Coal India

బొగ్గు సరఫరాపై పి.ఎం.ఓకు వినతి

Updated By ManamThu, 10/11/2018 - 23:01

coal indiaన్యూఢిల్లీ: బొగ్గు సౌలభ్యం, దాని సరఫరా సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్ పరిశ్రమల రంగ సంస్థ ఐ.సి.పి.పి.ఏ ప్రధాన మంత్రి కార్యాలయానికి విజ్ఞప్తి చేసింది. అయితే, ఇండియన్ క్యాప్టీవ్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐ.సి.పి.పి.ఏ)లో ఉక్కు, అల్యూమినియం వంటి కీలక రంగాలకు చెందిన వారు కూడా సభ్యులుగా ఉన్నారు. విద్యుత్ ఎక్కువ అవసరమయ్యే పరిశ్రమగా అల్యూమినియంను అక్టోబర్ 4న పి.ఎం.ఓకు రాసిన లేఖలో ఐ.సి.పి.పి.ఏ పేర్కొంది. ఒక టన్ను అల్యూమినియం లోహాన్ని ఉత్పత్తి చేయడానికి దాదాపు 14,500 (కిలోవాట్ గంట) యూనిట్లు అవసరమవుతాయని సంస్థ తెలిపింది. అంత విద్యుదుత్పాదనకు 11.7 టన్నుల బొగ్గు అవసరమవుతుందని సంస్థ వెల్లడించింది. క్యాప్టీవ్ పవర్ ప్రొడ్యూసర్లకు బొగ్గు సరఫరా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యగా సంస్థ చెప్పింది. ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల మాదిరిగా వాణిజ్య ప్రయోజనాలకు  క్యాప్టీవ్ పవర్ ప్రొడ్యూసర్లు విద్యుదుత్పాదన చేయరని తెలిపింది. ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్.ఎస్.ఏ)లోని నిష్పత్తి ప్రకారం క్యాప్టీవ్ పవర్ ప్రొడ్యూసర్లకు 25 శాతం బొగ్గు కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖే 2016 ఫిబ్రవరి 15 వ తేదీ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు ఐ.సి.పి.పి.ఏ గుర్తు చేసింది. రెండు గంటలు లేదా అంతకుమించి విద్యుత్ సరఫరా నిలిచిపోతే అల్యూమినియం బానలు గడ్డకట్టుకుపోతాయని, ప్లాంట్‌ను కనీసం 6 నెలలపాటు మూసివేయవలసి ఉంటుందని సంస్థ తెలిపింది. ఫలితంగా, పరిశ్రమ భారీగా నష్టాల పాలవుతోందని, పునః ప్రారంభానికి ఖర్చులు చేయవలసి వస్తోందని సంస్థ వాపోయింది. పైగా, అల్యూమినియం పరిశ్రమ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 20 లక్షల టన్నుల నుంచి 4.1 మిలియన్ టన్నులకు పెంచుకునేందుకు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని సంస్థ తెలిపింది. రూ. 70,000 కోట్ల రుణ భారాన్ని మోస్తున్న అల్యూమినియం పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్లకు ఇస్తున్న రేటుకే బొగ్గును క్యాప్టీవ్ పవర్ ప్రొడ్యూసర్లకు కూడా కోల్ ఇండియా లిమిటెడ్ అందజేయాలని ఐ.సి.పి.పి.ఏ డిమాండ్ చేసినట్లు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి రాజీవ్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు.థర్మల్ కేంద్రాల వద్ద తగ్గుతున్న బొగ్గు నిల్వలు

Updated By ManamThu, 09/20/2018 - 22:04

coalన్యూఢిల్లీ: సెప్టెంబర్ 17 నాటికి దేశంలో కనీసం 14 విద్యుత్ కేంద్రాలు సూపర్ క్రిటికల్ స్థాయిల్లో ఉన్నాయి. అంటే, వాటి దగ్గర ఉన్న బొగ్గు నిల్వలు నాలుగు రోజులకన్నా తక్కువ అవసరాలను మాత్రమే తీర్చగలుగుతాయి. రెండు థర్మల్ ప్లాంట్లు క్రిటికల్ స్థాయిల్లో ఉన్నాయి. వాటి వద్దనున్న బొగ్గు నిల్వలు ఏడు రోజులకు కూడా పూర్తిగా సరిపోవు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తాజా డాటా దీన్ని సూచిస్తోంది. అంతమాత్రాన మిగిలిన తాప విద్యుత్ కేంద్రాల వద్ద బొగ్గు సరిపడినంత స్థాయిల్లో ఉందని అర్థం కాదు. సూటిగా చెప్పాలంటే, 121 థర్మల్ ప్లాంట్లలో 76 ప్లాంట్ల వద్ద ఏడు రోజులు లేదా అంతకన్నా తక్కువ రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. విద్యుత్ కేంద్రాలు సిద్ధంగా ఉన్న బొగ్గు నిల్వలను తీసుకెళ్ళకపోవడం కూడా అందుకొక కారణం. తూర్పు ప్రాంతంలో బొగ్గు నిల్వల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అక్కడి 28 విద్యుత్ కేంద్రాలలోని 21 కేంద్రాలలో ఒక వారం లేదా అంతకన్నా తక్కువకు సరిపడ మాత్రమే బొగ్గు నిల్వలున్నాయి. పశ్చిమ ప్రాంతంలోని 40 విద్యుత్ కేంద్రాల్లో 29 కేంద్రాల్లో కూడా ఒక వారం లేదా అంతకన్నా తక్కువకు సరిపడ బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. దక్షిణాదిలోని 20 కేంద్రాల్లో పది కేంద్రాల్లోనూ, ఉత్తరాదిలోని 32 కేంద్రాల్లో 16 కేంద్రాల్లోనూ కూడా బొగ్గు నిల్వలు అదే స్థాయిల్లో ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే, దేశం మొత్తంమీదున్న 121 తాప విద్యుత్ కేంద్రాల్లో 32 కేంద్రాలకు వాటి వార్షిక కాంట్రాక్టు బొగ్గు పరిమాణంలో 99 శాతం సరఫరా అవుతోంది. అంతకన్నా ఎక్కువగా (ఒక్కోసారి 152 శాతం వరకు కూడా) సరఫరా అవుతోంది. ఈ అధిక డిమాండ్ బొగ్గు సరఫరా వాల్యూ చైన్‌పై మరింత ఒత్తిడి పెంచుతోంది. ‘‘బొగ్గు సరఫరా స్థితికి సంబంధించి రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి. ఉత్పత్తి. రెండు. సరఫరా. డిమాండ్ హఠాత్తుగా పెరిగిందని ఆ రెండింటినీ పెంచలేం. తాప విద్యుత్‌కు కనిపిస్తున్న గిరాకీ స్థాయి అసాధారణంగా ఉంది. విద్యుత్ డిమాండ్ అంచనాలు పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి లభించగల వాటాను కూడా లెక్కలోకి ఎక్కువగా తీసుకున్నాయి’’ అని బొగ్గు మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి సుశీల్ కుమార్ అన్నారు. 

కొత్తగా నెలకొల్పిన థర్మల్ విద్యుదుత్పాదన సామర్థ్యం 1,45,155 మెగావాట్లుగా ఉంది. థర్మల్ ప్లాంట్ల వద్ద 12.29 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. దానిలో దిగుమతి చేసుకున్న 407.76 వేల టన్నుల బొగ్గు కూడా ఉంది. అదే 2017 సెప్టెంబర్ 17న, థర్మల్ విద్యుదుత్పాదన సామర్థ్యం 1,34,205 మెగావాట్లుగా ఉంది. అప్పట్లో వాటి విద్ద 9.38 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. పవన, జల విద్యుదుత్పాదన తక్కువ స్థాయిలో ఉండడంతో ఈ వారంలో థర్మల్ విద్యుత్‌పై ఒత్తిడి పెరిగింది. ఇది ఆన్ ద స్పాట్ పవర్ ఎక్చ్సేంజిలో, టారిఫ్‌లు పెరిగి, గత ఎనిమిదేళ్ళలో ఎరుగనంత అత్యధిక స్థాయిలను తాకడానికి కారణమైంది.‘మెరుగుపడనున్న బొగ్గు సరఫరా’

Updated By ManamSat, 07/21/2018 - 00:10
  • సమస్యలు క్రమంగా తొలగిపోతున్నాయన్న కోల్ ఇండియా చైర్మన్ అనిల్ కుమార్ ఝా

Coal Indiaకోల్‌కతా: కోల్ ఇండియా కొన్ని దశాబ్దాల కాలంలో ఉత్పత్తిలో తరచు రెండు సంఖ్యలలో వృద్ధిని కనబరుస్తూ వచ్చినా రైలు రవాణాలో ప్రతిబంధకాల వల్ల  బొగ్గు లభ్యత ఒక సమస్యగా ఉంటూ వచ్చింది. మౌలిక వసతులు పెంపొందించడంలో కేంద్రం చూపిస్తున్న చొరవ పుణ్యమా అని ఆ సమస్య ఇప్పుడు తగ్గనుంది. ముఖ్య ప్రాజెక్టులు అనేకం పూర్తయ్యే తుది దశలో ఉన్నందు వల్ల  ఈ ఏడాది నుంచి బొగ్గు సరఫరాలు చాలా వేగంగా కదలడం ప్రారంభించనున్నాయని కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ ఝా చెప్పారు. ‘‘ఝార్ఖండ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లలో కొన్ని విస్తారమైన బొగ్గు నిల్వలను వేరు చేసే పని త్వరలో ముగుస్తుంది. బొగ్గు నిల్వలను తరలించడంలో లాజిస్టిక్స్ రెండేళ్ళలో పెద్దయెుత్తున మెరుగుపడనుంది’’ అని కోల్ ఇండియా చైర్మన్‌గా మే 18న బాధ్యతలు చేపట్టాక ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో  బొగ్గు రవాణాలను 580 మిలియన్ టన్నుల నుంచి 681 మిలియన్ టన్నులకు పెంచాలని కోల్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్పత్తి లక్ష్యాన్ని గత ఏడాది నాటి 567 మిలియన్ టన్నులకన్నా 85 మిలియన్ టన్నులు అధికంగా నిర్ణయించారు. దానికి తగ్గట్లుగా కోల్ ఇండియా ఉత్పత్తిని 104 మిలియన్ టన్నులు పెంచుకుంది. కడచిన నాలుగేళ్ళలో దాని సరఫరాలలో 109 మిలియన్  టన్నుల వృద్ధి కనిపించింది. ఉత్పత్తి లక్ష్యం ఎక్కువగా ఉన్న మాట వాస్తవమేని ఝా అంగీకరిస్తూ, కానీ, అది సాధ్యమైనదేనని చెప్పారు. వర్షాకాలం విస్తరించకుండా, వర్షపాతం సాధారణ పరిమితులకు మించకుండా ఉండాలని ఆయన అన్నారు. ఈ రెంటికి తోడు, ఒడిశా బొగ్గు క్షేత్రాలలో శాంతి భద్రతల పరిస్థితి స్వల్పంగా మెరుగుపడినా కూడా ఉత్పత్తి లక్ష్యం సుసాధ్యమవుతుందని చెప్పారు. ఒడిశాలో ముఖ్యంగా ఫలవంతమైన తాల్చేర్ బొగ్గు క్షేత్రాలలోను, వాటి చుట్టుపక్కల తరచు జరుగుతున్న సమ్మెలు ప్రధాన ఉత్పత్తి నష్టాలకు కారణమవుతున్నాయని ఝా చెప్పారు.ఉత్పత్తి వృద్ధిలో సగం వాటా బిలాస్‌పూర్ కేంద్రంగా ఉన్న సౌత్ ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్,  సంబల్‌పూర్ కేంద్రంగా ఉన్న మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి ఉండగలదని ఆయన తెలిపారు. రాంచీ కేంద్రంగా ఉన్న సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్, సింగరౌలి కేంద్రంగా ఉన్న నార్ద్రన్ కోల్‌ఫీల్డ్స్‌లు కూడా ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదలకు తోడ్పడగలవని ఝా అన్నారు. ఒడిశాలో సుందర్‌గఢ్ జిల్లాలో ఐబీ-లోయ నిక్షేపాలను అనుసంధానపరచే 53 కిలోమీటర్ల నిడివిగల ఝర్సుగూడా-బరపాలి రైలు మార్గం ఇటీవల పూర్తయింది. సరఫరాలు పెంచడంలో ఇది కీలక పాత్ర వహించనుంది. విస్తారమైన మగధ్, ఆవ్రుపాలి నిక్షేపాల నుంచి రైలు, రోడ్డు మార్గాల ద్వారా బొగ్గు రవాణాకు వెసులుబాటు కల్పించే 45 కిలోమీటర్ల నిడివి గల టోరీ-శివ్‌పూర్ లైను డిసెంబర్ నాటికి పూర్తి కానుంది. చత్తీస్‌గఢ్‌లో 90 కిలోమీటర్ల నిడివి కలిగిన ఖర్సియ-ధర్మజగఢ్ లింక్ కూడా డిసెంబర్ నాటికి పాక్షికంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. 

అయితే, పన్నులు చెల్లించాక, కోల్ ఇండియా గడిస్తున్న లాభంలో 2014 మార్చి నుంచి దాదాపు 40 శాతం తరుగుదల కనిపించింది. విద్యుదుత్పాదన రంగానికి కోల్  ఇండియా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే అందుకు కారణం. తక్కువ రకం థర్మల్ బొగ్గుకు ఇతర వినియోగదార్లకన్నా విద్యుదుత్పాదన రంగం 20 శాతం తక్కువ చెల్లిస్తుంది. వేతనాల పెరుగుదలకు గత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు చేసినందు వల్ల 2018-19లో లాభదాయకత కూడా మెరుగుదలను చూడవచ్చని ఝూ సూచించారు. కోల్ ఇండియా 2017-18 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 10,000 కోట్లు తరలి వెళ్ళడాన్ని చూసింది. జీతభత్యాలలో తెచ్చిన రూ. 800 కోట్ల పెరుగుదల వల్ల అధికారులకు చెల్లించిన రూ. 2,700 కోట్ల బకాయిలు, నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల గ్రాట్యుటి, ఇతర సదుపాయాలకు కేటాయించిన రూ. 7,400 కోట్ల కేటాయింపు కూడా ఉంది. ఒడిశాలోని సుందర్‌గఢ్‌లో ఎన్.టి.పి.సితో కలసి సంయుక్త రంగంలో కోల్ ఇండియా ఒక విద్యుదుత్పాదన కేంద్రాన్ని నెలకొల్పనుంది. కోల్ ఇండియాకు చెందిన గనుల తవ్వక అనుబంధ సంస్థ ఎం.సి.ఎల్ ఈ ప్రాజెక్టులో ఎన్.టి.పి.సికి భాగస్వామిగా ఉంటుంది.ఘనంగా బొగ్గు ఉత్పత్తి

Updated By ManamTue, 06/12/2018 - 22:50

coalన్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా ఉత్పత్తి భారీగా పెరిగినట్లు కేంద్ర మంత్రి పీయష్ గోయల్ అన్నారు. బీజేపీ పాలనకు నాలుగేండ్లు నిండిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  గత నాలుగేండ్లలో బొగ్గు ఉత్పత్తి 105 మిలియన్ టన్నులు పెరిగి 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 567 మిలియన్ టన్నుల మార్క్‌ను చేరిందని ఆయన తెలిపారు. కాగా నాలుగేండ్ల క్రితం, 2013-14 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి 462 మిలియన్ టన్నులుగా ఉంది. గతంలో ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల కాలంలో సాధించే  ఈ ఉత్పత్తిని నాలుగేళ్లలో సాధించామని గోయల్ అన్నారు. ఇంత భారీ ఎత్తున ఉత్పత్తి జరగటానికి బొగ్గు, రైల్వే మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం దోహదపడిందని  ఆయన పేర్కొన్నారు. అదే విధంగా,  రైలు రవాణా సుంకాన్ని ఏప్రిల్, మేలో 8 శాతం పెంచినట్లు ఆయన తెలిపారు. గత కొన్నేం డ్ల నుంచి బొగ్గు దిగుమతులు గణనీయం గా తగ్గినట్లు గోయల్ తెలిపారు.బొగ్గు కేటాయింపులో పీఎస్‌యూలకే పెద్ద పీట

Updated By ManamFri, 05/25/2018 - 22:20

Coal Indiaన్యూఢిల్లీ: కొరతగా ఉన్న బొగ్గును కేటాయించడంలో  వరుస క్రమాన్ని తప్పి అయినా సరే మొదట కేంద్ర, రాష్ట్ర విద్యుదుత్పాదన కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వవలసిందని ప్రభుత్వం కోల్ ఇండియా లిమిటెడ్‌ను ఆదేశించింది. దీనితో ప్రైవేటు విద్యుదుత్పాదన సంస్థలు ఖంగుతిన్నాయి. ప్రైవేటు పరిశ్రమలకు చెందిన క్యాప్టీవ్ పవర్ ప్లాంట్ల వంటి ఇతర వినియోగ సంస్థలకుగాక విద్యుదుత్పాదన కేంద్రాలకు మాత్రమే బొగ్గును సరఫరా చేయవలసిందని మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ నెల మొదట్లో ఆదేశించిన తర్వాత, ఆ రకమైన ఉత్తర్వు వెలువడింది. నడి వేసవిలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడం వల్ల, బొగ్గుకు డిమాండ్ పెరగవచ్చని బొగ్గు మంత్రిత్వ శాఖ మే 24న కోల్ ఇండియాకు రాసిన లేఖలో పేర్కొంది. ఏప్రిల్‌లో విద్యుదుత్పాదన అనుకున్న దానికన్నా ఎక్కువగా సాగించారు. ఇది తిరిగి విద్యుత్ రంగం నుంచి బొగ్గుకు ఉన్న డిమాండ్‌ను ఊహించినదానికన్నా ఎక్కువ చేయవచ్చు అని ఆ లేఖలో పేర్కొన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద బొగ్గుకు కొరత ఏర్పడడానికి ఉన్న అవకాశాన్ని నివారించేందుకు, బొగ్గు నిల్వల సౌలభ్యం, తగిన రవాణా ఏర్పాట్లు వివిధ అంశాలను ఆధారం చేసుకుని నిర్వహణ పరంగా ఎంతవేురకు వీలైతే అంత మేరకు బొగ్గు కేటాయింపులను, అవసరమైతే మిగిలిన వాటిని పక్కనపెట్టైనా రాష్ట్ర, కేంద్ర పి.ఎస్.యు (విద్యుత్) ఉత్పాదన కంపెనీలకు (జెన్‌కోలకు) కేటాయించవచ్చని నిర్ణయించడమైనది. విద్యుదుత్పాదనకు బొగ్గు అవసరాలు ఒక్కసారిగా పెరగడం వల్ల ఇలా చేయవలసి వస్తోంది అని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. దేశంలో బొగ్గుకు కొరత ఏర్పడవచ్చని పరిశ్రమ వర్గాలవారు చెబుతున్నారు. వేసవి నెలల్లో విద్యుత్ డిమాండ్ తార స్థాయికి చేరుతుంది. ఒక్క ఉదుటున పెరిగిన డిమాండ్‌ను తీర్చడంలో కోల్ ఇండియా లిమిటెడ్ కూడా వెనుకబడింది. వరుస క్రమాన్ని పక్కనపెట్టి కేటాయించడం వల్ల  ఆశావహ పథకం శక్తి కింద బొగ్గు కేటాయింపుపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. బొగ్గు నియంత్రణను, కేటాయింపును పారదర్శకంగా నిర్వహించే పథకాన్ని సంక్షిప్తంగా శక్తి అని పిలుస్తున్నారు. ఈ-వేలం ద్వారా కేటాయించవలసి వచ్చే మొత్తాలపైన కూడా దాని ప్రభావం పడుతుంది. శక్తి పథకం కింద, హామీ లేఖలు పొందిన విద్యుత్ ప్లాంట్లకు బొగ్గును కేటాయించవలసి ఉంటుంది. కోల్ ఇండియా ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించలేకపోవడం వల్ల ఆ విధమైన బొగ్గు కేటాయింపులకు ఆటంకం ఏర్పడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యతపై బొగ్గు సరఫరా చేయలేకపోతున్నారు. స్వతంత్ర విద్యుదుత్పాదన సంస్థల ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రభుత్వం పి.ఎస్.యులకు మద్దతు కొనసాగిస్తోందని విమర్శలున్నాయి. కోల్ ఇండియా క్లోజ్!

Updated By ManamWed, 02/21/2018 - 04:48
  • బొగ్గు గనుల ప్రైవేటీకరణకు ప్రభుత్వం ఓకే.. ప్రతిపాదనకు సీసీఈఏ సమావేశం ఆమోదం

  • ప్రభుత్వరంగ సీఐఎల్ గుత్తాధిపత్యానికి స్వస్తి.. గనులు.. క్షేత్రాల వేలం ప్రక్రియకు అంగీకారం

  • పోటీతత్వానికి బీజం పడుతుంది: పీయూష్.. లక్షలాదిగా ప్రత్యక్ష.. పరోక్ష ఉద్యోగావకాశాలు

  • పెద్ద.. చిన్న... మధ్యతరహా గనులన్నీ వేలం.. కేంద్ర మంత్రిమండలి భేటీలో తీర్మానాలు

coalindiaన్యూఢిల్లీ: దేశంలో బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్రం తెరతీ సింది. ఈ శిలాజ ఇంధన రంగాన్ని 1973లో జాతీయం చేసింది మొదలు ఇప్పటిదాకా కొనసాగిన ప్రభుత్వ అజమాయిషీ ఇక అంతమవుతుంది. తదనుగుణంగా ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) గుత్తాధిపత్యానికి తెరపడుతుంది. అటుపైన బొగ్గు ఉత్పత్తి కాస్తా ప్రైవేటు రంగం చేతిలోకి వెళ్లి వాణిజ్యపరంగా తవ్వకాలకు రంగం  సిద్ధమవుతుంది. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమైన సందర్భంగా ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) బొగ్గు రంగం ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఆమోదించింది. బొగ్గు రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్కరణగా కేంద్ర రైల్వే, బొగ్గుశాఖ మంత్రి పీయూష్ గోయెల్ దీన్ని అభివర్ణించారు. మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన విలేకరులకు వివరించారు. ప్రస్తుతం ప్రైవేటు సంస్థల సొంత అవసరాల కోసం బొగ్గు తవ్వకానికి అనుమతిస్తున్నట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. సీసీఈఏ తాజా నిర్ణయంతో అమలు కానున్న భారీ సంస్కరణద్వారా సీఐఎల్ గుత్తాధిపత్య శకం ముగిసి పోటీతత్వానికి బీజం పడుతుందని మంత్రి చెప్పారు. పెట్టుబడుల ప్రవాహం పెరిగి లక్షలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు. అంతేకాకుండా విద్యుత్ చార్జీలు కూడా తగ్గే అవకాశం ఉందన్నారు. ‘‘వాణిజ్యపరమైన ఉత్పాదనకు అనుమతించడం వల్ల బొగ్గు తవ్వకంలో పోటీతత్వం పెరుగుతుంది. అత్యాధునిక సాంకేతికత వాడకం సాధ్యమవుతుంది. పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా రావడంవల్ల బొగ్గు రంగంతో ముడిపడిన రంగాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు మెండుగా అందుబాటులోకి వస్తాయి. అలాగే గనులున్న ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి బాటలు పడతాయి’’ అని పీయూష్ గోయెల్ చెప్పారు.

ఇక జరగబోయేది ఏమిటి?
కేంద్ర మంత్రిమండలి తాజా నిర్ణయం నేపథ్యంలో పెద్ద, మధ్యతరహా, చిన్నతరహా గనులలో తవ్వకాలకు ప్రైవేటు కంపెనీలను అనుమతిస్తారు. ఆ మేరకు బొగ్గు అమ్మకాల కోసం గనులు, క్షేత్రాల వేలం ప్రక్రియను కూడా కేబినెట్ ఆమోదించింది. బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనలు) చట్టం-2015; గనులు, ఖనిజాల (అభివృద్ధి-నియంత్రణ) చట్టం-1957 ప్రకారం ఈ ప్రక్రియ సాగుతుందని కేంద్ర బొగ్గు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రైవేటీకరణవల్ల బొగ్గు సరఫరాకు భరోసా ఏర్పడి ఇంధన భద్రత లభిస్తుందని మంత్రి వివరించారు. కేటాయింపు ప్రక్రియలో పారదర్శకతకు, వాణిజ్య సౌలభ్యానికి ప్రాధాన్యం లభిస్తుందని, దీంతో సహజ వనరులు జాతీయాభివృద్ధికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. బొగ్గు వాస్తవ ఉత్పత్తిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ‘టన్నుకు/రూపాయల’ చెల్లింపుమొత్తం ప్రాతిపదికన వేలం వేస్తారు. ఈ మేరకు అత్యధిక మొత్తానికి పాడుకున్న సంస్థకు గనులు/క్షేత్రాలను కేటాయిస్తారు. అయితే, బొగ్గు అమ్మకం లేదా విక్రయంసహా వినియోగంపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు. ‘‘బొగ్గు అమ్మకానికి అనుమతిస్తూ గనులను వేలం వేయగా వచ్చే మొత్తం నిధులు ఆయా క్షేత్రాలున్న రాష్ట్రాలకే వెళ్తాయి. దీనివల్ల రాబడులు పెరిగి వెనుకబడిన ప్రాంతాలతోపాటు అక్కడి గిరిజనుల అభివృద్ధికి వినియోగించుకునే వీలు కలుగుతుంది’’ అని బొగ్గు శాఖ ప్రకటన పేర్కొంది. ఈ పోటీతత్వం వల్ల దేశీ యంగా బొగ్గు ఉత్పత్తి పెరిగి దిగుమతులపై ఆధారప డాల్సిన అవసరం తప్పు తుందని, విలువైన విదేశీ మారకం ఆదా అవుతు ందని మంత్రి పేర్కొ న్నారు. దీని ప్రభా వం కోల్ ఇండి యాపై ఎలా ఉంటుందన్న ప్రశ్నకు- పోటీతత్వం ఫలితంగా ఈ ప్రభుత్వరంగ సంస్థకు మేలు కలుగుతుందని బదులిచ్చారు. దేశంలో 30వేల కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్నాయన్న అంచనా నేపథ్యంలో కేంద్ర మంత్రిమండలి తాజా నిర్ణయంతో పశ్చిమ బెంగాల్, ఒడిసా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు భారీగా లబ్ధి పొందనున్నాయి.

కర్ణాటకలో 2,920 కోట్లతో జాతీయ రహదారి విస్తరణ
కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు-మైసూరు మధ్య జాతీయ రహదారి (ఎన్‌హెచ్-275) విస్తరణ పథకానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రూ.2,920 కోట్లతో నిడగట్ట-మైసూరు మార్గంలో 74.2 కిలోమీటరు నుంచి 135.4 కిలోమీటరు వరకు ఆరు వరుసలుగా వెడల్పు చేస్తారు. ఈ మేరకు రోడ్డు రవాణా-హైవేల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు 2.48 లక్షల పనిదినాల సామర్థ్యంగల ఈ విస్తరణ పథకంవల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చేపట్టే ‘చార్‌ధామ్’ ప్రాజెక్టులో భాగంగా కేదారనాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రిలను అనుసంధానిస్తూ సొరంగ మార్గం నిర్మిస్తారు. మొత్తం రూ.1,384 కోట్లతో ఈ పనులను చేపట్టేందుకు సీసీఈఏ ఆమోదించింది. దీంతో 20 కిలోమీటర్ల మేర ప్రయాణం తగ్గడమేగాక గంట సమయం ఆదా అవుతుంది. ఇక ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌ల మధ్య మహానది జల వివాద పరిష్కారం కోసం ట్రైబ్యునల్ ఏర్పాటుకు మంత్రిమండలి అంగీకారం తెలిపింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ)కింద పట్టణ గృహ నిర్మాణానికి అదనపు బడ్జెట్ మద్దతు ఇచ్చే ప్రతిపాదనను కూడా కేబినెట్ అంగీకరించింది. ఈ పథకం కింద పట్టణ పేదల కోసం 1.2 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంకల్పించిన సంగతి తెలిసిందే.పెరిగిన బొగ్గు సరఫరా

Updated By ManamThu, 02/08/2018 - 20:31

Coal Indiaకోల్‌కతా: ఈ ఏడాది జనవరితో ముగిసిన గత 10 నెలల్లో విద్యుదుత్పాదన రంగానికి కోల్ ఇండియా 371.8 మిలియన్ల టన్నుల బొగ్గు సరఫరా చేసింది. 2017 జనవరితో ముగిసిన పది నెలల కాలంలో సరఫరా చేసిన బొగ్గుకన్నా అది 6.8 శాతం ఎక్కువ. ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ గనుల తవ్వకం సంస్థ 2017 ఏప్రిల్ నుంచి  ఈ ఏడాది  జనవరి వరకు విద్యుతేతర రంగానికి సరఫరా చేసిన బొగ్గు అంతకుముందు అదే కాలంలో కన్నా 8.8 శాతం ఎక్కువగా 103.1 మిలియన్‌న్  టన్నుల మేరకు ఉంది. కోల్ ఇండియా పెట్టుకున్న లక్ష్యంకన్నా 29.2 మిలియన్ టన్నులు తక్కువగా బొగ్గును వెలికితీసినప్పటికీ,  సరఫరా పెంచగలిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2017 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు కోల్ ఇండియా 440 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగలిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న త్రైమాసికంలో గిరాకీ పతాక స్థాయికి చేరే సమయంలో బొగ్గు ఉత్పత్తి పెంచుకోగల అపార సామర్థ్యం సంస్థకు ఉందని సి.ఐ.ఎల్ అధికారి ఒకరు చెప్పారు. సంస్థ వద్ద వెలికితీసిన బొగ్గునిల్వలు ప్రస్తుతం 3 కోట్ల 40 లక్షల టన్నుల మేరకు ఉన్నాయి. థర్మల్ విద్యుదుత్పాదన కేంద్రాలకు బొగ్గు సరఫరాను పెంపొందించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని, బొగ్గు గనికి 50 కిలోమీటర్ల లోపలే బొగ్గు గని ఉన్నప్పుడు, రోడ్డు రవాణా ద్వారా బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. కోల్ ఇండియా లిమిటెడ్‌కి సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్, భారత్ కోకింగ్ కోల్ అని రెండు అనుబంధ సంస్థలున్నాయి. బొగ్గు నిల్వలు భారీ స్థాయిలో ఖాళీగా పడి ఉండడం వల్ల 2017-18 ఆర్థిక సంవత్సరం మొదట్లో కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తికి కోత పెట్టుకుంది. బొగ్గు ఉత్పత్తిపై సందేహాలు

Updated By ManamTue, 02/06/2018 - 20:23

Coal Indiaకోల్‌కతా: విద్యుచ్ఛక్తి డిమాండ్‌లో వృద్ధి అకస్మాత్తుగా పెరగడం, కోల్ ఇండియా నుంచి బొగ్గు ఉత్పత్తి పేలవంగా ఉండడం ఇంధన సంక్షోభాన్ని తీవ్రతరం చేయగల అవకాశం ఉంది. విదేశీ మార్కెట్లలో బొగ్గు ధరలు మండిపోతున్నాయి. దిగుమతి చేసుకునే  బొగ్గుపై ఆధారపడిన జెన్‌కోలు నిశ్చలంగా ఉన్నాయి. సాధారణంగా శీతాకాలంలో అత్యధికంగా ఉండే కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి అంతంతమాత్రంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. థర్మల్ విద్యుచ్ఛక్తికి అనూహ్యంగా పెరిగిన డిమాండ్ 2017 జూలైలో విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించింది. డాటా కొరవడడం వల్ల, మొదట్లో దానికి జల విద్యుదుత్పాదన తగ్గడం కారణమనుకున్నారు. కేంద్రం రెండు పథకాల ద్వారా గ్రామీణ విద్యుదీకరణను ప్రోత్సహిస్తున్నందు వల్ల డిమాండ్ బాగా పెరగడం కూడా దానికి కారణం అనుకున్నారు. ఒక్కసారిగా, బొగ్గుకు డిమాండ్ ఏర్పడడంతో కోల్ ఇండియా సతమతమైది. అప్పటికి దాదాపు రెండేళ్ళుగా మందగొడిగా ఉన్న డిమాండ్ వల్ల అది బొగ్గు ఉత్పత్తికి కోత విధించుకునే ప్రక్రియలో ఉంది. డిమాండ్ సాధారణంగా ఉండడం, గత రెండేళ్ళలో అవసరానికి మించిన ఉత్పత్తి వల్ల బొగ్గు నిల్వలు 6 కోట్ల 80 లక్షల టన్నులకు చేరుకున్నాయి. మెరుగుపడిన రైల్వే రవాణా ద్వారా కోల్ ఇండియా ఆ నిల్వలను అవసరం ఉన్న చోటుకు తరలించగలిగింది. క్రమంగా సరఫరాలు మెరుగుపడుతూ వచ్చాయి. డిసెంబర్ నెలాఖరు నాటికి విద్యుదుత్పాదన కేంద్రాల వద్ద ఐదు నుంచి తొమ్మిది రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గు నిల్వలు తగినంతగా లేని స్థితిలో ఉన్న విద్యుదుత్పాదన కేంద్రాల సంఖ్య ఐదు నెలల్లో 29 నుంచి 12కు తగ్గింది. విద్యుత్తుకే కాకుండా, ఉక్కు, సిమెంటు రంగాలకు కూడా బొగ్గు సరఫరాలు పెరిగాయి. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో బొగ్గు ఉత్పత్తిలో వృద్ధి నమోదైంది. ఆ తర్వాత, కోల్ ఇండియాకు అనుబంధ సంస్థలైన సి.సి.ఎల్, బి.సి.సి.ఎల్.ల బొగ్గు ఉత్పత్తి 11 నుంచి 13 శాతం  క్షీణించింది. ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి నెలకు సగటున 5 కోట్ల 30 లక్షల టన్నులుగా ఉంది. కాగా, విద్యుచ్ఛక్తికి డిమాండ్ గత జూలై నెలలోనే 5.8 శాతం పెరిగింది. ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్‌లు ప్రధాన విద్యుత్ కొనుగోలు రాష్ట్రాలుగా ఉన్నాయి. ఫిబ్రవరి 1 నాటికి 21 విద్యుదుత్పాదన కేంద్రాల వద్ద  తొమ్మిది రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. 

Related News