వర్షకాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం, వైరల్ ఫీవర్ వంటివి సంభవిస్తుంటారు. అందుకే ఈ సీజన్ రోగాలకు నిలయం అని పిలుస్తుంటారు. ఇక ముఖ్యంగా సీజనల్ వ్యాధులు వర్షకాలంలో ఎక్కువగా పలుకరిస్తాయి. వర్షాల వల్ల ఎన్నో బ్యాక్టీరియాలు అభివృద్ధి చెందుతాయి. తేమ, చల్లని వాతావరణం బ్యాక్టీరియా, వైరస్‌లకు నిలయం. ఇక వర్షపు నీరు ఎక్కడపడితే అక్కడ నిలుస్తుంటాయి. ఇండ్లలో, పూలకుండీలలో, ప్లాస్టిక్ డబ్బాలలో, సైకిల్, బండ్లు, టైర్లలో, కొబ్బరిబొండాలు ఇలా అవి ఇవి అని తేడా లేకుండా నీరు నిలుస్తుంటుంది. వీటిలో ఎన్నో రకాల దోమలు, క్రిములు తయారవుతుంటాయి. ఇక దోమలు కుట్టడం ద్వారా ఈ సీజన్ లో ఎక్కువ వ్యాధులు సంభవిస్తుంటాయి. వాటిలో ముఖ్యంగా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ వంటివి వస్తుంటాయి.
డెంగ్యూ జ్వరం :
ఈ జ్వరం దోమ కుట్టదం ద్వారా సంభవిస్తుంది. 102 డిగ్రీలకు పైగా జ్వరం నమోదు అవుతుంది. ముఖ్యంగా తీవ్రమైన కీళ్లనొప్పులు, ఛాతి వెనుక భాగంలో నొప్పి, తల తిరగడం, మూర్చపడిపోవడం, వణుకు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ డెంగ్యూ జ్వరంలో రకరకాలుంటాయి. శరీరంలో నీటి శాతం కూడా తగ్గిపోతుంటుంది. రక్త కణాలు పడిపోతుంటాయి. ఇది ఎక్కువైతే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది వస్తే ముందుగానే చికిత్స తీసుకోవాలి.
మలేరియా :
ఇది ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. మనిషి రక్తంలో పరాన్న జీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది. ఈ జ్వరంలో చలి, వణుకు ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు తలనొప్పి కూడా కనిపిస్తుంటుంది. సరైన చికిత్స తీసుకోకపోతే మలేరియా కూడా ప్రాణాంతకమే అవుతుంది. ఎక్కువగా ఏజెన్సీ ఏరియాల్లో మలేరియా మరణాలు నమోదు అవుతుంటాయి. మలేరియా మూలంగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది, మెదడు దెబ్బతినడం, శరీరంలోని అవయవాలు వైఫల్యానికి దారి తీయవచ్చు.
చికెన్ గున్యా :
ఇది కూడా దోమ కుట్టడం ద్వారానే సంభవిస్తుంది. జ్వరం రోజు మొత్తం ఉండదు. జ్వరం వస్తూ పోతూ ఉంటుంది. అదేవిధంగా ఒళ్లునొప్పులు కూడా ఉంటాయి. దోమలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. లేనియెడల ప్రాణాలకే ప్రమాదం.
టైఫాయిడ్ జ్వరం :
కలుషితమైన నీరు, కలుషిత ఆహారం ద్వారా వచ్చే జ్వరం. కడుపులో వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు కనిపిస్తుంటాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇది సంభవిస్తుంది. శరీరంలోని వివిధ అవయవాలకు వ్యాపించి ప్రాణాంతకంగా మారుతుంది. అందుకోసం చికిత్స వెంటనే తీసుకోవాలి. బయటి ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు. ఇంట్లో కూడా ఈసీజన్ లో వండిన వెంటనే తీసుకోవడం బెటర్.
వైరల్ ఫీవర్ :
జ్వరం వస్తే అది కరోనా వల్లనే వచ్చిందని అనుకునే అవసరం లేదు.ఆ జ్వరానికి సంబందించిన లక్షణాలను బట్టి అది ఏరకానికి చెందినదని గుర్తించవచ్చు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు వైరల్ ఫీవర్లో కనిపిస్తుంటాయి.
ఇలాంటి వ్యాదులు రాకుండా ఉండాలంటే ఈ వర్షాలు వచ్చినప్పుడు వర్షానికి తడవడం, అదేవిధంగా బయట ఫుడ్‌ను తీసుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు. అదేవిధంగా వర్షపు నీరు ఇంట్లో నిలువకుండా చూసుకోవాలి. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో మనం తాగే నీరు కాచి చల్లార్చిన తరువాత తీసుకోవాలి. మాంసాహారం ఎక్కువగా తీసుకోకూడదు. ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోవద్దు. ఆకుకూరలు వర్షానికి తడిచి కుళ్లిపోతుంటాయి. ఈ జాగ్రత్తలు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
Also Read :
టీ, కాఫీలు తాగితే ఇన్ని నష్టాలు కలుగుతాయా..?
మీరు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే మీ కొవ్వును ఇలా కరిగించుకోండి..!