తెలంగాణ వ్యవహారాలను రాహుల్ గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టికి ప్రాధాన్యత పెంచారు. పీపుల్స్ మార్చ్ తో తెలంగాణలో పార్టీ జోష్ కి కారణమైన భట్టికి తాజాగా రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం సభ తరువాత గన్నవరం బయల్దేరిన రాహుల్ తనతో పాటుగా భట్టిని వెంట బెట్టుకెళ్లారు. ఆ సమయంలో రాష్ట్రంలో పార్టీలోని పరిస్థితులపైన ఆరా తీసారు. నేతల సమన్వయంపైన చర్చించారు.
Advertisement
రాహుల్ గాంధీ స్వయంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిణామాల పై ఆరా తీస్తున్నారు. కర్ణాటక తరువాత తెలంగాణ పైన కాంగ్రెస్ అధికారం దక్కించుకోవాలనే కసితో అడుగులు వేస్తోంది. ఈ సమయంలో ఎక్కడ ఏ విషయంలోనూ ఉపేక్షించ కూడదని రాహుల్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ యాత్ర ద్వారా భట్టి కష్టాన్ని రాహుల్ గుర్తించారు. తన సుదీర్ఘ యాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటంతో పాటుగా పేదల వద్దకు పార్టీ ని తీసుకు వెళ్ళటం, వారితో మమేకం అవ్వటం, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించటం పార్టీకి మైలేజ్ పెంచిందని రాహుల్ విశ్వసించారు. అందులో భాగంగానే తానే స్వయంగా వచ్చి ఖమ్మం సభలో భట్టిని సత్కరించారు. ప్రత్యేకంగా భట్టి యాత్రను ప్రశంసించారు. సభ ముగిసిన తరువాత భట్టిని తనతో పాటుగా తీసుకెళ్లిన రాహల్ కీలక మంతనాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
Advertisement
రాహుల్ కారులోనే భట్టికి పార్టీ వ్యూహాల పైన కీలక సూచనలు చేసారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి.. టికెట్ల ఖరారు ఎంపిక పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బ తినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో, భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లైంది.
ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో టికెట్లు ఖరారు చేయటం వలన ప్రతీ సారి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సారి ఎన్నికలకు ముందుగానే క్లారిటీ ఉన్న నియోజకవర్గాల్లో వచ్చే నెలలోనే టికెట్లు ఖరారు చేసే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. పోటీ ఉన్న నియోజకవర్గాల్లోనూ అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఎన్నికలకు మూడు నెలల ముందుగానే విడదుల చేసేందుకు రాహుల్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. దీని ద్వారా చివరి నిమిషం లో సీట్ల కోసం వివాదాలు నివారించవచ్చని, అభ్యర్థుల ప్రచారానికి సమయం ఎక్కువగా ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు. ఈ సమయంలో భట్టి నుంచి రాహుల్ నివేదిక కోరటంతో అభ్యర్థుల ఎంపికలో భట్టి విక్రమార్క్ చేసే సూచనలు, ఇచ్చే నివేదిక పార్టీ అభ్యర్థుల ఖరారులో కీలకంగా మారనుంది.