మనం ఇప్పుడు చూసిన రామాయణ, భారత గ్రంధాలను ఆధారంగా తీసిన పౌరాణిక చిత్రాలు అన్నిటిలోనూ రాముడికి కానీ, కృష్ణుడికి కానీ మీసాలు ఉండవు. అలనాటి నట సార్వభౌముడు ఎన్టీఆర్ ఎన్ని సార్లు రాముడి వేషాలు లేదా కృష్ణుడి వేషాలు వేసినా మీసం లేకుండానే కనిపించారు. అదే అలవాటు అయిపోయిన మనకి రాముడికి, కృష్ణుడికి అసలు దేవుళ్ళెవరికీ మీసాలు ఉండవు అని ఫిక్స్ అయిపోయింది.
Advertisement
నిజానికి రాముడికి కానీ, కృష్ణుడికి కానీ మీసాలు ఉన్నాయా? అన్న ప్రశ్న వస్తే సమాధానం ఎవ్వరూ చెప్పలేరు. కానీ కృష్ణుడికి మీసాలు ఉన్నాయి అని చెప్పడానికి మాత్రం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు ఆధారాలు ఉన్నాయి. అవేంటంటే, భారత దేశంలో తమిళ నాడు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో ఒక్కో చోట మీసాల కృష్ణుడు కొలువై ఉన్నాడు. అది కూడా రెండు వందల సంవత్సరాల క్రితం నుంచే కొలువై ఉన్నాడు. ఆ గుళ్ళల్లో కృష్ణుడిని మీసాలతోనే ఉంచుతారు. అలానే దర్శనం చేసుకుంటారు. పూజలు జరిపిస్తారు.
తెలంగాణ మెదక్ జిల్లా, దుబ్బాక మండలంలోని చెల్లాపూర్ గ్రామంలో ఉన్న మీసాల కృష్ణుడి దేవాలయం ఈ కృష్ణ మందిరాలన్నిటిలోకి చాలా పాపులర్ అయ్యింది. ఇక్కడి కృష్ణుడిని దీపపు వెలుగులో మాత్రమే చూడాలి. ఈ దీపాన్ని నందాదీపం అని అంటారు. ఇక్కడి కృష్ణుడిని ఇలా దర్శనం చేసుకుంటే ఆ గ్రామం పాడి పంటలతో, పిల్లా పాపలతో సుఖంగా ఉంటుందని నమ్ముతారు. ప్రతి ఏడాది స్వామి వారికి ముడుపు కట్టి వ్యవసాయం ప్రారంభిస్తారట. అలా చేస్తే గ్రామం పచ్చగా ఉంటుందని నమ్ముతారు.
Advertisement
దుబ్బాక సంస్థానాన్ని పరిపాలించే దొరల వేధింపులు తాళలేక ఆ గ్రామస్తులు కప్పం ఎగ్గొట్టడానికే నిలువు నామాలతో వేణుగోపాల స్వామి ఆలయాన్ని కట్టాలనుకుంటారు. అనుకున్నట్లే, ఆలయ నిర్మాణం పూర్తి చేస్తారు కానీ విగ్రహం నిర్మాణానికి ఆర్ధిక స్థోమత సరిపోదు. దీనితో రామ్ గోపాల్ పేటలో ఓ కృష్ణ విగ్రహం ఉందని తెలుసుకుని అక్కడనుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించేస్తారు. దీనితో రామ్ గోపాల్ పేట ప్రజలు విగ్రహం కోసం గాలిస్తారు. వారికి కనిపించకుండా ఉండడం కోసం విగ్రహాన్ని నీళ్లలో ముంచేసి కొంతకాలం దాచేస్తారు. ఆ తరువాత కొప్పు తీసి వెండి కిరీటాన్ని పెడతారు. ఇంకా వెండి మీసాలను కూడా అలంకరిస్తారు. దీనితో స్వామి వారి రూపు రేఖలు మారిపోయి మీసాల కృష్ణుడిగా అవతరిస్తారు. ఇది ఆ స్థల పురాణం.
ఈ మీసాల కృష్ణుడిలాగే మరో ఇద్దరు స్వామి వార్లు కూడా ఉన్నారు. తమిళనాడు లోని పార్ధ సారధి ఆలయం, ఆంధ్రలో గోదావరి తీరం వద్ద ఉన్న పులిదిండి గ్రామంలో కూడా మీసాల కృష్ణుడి ఆలయం ఉంది. కేవలం గుళ్ళలోనే కాదు ఓ పాపులర్ పెయింటింగ్ లో కూడా కృష్ణుడికి మీసాలు ఉంటాయి. అసలు ఈ పెయింటింగ్ వెనక పెద్ద స్టోరీ నే ఉంది. భారతంలో వీరాధి వీరుడైన కృష్ణుడికి మీసాలు లేకపోవడం ఏమిటి అని సురవరం ప్రతాప రెడ్డి గారు మార్చాలా రామాంజనేయాచార్యులు అనే చిత్ర కర్త తో కృష్ణుడికి మీసాలను పెట్టి పెయింటింగ్ వేయించారు. అప్పట్లో ఈ విషయమై చాలానే చర్చలు జరిగాయి కూడా.
రాముడికి, కృష్ణుడికి యుగాంతరాలు ఉన్నా పోలికలు చాలా ఉన్నాయి. శరీర పోలికలు చాలానే కలుస్తాయి. ఇద్దరూ నీల మేఘ శ్యామవర్ణులు. కృష్ణుడికే మీసాలున్నప్పుడు రాముడికి ఉండకూడదని ఏమీ లేదు కదా. మన అభిప్రాయాలను పక్కన పెడితే.. ఇప్పటివరకు చూసిన రాముళ్ళకు విరుద్ధంగా ప్రభాస్ మీసాల రాముడిగా కనిపించి అలరించబోతున్నాడు. సినిమాను సినిమాలా చూసి ఆనందిద్దాం. నచ్చితే అభినందిద్దాం.
మరిన్ని ముఖ్య వార్తలు:
Adipurush Movie Review: ఆదిపురుష్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
ఎన్టీఆర్ నుండి ధనుష్ వరకూ…సినిమాల్లో సార్ లుగా నటించిన స్టార్స్ వీళ్లే..!
నెట్టింట వైరల్ అవుతున్న శ్రీదేవి చివరి ఫోటో చూశారా..?