వర్షాకాలంలో ఆకాశంలో నల్లని మబ్బలు ఒక్కసారిగా కమ్ముకుని పట్టపగలు కూడా కారు చీకటిలాగా కనిపించి ఉరుములు, మెరుపులతో వర్షాలు వస్తుంటాయి. ఈ సమయంలో చాలా చోట్ల పిడుగులు కూడా పడుతుంటాయి. తరచూ మనం వార్తల్లో వింటూనే ఉంటాం. పిడుగు పడే సమయంలో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పిడుగు పాటు సంకేతాలు
Advertisement
ఆకాశంలో నల్లని మబ్బులు గుమికూడడం, మెరుపులు కనిపించడం, ఉరుములు వినిపించడం, శర వేగంగా గాలులు వీచడం వంటివి పిడుగుకు సంకేతాలు.
పిడుగులు పడే ప్రదేశాలు
ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాలు కొండ ప్రాంతాలు, పొడవైన చెట్టు, సెల్ఫోన్ టవర్లు, విద్యుత్ మరియు టెలిఫోన్ స్థంబాలు, విడివిడిగా ఉండే చెట్లు, గృహాలు, బహిరంగ ప్రదేశాలు వంటి ప్రదేశాల్లో పిడుగులు పడుతుంటాయి.
పిడుగు పడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Advertisement
- టీవీ లేదా రేడియోల ద్వారా వాతావరణ సమాచారం తెలుసుకుని స్థానిక హెచ్చరికలను పాటించాలి.
- తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. అనగా (భవనాలు, ఆఫీసులు, షాపింగ్ సెంటర్లు)
- విద్యుత్ నిలిపి వేయాలి. లోహపు వస్తువులకు వ్యవసాయ పంపుసెట్లకు దూరంగా ఉండాలి.
- తప్పనిసరి పరిస్థితిలో బహిరంగ ప్రదేశాల్లో ఉండాల్సి వస్తే మొక్కాళ్ల మధ్య రెండు చేతులతో చెవులు మూసుకుని భూమికి తగలకుండా వంగి కూర్చోవాలి.
- గోడలకు ద్వారాలకు కిటికిలకు దూరంగా ఉండాలి. ఎండిన చెట్లు విరిగిన కొమ్మలకు దూరంగా ఉండాలి.
- వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు వాటిని సురక్షిత ప్రాంతాల్లో నిలిపి అందులో ఉండాలి.
- పశుసంపదను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. బాధితులకు ప్రథమ చికిత్సను అందించాలి. వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.
చేయకూడనివి
- ఆరు బయట ప్రదేశాల్లో ఉండకూడదు.
- ఆశ్రయం కోసం చెట్ల కిందకి అసలు వెళ్లకూడదు.
- నీటిలో ఉండకూడదు. లోహపు పైపుల నుంచి వచ్చు నీటిని తాకకూడదు.
- సెల్ఫోన్లు ఉపయోగించకూడదు.
- రేకుల షెడ్ల కింద వరండాలో ఉండకూడదు. ఉరుములు మెరుపుల తదుపురి కనీసం 30 నిమిషాల వరకు బయటకు వెళ్లకూడదు.
- ఎలక్ట్రిక్ ఉపకరణాలను వ్యవసాయ పంపు సెట్లను ఉపయోగించకూడదు.
- ట్రాక్టర్లు, మోటారు సైకిళ్లను ఆరు బయట నిలపి ఉంచకూడదు.