godavari

లాంచీ వెలికితీత.. మృతదేహాలపై రాని స్పష్టత

Updated By ManamWed, 05/16/2018 - 14:21

boat 2 అమరావతి: గోదావరిలో మునిగిన లాంచీని ఎట్టకేలకు బయటకు తీశారు. ఎన్డీఆర్‌ఎఫ్, నేవీతో సహా ప్రభుత్వ యంత్రాగ కృషితో లాంచీని బయటకు తీశారు. మంటూరు దగ్గర 40 అడుగుల లోతులో లాంచీని గుర్తించిన అధికారులు, భారీ క్రేన్ సాయంతో లాంచీని ఒడ్డుకు చేర్చారు. అయితే బోటును బయటకు తీసినప్పటికీ, అందులో ఎంతమంది మృతదేహాలు ఉన్నాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

కాగా బయటపడ్డ మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గుర్తించిన తరువాత వెంటనే పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ఆయన పరిశీలిస్తున్నారు.

 లాంచీ ఆచూకీ లభ్యం

Updated By ManamWed, 05/16/2018 - 10:44

boat 1కాకినాడ: గోదావరి నదిలో మునిగిన లాంచీ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. పోలవరం మండలం వాడపల్లి సమీపంలో 40 అడుగుల లోతులో లాంచీ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో క్రేన్‌లను ఉపయోగించి లాంచీని వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా లాంచీలోనే పలువురు ప్రయాణికుల మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటున్నారు. కాసేపట్లో ఆయన ఘటనా స్థలానికి వెళ్లనున్నారు. అయితే మృతదేహాల కోసం మరోవైపు గజ ఈతగాళ్లు కూడా గాలింపు చర్యలను చేపట్టారు.

 దొరకని లాంచీ ఆచూకీ.. కొనసాగుతున్న సహాయక చర్యలు

Updated By ManamWed, 05/16/2018 - 07:33

boat  రాజమహేంద్రవరం: మంగళవారం సాయంత్రం గోదావరిలో మునిగిన లాంచీ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీంతో  అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేయగా, మరోవైపు నేవీ హెలికాప్టర్ రంగంలోకి దిగింది. వారితో పాటు గజ ఈతగాళ్లను, అదనపు బోట్లను ఎన్టీఆర్‌ఎఫ్ సిద్ధం చేసింది. లాంచీ ఆచూకీ తెలిసిన వెంటనే దానిని బయటకు తీసేందుకు భారీ క్రేన్‌లను ఏర్పాటు చేశారు అధికారులు.  కాగా నదిలో పడ్డ వారిలో ఇప్పటివరకు 16మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ తెలిపారు. మొత్తం ఎంతమంది గల్లంతయ్యారనేది స్పష్టత లేదని, వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశామని ఆయన పేర్కొన్నారు. అయితే పెళ్లి బృందంతో మంగళవారం సాయంత్రం గోదావరిలో వెళుతున్న ఓ లాంచీ తిరగబడ్డ విషయం తెలిసిందే. 

 గోదా‘వర్రీ’

Updated By ManamSat, 03/31/2018 - 01:02
  • మరో 15 రోజుల్లో చేతికి పంట.. చివరి దశలో అందని చుక్కనీరు

  • అధికారుల లెక్కల్లో అంతా ఓకే.. అస్తవ్యస్తంగా డెల్టా ఆధునికీకరణ 

  • ఫలితంగా శివార్లకు నీరు గగనమే.. 2 లక్షల ఎకరాల్లో పంటకు ప్రమాదం

  • 6 టీఎంసీలిస్తే చాలంటూ ప్రకటనలు.. 16 టీఎంసీలు కావాలంటున్న రైతులు

godavariకాకినాడ: ఒకప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు కూడా ‘రైస్‌బౌల్’గా పేరొందిన గోదావరి డెల్టా.. ఇప్పుడు బావురుమంటోంది. మరో 15 రోజుల్లో పంట చేతికి రావాల్సిన పరిస్థితిలో నీళ్లు అరకొరగానే ఉన్నాయి. దాంతో పంట ఎండిపోయే ప్రమాదం కళ్లముందు కనిపిస్తుండటంతో అన్నదాత ఆందోళనలో పడ్డాడు. సవుయానికి నీళ్లు ఇవ్వకపోతే ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయే ప్రమాదం కళ్లెదుటే కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఇదిగో నీరు.. అదిగో నీర ని ఊరిస్తూ పబ్బం గడిపేసుకుంటున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడం, అధికారులకు ముందుచూపు కొరవడటం వల్లే  ఈ పరిస్థితి దాపురించిందని రైతులు విమర్శిస్తున్నారు. గోదావరిలో నీటి లభ్యత డెడ్ స్టోరేజికి చేరుకుంది. మరోపక్క సీలేరు నీటిని ముందుగానే ఊడ్చేశారు. పంట చివరిదశలో నీరు లేకుండా చేసి అధికారులు చేతులు ఎత్తేసేలా ఉన్నారని రైతులు లబోదిబోమంటున్నారు. 

10 టీఎంసీల తేడా
ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని గోదావరి డెల్టాలో 8.96 లక్షల ఎకరాలలో వరిసాగు చేపట్టారు. దీనికి 90 టీఎంసీల నీరు అవసరం అవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే తాము 84 టీఎంసీలు ఇచ్చేశామని, మరో ఆరు టీఎంసీలే కావాలి కాబట్టి అది కూడా రాబోయే 15 రోజుల్లో ఇచ్చేలా ప్లాన్ చేశామని అంటున్నారు. లెక్కల్లో చూడటానికి ఇదంతా చాలా అందంగా, చక్కగా కనపడుతుంది. కానీ.. వాస్తవానికి గోదావరి డెల్టాలో రైతులకు అందే నీళ్లు తక్కువ.. వృధాగా పోయేది ఎక్కువ. డెల్టా ఆధునికీకరణ పనులు అస్తవ్యస్తంగా జరగడం, అసలు పూర్తిస్థాయిలో ఆధునికీకరించకపోవడంతో ఈ దుస్థితి తలెత్తింది. సాధారణంగా ఒక టీఎంసీ నీళ్లతో 10 వేల ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేస్తుంటారు. కానీ.. వాళ్లు విడుదల చేసే నీటిలో చివరికి రైతుల పంటపొలాల వరకు వచ్చేసరికి చాలా తగ్గిపోతోంది. మధ్యలో బోలెడంత నీరు వృథా అవుతుంది. దానివల్ల మొత్తం 100 టీఎంసీల నీళ్లిస్తే తప్ప తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాగుచేసిన మొత్తం వరిపంట సజావుగా పండదు. అధికారులు చెప్పేదాన్ని బట్టి ఇంకో 6 టీఎంసీలిస్తే సరిపోతుంది. కానీ.. రైతులు క్షేత్రస్థాయి వాస్తవాలతో చెబుతున్నదాన్ని బట్టి చూస్తే కనీసం మరో 16 టీఎంసీల నీళ్లు గోదావరి డెల్టాకు అందాలి. అప్పుడు గానీ గండం గట్టెక్కదు. అధికారుల లెక్కలకు.. రైతుల అంచనాలకు మధ్య ఉన్న 10 టీఎంసీలు ఇవ్వకపోతే.. శివారు భూములకు నీళ్లు అందక పంటలు ఎండిపోతాయి.. లేదా దిగుబడులు దారుణంగా పడిపోతాయి. అధికారుల తీరు చూస్తే మాత్రం ఈ నీళ్లు అందే పరిస్థితి కనపడటం లేదు. ఇప్పటికే సీలేరు ప్రాజెక్టు నుంచి సమారు 62 టీఎంసీల నీటిని వాడేశారని.. దాంతో అక్కడ కూడా నీటి లభ్యత కనిపించడం లేదని రైతులు చెపుతున్నారు. మరో పక్క ఒడిశాలోని పవర్ ప్రాజెక్టు ద్వారా నీరు లభించే ఏర్పాట్లు చేసినా అది కూడా అధికారులు చెబుతున్న 6 టీఎంసీల లెక్కలోకే వస్తుంది తప్ప అంతకు మించి అందేలా లేదని రైతులు అంటున్నారు. 

ఇచ్చేది ఏ మూలకు?
ప్రస్తుతం డెల్టాలోని కాలువలకు రోజుకు 7100 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు. ఇది ఏ మూలకూ సరిపోవటం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో 9800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని రైతులు అంటున్నారు. ప్రస్తుతం ఇస్తున్న 7100 క్యూసెక్కుల నీటిని కూడా అధికారులు నానా తంటాలు పడి ఇస్తున్నారు. అంటే గోదావరిలో నీటి లభ్యత 1500 క్యూసెక్కులు ఉంటే, సీలేరు నుంచి 4000 క్యూసెక్కులు, బ్యారేజి డెడ్ స్టోరేజి నుంచి 1600 క్యూసెక్కులు నీటిని కలిపి ఇస్తున్నారని రైతు ప్రతినిధులు చెబుతున్నారు. ఇదే విధానంలో 15 రోజులు పాటు నీటి సరపరా చేస్తారన్న నమ్మకం కూడా లేదని విమర్శిస్తున్నారు. గత ఏప్రిల్‌లో బ్యారేజ్ వద్ద నీటిమట్టం 13.32 అడుగులు ఉంటే.. ఇప్పుడది 12.50 అడుగులకు దిగజారింది.  పంటకు నీరు ఎంతో అవసరమైన ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాల వైపు అధికారులు దృష్టి సారించకపోవడం దారుణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

6 టీఎంసీలు చాలు..
ఇదే విషయమై ఇరిగేషన్ ఎస్.ఇ. కృష్ణంరాజును వివరణ కోరగా ఇప్పుడు సరఫరా చేస్తున్న 7100 క్యూసెక్కులు నీరు సరిపోవటంలేదని రైతులు చెప్పడం వాస్తవమేనని తెలిపారు. కాకపోతే తమ లెక్కల ప్రకారం 6 టీఎంసీల నీళ్లతో పంట చేతికి వచ్చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొద్ది రోజులలో కొన్ని ప్రాంతాలలో వరి కోతలు ప్రారంభం అవుతాయని, దీంతో నీటి అవసరం కొంత మేర తగ్గుతుందని,  ఆ నీటిని శివారు భూముల వాళ్లు ఉపయోగిం చుకుంటారని చెప్పారు. మరీ ఇబ్బందికర పరిస్థితులు వస్తే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంటను కాపాడేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఎకరానికి రూ. 30 - 40 వేల పెట్టుబడి పెట్టి, పంటకు కీలక దశలో నీరు లభించని పరిస్థితులు, రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా గోదావరి డెల్టా రైతాంగం ఇబ్బందులను గవునించి ఆదుకునే ప్రయత్నాలు తక్షణం చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదు.గోదావరి-పెన్నా అనుసంధానంపై ముందడుగు

Updated By ManamFri, 12/15/2017 - 19:09
  • మహా సంగమానికి ముందడుగు...గోదావరి-పెన్నా అనుసంధానంపై పూర్తయిన సర్వే

  • మెగా ప్రాజెక్టుకు రూ. 80 వేల కోట్ల వ్యయం..320 టీఎంసీలతో ఆరు జిల్లాలు సస్యశ్యామలం

  • ముఖ్యమంత్రి చంద్రబాబుకు ‘వాప్‌కాస్’ నివేదిక

penna riverఅమరావతి, డిసెంబర్ 15 : పట్టిసీమ స్ఫూర్తితో మరో రెండు నదులు గోదావరి-పెన్నా అనుసంధానానికి ముందడుగు పడింది. 320 టీఎంసీల గోదావరి మిగులు జలాలను పెన్నాకు తరలించే ఈ ప్రాజెక్టుకు సంబంధించి లైడార్, హైడ్రోగ్రాఫిక్ సర్వే పూర్తికాగా, జియో టెక్నికల్ అధ్యయనం ముగింపు దశకు వచ్చింది. గోదావరి-పెన్నా అనుసంధానం ద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగు-సాగు నీరు, పరిశ్రమలకు నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం పూర్తయితే ఆరు జిల్లాల్లోని పట్టణాలకు, గ్రామాల్లోని చెరువులకు, ఇతర రిజర్వాయర్లకు గోదావరి మిగులు జలాలు తరలించేందుకు వీలు కలుగుతుంది.  

chandrababuగోదావరి-పెన్నా సంగమ ప్రాజెక్టుపై శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వాప్‌కాస్ లిమిటెడ్ (WAPCOS) నివేదిక సమర్పించింది. ప్రాజెక్టు పూర్తికావడానికి సుమారు రూ. 80 వేల కోట్ల వ్యయం కానుందని, 320 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా తరలించేందుకు 3,625 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని ‘వాప్‌కాస్’ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ మహత్తర పథకం పూర్తికావాలంటే 32 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి వుందని, ఇందులో 7 వేల ఎకరాల అటవీ భూమి వుందని తెలిపారు. 

పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ మధ్యలో రెండు సొరంగాలు తవ్వాలని, బొల్లపల్లి దగ్గర రిజర్వాయర్ నిర్మించాలని ముఖ్యమంత్రికి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి సంగం బ్యారేజ్ వరకు 701 కి.మీ. మేర కాలువలు నిర్మించాల్సి వుంటుందని చెప్పారు. వరద నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి కొమ్మమూరు కాలువ మీదుగా  పెదగంజాంకు, అక్కడ నుంచి ఎత్తిపోతల ద్వారా గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు, ఆ తర్వాత సంగం బ్యారేజ్‌కు తరలించడంపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. 

సత్వర ఫలితాలు సాధించేలా దశలవారీగా గోదావరి-పెన్నా అనుసంధానం పూర్తి చేయాలని, కాలువల నిర్మాణ వ్యయం తగ్గేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. గోదావరి-పెన్నా అనుసంధానంలో భాగంగా మొదటి దశ కింద ప్రస్తుతం వున్న కాలువలు, రిజర్వాయర్ల ద్వారా వీలైనంత వేగంగా ఎంతమేర జలాలను తరలించవచ్చో అధ్యయనం చేయాలని చెప్పారు. ఈ సంగమం సంపూర్ణమైతే రాష్ట్రంలో సుమారు 1,500 టీఎంసీల వరకు జలాలను నిల్వ చేసుకునేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. 

ఈనెల 23న రాష్ట్రానికి గడ్కరీ
పోలవరం పనులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఈనెల 23న రాష్ట్రానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వస్తున్న నేపథ్యంలో గోదావరి-పెన్నా అనుసంధానంపై సవివర ప్రాజెక్టును రూపొందించాలని ముఖ్యమంత్రి ‘వాప్‌కాస్’ ప్రతినిధులకు సూచించారు. గోదావరి-పెన్నా అనుసంధానంతో పాటు కావేరి వరకు గోదావరి జలాలను తరలించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఈ వివరాలతో గడ్కరీకి ప్రజంటేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.  


కృష్ణానదిపై మరో బ్యారేజ్

పులిచింతల ప్రాజెక్టుకు 60 కి.మీ. దిగువన, ప్రకాశం బ్యారేజ్‌కు 23 కి.మీ ఎగువన కొత్తగా బ్యారేజ్ నిర్మించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. వైకుంఠపురం దగ్గర కృష్ణా నదిపై నిర్మించే ఈ బ్యారేజ్‌కు రూ. 3,278.60 కోట్లు వ్యయం కానుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీని నిర్మాణానికి మూడేళ్ల సమయం పడుతుందని వెల్లడించారు. జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు.
Related News