బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఆరోపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. స్టీల్ ప్లాంట్ ప్రైటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో కాంగ్రెస్ నిర్వహించిన న్యాయ సదస్సు బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్.. ఏపీలో ప్రశ్నించే గొంతులు లేవన్నారు. వైసీపీ, టీడీపీ రెండూ ఢిల్లీలో మోడీకి మద్దతిచ్చే పార్టీలే అని విమర్శించారు. ఒకప్పుడు రాష్ట్రంలోని నేతలు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడితే.. ఇప్పుడు మాత్రం ఇక్కడి నేతలు ఢిల్లీలో రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు. ఏపీలో ప్రధాని మోడీని ప్రశ్నించే వారే లేరన్నారు.
Advertisement
Advertisement
వైఎస్‌ఆర్ ఆశయాలను నెరవేర్చేవారే ఆయన నిజమైన వారసులు అన్నారు రేవంత్ రెడ్డి. షర్మిల వైఎస్‌ఆర్ ఆశయాల సాధన కోసం పని చేస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా షర్మిల సీఎం అవుతారని చెప్పారు. ఏపీకి కావాల్సింది పాలకులు కాదని.. ప్రశ్నించే గొంతుకలని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించండి.. మిమ్మల్ని ఎక్కువ అడగడం లేదు. 25 మంది ఎమ్మెల్యేలు, 5 గురు ఎంపీలను ఇవ్వండి చాలు.. షర్మిలమ్మ పోరాటం చేస్తారు. ఎవ్వరినైనా చొక్కా పట్టి ప్రశ్నిస్తారు. ఎలా మీ రాజధాని నిర్మాణం కాదో.. ఎలా పోలవరం పూర్తి కాదో.. ఎలా విశాఖ ఉక్కును కొల్లగొడతారో చూసుకుంటారు. కంచె వేసి కాపాడుకుంటారని తెలిపారు.
కష్టాల్లో ఉన్న ఏపీ ప్రజలకు అండగా నిలవడానికే వైఎస్ షర్మిల ఇక్కడికి వచ్చారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అచ్చొసిన ఆంబోతుల్లా వారిద్దరూ జగన్, చంద్రబాబు తలపడుతుంటే ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం ఆషామాషీ కాదని ఆమెకు తెలుసు. అయినా సరే పోరాటం చేయడానికి షర్మిల ముందుకొచ్చారు. ఆమె నాయకత్వాన్ని ప్రజలు బలపరచాలి. షర్మిల ఏపీ సీఎం పీఠం పై కూర్చునే వరకు తాను తోడుగా ఉంటానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.