌నొప్పి, కండ్ల‌లో మంట లాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. బాగా చ‌దివిన అంశాల‌ను స‌రిగ్గా రాయ‌లేక న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది.

ఇక ఆహారం విష‌యంలో కూడా విద్యార్థులు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. జంక్ ఫుడ్ జోలికి అస‌లు వెళ్ల‌కూడ‌దు. కారం, మ‌సాలాలు వంటివి ఎక్కువ‌గా ఉండే ఆహారం తీసుకోకూడ‌దు. ఇలాంటి ఆహారం వ‌ల్ల క‌డుపులో తిప్పిన‌ట్టుగా మంట పుట్టిన‌ట్టు ఉంటుంది. ఇది రివిజ‌న్‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. ప‌రీక్ష‌లో తెలిసిన ప్ర‌శ్న‌ల‌కు స‌రిగ్గా స‌మాధానాలు రాయ‌లేక మార్కులు కోల్పోయే ప్ర‌మాద‌ముంది.

ప‌రీక్ష హాల్‌లో విద్యార్థులు కొన్ని ముఖ్య‌మైన మెళుకువ‌లు పాటిస్తే మంచి ఫ‌లిత‌ముంటుంది. కొంత మంది ప‌రీక్ష హాల్‌లో అడుగుపెట్ట‌గానే ప్ర‌శ్న ప‌త్రం ఎలా వ‌స్తుందో ఎలాంటి ప్ర‌శ్న‌లు ఇస్తారో నేను స‌మాధానాలు స‌రిగ్గా రాయ‌గ‌ల‌నో లేదో అని ఆందోళ‌న చెందుతుంటారు. మీ ప్రిప‌రేష‌న్ స‌జావుగా సాగిఉంటే ఇలాంటి అన‌వ‌స‌ర ఆందోళ‌న అక్క‌ర్లేదు. దీని వ‌ల్ల స‌మాధానాలు తెలిసిన ప్ర‌శ్న‌ల‌కు కూడా స‌రిగ్గా జ‌వాబులు రాయ‌లేక‌పోయే ప్ర‌మాద‌ముందే త‌ప్ప మ‌రెలాంటి ప్ర‌యోజ‌న‌ముండ‌దు.

కొంద‌రు విద్యార్థులు స‌మ‌యం స‌రిపోద‌న్న భ‌యంతో ప్ర‌శ్న ప‌త్రం ఇవ్వ‌గానే హ‌డావిడిగా స‌మాధానాలు రాయ‌డం ప్రారంభిస్తారు. ఇది స‌రికాదు. బాగా ప్రిపేర్ కావ‌డం ఎంత ముఖ్య‌మో ఆ ప్రిపేర్ అయిన అంశాల‌ను ప‌రీఓలో సూటిగా.. అర్థ‌వంతంగా రాయ‌డం కూడా అంతే ముఖ్యం. అందుకే ప్ర‌శ్న ప‌త్రాన్ని పూర్తిగ‌గా చ‌దివిన త‌రువాత‌నే మ‌న‌స్సు ప్రశాంతం చేసుకుని మీకు బాగా తెలిసిన ప్ర‌శ్న‌ల‌కు తొలుత స‌మాధానాలు రాయాలి.

కొంత మంది విద్యార్థులు రాత నీట్‌గా ఉండాల‌నే ఉద్దేశంతో స‌మాధానాలు నిదానంగా రాస్తుంటారు. ఇది కూడా మంచి ప‌ద్ద‌త కాదు. ఎందుకంటే తొలుత నిదానంగా స‌మాధానాలు రాయ‌డం వ‌ల్ల చివ‌రిలో రాయాల్సింది ఎక్క‌వ ఉండ‌డం.. స‌మ‌యం త‌క్కువ‌గా ఉంటుంది. చివ‌రి ప్ర‌శ్న‌లు హ‌డావిడిగా స‌మాధానాలు రాసి మార్కులు కోల్పోవాల్సి వ‌స్తుంది. కంగారు ప‌డి కానీ, మ‌రీ నిదానంగా కానీ కాకుండా ఒక్కో ప్ర‌శ్న‌కు ల‌భించే నిర్థారిత స‌మ‌యంలో స‌మాధానం పూర్తి చేయాలి.

ప్ర‌తి స‌బ్జెక్టులో ఏ సెక్ష‌న్‌కు ఏ ప్ర‌శ్న‌కు ఎంత స‌మ‌యం కేటాయించ‌వ‌చ్చ‌నే విష‌యంలో ప‌రీక్ష‌కు ముందే అవ‌గాహ‌న చేసుకోవాలి. దీనివ‌ల్ల ప‌రీక్ష హాల్‌లో అన‌వ‌స‌ర క‌న్ఫ్యూజ‌న్ ద‌రి చేర‌కుండా ఉంటుంది. అదేవిధంగా ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం రాయ‌డం పూర్త‌యిన త‌రువాత క‌నీసం రెండు లైన్లు గ్యాప్ ఇచ్చి.. మ‌రొక ప్ర‌శ్న‌కు స‌మాధానం రాయాలి. మీ స‌మాధాన ప‌త్రం నీట్‌గా ఉండ‌డ‌మే కాకుండా మంచి మార్కులు పొందే అవ‌కాశం ఉంది.


ఈ విధంగా ఇలాంటి చిన్న చిన్న మెళుకువ‌లు పాటించి త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుని ప్ర‌శాంతంగా ప‌రీక్ష‌లు రాయండి. ఎటువంటి అన‌వ‌స‌ర భ‌యాలు, ఆందోళ‌న‌ల‌తో న‌ష్టం త‌ప్ప లాభం లేద‌నే విష‌యం గ్ర‌హించండి. చ‌దివిన అంశాల‌ను చ‌క్క‌గా ప్ర‌జెంట్ చేస్తే విజ‌యం త‌ప్ప‌కుండా మిమ్మ‌ల్ని వ‌రిస్తుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్‌.

 

Also Read : 

 

నా బ‌రువు త‌గ్గించుకుంటా నీ ముఖాన్ని ఎక్క‌డ పెట్టుకుంటావ్..? రిపోర్ట‌ర్ కు కేజీఎఫ్ న‌టి స్ట్రాంగ్ కౌంట‌ర్…!


You may also like