up

భర్తతో గొడవ పడి.. బిడ్డలకు నిప్పుంటించి..

Updated By ManamSat, 10/13/2018 - 19:55
  • ముగ్గురు చిన్నారులు మృతి.. మరో చిన్నారి పరిస్థితి విషమం

  • నలుగురు చిన్నారుల చేతులు కట్టేసి కిరోసిన్ పోసిన తల్లి

  • కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య

Woman, 4 Children, set Fire, UP, Dispute With Husband, Premavathi బండా: భర్తతో గొడవపడిన భార్య తన నలుగురి పిల్లలతో కలిసి నిప్పుంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన నలుగురి పిల్లల చేతులను వెనక్కి కట్టేసి వారిపై కిరోసిన్ పోసి తల్లి నిప్పుంటించింది. అనంతరం తనపై కూడా కిరోసిన్ పోసుకొని నిప్పుంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే నలుగురు చిన్నారుల్లో ముగ్గురు చిన్నారులు మృతిచెందగా, ఒక చిన్నారి ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం అమ్గావ్ గ్రామంలోని రాత్ పోలీసు స్టేషన్ ఏరియాకు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రేమవతి అలియాస్ సుఖో (28)అనే మహిళకు ఆమె భర్తకు మధ్య ఘర్షణ జరిగిందని ఎస్పీ హేమరాజ్ మీనా చెప్పారు.

భర్తతో గొడవ అనంతరం తన నలుగురు పిల్లల్లో స్వప్న (7), ప్రశాంత్ (5), స్నేహ (3), దివ్యానుష్ (1) చేతులను తాళ్లతో వెనక్కి కట్టేసి వారిపై కిరోసిన్ పోసింది. వెంటనే చిన్నారులకు నిప్పుంటించింది. అనంతరం తాను కూడా నిప్పుంటించుకున్నట్టు ఎస్పీ మీనా తెలిపారు. దివ్యానుష్ అక్కడిక్కడే మృతిచెందగా, స్వప్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతూ మృతిచెందింది. ప్రేమవతి, ప్రశాంత్, స్నేహాలను ఝాన్సీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించగా ప్రేమవతి, స్నేహా చికిత్స పొందుతూ మృతిచెందగా, ప్రస్తుతం ప్రశాంత్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని ఎస్పీ మీనా చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు ఎస్పీ మీనా పేర్కొన్నారు.



పరీక్ష పేపర్.. 7 లక్షలు!

Updated By ManamSun, 09/02/2018 - 15:48
  • యూపీలో పోటీ పరీక్షల పేపర్‌లీక్.. యూపీఎస్‌ఎస్‌ఎస్‌సీ పరీక్ష రద్దు.. 

  • సూత్రధారి ప్రాథమిక స్కూలు టీచర్.. 11 మందిని అరెస్టు చేసిన ఎస్‌టీఎఫ్

  • బోర్ ఆపరేటర్ల నియామకానికి పరీక్ష.. 3,210 పోస్టులకు 2 లక్షల దరఖాస్తులు

Rs 7 lakhs cost for Exam paper, UP Competition paper leakలఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో బోర్ ఆపరేటర్ల నియామకానికి నిర్వహించాల్సిన పరీక్ష పేపర్ లీక్ కావడంతో పరీక్షను రద్దుచేశారు. ఉత్తరప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ (యూపీఎస్‌ఎస్‌ఎస్‌సీ) ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. పేపర్ లీకేజికి సూత్రధారి అయిన ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడితో సహా మొత్తం 11 మందిని యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) సిబ్బంది అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 364 కేంద్రాలలో ఈ నియామక పరీక్ష నిర్వహించాలని తలపెట్టి అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్ష రద్దుకావడంతో మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో తెలియజేస్తామని కమిషన్ వర్గాలు తెలిపాయి. అరెస్టయిన వారిలో ఐదుగురు పరీక్ష రాయాల్సిన అభ్యర్థులు కాగా మరో ఆరుగురికి పేపర్ లీకేజితో సంబంధం ఉందని ఎస్‌టీఎఫ్ సీనియర్ ఎస్పీ అభిషేక్ సింగ్ తెలిపారు. మొత్తం లీకేజి కుంభకోణానికి సూత్రధారి సచిన్ చౌదరి అనే ప్రాథమిక పాఠశాల టీచర్ అని ఆయన చెప్పారు. తనకున్న సంబంధాలతో ప్రశ్నపత్రం సంపాదించిన సచిన్.. ఒక్కో పేపర్‌ను రూ. 7 లక్షల చొప్పున అమ్మకానికి పెట్టాడు. పరీక్ష జరగడానికి 15 గంటల ముందుగా పరీక్ష రాసే అభ్యర్థులకు అతడు పేపర్లు అమ్ముతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. 

వెంటనే ప్రభుత్వాధికారులకు లీకేజి గురించి సమాచారం అందించారు. స్వాధీనం చేసుకున్న పేపర్లు.. పరీక్ష పేపర్లతో సరిపోలడంతో వెంటనే పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అరెస్టు చేసినవారి నుంచి రూ. 15 లక్షల నగదు, పలువురు పరీక్షార్థుల ఐడీ కార్డులు, డజనుకు పైగా సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లీకేజి ఎలా జరిగిందన్న విషయం తెలుసుకోడానికి సచిన్ చౌదరిని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3,210 బోర్ ఆపరేటర్ల పోస్టులు ఉండగా, వాటికోసం 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేశారు. పరీక్ష వాయిదా పడినట్లు ప్రకటన రావడంతో చాలామంది పరీక్ష కేంద్రాల ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 



వాజ్‌పేయి ‘అస్థికల నిమజ్జనం’లో అపశ్రుతి!

Updated By ManamSun, 08/26/2018 - 11:24
  • పడవ బోల్తా.. నదిలో పడ్డ బీజేపీ నేతలు.. 

  • సురక్షితంగా నేతలను ఒడ్డుకు తీసుకొచ్చిన పోలీసులు.. 

BJP leaders, fall into river, scatter Vajpayee's ashes, UPలఖ్‌నవూ (ఉత్తరప్రదేశ్): దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి అస్థికలను బీజేపీ నేతలు ఓ నదిలో కలుపుతుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. బీజేపీ నేతలు వెళ్తున్న పడవ బోల్తా పడింది. అదృష్టవశాత్తూ బీజేపీ నేతలందరూ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వాజ్‌పేయి అస్థికలను దేశవ్యాప్తంగా అన్ని నదుల్లో కలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలోని బస్తీ జిల్లాలో బీజేపీ నేతలు వాజ్‌పేయి అస్థికలను నదిలో కలుపుతుండగా అందరూ ఒక్కసారిగా పడిపోయారు. రాష్ట్ర మాజీ బీజేపీ చీఫ్, సీనియర్‌ రామ్‌ త్రిపాఠి, ఎంపీ హరీశ్‌ ద్వివేది, రామ్‌ చౌదరీ, సీనియర్ నేతలతో పాటు జిల్లా ఎస్పీ దిలీప్ కుమార్ ఉన్నారు.

అయితే పడవలో సామర్థ్యానికి మించి ఎక్కువ మంది ఎక్కడంతో అది ఒక్కసారిగా బోల్తాపడింది. దాంతో అప్రమత్తమైన పోలీసు సిబ్బంది వెంటనే నదిలోకి దూకి బీజేపీ నేతలను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. నది ఒడ్డుకు సమీపంలోనే ఈ ఘటన జరగడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని, నదిలో పడిన నేతలను వెంటనే సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చినట్టు జిల్లా కలెక్టర్‌ రాజశేఖర్‌ చెప్పారు.



ఘోరం: ఐదునెలల పిండంతో పోలీస్‌ స్టేషన్‌కు యువతి

Updated By ManamSun, 07/22/2018 - 19:49

UP Woman Approaches Police With Aborted Foetus in Bag to File Rape Complaint

ఉత్తరప్రదేశ్: ఇదిగో పక్కనున్నఫొటోలో ఉన్న యువతి చేసిన పనికి పోలీసులు అవాక్కయ్యారు. ఇందుకు కారణం ఈమె చేతిలో ఉండే సంచే కారణం. అవాక్కవడానికి సంచికి సంబంధమేంటనే సందేహం కలుగుతోంది కదూ.. దీనిపై క్లారిటీ కావాలంటే ఆర్టికల్స్ పూర్తిగా చదవాల్సిందే మరి. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ ప్రాంతానికి చెందిన ఈ యువతి గత ఆర్నెళ్లుగా ఓ యువకుడితో సహజీవనం చేస్తోంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా కలవడంతో యువతి గర్భం దాల్చింది. దీంతో గర్భం తీయించుకున్న అనంతరం పెళ్లిచేసుకుందామని నమ్మబలికి యువతికి గర్భనిరోధక మాత్రలిచ్చి.. బలవంతంగా ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా తనను పెళ్లి చేసుకోవాలని కోరగా యువకుడు పట్టించుకోకపోగా.. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

తనను నమ్మించి మోసం చేసిన యువకుడు కాదనడంతో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లలేక పోయింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని ఆ యువతి అబార్షన్ చేసి తీసిన ఐదు నెలల పిండంను తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. బాధితురాలు సంచికి తీసుకొని రావడంతో అందులో ఏముందని ఓపెన్ చేయగా పిండంను చూసి పోలీసులు కంగుతిన్నారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి మీడియాకు వివరించాడు. బాధితురాలికి యువకుడితో పెళ్లి చేసి న్యాయం చేయాలని మహిళా సంఘాలు సైతం పోలీసులకు కోరుతున్నాయి. కాగా పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకుతున్నామని త్వరలోనే ఆ యువకుడ్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ మహిళ ఇలాగే తనను కిడ్నాప్ చేసి రేప్ చేశారని పిండంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసు ఏమైందన్న విషయం ఇంకా తెలియరాలేదు.

 



యూపీ స్కూళ్లల్లో యోగా తప్పనిసరి

Updated By ManamFri, 07/13/2018 - 22:59
  • ఆదేశాలు జారీ చేసిన యోగీ సర్కారు  

imageలక్నో:  ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేస్తూ యోగి ఆదిత్యానాథ్ సర్కారు ఆదేశాలు జారీచేసింది. 9వ తరగతి నుంచి యోగాను తప్పనిసరి చేస్తూ, దీన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా విలీనం చేశారు.  ఈ ఏడాది నుంచి దీన్ని అనుసరించేలా చేస్తూ, విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఇది తోడ్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది.  యోగాపై రాతపూర్వక పరీక్షను కూడా నిర్వహించేలా తాము తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయం చేయరాదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ విజ్ఞప్తిచేశారు. మరోవైపు ఇది ఏ మతానికో సంబంధించినది కాదని, ఇప్పటికే విద్యార్థినులకు జూడో, తైక్వాండో కూడా నేర్పుతున్నట్టు శర్మ చెప్పుకొచ్చారు. 



జైల్లో గ్యాంగ్‌స్టర్ బజరంగీ హత్య

Updated By ManamMon, 07/09/2018 - 21:27
  • తుపాకీతో కాల్చిచంపిన మరో ఖైదీ.. ఉత్తరప్రదేశ్ జిల్లా జైలులో ఘటన 

  • సీరియస్‌గా తీసుకున్న యోగీ సర్కార్.. ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం

imageబాఘ్‌పట్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ ప్రేమ్ ప్రకాశ్ సింగ్ అలియాస్ మున్నా బజరంగీ జైల్లోనే హత్యకు గురయ్యాడు. ఓ ప్రజాప్రతినిధి హత్య సహా పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న బజరంగీని ప్రత్యర్థి ముఠాకు చెందిన మరో ఖైదీ తుపాకీతో కాల్చి చంపేశాడు. బాఘ్‌పట్ జిల్లా జైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జైలులో ఉన్న విచారణ ఖైదీల చేతుల్లోకి ఆయుధాలు ఎలా చేరాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ నలుగురు జైలు అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు ఘటనపై విచారణకు ఆదేశించారు. బీజేపీ ఎమ్మెల్యే లోకేష్ దీక్షిత్‌ను డబ్బు కోసం బెదిరించాడనే కేసులో బజ్రంగీపై బాఘ్‌పట్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణకు హాజరుపరిచేందుకు ఝాన్సీ జైలులో శిక్ష అనుభవిస్తున్న బజ్రంగీని ఆదివారం నాడు పోలీసులు బాఘ్‌పట్ జిల్లా జైలుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అదే జైలులో ఉన్న బజరంగీ ప్రత్యర్థి, మరో గ్యాంగ్‌స్టర్ సునీల్ రాతి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో బజరంగీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు వెల్లడించారు.

పోలీసుల హిట్ లిస్ట్‌లో..
గ్యాంగ్‌స్టర్ బజ్రంగీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన భార్య సీమ గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. బజరంగీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని సీమ ఆరోపించారు. ఈ క్రమంలో సోమవారం బజ్రంగీ హత్యకు గురవడం.. అదీ జిల్లా జైలులోని ఓ ఖైదీ తుపాకీతో కాల్చిచంపడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జైలులోపలికి తుపాకీ ఎలా చేరిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, సోమవారం ఉదయం బజరంగీని న్యాయస్థానానికి తీసుకెళ్లే ప్రయత్నాలలో ఉండగా.. సునీల్ రాతి అనే ఖైదీ కాల్పులు జరిపి బజరంగీని హత్య చేశాడని జైలు అధికారులు వివరిస్తున్నారు.



హత్యా.. ఆత్మహత్యా..?

Updated By ManamSat, 06/02/2018 - 21:47
  • బెంగాల్‌లో.. మళ్లీ అదే రీతిలో!

  • విద్యుత్ స్తంభానికి వేలాడుతూ బీజేపీ కార్యకర్త

  • ఇది టీఎంసీ కార్యకర్తల పనే..: అమిత్ షా

imageకోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని పురూలియా జిల్లాలో రెండ్రోజుల క్రితం ఓ బీజేపీ కార్యకర్త చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించిన విషయం తెలిసిందే. మళ్లీ అదే రీతిలో అదే జిల్లాలో శనివారం మరో కార్యకర్త విద్యుత్ స్తంభానికి వేలాడుతూ కనిపించాడు. జిల్లాలోని దాబా గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో ఇదే జిల్లాలో త్రిలోచన్ మహతో (20) అనే బీజేపీ కార్యకర్త విగత జీవిగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ‘‘బీజేపీ కోసం పని చేసినందుకు ఇవాళ నీవు శవంగా మారావు’’ అని రాసి ఉన్న కాగితం త్రిలోచన్ మృతదేహం పక్కన కనిపించడం సంచలనం సృష్టిచింది.  మళ్లీ ఇదే రీతిలో దాబా గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త దులాల్ కుమార్  హైటెన్షన్ విద్యుత్ స్తంభానికి వేలాడుతూ కనిపించారు. దాంతో తీవ్ర దుమారం చెలరేగుతోంది.

పంచాయతీ ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తలపై వేధింపులు, దాడులు పెరిగిపోతున్నాయని ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఆరోపిస్తున్నారు. టీఎంసీ వారే దులాల్‌ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా కూడా ఇదే విధంగా స్పందించారు. టీఎంసీ నేతలే ఈ మారణకాండకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు,  ఈ అనుమానాస్పద మృతి ఘటనలపై సీఐడీ విచారణకు మమతా బెనర్జీ ఆదేశించారు.  వరస ఘటనలపై దర్యాప్తును ప్రారంభించినట్లు పురాలియా ఎస్పీ జాయ్ బిస్వాస్ తెలిపారు. మొదటి ఘటనపై హత్య అనుమానాలు ఉన్నా.. రెండో ఘటన ఆత్మహత్యే కావొచ్చని ఆయన తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని, విచారణ ముమ్మరం చేశామని ఎస్పీ తెలిపారు.



సొంతపార్టీ ఎంపీ ర్యాలీ

Updated By ManamMon, 04/02/2018 - 02:01
  • రాజ్యాంగం, రిజర్వేషన్లను కాపాడాలంటూ నినాదం

  • ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎంపీ సావిత్రిభాయి తిరుగుబాటు  

imageలఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ ఎంపీ సాథ్వీ సావిత్రిభాయి పూలే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రకటించారు. కేంద్రం దళిత వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడండి’ అనే నినాదంతో ఆదివారం లఖ్‌నవూలోని కాశీరామ్ స్మృతి ఉప్వాన్ వరకూ పెద్ద ఎత్తున మహార్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంపై పరోక్ష విమర్శలు చేశారు. రాజ్యాంగం, రిజర్వేషన్లు ప్రమాదంలో ఉన్నాయని సావిత్రి భాయి చెప్పారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆమె విమర్శించారు. రిజర్వేషన్ అనేది అడుక్కుంటే వేసే భిక్ష కాదని.. అది హక్కు అని ఎంపీ చెప్పారు. ఇప్పటివరకూ దేశంలో రాజ్యాంగం అమలు కాలేదని ఆమె ఆరోపించారు. తమ దళితులకు సమాన అవకాశాలు ఈరోజుకూ దక్కలేదని సావిత్రి భాయి చెప్పారు. తాము పోరాడటం లేదని.. తమ ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తున్నామని తెలిపారు. దళితులను ఎవరైతే అణగదొక్కాలని చూస్తున్నారో వారితోనే ఢీకొడుతున్నామని చెప్పారు. తాను ఎంపీనైనా, కాకపోయినా తమ వర్గానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని సావిత్రి భాయి హెచ్చరించారు. తాను బాబా సాహెబ్ కూతురినని, ఈ పరిణామాలను సహించేది లేదని ఆమె వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు తొలగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. అంతేకాదు, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. సావిత్రి భాయి పూలే ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ నుంచి లోక్‌సభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.



భార్య అక్రమ సంబంధం.. కట్టేసి కొట్టిన భర్త(వీడియో)

Updated By ManamFri, 03/23/2018 - 20:04

husbandలక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన జరిగింది. పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళకు ఆ గ్రామ పెద్దలు ఆటవిక శిక్ష విధించారు. నడి ఊళ్లో ఆమెను చెట్టుకు కట్టేసి భర్తతో కొరడా దెబ్బలు కొట్టించారు. అక్కడున్న జనమంతా ఈ సీన్‌ను వేడుకలా చూశారు. ఈ మహిళ తన దగ్గరి బంధువుతో అక్రమ సంబంధం పెట్టుకుని ఓ ఇంట్లో అడ్డంగా దొరికిపోయింది. దీంతో పంచాయితీ నిర్వహించిన గ్రామ పెద్దలు కొరడా దెబ్బలు కొట్టించడమే ఈమెకు సరైన శిక్ష అని తీర్పు ప్రకటించారు. ఆ తీర్పును తూచాతప్పకుండా అమలు చేశారు. ఇదిలా ఉంటే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు ఆమె భర్తను, కొడుకును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మార్చి 10నే జరిగినప్పటికీ వీడియో వైరల్ కావడంతో తాజాగా వెలుగులోకొచ్చింది. లక్నోకు 400కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగా గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 18మందిపై కేసు నమోదు చేశారు.



ఘోర ప్రమాదం: బీజేపీ ఎమ్మెల్యే దుర్మరణం

Updated By ManamWed, 02/21/2018 - 08:56

BJP MLA Lokendra Singh

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్రసింగ్  దుర్మరణం చెందారు. వ్యక్తిగత పనిమీద ఎమ్మెల్యే సింగ్ తన టొయోటా ఫార్చున్ కారులో ఇద్దరు గన్‌మెన్స్‌‌తో బయలుదేరారు. ఇంతలో అనుకోని ఘటన జరిగిపోయింది. బిజ్నూర్ జిల్లా సితార్‌పూర్‌లో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వేగంగా వస్తున్న ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లోకేంద్రసింగ్ సహా ఇద్దరు గన్‌మెన్లు, డ్రైవర్ అక్కడికక్కడే  మృతి చెందారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యే, గన్‌మెన్లు, డ్రైవర్ మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ట్రక్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సింగ్ భార్య కుప్పకూలిపోయారు.. హుటాహుటిన తనపిల్లలిద్దరితో ఆస్పత్రికి చేరుకున్నారు.. ఆమె, ఇద్దరి పిల్లల ఆర్తనాదాలు మిన్నంటాయి. లోకేంద్రసింగ్ మృతికి పలువురు బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ శ్రేణులు సంతాపం ప్రకటించాయి. 

40 ఏళ్లు వయసున్న లోకేంద్రసింగ్.. బిజినోర్ జిల్లాలోని ధామాపూర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో ఎమ్మెల్యేగా గెలిచిన నియోజవకర్గం నుంచే 2017లో కూడా ఎన్నికయ్యారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.





Related News