Bhakthi news

జై జగన్నాథ

Updated By ManamMon, 07/09/2018 - 23:22

ఆషాఢంలో జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధం. పతితపావనుడు, నీలమాధవుడు అని భక్తులంతా కీర్తించే జగన్నాథస్వామి ఆషాఢమాసంలో రెండోరోజున రథయాత్ర చేస్తాడు. సాధారణంగా ఏ ఆలయంలో అయినా ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. పూరీలో మాత్రం మూలవిరాట్టులనే ప్రతి సంవత్సరం రథయాత్రలో ఊరేగిస్తారు. దేవేరులతో కాకుండా తోడబుట్టిన వారితో కలిసి జగన్నాథస్వామి గుండీచా మందిరం వరకు వెళ్లి, తిరిగి రావడమే రథయాత్రలోని ముఖ్య ఉద్దేశ్యం. ఈ శనివారం జగన్నాథ రథయాత్ర సందర్భంగా...

image


జగన్నాథ రథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్య నాడు పూరీక్షేత్రంలో దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం  లభిస్తుంది. ఆషాఢ శుక్ల విదియనాడు ఉదయకాల పూజల తరువాత పెద్దపెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని పహండీ అంటారు. ఆ దశలో కులమత భేదాలకు తావుండదు. గుండీచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులవుతారు. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే చెరా పహారా అంటారు.

రథ నిర్మాణం
జగన్నాథ రథయాత్రకు అరవై రోజుల ముందు, వైశాఖ బహుళ విదియనాడు పనులు మొదలవుతాయి. పూరీ మహారాజు పూజారుల్ని పిలిపించి, కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. మొత్తం 13 వేల ఘనపుటడుగుల కలపను జగన్నాథ రథాల నిర్మాణానికి వినియోగిస్తారు. ముందుగా వృక్ష కాండాల్ని 2,188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు. జగన్నాథుడి రథం నందిఘోష. ఎత్తు సుమారు 46 అడుగులు, పదహారు చక్రాలుం టాయి. ఒక్కో చక్రం ఎత్తూ ఆరు అడుగులు. సారథి పేరు దారుక. బలభద్రుడి రథం తాళధ్వజం. సుభద్రాదేవి రథం దేవదళన్. నిర్మా ణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకు ఒకరోజు ముందుగా...ఆలయ తూర్పు భాగంలోని సింహ ద్వారం దగ్గర నిలబెడతారు. లాగేందుకు అనువు గా ఒక్కో రథానికీ 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు.

ఘోషయాత్ర
జగన్నాథ స్వామిని పతితపావనుడు అంటారు. లక్షలాది భక్తులు రథయాత్రలో పాల్గొంటారు. జగన్నాథస్వామి ఆలయం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయం వరకు రథయాత్ర కొనసాగుతుంది. అందుకు 12 గంటల సమయం పడుతుంది. ఆనాటి రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూలవిరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు పొద్దున మేళతాళాలతో గుడిలోపలికి తీసుకువెళతారు. స్వామి అక్కడ ఏడురోజుల పాటు ఉంటాడు. ఐదోరోజున ఓ ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది. ఆలయంలోకి తనతోపాటూ తీసుకెళ్లలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి, గుండిచా గుడి బయటి నుంచే జగన్నాథుడిని ఓరకంట దర్శించి.. పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్లిపోతుంది. ఈ ముచ్చట అంతా అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారు. ఆ రోజును హీరాపంచమి అంటారు. వారంపాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమినాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని బహుదాయాత్ర అంటారు . తరువాత రోజు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో (సునావేష) అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. ద్వాదశినాడు మళ్లీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది.రాహుకాల దీపం అంటే ఏమిటి?

Updated By ManamMon, 07/09/2018 - 23:08
  • దీనిని ఇంట్లో వెలిగించవచ్చా?

imageరాహుకాలం నిడివి రోజుమొత్తంలో తొంబై నిమిషాలు ఉంటుంది.  ఆ సమయంలో రాహుప్రీతి కోసం నిమ్మకాయను మధ్యకు తరిగి, రసం తీసివేయాలి. ఖాళీ అయిన నిమ్మకాయ డిప్పలో ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. నిజానికి నవగ్రహాలలో అందరికీ ఈ దీపాలు ఇష్టమైనవే. ఎవరి ముందు దీపారాధన చేసినా అన్నీ శివప్రీతి కలిగిస్తాయి. ఈ నిమ్మకాయ దీపాలను కార్తిక, మార్గశిర మాసాల్లో వెలిగించడం మంచిది. అందులోనూ సోమవారం నాటి ఉదయం 7.30 నుంచి 9.00 గంటల మధ్య కాలంలో చేయడం వల్ల సమస్త దోషాలూ నశిస్తాయి.

 శుభసమయం లేనప్పుడు ఏదైనా పని ప్రారంభించవలసి వచ్చినా, ప్రయాణం చేయవలసి వచ్చినా నిమ్మకాయలో రాహుకాల దీపం వెలిగించడం వల్ల తలపెట్టిన విఘ్నాలు రావని, విజయం పొందుతారని రుద్రయామళ తంత్రం చెబుతోంది. అయితే తెలుగు సంప్రదాయంలో రాహుకాలానికి పట్టింపులేదు.

- డా. అన్నదానం చిదంబర శాస్త్రి, ఆధ్యాత్మిక వేత్తసూర్యాయ నమ:

Updated By ManamMon, 01/22/2018 - 22:21

Surya namaha, Bhakthi newsసూర్యుడు ప్రత్యక్షదైవం. త్రిమూర్తి స్వరూపుడు. ఆయనే సృష్టి కర్త. స్థితి పోషకుడు కూడా సూర్యనారాయణుడే. లయకారకుడైన శివుడే అసలు సూర్యుడు. ఉదయవేళ బ్రహ్మగా, మధ్యాహ్నవేళ మహేశ్వరునిగా, సాయంత్రవేళ విష్ణుమూర్తిగా సూర్యుణ్ణి పూజించడం మన సంప్రదాయం. మన సంస్కృతిలో సౌరమే తొలి మతం. రేపు రథసప్తమి సందర్భంగా....

సప్తమ్యాం అథవా షష్ఠ్యాం భక్త్యా
పూజాం కరోతియః
అనిర్విణ్ణో అనహంకారీతం
లక్ష్మీర్భజతే నరమ్
మహాభారతం అరణ్యపర్వంలో సూర్యుణ్ణి ఆరాధించి అక్షయపాత్రను పొందాడు ధర్మరాజు. ఆ సందర్భంలో ధర్మజుడు చేసిన సూర్యస్తోత్రం ఇది. సప్తమి లేదా షష్ఠి తిథులలో అహంకారం, విచారం లేకుండా భక్తితో భాస్కరుణ్ణి పూజించిన వారికి సమస్త ఐశ్వర్యాలు లభిస్తాయని ఈ శ్లోకానికి అర్థం. నమస్కార ప్రియుడైన భాస్కరుడు ఐశ్వర్యప్రదాత మాత్రమే కాదు ఆపదలను నివారించేవాడు. సమస్త జీవులకు ఆత్మ సూర్యుడే. అందుకే ఆయన ఆరోగ్యప్రదాతగా కీర్తిగడించాడు. చర్మ, నేత్ర, హృద్రోగాల నివారణకు సూర్యారాధన శ్రేష్ఠం. అలాగే సంతాన భాగ్యాన్ని ప్రసాదించే దేవత కూడా ఆయనే.
పరంజ్యోతి స్వరూపం
వెలుగు కిరణాలను ప్రసరించేవాడు. ప్రాణశక్తుల్ని చైతన్యవంతం చేసేవాడు. నీటిలోని రసాన్ని స్వీకరించి తిరిగి అందించేవాడు. ఆకాశంలో సంచరించేవాడు. లోకాన్ని సృష్టించేవాడు. ప్రాణుల్ని నిత్యకర్మలు అనుష్ఠించేందుకు ప్రేరేపించేవాడు సూర్యుడే. ద్వాదశాదిత్యులు అనే మాట ప్రముఖంగా వినబడుతుంది. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష; హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరుడనే వారు ద్వాదశాదిత్యులు. వాసుదేవుని ద్వాదశాక్షరీ మంత్రమే ద్వాదశాదిత్యుల రూపంలో ప్రకాశిస్తుందని వైష్ణవులంటారు. శివపరంగా చూస్తే అష్టమూర్తి తత్త్వంలో తొలి మూర్తి రూపమే సూర్యుడు. అలాగే శాక్తేయంలో, గాణపత్యంలో అన్నింటా సూర్యదేవుని ఆరాధన ఉంది. 

సూర్యా ద్భవంతి భూ తాని 
సూర్యేణ పాళీ తానిచ 
సూర్యే లయం ప్రాప్నువంతి 
య సూర్యః సోహ మేవచ
సృష్టి, స్థితి, లయాలు సూర్యుని వల్లనే జరుగుతున్నాయని సూర్యోపనిషత్తు చెబుతోంది.  జీవులలో చైతన్యం నింపడం ద్వారా పోషక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు సూర్యనారాయణుడు. సూర్యరశ్మి నుంచి పోషకాలు, విటమిన్లు లభిస్తాయి. సౌరశక్తి ఆధారంగానే సాంకేతికత కూడా అభివృద్ధి అవుతోంది. మానవ మనుగడకు, అభివృద్ధికి అన్నింటికీ సూర్యుడే దిక్కు. ఆయన నారాయణ స్వరూపమై పోషక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సర్వసంగ పరిత్యాగి, యోగి, వీరమరణం పొందినవాడు మాత్రమే సౌరమండలాన్ని ఛేదించుకుని నేరుగా ముక్తిపథానికి వెళతారని పెద్దలు చెబుతారు. అలా సూర్యదేవుని లయకారకత్వం కూడా నిరూపితమైంది. అన్నింటికీ మించి యోగ్యత, అయోగ్యతల ప్రస్తావన లేకుండా అందరికీ సమానంగా వెలుగులు పంచే మహాదాత, ప్రత్యక్ష దైవం సూర్యుడు. అందుకే రథసప్తమినాడు ఆయనను ఆరాధించి కృతజ్ఞతలు చెప్పుకోవడం మన విధి.  

రథసప్తమి విధులు 
రవి మకరరాశిలో ఉండగా వచ్చే సప్తమికి ‘మకరీ’ అని పేరు. ఆరోజు నుంచి సూర్యుని కిరణాలు నేలపై పుష్కలంగా పడతాయి. ఆ సౌరశక్తి ప్రధానంగా జిల్లేడు, చిక్కుడు, రేగు చెట్లలోనూ, పారే నీటిలోనూ ఉంటుందంటారు. అందుకే రథసప్తమినాడు చేసే స్నానం ప్రత్యేకతను కలిగివుంటుంది. వ్రతచూడామణిలో రథసప్తమినాడు చేయాల్సిన స్నానవ్రతాన్ని గురించి వివరణ ఉంది. ఆనాడు అరుణోదయ వేళకంటే ముందుగా నెయ్యి లేదా నువ్వులనూనెతో దీపం వెలిగించాలి. ఆ దీపాన్ని ఆరిపోకుండా భద్రంగా కాపాడుకుంటూ, నదీతీరానికి గానీ, చెరువుల వద్దకు గానీ వెళ్లి, సూర్యప్రీతికోసం నీటిలో వదలాలి. తరువాత స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులు, రేగుపళ్లు తలపై ఉంచుకోవాలి.

జననీ సర్వలోకానాం సప్తమీ సప్తసప్తికే
సప్తవ్యాహృతికే దేవీ నమస్తే సూర్యమండలే

అంటూ సూర్యమండలాన్ని అర్చించి నమస్కరించాలి. సప్తమి తిధి దేవతకు, సూర్యమండలంలోని ఇతర దేవతలకూ కూడా అర్ఘ్యమివ్వాలి. రథసప్తమినాడు ఇలా చేయడం వల్ల తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం వృద్ధి చెందుతాయి. చర్మరోగాలు నశిస్తాయి. జన్మాంతరాల్లో చేసిన సప్త విధాలైన పాపాలు హరిస్తాయి. రథసప్తమినాడు అరుణపారాయణంతో సూర్యనమస్కారాలు చేస్తారు. ఆదిత్యహృదయం, సూర్యాష్టకం వంటివి పఠిస్తారు. మంచిగంధంతో పద్మం వేసి, ద్వాదశాదిత్యులను ఆవాహనచేసి పూజించడం మంచిది. ఎర్రని పూలతో, ఎర్రచందనంతో భాస్కరుని అర్చించడం వల్ల విశిష్ట ఫలితాలు పొందగలుగుతారు. ఆవుపేడతో చేసిన పిడకల మంటపై ఆవుపాల పాయసాన్ని తయారుచేయాలి. చిక్కుడు కాయలతో సూర్యరథం సిద్ధం చేయాలి.  చిక్కుడాకుల్లో పాయసం వడ్డించి సూర్యుని ప్రకాశం తగిలేచోట తులసిచెట్టువద్ద సూర్యరథానికి నివేదన చేయాలి. ఆ ప్రసాదాన్ని చిక్కుడాకుల్లోనే భుజించాలి. 
- కె. పూర్ణప్రజ్ఞాభారతి

ఆదిత్య వందనం
1 ఓం హ్రాం మిత్రాయ నమ:  
2 ఓం హ్రీం రవయే నమః  
3 ఓం హ్రూం సూర్యాయ నమః  
4 ఓం హ్రైం భానవే నమః  
5 ఓం హ్రౌం ఖగాయ నమః  
6 ఓం హ్రః పూష్ణే నమః  
7 ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః  
8 ఓం హ్రీం మరీచయే నమః  
9 ఓం హ్రూం ఆదిత్యాయ నమః  
10 ఓం హ్రైం సవిత్రే నమః  
11 ఓం హ్రౌం అర్కాయ నమః  
12 ఓం హ్రః భాస్కరాయ నమః 
నమస్కార ప్రియ భానునికి ఈ బీజమంత్రాలను ఉచ్చరిస్తూ సూర్యోదయ వేళ ఎవరైనా సరే, శుచిగా వందనం చేస్తే శుభఫలితాలు కలుగుతాయి.

Related News