వెండి తెరపై విలన్ పాత్రలు పోషించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రముఖ నటుడు సోనూసూద్. ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేసి తన మంచి మనసున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు సోనూసూద్. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తూ వారి జీవితాలకు బాసటగా నిల్చుతున్నాడు. తాజాగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న దివ్యాంగుడు అయిన సింగర్ కి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఓ ప్రైవేటు స్కూల్ లో ఉద్యోగం కల్పిస్తాననే భరోసా కూడా కల్పించాడు.
Advertisement
ఝార్ఖండ్ కి చెందిన మక్సూద్ అనే దివ్యాంగుడు సంగీతంలో మంచి ప్రావిణ్యుడు. 2017లో ఇండియన్ ఐడల్ సింగర్ పోటీలలో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం తన పరిస్థితి బాలేక బొకారో జిల్లాలో రోడ్ల వెంట భిక్షాటన చేస్తున్నాడు. తన గాత్రాన్ని ప్రజలకు వినిపిస్తూ సాయం చేయాలని ప్రజలను దీనంగా అడుక్కుంటున్నాడు. అతడి గురించి సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. మక్సూద్ గురించి తెలుసుకున్న సోనూసూద్ అతనికి ఓ ప్రైవేటు పాఠశాలలో ఉద్యోగం కల్పిస్తాననే హామీ ఇచ్చాడు. అదేవిధంగా ఆ రాష్ట్ర మంత్రి కూడా మక్సూద్ కి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మక్సూద్ మీడియాతో మాట్లాడారు. “సోనూసూద్ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది వాస్తవమే. సంగీతంలో కలిసి సాగడమే నా కల. మళ్లీ ఇండియన్ ఐడల్ సింగర్ పోటీలలో పాల్గొనాలని ఉంది. నా గొంతుకు గుర్తింపుగా పురస్కారాలు అందుకోవాలని ఉంది. కరోనా కారణంగా నా జీవితం తలకిందులు అయింది. ప్రస్తుతం బొకారో నగరానికి వచ్చి విధుల్లో భిక్షాటన చేస్తూ సాయంత్రం ఇంటికి వెళ్తున్నాను. సోనూసూద్ సార్ సాయంతో మళ్లీ నా కల నెరవేరుతుందని భావిస్తున్నా” అంటూ హర్షం వ్యక్తం చేశాడు మక్సూద్.