gst

జి.ఎస్.టి పాస్‌వర్డ్ మార్చుకోవచ్చు

Updated By ManamThu, 06/14/2018 - 23:23

gstన్యూఢిల్లీ: జి.ఎస్.టి కింద రిజిస్టరు చేసుకున్నవారు గుర్తింపు నంబరు (జి.ఎస్.టి.ఐ.ఎన్) కోసం నమోదు చేసుకున్న ఇ-మెయిల్, మొబైల్ నంబర్లను మార్చుకోవచ్చని ఆర్థి క మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు తమ పరిధిలోకి వచ్చే పన్ను అధికారి వద్దకు వెళ్ళి అధీకృత పత్రాలు చూపి వాటిని మార్చుకోవచ్చని తెలిపింది. తమ తరఫున రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసేందుకు తాము అధికారమిచ్చిన మధ్యవర్తులు, ఆ ప్రక్రియలో వారి సొంత ఇ-మెయిల్, మొబైల్ నంబరు ఉపయోగించారని పన్ను చెల్లింపుదార్ల నుంచి రెవిన్యూ శాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ మధ్యవర్తులు యూజర్ వివరాలను పన్ను చెల్లింపుదార్లతో పంచుకోవడం లేదు. పన్నుచెల్లింపుదార్లకు ఈ చిక్కును తొలగించేందుకు, అధీకృత సంతకందారు ఇ-మెయిల్, మొబైల్ నంబరు అప్‌డేట్ చేసుకునే సౌలభ్యాన్ని జి.ఎస్.టి సిస్టంలో అందుబాటులో ఉంచారు. పన్నుచెల్లింపుదారు ఉండే ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుందో ఆ పరిధికి చెందిన అధికారి ద్వారా ఇ-మెయిల్, మొబైల్ నంబరు మార్చుకోవచ్చు. వ్యాపార సంస్థకు కేటాయించిన జి.ఎస్.టి.ఐ.ఎన్ కోసం పాస్‌వర్డ్ పొందడానికి సంబంధిత పన్ను అధికారిని పన్ను చెల్లింపుదారు సంప్రదించవలసి ఉంటుంది. తాము ఏ పరిధిలోకి వస్తారో తెలుసుకునేందుకు పన్నుచెల్లింపుదార్లు జి.ఎస్.టి పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ‘సెర్చ్ ట్యాక్స్‌పేయర్’ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. పన్ను చెల్లింపుదార్లు పత్రాలు చూపిన తర్వాత, అధికారి కొత్త ఇ-మెయిల్ ఐ.డి, మొబైల్ నంబర్లను ఎంటర్ చేస్తారు. డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసిన తర్వాత, సిస్టంలో జి.ఎస్.టి.ఐ.ఎన్ పాస్‌వర్డ్‌ని పన్ను అధికారి రీసెట్ చేస్తారు. యూజర్ పేరు, రీసెట్ చేసిన తాత్కాలిక పాస్‌వర్డ్‌ని, అధికారి ఎంటర్ చేసిన ఇ-వెుయిల్‌కి పంపుతారు. తనకు ఇ-మెయిల్‌లో వచ్చిన యూజర్ పేరు, తాత్కాలిక పాస్‌వర్డ్ ఉపయోగించి పన్నుచెల్లింపుదారు జి.ఎస్.టి పోర్టల్‌లో లాగిన్ కావచ్చు. అప్పుడు పన్ను చెల్లింపుదారు తాను కోరుకున్న విధంగా యూజర్ పేరు, పాస్‌వర్డ్ మార్చుకోవచ్చు. రిఫండ్‌కు సన్నాహాలు

Updated By ManamMon, 06/11/2018 - 22:23

gstన్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జి.ఎస్.టి) అమలులోకి తెచ్చిన తర్వాత కూడా ఎగుమతిదార్లు చెల్లిస్తూ వస్తున్న పన్నులను, ఎంబెడ్డెడ్ వాటితో సహా, రిఫండు చేసే యంత్రాంగాన్ని కనుగొనేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. ‘‘ఎగుమతిదార్లకు అటువంటి చెల్లింపుల వల్ల ఎగుమతులు మరింత పోటీదాయకంగా తయారవడవేుకాక, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఓ) వ్యవస్థ కింద ఎగుమతులు సాగించేందుకు వీలు కలుగుతుంది. ఎందుకంటే, భారతదేశ ఎగుమతి సబ్సిడీలపై ఇటీవలి కాలంలో డబ్ల్యు.టి.ఓలో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి’’ అని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ‘‘జి.ఎస్.టి కింద రిఫండ్ కాని పన్నులు కొన్ని ఉన్నాయి. విద్యుత్ సుంకం, పెట్రోలియం వస్తువులపై ‘వ్యాట్’, మార్కెట్ పన్ను, స్టాంప్ డ్యూటీ వంటివాటిని ఎగుమతిదార్లు చెల్లించడం కొనసాగిస్తున్నారు. సంస్తరిత పన్నులు అనేకం ఉన్నాయి. ఈ పన్నులు రిఫండ్ చేయగల యంత్రాంగాన్ని కనుక రూపొందించగలిగితే, అదే గణనీయమైన సహాయం కిందకు వస్తుంది’’ అని ఆ అధికారి చెప్పారు. ఉదాహరణకి, దుస్తుల రంగంలో వివిధ ఎంబెడ్డెడ్ పన్నులు  ఉన్నాయని దుస్తుల ఎగుమతుల ప్రోత్సాహక మండలి చెబుతోంది. పత్తి, విద్యుత్‌పై లెవీలు, రిజిస్టరుకాని డీలర్ల నుంచి కొన్న మానవ తయారీ ఫైబర్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్లపై ఆంక్షలు పరిశ్రమపై అదనంగా 4-5 శాతం భారం పడేట్లు చేస్తున్నాయి. డబ్ల్యు.టి.ఓతో పొత్తు కుదరని ఎగుమతి ప్రోత్సాహక పథకాలను ఉపసంహరించుకున్న వెంటనే ఎగుమతిదార్లకు పరిహారం చేకూర్చే ప్రత్నామ్నాయ మార్గాలను కనుగొనేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక అనియత కమిటీని ఏర్పాటు చేసింది. రిఫండ్ ఇవ్వని పన్నులకు బదులుగా ఎగుమతిదార్లకు పరిహారం చేకూర్చే మార్గాలను ఈ కమిటీ సునిశితంగా పరిశీలిస్తోంది. విదేశీ వర్తక డైరెక్టరేట్ జనరల్ ఈ కమిటీకి అధిపతిగా ఉన్నారు. పరిశ్రమల ప్రతినిధులు, ఆలోచనాశీలురతో కూడిన ఈ లోపాయకారీ కమిటీ, ఈ విషయంలో ఇతర దేశాల అనుభవాలను కూడా అధ్యయనం చేస్తోంది. జి.ఎస్.టికి బయట వదిలేసిన ఉత్పత్తుల (ప్రెట్రోలియం, విద్యుత్)లో పొదిగి ఉన్న పన్నులు, జి.ఎస్.టి పరిధిలోని వస్తువులలో కూడా కొన్నింటిపై అంతర్భాగంగా ఉండిపోయిన పన్నులపై జి.ఎస్.టి కౌన్సిల్ ఒక సమగ్ర సమీక్ష నిర్వహించాలని ఆసక్తికరంగా, తాజా ఆర్థిక సర్వే సూచించింది. ఉదాహరణకి, జి.ఎస్.టిలో ఉన్న వస్తువులపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్లు కలిసి ఉండవచ్చు. ‘‘పన్ను విపర్యాసం’’ కారణంగా, ఎగుమతిదార్ల చేతికి రాకుండా, ప్రభుత్వం వద్ద నిలిచిపోయి ఉండవచ్చు. ఈ వరుసను గమనిస్తే, ఎగువనున్న వాటిపైనకన్నా, దిగువనున్న వాటిపైనే పన్నులు ఎక్కువగా ఉన్నాయి. ‘‘ఈ సమీక్ష నిక్షిప్త ఎగుమతి పన్నులను వేగంగా తొలగించేందు కు దారితీయాలి. ఫలితంగా, భారతదేశ వస్తూత్పత్తి ఎగుమతులకు ముఖ్యమైన శక్తిని ఇచ్చినట్లవుతుంది’’ అని సర్వే పేర్కొంది. జి.ఎస్.టి రిఫండ్‌తో ఎగుమతిదార్లకు ఊరట

Updated By ManamSat, 06/09/2018 - 22:37

gstన్యూఢిల్లీ: ప్రస్తుతం సాగుతున్న ‘ప్రత్యేక రిఫండ్ పక్షం’ మొదటి తొమ్మిది రోజుల్లో ఎగుమతిదార్లకు పెండింగ్‌లో ఉన్న జి.ఎస్.టి రిఫండ్లలో సగ భాగాన్ని అంటే రూ. 7,000 కోట్లకుపైగా క్లియర్  చేశారు. కేంద్ర పరోక్ష పన్నుల, కస్టమ్స్ బోర్డ్ ఈ మేరకు ట్వీట్ శుక్రవారం పొద్దుపోయాక ట్వీట్ చేసింది. ఎగుమతిదార్లకు ఇవ్వాల్సిన  రిఫండ్లు ఇచ్చేందుకు 2018 మే 31 నుంచి జూన్ 14 వరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఎగుమతిదార్లు వారి పరిధిలోకొచ్చే జి.ఎస్.టి ఆఫీసు లేదా కస్టమ్స్ హౌస్/పోర్ట్‌ను సందర్శించి పెండింగ్‌లో ఉన్న క్లైమ్‌లను సెటిల్  చేసుకోవచ్చని బోర్డ్ తెలిపింది. వివిధ పత్రాలు సరిపోలక పోవడం వల్ల ఎగుమతిదార్లకు రావాల్సిన నిధులు సుమారు రూ. 14,000 కోట్ల వరకు ప్రభుత్వం వద్ద చిక్కుకుపోయాయి. షిప్పింగ్ బిల్లు, రిటర్ను ఫారాలలో పేర్కొన్న జి.ఎస్.టి.ఐ.ఎన్ సరిపోలక పోవడం వల్ల రిఫండ్లు నిలిచిపోతే, ఎగుమతిదార్ల ‘ప్యాన్’ నంబర్లను ఆధారం చేసుకుని జి.ఎస్.టి రిఫండ్లను అనుమతించవలసిందిగా బోర్డ్ కోరింది.తగ్గిన జి.ఎస్.టి వసూళ్ళు

Updated By ManamFri, 06/01/2018 - 23:50

gstన్యూఢిల్లీ: ఏప్రిల్‌లో రూ. 1.03 లక్షల కోట్ల మేరకు ఉన్న జి.ఎస్.టి వసూళ్ళు మేలో రూ. 94,016 కోట్లకు తగ్గినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారంనాడు పేర్కొంది. మే నెలలో దాదాపు 62.47 లక్షల వ్యాపార సంస్థలు వాటి సంక్షిప్త అమ్మకాల రిటర్నులు జి.ఎస్.టి.ఆర్-3బిలను దాఖలు చేశాయి. 2018 మేలో వసూలైన మొత్తం స్థూల జి.ఎస్.టి రాబడి రూ. 94,016 కోట్లలో సి.జి.ఎస్.టి రూ. 15,866 కోట్లు, ఎస్.జి.ఎస్.టి రూ. 21,691 కోట్లు, ఐ.జి.ఎస్.టి రూ. 49,120 కోట్లు, సెస్సు రూ. 7,339 కోట్ల మేరకు ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘‘ఏప్రిల్ రెవిన్యూతో పోలిస్తే, మే నెల వసూళ్ళు తక్కువగానే ఉండవచ్చు. అయినప్పటికీ మే నెల స్థూల రెవిన్యూ వసూలు (రూ. 94,016 కోట్లు), కడచిన ఆర్థిక సంవత్సరంలోని నెలసరి సగటు జి.ఎస్.టి వసూలు (రూ. 89,885 కోట్ల)కన్నా ఎక్కువే ఉం ది. సంవత్సరాంత ప్రభావం వల్ల ఏప్రిల్ రెవిన్యూ సంఖ్య అధికంగా ఉంది’’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రాలకు జి.ఎస్.టి పరిహారం కింద 2018 మార్చి నెలకుగాను, మే 29 నాటికి దాదాపు రూ. 6,696 కోట్లు వసూలు చేశారు. రాష్ట్రాలకు 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను (2017 జూలై నుంచి 2018 మార్చి వరకు) విడుదల చేసిన మొత్తం జి.ఎస్.టి పరిహారం దీనితో రూ. 47,844 కోట్లుగా ఉందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ‘‘2018 మే లో మొత్తం జి.ఎస్.టి వసూలు రూ. 94,016 కోట్లు 2017-18 సంవత్సరపు నెలసరి సగటు వసూలు రూ. 89,885 కోట్లకన్నా ఎక్కువగా ఉంది. ఈ-వే బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత నిబంధనలు మెరుగ్గా పాటిస్తున్నట్లు ఇది వెల్లడిస్తోంది’’ అని ఆర్థిక శాఖ కార్యదర్శి హాస్‌ముఖ్ అధియా ట్వీట్ చేశారు. రెవెన్యూ వసూలు వివరాలలో లోటు

Updated By ManamMon, 05/28/2018 - 00:55

న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జి.ఎస్.టి)ని అమలులోకి తెచ్చిన 10 నెలల తర్వాత కూడా, ఏ రంగం లేదా ఏ వస్తువు నుంచి హెచ్చు రాబడి వస్తోందో, ఏది వెనుకబడిందో చెప్పలేని స్థితిలో పన్ను అధికారులు ఉన్నారు. ఈ అతి పెద్ద పన్ను సంస్కరణ కింద పన్ను అధికారుల వద్ద వస్తువు లేదా రంగం వారీగా పన్ను వసూలు వివరాలు లేకపోవడమే దానికి కారణం. దానితో  కేంద్ర పరోక్ష పన్నుల, కస్టమ్ బోర్డు అధికారులు జి.ఎస్.టి కింద  వస్తువు వారీగా వివరాలు రికార్డు చేసే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే ప్రాథమిక పనులను ప్రారంభించారు. ‘‘ఉదాహరణకు, సర్వీసుల రంగాన్నే తీసుకోండి. 2017 జూలై 1కి ముందు రెవిన్యూ రాబడులను రికార్డు చేయడానికి మాకు 250కి పైగా శీర్షికలు ఉండేవి. ఏ రంగం పనితీరు బాగుందో, ఏది బాగాలేదో మేం కనుగొనేవాళ్ళం. ప్రస్తుతానికి జి.ఎస్.టి కింద మా వద్ద అటువంటి ఎక్సెల్ షీట్ లేదు’’ అని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. డిపాజిట్ అయిన పన్ను వస్తువులా లేదా సేవల నుంచి వచ్చిందా అని చెప్పడం కూడా నిజంగా కష్టవేునని ఆ అధికారి అన్నారు. జి.ఎస్.టిని గత ఏడాది జూలై 1న ప్రవేశపెట్టారు. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన 17 పన్నులు, 23 సెస్సులను ఏకీకృతం చేసి జి.ఎస్.టిగా రూపొందించారు. వస్తువు వారీగా డాటా కొరవడడం వల్ల కొన్ని అననుకూలతలు ఉన్నాయని ఆ అధికారి అన్నారు. ‘‘ప్రోత్సాహకాలకు ప్రణాళిక తయారు చేయడానికి లేదా ఒక నిర్దిష్ట రంగానికి చేయూతనిచ్చి పెంపొందించేందుకు గతంలో పన్నుల వివరాలు, నిజంగా సహాయపడేవి. ప్రస్తుతానికి, అటువంటి పని చేయడం కష్టం’’ అని ఆ అధికారి తెలిపారు. 

taxవేర్వేరు కోడ్‌లు
జి.ఎస్.టి వ్యవస్థ కింద, ప్రతి వస్తువు లేదా వస్తువుల కేటగిరీకి, సర్వీసు లేదా సర్వీసుల కేటగిరీకి ఒక కోడ్ ఇచ్చారు. వస్తువులకు, హెచ్.ఎస్.ఎన్ లేదా హార్మైనెజ్డ్ సిస్టం ఆఫ్ నావెున్‌క్లేచర్ కోడ్ ఉంది. సర్వీసులకు సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ (ఎస్.ఎ.సి) ఉంది. ఈ రెండూ అంతర్జాతీయంగా ఆమోదం పొందినవి. అంతర్జాతీయ వర్తకంలో వాడుతున్నవి. టర్నోవరు లేదా తమ వ్యాపార స్వభావాన్ని ఆధారం చేసుకుని వర్తక, పరిశ్రమ వర్గాలవారు రెండు నుంచి ఎనిమిది సంఖ్యలు గల కోడ్‌ని ఉపయోగించవలసి ఉంటుంది. టర్నోవరు సుమారు రూ. 1.5 కోట్లకు ఎగువన, రూ. 5 కోట్లకు దిగువన ఉన్న పన్ను చెల్లింపుదార్లు రెండు సంఖ్యల కోడ్‌ను ఉపయోగించాలి. టర్నోవరు రూ. 5 కోట్లు, అంతకు ఎగువన ఉన్న పన్ను చెల్లింపుదార్లు నాలుగు సంఖ్యల కోడ్‌ను ఉపయోగించాలి. టర్నోవరు రూ. 1.5 కోట్లకు దిగువన ఉన్న పన్ను చెల్లింపుదార్లు వారి ఇన్‌వాయిస్‌లలో కోడ్‌ను పేర్కొనాల్సిన అవసరం లేదు. ఎగుమతి, దిగుమతుల వ్యాపారానికి ఎనిమిది సంఖ్యల కోడ్ ఉంటుంది. 
రిటర్నుల దాఖలు
వస్తువుల వారీగా వివరాలు రాకపోవడానికి కారణం ప్రస్తుత రిటర్నుల దాఖలు పద్ధతిలో ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత రిటర్నుల దాఖలు వ్యవస్థ (జి.ఎస్.టి.ఆర్-1, జి.ఎస్.టి.ఆర్-3బిలను దాఖలు చేయాల్సి ఉంటుంది) పన్ను వసూలు సమాచారాన్ని ఏకీకృత ప్రాతిపదికన సమకూరుస్తుంది. ‘‘జి.ఎస్.టి.ఆర్ 1, 3బిల రిటర్నుల ఫార్మాట్‌ల రూపు రేఖల కారణంగా, ప్రస్తుత రిటర్నుల దాఖలు వ్యవస్థ వస్తువు/హెచ్.ఎస్.ఎన్ వారీ ప్రాతిపదికన పన్ను వివరాలు అందించలేకపోతోంది’’ అని  డెలాయిట్ ఇండియాలో సీనియర్ డైరెక్టర్ సలోని రాయ్ వివరించారు. 

నేడు రెవెన్యూ వసూలు జి.ఎస్.టి.ఆర్ 3బి రిటర్ను ఆధారంగా ఉన్నందున పన్ను అధికారులు హెచ్.ఎస్.ఎన్ వారీగా రెవిన్యూ వసూలు వివరాలను ప్రాసెస్ చేయలేకపోతున్నారని ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా సంస్థలో ట్యాక్స్ పార్ట్నర్ బిపిన్ సప్రా అన్నారు. జి.ఎస్.టి.ఆర్ 3బి రిటర్నులో హెచ్.ఎస్.ఎన్ వారీగా రెవిన్యూ వివరాలు పొందుపరచాల్సిన అవసరం లేదు. కనుక, సమాకలనానికి అవి వెంటనే అందుబాటులో ఉండడం లేదు. జి.ఎస్.టి.ఆర్ 1లో వివరాలు ఉంటాయిగానీ, అవి జి.ఎస్.టి.ఆర్ 3బిలోని సంఖ్యలతో సరిపోలకపోవచ్చు. ఎందుకంటే, హెచ్.ఎస్.ఎన్ మాండేటరీ ఫీల్డ్ కాదు. ఈ డాటా సరైనదని ధ్రువీకరించే ఏర్పాటు ఏదీ లేదు. ‘‘జి.ఎస్.టి.ఆర్ 1 డాటా సమగ్ర విశ్లేషణతో  జి.ఎస్.టి.ఎన్ వెలువడితే, హెచ్.ఎస్.ఎన్ వారీ వివరాలు అందుబాటులోకి రావచ్చేమో. కానీ, జి.ఎస్.టి.ఆర్ 1లో క్యాష్ లేదా క్రెడిట్ ద్వారా జరిపిన వాస్తవిక పన్ను చెల్లింపు డాటా ఉండదు. ఎందుకంటే, హెచ్.ఎస్.ఎన్ వారీ జి.ఎస్.టి సదరు కంపెనీకి లయబిలిటీ అవుతుంది’’ అని సప్రా అన్నారు. కొత్త నెలవారీ రిటర్ను పత్రాన్ని ప్రవేశపెట్టిన తర్వా త, వస్తువుల వారీగా పన్ను వసూళ్ళను ప్రభుత్వం సేకరించగలదని సలోనా రాయ్ అన్నారు. అయితే, అది కొ త్త రిటర్ను ఫార్మాట్‌పై ఆధారపడి ఉంటుంది. నూతన నెలవారీ రిటర్ను ఫార్మాట్ ఈ ఏడాది చివరికి సిద్ధం కాగలదని భావిస్తున్నారు. జి.ఎస్.టి వసూళ్ళు రూ. 7.19 లక్షల కోట్లు

Updated By ManamFri, 04/27/2018 - 21:45

gstన్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జి.ఎస్.టి) వసూళ్ళు 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 7.19 లక్షల కోట్లుగా నిలిచాయి. ఈ మొత్తంలో 2017 ఆగస్టు నుంచి 2018 మార్చి వరకు వసూలైన రూ. 1.19 లక్షల కోట్ల కేంద్ర జి.ఎస్.టి, రూ. 1.72 లక్షల కోట్ల రాష్ట్ర జి.ఎస్.టి, రూ. 3.66 లక్షల కోట్ల ఇంటెగ్రేటెడ్ జి.ఎస్.టి మొత్తాలు కూడా కలిసి ఉన్నాయి. దిగుమతులపై వేసిన రూ. 1.73 లక్షల కోట్ల పన్ను, రూ. 62,021 కోట్ల సెస్సు ఐ.జి.ఎస్.టి వసూళ్ళలో కలిసి ఉన్నాయి. ‘‘ఈ ఎనిమిది నెలలకు నెలవారీ సగటు వసూళ్ళు రూ. 89,885 కోట్ల మేర ఉన్నాయి’’ అని  ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఐ.జి.ఎస్.టి సెటిల్‌మెంట్‌తో కలుపుకొని, ఆర్థిక సంవత్సరంలో, ఎస్.జి.ఎస్.టి వసూళ్ళు రూ. 2.91 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఈ కాలంలో రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తం పరిహారం రూ. 41,147 కోట్లుగా ఉంది. బేస్ సంవత్సరం పన్ను వసూలు 2015-2016లో ఉన్నదానిపై 14 శాతం స్థాయి వద్ద రాష్ట్రాల ఆదాయాన్ని కాపాడేందుకు పరిహారం చెల్లిస్తున్నారు. ‘‘ప్రతి రాష్ట్రం రాబడిలో వ్యత్యాసం గత ఎనిమిది నెలలుగా తగ్గుతూ వస్తోంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించి సగటు రాబడి వ్యత్యాసం గత ఏడాది దాదాపు 17 శాతం మేర ఉంది’’ అని ఆ ప్రకటనలో తెలిపారు. నిబంధనలు పాటించే స్థాయి కూడా ఈ ఏడాది కాలంలో ‘ప్రగతిశీలమైన మెరుగుదల’ను కనబరచిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2017 జూలైలో, గడువు తేదీ నాటికి 57.69 శాతం జి.ఎస్.టి రిటర్నులు దాఖలయ్యాయి. ఇది 2017 డిసెంబరు నాటికి 66.81 శాతానికి మెరుగుపడింది. కానీ, 2018 మార్చిలో 62.63 శాతానికి తగ్గింది. మొత్తంమీద పాటిస్తున్న స్థాయిలు (ఇంతవరకు దాఖలెైన రిటర్నుల శాతం) ప్రారంభ నెలలకు 90 శాతం దాటింది. 2018 జూలైకి ఇది 96 శాతానికి చేరుకుంది. ‘‘నిబంధనలు పాటించడంలో ఇంతవరకు రాష్ట్రాల మధ్య తారతమ్యాలున్నాయి. అయితే, ఆలస్యంగా దాఖలు చేసినవాటిని కూడా లెక్కలోకి తీసుకుంటే రాష్ట్రాల వారీ కాంప్లియన్స్ స్థాయిలు కొంత కాలానికి ఒకే రీతిలో పుదిద్దుకుంటాయి’’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది.జీఎస్టీ రేటుపై గందరగోళం

Updated By ManamTue, 04/17/2018 - 22:24

gstన్యూఢిల్లీ: రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికెట్ల (ఆర్.ఇ.సి)పై వస్తువులు, సేవల పన్ను (జి.ఎస్.టి)ని చూసి కాలుష్య రహిత ఇంధన పరిశ్రమ తల గొక్కుంటోంది. విద్యుచ్ఛక్తి ట్రేడ్ పై పన్ను లేనప్పుడు ఆర్.ఇ.సి.ల ట్రేడ్ జి.ఎస్.టిని ఆకర్షించడం అసాధారణమని ఈ పరిశ్రమ సంస్థలు వాదిస్తున్నాయి. ‘‘విద్యుచ్ఛక్తి వర్తకంపై జి.ఎస్.టి లేనప్పుడు, ఆర్.ఇ.సిలపై పన్ను ఎందుకు ఉంటుంది?’’ అని పవన విద్యుత్ పరిశ్రమ రంగానికి చెందిన పరిశీలకుడు ఒకరు ప్రశ్నించారు. ఒకవేళ పన్ను వేసినా ఆర్.ఇ.సి.లపై ఏ రేటు చొప్పున పన్ను లెక్కగట్టాలనే అంశంపై ఉన్న గందరగోళం పరిశ్రమను మరింత కలవరపరుస్తోంది. విద్యుత్ స్పాట్ ట్రేడింగ్‌కి ఇండియన్ ఎనర్జీ ఎక్చ్సేంజి (ఐ.ఇ.ఎక్స్) దేశంలోనే పెద్ద ప్లాట్‌ఫాంగా ఉంది. ‘‘రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికెట్లపై వస్తువులు, సేవల పన్ను వర్తిస్తుందని సి.బి.ఇ.సి, జి.ఎస్.టి (విధాన విభాగం) 2018 జనవరి 4 నాటి లేఖలో స్పష్టం చేసింది. అయితే, రేటుకానీ, వర్తించే హెచ్.ఎస్.ఎన్ నంబరుకానీ పేర్కొనలేదు’’ అని ఐ.ఇ.ఎక్స్ దాని వినియోగాదార్లకు పంపిన సర్క్యులర్‌లో పేర్కొంది. హెచ్.ఎస్.ఎన్ పేర్కొనకపోతే, వర్తించే  పన్ను రేటును నిర్ణయించడం కష్టమవుతుంది. అయితే, తన సొంత కన్సల్టెంట్లు, ఆర్.ఇ.సిలు టైటిల్ డాక్యుమెంట్లు అవుతాయని, కనుక అవి హెచ్.ఎస్.ఎన్ కోడ్ 49070090 కిందకు వస్తాయని, వాటిపై 12 శాతం జి.ఎస్.టి పడుతుందని అభిప్రాయపడ్డారని ఐ.ఇ.ఎక్స్ తన వంతుగా దాని కస్టమర్లకు స్పష్టం చేసింది. ‘‘ఆర్.ఇ.సి ధరను, దానిపై పడుతుందని భావిస్తున్న పన్ను రేటును కొనుగోలుదార్ల నుంచి జనవరి నుంచి వసూలు చేయడం ప్రారంభించా’’ మని ఐ.ఇ.ఎక్స్ అధికారి ఒకరు తెలిపారు. సౌర శక్తేతర ఆర్.ఇ.సిల ట్రేడింగ్‌కు సుప్రీం కోర్టు గత ఏడాది జూలైలో అనుమతించింది. అప్పటి నుంచి ఎక్చ్సేంజిలో ఆర్.ఇ.సి.ల ట్రేడింగ్ క్రమంగా పెరుగుతూ వచ్చి, ఒక్క 2017 డిసెంబరులోనే రికార్డు స్థాయిలో 32.39 లక్షల లావాదేవీలు చోటుచేసుకున్నాయి. ఒక్కో సర్టిఫికెట్ రూ. 1500 ఖరీదుతో దాదాపు రూ. 485.87 కోట్ల విలువైన వర్తకం సాగింది. కానీ,జి.ఎస్.టిని విధించిన తర్వాత, జనవరిలో, ఆర్.ఇ.సి.ల ట్రేడింగ్ కేవలం రూ. 2.7 కోట్ల విలువైన 1.82 లక్షల లావాదేవీలకు పతనమైంది. ఫిబ్రవరిలో 3.90 లక్షల సర్టిఫికెట్ల ట్రేడింగ్‌తో అది నామమాత్రంగానే ఉందని చెప్పవచ్చు. మార్చిలో మళ్ళీ పునరుద్ధరణ కనిపించింది. రూ. 311.96 కోట్ల విలువైన 20.79 లక్షల ఆర్.ఇ.సిల ట్రేడింగ్ జరిగింది. 

మరింత జటిలం
ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ సర్టిఫికెట్ల (పి.ఎస్.ఎల్.సిలు)కు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్చిన జారీ చేసిన సర్క్యులర్ పరిస్థితిని మరింత జటిలం చేస్తూ, పరిశ్రమకు శిరోవేదనగా తయారైంది. పి.ఎస్.ఎల్.సిలు కూడా రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికెట్లు, ఇతరముల వంటి వస్తువుల కిందకే వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ  వర్గీకరించింది. వాటిపై 18 శాతం పన్ను విధించవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘‘ఆర్.ఇ.సి.లకు వర్తించే రేటుపై ఈ వివరణ మరింత గందరగోళపరచింది. ఆర్.ఇ.సి.లపైన కూడా 18 శాతం జి.ఎస్.టి రేటు వర్తిస్తుందా అని ఎక్చ్సేంజిలోని కొద్ది మంది సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు’’ అని ఐ.ఇ.ఎక్స్ వెల్లడించింది. రూ. 95,000 కోట్లకు చేరనున్న జీఎస్టీ వసూళ్ళు

Updated By ManamMon, 04/16/2018 - 22:04
  • గత ఐదు నెలల్లో అవి సగటున రూ. 87వేల కోట్లు మాత్రమే

gstన్యూఢిల్లీ: మార్చి నెల రిటర్నులు ఏప్రిల్ 20కల్లా దాఖలైనప్పుడు, వస్తువులు, సేవల పన్ను (జి.ఎస్.టి) వసూళ్ళు రూ. 93,000 కోట్ల నుంచి రూ. 95,000 కోట్ల వరకు తిరిగి చేరుకోగలవని భావిస్తున్నారు. గత ఐదు నెలల్లో ఇవి సగటున సుమారు రూ. 87,000 కోట్లుగా ఉన్నాయి. కొత్త పన్ను వ్యవస్థ 2017 జూలైలో అమలులోకి వచ్చినప్పటి నుంచి జి.ఎస్.టి వసూళ్ళు (కేంద్ర, రాష్ట్ర, ఇంటెగ్రేటెడ్ జి.ఎస్.టి మొత్తం) బాగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. మూడు నెలలపాటు నెలకు రూ. 90,000 కోట్లకు మించి దండిగా కనిపించిన వసూళ్ళు తర్వాత రెండు నెలల్లో తగ్గాయి. చాలా వరకు నవంబరులో పూర్తయిన లావాదేవీలకు సంబంధించి, 2017 డిసెంబరులో వసూళ్ళు రూ. 84,000 కోట్లకు తగ్గి, మార్చిలో రూ. 89,300 కోట్లకు మెరుగుపడ్డాయి. జి.ఎస్.టి సిస్టంలు ఇప్పుడు స్థిరత్వం పొందాయి. పన్ను వ్యవస్థ పట్ల వ్యాపార సంస్థలకు మెరుగైన స్పష్టత వచ్చింది. ఆరంభ నెలల్లో అవాంతరాల తర్వాత ఆర్థిక వ్యవస్థ కూడా తిరిగి సర్దుకుంది. 


జి.ఎస్.టి రేట్లు 2017 అక్టోబరు, నవంబరు నెలల్లో ప్రధానమైన మార్పులకు లోనయ్యాయి. డీవెురిట్ రేటు 28 శాతం చొప్పున పన్ను విధించే వస్తువుల జాబితాను 50కి కుదించారు. 178 వస్తువులపై రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. వసూళ్ళలో సమతూకం లేకపోవడానికి ఇది కారణమైంది. వర్తించే పన్ను రేట్లు, ఇన్‌పుట్ పన్ను క్రెడిట్ యంత్రాంగం పట్ల స్పష్టత కూడా కొరవడింది. వీటికి తోడు, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ స్థాయి కూడా అంతంతమాత్రంగానే ఉందని పన్ను నిపుణులు వివరించారు. ఈ రకమైన గందరగోళం ఉన్నప్పటికీ, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో దాఖలైన రిటర్నులు జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో చెప్పుకోదగ్గ వసూళ్ళకు సంకేతమిచ్చాయి. కానీ, అక్టోబరు నెల లావాదేవీలకు సంబంధించి నవంబరులో దాఖలైన  రిటర్నులలో వసూళ్లలో రూ. 9,200 కోట్ల తగ్గుదల కనిపించింది. తర్వాత నెలలో, అవి మరో రూ. 2,200 కోట్లు తగ్గాయి. రేట్ల విషయంలో అస్థిరత ఉంది. జనం వారి పన్నులను సక్రమంగా చెల్లించడం లేదని కెపిఎంజిలో పరోక్ష పన్ను విభాగ అధిపతి, పార్ట్నర్ సచిన్ మెనాన్ అభిప్రాయపడ్డారు. రేట్లు స్థిరత్వం పొంది, వ్యాపార సంస్థలకు అవాగహన మెరుగుపడిన తర్వాత డిసెంబరు నుంచి వసూళ్ళు మెరుగుపడ్డాయని ఆయన అన్నారు. ఎగవేతపై విరుచుకుపడతారనే భయం, ఈ-వే బిల్లును అనివార్యంగా ప్రవేశపెట్టడం కూడా వసూళ్ళను మెరుగుపరచి ఉంటాయని ఆయన అన్నారు. 

క్రెడిట్‌లు క్లైమ్ చేయడంలో బిజీ
ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్లు ముఖ్యంగా మార్పునకు సంబంధించిన క్రెడిట్లు (లేదా జి.ఎస్.టి అమలుకు ముందు వ్యాపార సంస్థల వద్దనున్న స్టాకులపై ట్యాక్స్ క్రెడిట్) క్లైమ్  చేయడంలో త్వరపడడం వల్ల అక్టోబరు, నవంబరు నెలల పన్ను వసూళ్లు తగ్గాయని ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో పార్ట్నర్ బిపిన్ సప్రా అభిప్రాయపడ్డారు. పన్ను భారాలపై గందరగోళం వల్ల, వ్యాపార సంస్థలు మొదటి మూడు నెలల్లో ఇన్‌పుట్ క్రెడిట్ ని పూర్తిగా వినియోగించుకోలేకపోయాయని, ట్రాన్సిషనల్ క్రెడిట్ క్లైమ్ చేయడంలో అప్పట్లో కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయని బిపిన్  సప్రా చెప్పారు. అక్టోబరు-డిసెంబరు క్వార్టరులో ఈ క్లైమ్‌లు విజృంభించడంతో ఆ నెలలకు వసూళ్ళు తగ్గాయి. కానీ, మొదటి మూడు నెలలకు సంబంధించిన క్లైమ్‌లు సడలినందువల, ఇప్పటి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లలో చాలా భాగం వర్తమానానికి చెందినవేనని సప్రా తెలిపారు. 

ఉత్పాదక వస్తువులపై నిబంధనలు
క్యాపిటల్ గూడ్స్‌పై ఇన్‌పుట్ క్రెడిట్ క్లైమ్ చేయడంలో నిబంధనలలో తెచ్చిన మార్పు కూడా వసూళ్ళను ప్రభావితం చేసింది. సెంట్రల్ ఎక్సైజ్/సెన్ వ్యాట్ వ్యవస్థలో, వ్యాపార సంస్థలు మొదటి ఏడాదిలో చెల్లించిన పన్నుల్లో 50 శాతానికి మాత్రమే క్రెడిట్ క్లైమ్ చేసే అవకాశం ఉండేది. కానీ, జి.ఎస్.టిలో, వ్యాపార సంస్థలు మొదటి ఏడాదిలో 100 శాతం క్రెడిట్ క్లైమ్ చేయవచ్చు. అవి 100 శాతం ట్రాన్సిషనల్ క్రెడిట్‌ను కూడా క్లైమ్ చేయవచ్చు. పైగా, ఆరంభ నెలల్లో అవసరానికి మించి చెల్లించిన పన్ను రిఫండు ప్రభుత్వం వద్దనే ఉండిపోయింది. అవసరానికి మించి చెల్లించిన పన్నుల రిఫండులు, సర్దుబాట్లు ఇంచుమించుగా డిసెంబరు నెలలో మొదలయ్యాయి. పండుగలు, పెళ్ళిళ్ళ సీజన్ డిమాండ్, సంవత్సరాంత కొనుగోళ్ళు లేకపోతే  పన్ను వసూళ్ళలో హెచ్చు తగ్గులు ఇంకా తీవ్రంగా ఉండేవి. నవంబరు గణాంకాలు ఎప్పుడూ పేలవంగానే ఉంటాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీలో ప్రొఫెసర్ అయిన ఆర్.కవితా రావు చెప్పారు. పరోక్ష పన్ను వసూళ్ళకు డిసెంబరు ఎప్పుడూ మెరుగ్గానే ఉంటుంది. జనవరిలో దాఖలైన రిటర్నులు వసూళ్ళలో పునరుద్ధరణను కనబరచడానికి అదే కారణం. నిబంధనలు పాటించడం మెరుగుపడినకొద్దీ క్రమంగా వసూళ్ళు కూడా మెరుగుపడతాయని ఆమె భావిస్తున్నారు.  జీఎస్టీ సమస్యలు పరిష్కరిస్తున్నాం

Updated By ManamSat, 04/14/2018 - 22:54

GST-issues-being-addressedహైదరాబాద్: వస్తువులు, సేవల పన్ను (జి.ఎస్.టి)కి సంబంధించి ఎగుమతిదార్లు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తేవతియా చెప్పారు. భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్.ఐ.ఇ.ఓ) సభ్యులతో ఆమె ఇక్కడ సమావేశమయ్యారు. ఆ సందర్భం గా ఆమె మీడియా ప్రతినిధులతో విడిగా మా ట్లాడారు. సమావేశంలో మిగిలిన వాటన్నింటికన్నా జి.ఎస్.టికి సంబం ధించిన అంశాలే ప్రాధాన్యం వహించాయని తేవతియా చెప్పారు. ‘‘జి.ఎస్.టిని క్రమబద్ధం చేయడమే నేడు ఎగుమతిదారులందరి ప్రాధాన్యతాంశంగా ఉంది’’ అని ఆమె అన్నారు. ‘‘రానున్న నెలల్లో ఈ వ్యవస్థ కుదుటపడుతుందని మేం భావిస్తున్నాం. జి.ఎస్.టి.పై ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి గురించి ఎగుమతిదార్లకు తెలిపి వారికి తిరిగి స్థయిర్యాన్ని చేకూర్చాం’’ అని ఆమె అన్నారు. ఈ-కామర్స్‌కు సంబంధించిన అంశాలన్నింటినీ ప్రస్తుతం అంతర్ మంత్రిత్వ శాఖల బృందం ఒకటి చర్చిస్తోందని ఆమె ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ‘‘ఈ-కామర్స్ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ-కామర్స్‌పై ఒక విధానం రూపొందించేం దుకు అవసరమైన మరికొన్ని అంశాలను పరిశీలించవలసి ఉంది’’ అని తేవతియా చెప్పారు. 
ఇండియా-యూరోపియన్ యూనియన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ఈ చర్చల నుంచి యూరోపియన్ యూనియన్ 2012లో ఉపసంహరించుకున్నప్పటికీ, ఏదో ఒక విధంగా సంప్రదింపులు సాగుతూనే ఉన్నాయని, యూరోపియన్ యూనియన్‌ను తిరిగి చర్చలకు రప్పించాలని ఇండియా కోరుకుంటోందని తేవతియా తెలిపారు. గత రెండేళ్ళలో పరిస్థితిని సమీక్షించే సమావేశాలు సుమారుగా ఐదు జరిగాయి. భారతదేశంలో 2012 తర్వాత, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వంటి విషయాల్లో విధానపరమైన మార్పులు చాలా వచ్చాయి. దీనితో చర్చల్లో పాల్గొనే భాగస్వాముల నుంచి డిమాండ్లు తగ్గాయని ఆమె చెప్పారు. ‘‘ప్రపంచంలో అత్యంత ఉదార ఎఫ్.డి.ఐ వ్యవస్థ’’ ప్రస్తుతం భారతదేశంలోనే ఉందని ఆమె అన్నారు. లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్, లెటర్ ఆఫ్ కంఫర్ట్ సదుపాయాన్ని పునరుద్ధరించవలసిందిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్‌కు నచ్చజెప్పవలసిందని ఎఫ్.ఐ.ఇ.ఓ దక్షిణాది చైర్మన్ ఎ. శక్తివేల్ వాణిజ్య శాఖను అభ్యర్థించారు. అనేక చిన్న, మధ్యతరహా సంస్థలు కూడా ఆ సదుపాయాన్ని వినియోగించుకుంటూ వస్తున్నాయని, వాటిని హఠాత్తుగా ఉపసంహరించడం వల్ల, నగదు ప్రవాహ సమస్యలు పెరిగాయని ఆయన చెప్పారు. మ‌రోసారి వ‌ర్మ‌ను విచారించ‌నున్న పోలీసులు

Updated By ManamWed, 04/04/2018 - 22:11

rgvసంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన జీఎస్టీ (గాడ్, సెక్స్, ట్రూత్) లఘు చిత్ర వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇది నెమ్మదిగా వర్మకు త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా తయారవుతోంది. గత ఫిబ్రవరిలో ఈ చిత్రానికి సంబంధించి అసభ్యత, అశ్లీలత ఉందన్న అభియోగాల‌తోపాటు.. సామాజిక కార్యకర్త దేవిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఆ విచారణలో తాను ఈ సినిమాని చిత్రీకరించడం కోసం పోలాండ్ వెళ్లానన్నది అవాస్తవమని.. తాను ఈ చిత్రానికి దర్శకత్వం వహించలేదని.. నిర్మాతలు కోరితే వారికి స్కైప్‌ ద్వారా సూచనలు మాత్రమే ఇచ్చానని తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కథ తనదేనని ఓ యువకుడు.. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు అందజేసాడు.

ఇదిలా ఉంటే.. మరో ఇద్దరు యువకులు (వారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు) ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లోనే చిత్రీకరించారని.. మియా మల్కోవాను హైదరాబాద్‌కు రప్పించి ఓ స్టార్ హోటల్‌లో షూటింగ్ నిర్వ‌హించార‌ని.. అందుకు తగిన సాక్ష్యాలను కూడా పోలీసులకు అందజేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వర్మను మరోసారి విచారించేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారు. అయితే.. ఈసారి వర్మ పాస్ పోర్టును పరిశీలించి జీఎస్టీ చిత్రీకరణ కోసం ఆయన పోలాండ్ వెళ్ళారా? లేదా? అన్నది నిర్ధారించుకోనున్నారు. అలాగే.. గతంలో వర్మ లాప్‌టాప్, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు సాక్ష్యాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. వర్మపై తీసుకోబోయే తదుపరి చర్యలు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే నివేదికపై ఆధారపడి ఉంటాయ‌ని పోలీసులు చెబుతున్నారు.

Related News