Telugu News » పెద్ద‌దేవుడికి కొత్త కోడ‌ళ్ల ప‌రిచ‌యం.. అడ‌వుల జిల్లాలో పెర్స‌పేన్ ఉత్స‌వం

పెద్ద‌దేవుడికి కొత్త కోడ‌ళ్ల ప‌రిచ‌యం.. అడ‌వుల జిల్లాలో పెర్స‌పేన్ ఉత్స‌వం

by Anji

ఆదివాసియులు ఏ పండుగ చేసినా ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అడ‌వుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో వేలాది ఆదివాసి కుటుంబాలు జీవిస్తున్నాయి. అందుకే ఆదిలాబాద్ జిల్లాను ఆదివాసీయుల ఖిల్లాగా పిలుస్తుంటారు. ఆదివాసి గిరిజ‌నుల సంస్కృతి, సంప్ర‌దాయాలు చూసేవారికి వింత‌గా అనిపించిన‌ప్ప‌టికీ ఎంతో విశిష్ట‌త‌ను సంత‌రించుకుని ఉంటాయి. అందుకే వారి సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ప‌రిర‌క్షించుకుంటూ.. భావి త‌రాల‌కు వాటిని వార‌స‌త్వంగా అందిస్తున్నారు. సంవ‌త్స‌రం మొత్తంలో ప‌లు పండుగ‌ల‌ను జ‌రుపుకునే ఆదివాసీయులు అందులో ఆట‌పాట‌ల‌కు ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీయులు పెర్స‌పేన్ ఉత్స‌వాల‌ను వారి సాంప్ర‌దాయ ప్ర‌కారం వైభ‌వంగా నిర్వ‌హిస్తుంటారు.

Ads


ముఖ్యంగా ఆదివాసీయులు త‌మ పెద్ద దేవుడిగా కొలిచే పెర్స‌పేన్ ఉత్స‌వాల‌ను ప్ర‌తి సంవ‌త్స‌రం వైశాఖ మాసంలో ఎంతో వైభ‌వంగా జ‌రుపుకుంటారు. ఐదు రోజుల పాటు జ‌రుపుకునే వేడుక‌ల్లో త‌మ సంస్కృతి, సంప్ర‌దాయం ప్ర‌కారం నిర్వ‌హిస్తున్నారు. మండుటెండ‌ల్లో ఉప‌వాసం ఉంటూ త‌మ ఆరాధ్య దైవాల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మొక్కులను చెల్లించుకుంటారు. ఆదివాసి గిరిజ‌నుల్లో నాలుగు, ఐదు, ఆరు, ఏడు సంఘాల‌కు చెందిన గిరిజ‌నులు ఇప్ప‌చెట్టుపై ఉంచిన పెర్స‌సేన్ ను కిందికి దించి గ్రామాల్లోకి తీసుకురావ‌డంతో ఈ ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి.

ఆదివాసీయుల యొక్క వాయిద్యాల మ‌ధ్య మొస్రం వంస‌శ‌స్థుల అల్లుళ్లు ప‌విత్ర జ‌లంతో దైవ స్నానం చేయిస్తారు. ఆ త‌రువా ఇంటి అల్లుడు ఇప్ప చెట్టుపై ఆ దేవుడిని ఉంచ‌డంతో పెర్స‌పేన్ పూజ‌లు ముగుస్తాయి. ముఖ్యంగా ఈ ఆదివాసి గిరిజ‌నులు జ‌రుపుకునే భేటింగ్ పూజ‌కు ఎంతో ప్ర‌త్యేక‌త ఉన్న‌ది. త‌మ ఇంటి కొత్త కోడ‌ళ్ల‌ను కుటుంబ పెద్ద‌లు త‌మ దైవాల‌కు ప‌రిచ‌యం చేసే కార్యాన్ని భేటింగ్ అని పిలుస్తుంటారు. ఈ భేటింగ్ జ‌రిగితే ఆ ఇంటి కొత్త కోడ‌ళ్లు ఇత‌ర దేవ‌త‌ల‌ను చూడ‌గ‌లుగుతార‌ని, ఇది త‌ర‌త‌రాల నుంచి వ‌స్తున్న ఆచారం అని, దీనిని క‌ట్టు త‌ప్ప‌కుండా ఆచ‌రిస్తున్నామ‌ని ఆదివాసులు పేర్కొంటున్నారు.


ముఖ్యంగా ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని జైనూర్ మండ‌లం ఉషేగాం, దేవుగూడ గ్రామాల్లో ఈ పూజ‌లు కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగానే గిరిజ‌న తెగ‌లోని నాగ్ భీడ్ వంశం కొత్త కోడ‌ళ్లు భేటింగ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. దాదాపు 107 మంది కొత్త కోడ‌ళ్ల‌కు భేటింగ్ నిర్వ‌హించారు. మ‌రొక‌సారి కేస్లాపూర్ నాగోబా జాత‌ర‌లోనూ మొస్రం వంశ‌స్తులు కొత్త కోడ‌ళ్ల‌కు భేటింగ్ నిర్వ‌హిస్తారు. ఇక ఈ పెర్స‌పేన్ ఉత్స‌వాల‌కు జిల్లాలోని గిరిజ‌న గూడ‌ల నుంచే కాకుండా పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర నుంచి కూడా గిరిజ‌నులు త‌ర‌లివ‌స్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప‌లు గిరిజ‌న గూడాల్లోనే ఈ ఉత్స‌వాలు ఎక్కువ‌గా కొన‌సాగుతుంటాయి.

Also Read : 

సాయంత్రం స‌మ‌యంలో గోర్లు క‌త్తిరించ‌కూడ‌దు అంటారు ఎందుకో తెలుసా..?

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఎక్కువ శ్రమ పడాలి

 


You may also like