ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఎన్నికలు జరగడానికి ఇంకా రెండేండ్ల సమయముంది. అయితే ఇప్పటి నుండే సీఎం జగన్ సిద్ధమయిపోతున్నట్టుగా తెలుస్తోంది. గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసారు. త్వరలో ఏపీ క్యాబినెట్ విస్తరణ చేయడం, వైసీపీఎల్పీ భేటీ జరుగుతుండడమే కారణం. ఈనెల 15న జరిగే వైసీపీ ఎల్పీ భేటీ సమావేశంలో ఏపీ మంత్రి వర్గ విస్తరణతో పాటు ఎన్నికల వ్యూహాలపై పార్టీ నేతలకు జగన్ పూర్తిగా వివరించే అవకాశముందని తెలుస్తోంది. ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ముఖ్యంగా సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించి కొత్త వారిని మంత్రులుగా నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకున్నది. దాదాపు మూడేళ్ల తరువాత ఏపీ క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధం అయింది. ఏపీ క్యాబినెట్ త్వరలో కొత్త మంత్రులతో కొలువు దీరనున్నది. ప్రస్తుత క్యాబినెట్ ఏర్పడి మూడేండ్లు అవుతోంది. దాదాపుగా మంత్రులను మార్చుతారని ప్రచారం జరిగినా.. కొందరినీ కంటిన్యూ చేస్తున్నట్టు సీఎం తెలిపారు.
ఏడుగురు మంత్రులను తప్ప మిగతా మంత్రులందరినీ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ మంత్రి వర్గంలో త్వరలో 17 మంది కొత్త ముఖాలు కనిపించబోతున్నాయి. చాలా కాలంగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంది. ఇదే సమయంలో త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందంటూ క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ తేల్చి చెప్పారు. అంతేకాకుండా పునర్ వ్యవస్థీకరణలో పదవులు కోల్పోయిన వారందరూ పార్టీ కోసం పని చేయాలని ఆదేశించారు సీఎం జగన్. వారందరికీ ఇన్‌చార్జీ బాధ్యతలను అప్పగించనున్నట్టు తెలిపారు.