GANTA SRINIVASARAO

ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Updated By ManamWed, 11/14/2018 - 19:40

AP Inter exams, AP Inter exam schedule, Ganta srinivasaraoవిశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌‌ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ షెడ్యూల్‌ను బుధవారం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంటా మాట్లాడుతూ.. ఏపీ ఇంటర్ పరీక్షలు మొత్తం 1448 కేంద్రాల్లో జరుగుతాయని చెప్పారు. ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అలాగే రెండో సంవత్సర విద్యార్థులకు ఫిబ్రవరి 28 నుంచి మార్చి18 వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

పరీక్షల అనంతరం 22 రోజుల్లోపు ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మొత్తం 10.64లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తామని గంటా చెప్పారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఇబ్బందులు పడకుండా వెళ్లేలా సరికొత్త యాప్‌ను పంపిస్తామని మంత్రి గంటా స్పష్టం చేశారు. 



నా ఆస్తులు వెల్లడిస్తా..

Updated By ManamFri, 11/09/2018 - 01:40
  • నేరుగా అడిగితే అన్ని వివరాలు ఇస్తా

  • సిట్ నివేదికలో నా పేరు లేకపోవడం సంతోషం: గంటా  శ్రీనివాసరావు

HRD-Minister-Ganta-Srinivasaraoవిశాఖపట్నం:  తన ఆస్తిపాస్తుల వివరాలు తెలుసుకోగోరేవారు తనను నేరుగా సంప్రదిస్తే ..రాజకీయాల్లోకి రాకముందు నుంచీ ఇప్పటి వరకూ అన్ని వివరాలను వెల్లడిస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..భూ కుంభకోణంలో తాను పెద్ద ఎత్తున లబ్ది పొందినట్టు స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా ఆరోపణలు వెల్లువెత్తిన తరుణంలో సిట్ ఏర్పాటు చేసి వాస్తవాలను బయటపెట్టాలని తానే కోరినట్టు తెలిపారు.  ఈమేరకు 2017 జూన్ 6న సీఎంకు లేఖ రాసినట్టు..అందులోనే సిట్ నివేదికలో వేయాలని కోరానన్నారు. దీనిపై స్పందించిన సీఎం అదే నెల 16వ తేదీన సిట్‌ను ఏర్పాటు చేశారన్నారు.  దీంతో జూన్ 28 నుంచి సిట్ విచారణ ప్రారంభించిందని గంటా వివరించారు.  కుంభకోణంలో తన ప్రమేయం లేదని సిట్ స్పష్టం చేసినందుకు సిట్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.  తన ఆస్తిపాస్తుల విషయమై పలువురికి అనేక రకాల అనుమానాలున్నాయన్నారు.  న్యాయ విద్య పూర్తయ్యాక రెండేళ్ల పాటు ఓ పత్రికలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం చేసినట్టు.. అనంతరం పలు కాంట్రాక్టులు నిర్వహించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. తన ఆర్ధిక పరిస్థితిపై లేనిపోని అవాకులు పేలితే ఇకపై ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. 



ఆంధ్రకేసరి వర్సిటీ

Updated By ManamFri, 11/02/2018 - 00:25
  • ఒంగోలులో ప్రకాశం విశ్వవిద్యాలయం

  • ఏర్పాటుకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ

  • నెరవేరిన ప్రకాశం ప్రజల ఆకాంక్ష: మంత్రి గంటా

imageఅమరావతి: ఒంగో లులో ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ఒంగోలు ప్రజల చిరకాల ఆకాం క్షను నెరవేర్చామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివా సరావు అన్నారు. విద్యాపరంగా వెనుక బడిన ప్రకాశం జిల్లాలో వర్సిటీ ఏర్పాటు చేయడం చారిత్రక ఘట్టమని ఆయన అభివర్ణించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీ ఏర్పాటుకు జీవో ఎం.ఎస్.నెం 32 విడుదల చేసింది. ఈ సందర్భంగా మంత్రి గంటా పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఒంగోలు పీజీ సెంటర్‌ను అప్ గ్రేడ్ చేస్తూ వర్సిటీని ఏర్పాటు చేయడం ద్వారా గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొన్నామని మంత్రి గంటా స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో వర్సిటీ ఉన్నా ఒంగోలులో లేకపోవడం కొరత గా ఉండేదని అన్నారు.

ఎప్పటికప్పుడు వర్సిటీ ఏర్పాటు చేయాలని సంకల్పించి చర్యలు తీసుకొన్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టం-1991 పరిధిలోకి వర్సిటీ వస్తుందని, వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలుపుతామన్నారు. విద్యా పరంగా తాము ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టుకుంటూ వస్తున్నామని, ఈ క్రమంలోనే ఒంగోలులో కూడా వర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. మహనీయుడు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పేరును వర్సిటీకి నామకారణం చేశామని, ఆయన స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకెళ్తుం దని తెలిపారు.

వచ్చే జ్ఞానభేరి సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతానికి పీజీ సెంటర్‌కు ఉన్న 114 ఎకరాల్లో వర్సిటీ ఏర్పాటు అవుతుందని మంత్రి గంటా తెలిపారు. ప్రస్తుతం 10 కోర్సులతో పీజీ సెంటర్ నడుస్తోందని,  పీజీ సెంటర్‌కు అనుబంధంగా 137 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీలు, 48 మంది సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. వర్సిటీ ఏర్పాటు చేయడం ద్వారా ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షను సార్థకం చేయడం సంతోషంగా ఉందని మంత్రి గంటా తెలిపారు. 



విద్యాభివృద్ధికి రూ.25 వేల కోట్లు

Updated By ManamSun, 09/16/2018 - 00:38
  • లోటు బడ్జెట్ ఉన్నా విద్యకు ప్రాధాన్యం 

  • నాలెడ్జ్ హబ్‌గా ఏపీ: మంత్రి గంటా

gantaఅనంతపురం: ఆ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం రూ. 25 వేల కోటు కేటాయించిందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం సర్వశిక్షా అభియాన్, జిల్లా విద్యాశాఖ అనంతపురం  ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ ఆడిటోరియంలో స్వచ్ఛతా ఫఖ్వాడా ముగింపు - స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని మంత్రి జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత, రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి, విప్ యామినిబాల, జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, ఎమ్మెల్సీ శమంతకమణి, మడకశిర, అనంతపురం ఎమ్మెల్యేలు ఈరన్న, ప్రభాకర్ చౌదరి, కలెక్టర్ వీరపాండియన్, కమిషనర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు హాజరయ్యారు. కార్యక్రమానికి అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తయారు చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. గత ఏడాది రూ.75 కోట్ల వ్యయంతో కొత్త సైకిళ్లను పంపిణీ చేసి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది బాలికలకు  అందజేశామన్నారు. ఈ ఏడాది రూ.95 కోట్లతో 8,9వ తరగతి చదివే బాలికలకు ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త సైకిళ్లు పంపిణీ (బడికొస్తా) కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు.

రాబోయే పోటీ ప్రపంచానికి బాలురతో ధీటుగా బాలికలను సన్నద్ధం చేసి వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపడమే ‘బడికొస్తా’ పథకం లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ పథకం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందు చూపు చాలా ఉందన్నారు. స్వచ్ఛతా ఫఖ్వాడా కార్యక్రమం అమలులో పరిశుభ్రత జీవన విధానంలో భాగస్వాములు కావాలి, స్వచ్ఛత ఉద్యమాన్ని సామాజిక ఉద్యమంగా మార్చాలని మంత్రి కోరారు. మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ.. స్వచ్ఛమైన నీరు, ఆహారం, పరిశుభ్రమైన వాతావరణంతోపాటు పాఠశాలలను తీర్చిదిద్దాలని తెలిపారు. విజ్ఞాన, ఆనందదాయకమైన సమాజానికి రాష్ట్రంలోనే పాఠశాలలు వేదిక కావాలన్నారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులు కార్పొరేట్ తరహాలో మంచి ఫలితాలు సాధిస్తున్నారని, మౌళిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో బాలికలకు వేడినీరు సౌకర్యం అందజేయాలని తెలిపారు. కార్యక్రమంలో జేసీ-2 సుబ్బరాజు, విద్యాశాఖ ఆర్‌జేడీ ప్రతాప్‌రెడ్డి, ఎస్కేయూ ఉపకులపతి శుభ, జేఎన్‌టీయూ వీసీ శ్రీనివాసకుమార్, డీఈఓ జనార్దనాచార్యులు, ఎస్‌ఎస్‌ఏ పీఓ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



ఐసెట్ ఫలితాలు విడుదల

Updated By ManamSat, 05/12/2018 - 23:40
  • 92.6 శాతం ఉత్తీర్ణత: మంత్రి గంటా

  • గుంటూరు విద్యార్థికి మొదటి ర్యాంక్.. అనంత విద్యార్థులకు 2, 3 ర్యాంక్‌లు

ganta srinivasarao విజయవాడ: ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్-2018 ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం విజయవాడలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. గుంటూరుకు చెందిన సీహెచ్ ప్రసన్న కుమార్ మొదటి ర్యాంక్ సాధించాడు. అనంతపురం జిల్లాకు చెందిన భరత్ కుమార్, సాయికుమార్ రెడ్డిలు వరుసగా రెండు, మూడు ర్యాంక్‌లను కైవసం చేసుకున్నారు. ఈ పరీక్షకు 48,635 మంది విద్యార్థులు హాజరు కాగా, 45,037 మంది అర్హత సాధించారని మంత్రి గంటా తెలిపారు. 92.60 శాతం ఉత్తీర్ణత సాధిం చినట్టు తెలిపారు. గతేడాదితో పోలిస్తే 6 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించినట్టు వెల్లడించారు. అన్ని సెట్ల ఫలితాలను దేశంలోనే తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించామని, షెడ్యూల్ ప్రకారం పరీక్షలను నిర్వహించడంతో పాటు ఫలితాలు వెల్లడించామని మంత్రి తెలిపారు.





Related News