Telugu News » ర‌మేష్ బాబు ఫ‌స్ట్ సినిమా కోసం సైకిల్ పై 45 KM ! ఓ పిల్ల బ్యాచ్ జ్ఞాప‌కాలు!!

ర‌మేష్ బాబు ఫ‌స్ట్ సినిమా కోసం సైకిల్ పై 45 KM ! ఓ పిల్ల బ్యాచ్ జ్ఞాప‌కాలు!!

by Azhar

ఇది నా ఎనిమిదో తరగతిలోని జ్ఞాపకం. అది జీవితాంతం నిలిచిపోయే పదిలమైన జ్ఞాపకం. ఎనిమిది మందితోటి ఉండేది మా సినిమా పిచ్చోళ్ళ బ్యాచ్. అందునా మేమంతా కృష్ణ వీరాభిమానులం. కృష్ణ కొడుకు ర‌మేష్ బాబు సామ్రాట్ సినిమా రిలీజ్ కోసం పదహారు కళ్లతో ఎదురు చూశాం. కానీ మా ఎదురు చూపులకు నిరాశా మబ్బులు కమ్మేసి మా మిర్యాలగూడలో సినిమానే రిలీజ్ చేయలేదు. నల్గొండ లో రిలీజ్ అయినట్లు తెలిసింది.

Ads

జనరల్ గా ప్ర‌తి సినిమా ముందు మిర్యాలగూడలో వచ్చి, ఆ తరువాతే నల్గొండలో రిలీజ్ అయ్యేది. కానీ ఎందుకో సామ్రాట్ మూవీ మాత్రం ముందుగా నల్గొండలోనే రిలీజ్ అయింది. మేమెంతగానో ఎదురుచూస్తున్న మా హీరో కొడుకు సినిమా ఏంటి? మేము చూడలేకపోవడమేంటి? ఉసూరుమంది ప్రాణం. ఏం చేయాలి? ఏదేమైనా సరే ఆదివారం సినిమా చూడాల‌ని ఫిక్స్ అయిపోయాం. అంతే!

కట్ చేస్తే…

నాలుగు సైకిళ్ళు సంపాదించి, ముందు జాగ్రత్తగా క్యారెల్ పై గాలిపంప్ బిగించుకుని చలో నల్గొండ టూర్ పెట్టుకున్నాం. 45కిలో మీటర్లు ప్రయాణం. ఇంట్లో చెబితే అస్సలు పంపించరు కాబట్టి టాప్ సీక్రెట్ మెయింటెయిన్ చేస్తూ బయలుదేరిపోయాం. మధ్యాహ్నం 2గంటలకు మొదలుపెట్టిన మా ప్రయాణం… సాయంత్రం 5గంటలకు వెంకటేశ్వర టాకీస్ కు చేరింది. అబ్బా..! అంతగా చెమటలు కక్కి రొప్పుతూ చేరుకున్నా….. మాకు ఆ టైం షో అందలేదు. హౌస్ ఫుల్ బోర్డు వెక్కిరించింది.

నెక్స్ట్ సినిమా అంటే ఇక సెకండ్ షోనే. అంటే 9, 9.30 టైం.! ఎట్లాగూ వచ్చాం. సినిమా చూడకుండా వెనుదిరకూడ‌ద‌ని ఫిక్స్ అయిపోయాం! చేసేదేం లేక నెక్ట్స్ షో వ‌ర‌కు ఆ సినిమా హాల్లోనే కబుర్లు చెప్పుకుంటూ, ఆ సామ్రాట్ సినిమా పోస్టర్లే మళ్లీ మళ్లీ చూసుకుంటూ, సినిమాలో హీరో అట్లా చేసి ఉంటాడు. ఇట్లా చేసి ఉంటాడనే కబుర్లతో గడిపాము. ఆకలి వేస్తుంటే ఉల్లిగడ్డ మరమరాలు కొనుక్కొని తిన్నాం!

Also Read: థర్డ్ వేవ్ లో ఓటిటి నుండి ఏ సినిమాకు ఎన్ని కోట్ల డీల్ వచ్చిందో తెలుసా…?

సినిమాకు మళ్ళీ టిక్కెట్ లు ఎక్కడ దొరక్కుండా పోతాయోననే భయంతోటి 8 గంటలకే బుకింగ్లోకి దూరిపోయినం. రూ.1:50 (రూపాయిన్నర/ఒక రూపాయి యాభై పైసలు) టికెట్ కొని థియేటర్లో, స్క్రీన్ ముందు ఆసీనులయ్యాం. మొత్తానికి సినిమా చూసేశాం. రాత్రి పన్నెండు గంటల తరువాత సినిమా శుభం కార్డు పడింది.

కానీ అసలు కథ అప్పుడే మొదలైంది: 
అర్ధరాత్రి 45 కిలోమీటర్లు సైకిళ్ల మీద ప్రయాణం. అందరి మనసుల్లో భయం. అది కానరాకుండా కప్పిపెట్టేందుకు మేము చూపిన మేకపోతు గాంభీర్యం చిన్న సన్నది కాదు. సినిమా మీద రివ్యూ చేసుకుంటూ మా ప్రయాణం మొదలుపెట్టాం. మేము మిర్యాలగూడ పొలిమేరను తాకేటప్పటికి మూడు కావొస్తుందట. రామచంద్ర గూడకు చేరేటప్పటికి రెండు సైకిళ్ల మీద ఇద్దరు బీట్ కానిస్టేబుల్స్ ఎదురయ్యారు. మమ్మల్ని చూసి ఏ ఎవ్వరా మీరు? ఆగండి అన్నారు. మేము చెప్పిన సమాధానాలకు ఆ పోలీసులకు దిమ్మతిరిగింది. బతిమాలుకున్నాం. ఆ పోలీసోళ్ళు మెత్తబడ్డారు. ఓకే అన్నారు. కానీ వాళ్ళిచ్చిన ట్విస్ట్ కు దిమ్మతిరగడం మా వంతైంది. వారు చెప్పింది ఏంటంటే… మేము ప్రయాణిస్తూ వచ్చిన మార్గంలో ఏదైనా దొంగతనం కానీ, మర్డర్ కానీ జరిగిందనుకోండి. వాళ్ళు మా ఇళ్ళకే వస్తారట.! అట్లా అని వూరికే వదల్లేదు. మా అడ్రస్ లు తీసుకొని మరీ వదిలారు. ఇంటికి వెళ్ళే సరికి సమయం తెల్లవారుఝాము 4గంటలు దాటి కోడి కూతలు వినిపిస్తున్నాయి. కానీ, ఆ వారం రోజులు మా బ్రతుకు దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షే. తెల్లవారితే చాలు… ఎక్కడైనా దొంగతనం వార్త ఉందా..! మర్డర్ జరిగిందా..! అని పేపర్ తిరగేయడమే అయింది మా పని.

✍️ఆజం ఖాన్
Also Read:
గల్లా అశోక్ ‘హీరో’ ట్రైల‌ర్ ఎలా ఉందంటే..?


You may also like