CHAKRASNANAM

చక్రస్నానంతో సంపూర్ణం

Updated By ManamSat, 09/22/2018 - 02:14
  • ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు 

  • పుష్కరిణిలో ఘనంగా చక్రస్నానం.. దీక్షాంత స్నానంగా అవభృథం

  • బ్రహ్మోత్సవ యజ్ఞం పరిపూర్ణం.. సమష్టి కృషితో విజయవంతం

  • భక్తుల సహకారానికి ధన్యవాదాలు.. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్

CHAKRASNANAMతిరుపతి:  కలియుగ వైకుంఠం తిరుమలలో ప్రత్యక్ష నారాయుణుడైన శ్రీ వేంకటేశ్వర స్వామికి తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. శుక్రవారం రాత్రి ధ్వజావరోహణం చేయడంతో బ్రహ్మోత్సవ యజ్ఞం మంగళాంతం అయ్యింది. దీనికిముందు ఉదయం శ్రీవారి పుష్కరణిలో చక్రస్నానం జరిగింది. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, సుదర్శన చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం  చేశారు. తొమ్మిది రోజుల ఉత్సవాలలో జరిగిన సేవలన్నీ సఫలమై లోకం క్షేమంగా ఉండటానికి, భక్తులు సుఖశాంతులతో ఉండటానికి చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక, యజ్ఞాంతంలో అవభృథస్నానం చేస్తారు. యజ్ఞ నిర్వహణలో జరిగిన చిన్న చిన్న లోపాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, సంపూర్ణ ఫలాలు చేకూరడానికి చేసే దీక్షాంతస్నానం అవభృథం. దీనికిముందు శ్రీ భూదేవి సమేతుడైన మలయప్పమూర్తికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. తరువాత సుదర్శనచక్రాన్ని పవిత్ర పుష్కరిణీ జలంలో ముంచి, స్నానం చేయించారు. అదే సమయంలో అనేకమంది భక్తులు పుష్కరిణిలో స్నానం చేశారు. చక్రస్నానం నాటి సాయంత్రం యథావిధిగా ధ్వజావరోహణం చేశారు. 

సమిష్టి కృషితో విజయవంతం: ఈఓ సింఘాల్
టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం సమిష్టి కృషితో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారని కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు సంయమనంతో వ్యవహరించి, క్యూలైన్లు, గ్యాలరీలలో వేచి ఉన్నారని, భక్తిభావంతో టీటీడీకి సహకరించారని, వారికి ధన్యవాదాలని తెలిపారు. జేఈఓ శ్రీనివాసరాజు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పకడ్బందీగా ప్రణాళికలు చేపట్టి, బ్రహ్మోత్సవాలు విజవంతం కావడానికి కృషిచేశారని తెలిపారు. తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారన్నారు. బ్రహ్మోత్సవ సమయాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదాల వితరణ చేసినట్లు తెలిపారు. వచ్చేనెల పదోతేదీ నుంచి జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సెలవులు ఉండటంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, దీనికి తగ్గట్లు ఏర్పాట్లు చేపడతామన్నారు. చక్రస్నానం కార్యక్రమంలో టీటీడీ ట్రస్టు బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల, తిరుపతి జేఈఓలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, బోర్డు సభ్యులు సుధా నారాయణమూర్తి, శివాజీ, శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.





Related News