టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తన కెరియర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొన్నాళ్లపాటు ఆటకు దూరంగా ఉండాలని ఈ 25 ఏళ్ల యువ బ్యాటర్ నిర్ణయించుకున్నాడు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఇషాన్ కిషన్ ఆ సమస్యను అధిగమించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇదే విషయాన్ని అతడు బీసీసీఐకి చెప్పగా…. ఇందుకు బోర్డు కూడా అనుమతినిచ్చింది. దీంతో అతడు దక్షిణాఫ్రికాతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ నుంచి తప్పకున్నాడని తెలుస్తోంది.
Advertisement
Advertisement
2021లో టి20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఇషాన్ అదే ఏడాది వన్డేలోనూ అరంగేట్రం చేశాడు. అయితే అతడికి ఎక్కువ అవకాశాలు రాలేదు. గత ఏడాది డిసెంబర్లో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఇషాన్ కు వరుస అవకాశాలు లభించాయి. వాటిని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. వన్డేల్లో ద్విశతకం బాదిన అతడు టి20ల్లోను నిలకడగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఏడాది భారత్ ఆడిన ప్రతి సిరీస్ లోను ఇషాన్ జట్టుతోనే ఉన్నాడు. అయితే గిల్, కేఎల్ రాహుల్ గాయాల నుంచి కోలుకొని టీం లోకి రావడంతో ఇషాన్ ఎక్కువగా బెంచ్ కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే అతడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్టుగా తెలుస్తోంది. దీంతో టెస్ట్ సిరీస్ నుంచి తప్పించాలని బీసీసీఐని కోరగా అతడి పరిస్థితిని అర్థం చేసుకున్న మేనేజ్మెంట్ అందుకు అతడికి అనుమతినిచ్చినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
అయితే మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో ఉన్నాడు ఇషాన్ కిషన్. ఈ యంగ్ క్రికెటర్ కిరామం కోరడంతో అతడి స్థానంలో తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ కు అవకాశం లభించింది. ఇప్పటికే గాయాల కారణంగా మహమ్మద్ షమీతో పాటు రుతురాజ్ గైక్వాడ్ లు టెస్ట్ సిరీస్ లకు దూరం కాగా, ఇప్పుడు ఇషాన్ కిషన్ తప్పుకున్నాడు. అయితే ఇషాన్ కిషన్ ఎంతకాలం పాటు ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు అనే విషయం మాత్రం తెలియరాలేదు.