Jagannatha Rao

శిఖరం.. సుందరం

Updated By ManamSat, 09/22/2018 - 02:14
  • యాగశాలకు వైభవంగా శిఖరస్థాపన.. అన్నవరంలో ఘనంగా కార్యక్రమం

  • వేద మంత్రాల నడుమ కలశపూజ.. దాతలు బొట్ట దంపతుల పూజలు

Jagannatha Raoకాకినాడ: అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి ఆలయ ప్రాంగణంలోని యాగ శాలకు కలశ (శిఖర) స్థాపన వైభవంగా జరిగింది. ఆగస్టు 12న యాగశాల ప్రారంభం కాగా.. సరిగ్గా 41 రోజుల తర్వాత దాతలు బొట్ట పర్వతయ్య, శారదాదేవి దంపతులు వేద మంత్రోచ్ఛారణల నడుమ భక్తి శ్రద్ధలతో శిఖర ప్రతిష్ఠ చేశారు. ఆలయ వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన కలశ శిఖర ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈవో జితేంద్ర, అదనపు కమిషనర్ జగన్నాధరావు తదితరులు పాల్గొన్నారు. ఉదయం గణపతి పూజ అనంతరం పుణ్యాహవచనం, కలశశుద్ధి తర్వాత రుత్వికుల వేదమంత్రాల మధ్య ప్రదర్శనగా కలశాన్ని యాగశాల నుంచి తీసుకె ళ్లి ఉదయం 9.38 గంటలకు శిఖరప్రతిష్ఠ నిర్వహించారు. కలశానికి పూదండలు వేసి, అర్చనలు చేసి అనంతరం బూరెలు అర్పించారు. తర్వాత ఆయుష్‌హోమం, లక్ష్మీగణపతి హోమాలు జరిగాయి. సత్యదేవుడు వెలిసిన ప్రదేశంలో ఆలయానికి ఈశాన్య ముఖంగా ఏర్పాటుచేసిన యాగశాలకు పడమర వైపు అన్నవరం సత్యనారాయణ స్వామి ఉత్సవ విగ్రహాలను తూర్పు ముఖంగా ఉండేలా ఏర్పాటుచేస్తారు. ఇలా స్వామి సన్నిధిలోనే యాగాలను నిర్వహించామనే సంతృప్తి ఉండేలా యాగశాల రూపొందింది. షోడశ(16) స్తంభాలతో శిల్పి కర్రి శ్రీనివాస్ నేతృత్వంలో తమిళనాడుకు చెందిన శిల్పులు 6 నెలల పాటు ఈ యాగశాలను తీర్చిదిద్దారు. ఇక్కడ ప్రతి రోజూ ఆయుష్‌యాగాలు నిర్వహిస్తామని, అన్నవరం సత్యదేవుని జన్మనక్షత్రం మఖ నాడు కూడా ఇక్కడ యాగాలు జరుగుతాయని రుత్విక్కులు తెలిపారు. ఆలయ స్థపతి ఇవటూరి శ్రీనివాస్ పర్యవేక్షణలో శిల్పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన శిల్పులు నాపరాతితో కట్టిన ఈ యాగశాల అజరామరంగా ఉంటుందని, స్వామివారి యాగాలను దీనిలో నిర్వహించుకోవడం ద్వారా భక్తులుకు ఎంతో ప్రయోజనం ఉంటుందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. తన హయాంలో యాగశాల నిర్మాణం జరగడం అదృష్టంగా భావిస్తున్నామని కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ఈవో జితేంద్ర అన్నారు. ఇంత మహత్కార్యానికి ముందుకొచ్చిన బొట్ట శారదాదేవి, పర్యతయ్య దంపతులను, వారి కుటుంబసభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఇంకా.. ఆలయ పాలకమండలి సభ్యులు కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు), వైదికకమిటీ సభ్యులు నాగభట్ట కామేశ్వరరావు, ముత్స సత్యనారాయణ, చామర్తి కన్నబాబు, శ్రీశైలం వైదిక కార్యక్రమాల వ్యవస్థాపకులు చాగంటి హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు. 

135 గదులతో శివసదన్
త్వరలో అన్నవరంలో 135 గదులతో శివసదన్ నిర్మించాలని తలపెడుతున్నట్లు ఆలయ ఈవో జితేంద్ర ‘మనం ప్రతినిధి’తో తెలిపారు. ఇందుకు మొత్తం రూ. 16 కోట్ల ఖర్చవుతుందన్నారు. రూ. 15 లక్షల ఇచ్చే దాతలు నెల రోజుల పాటు తాను స్పాన్సర్ చేసిన సూట్‌లో ఉండటానికి అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 50 మంది దాతలు ముందుకొచ్చారని, ఇంకొందరు సహకరిస్తే నిర్మాణాన్ని పూర్తి చేయగలమని తెలిపారు. ఆలయకమిటీ సభ్యులు ఎం.ఎస్.రెడ్డి, మట్టే శ్రీనివాస్‌ల సహకారంతో రెండు కళ్యాణమండపాలను రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్నామని, వీటిలో ఒకేసారి 10-12 జంటలు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. అన్నవరం ప్రసాద తయారీకి ఒకేసారి 225 కిలోల బరువైన వేడివేడి కళాయిని మోసుకుని తీయాల్సి వస్తోందని.. ఈ ఇబ్బందులు తొలగించేందుకు ప్రసాద పోటును యంత్రాల ద్వారా ఆధునీకరించడానికి, దానికయ్యే మొత్తాన్ని ఆలయ కమిటీ మెంబర్ మట్టే ప్రసాద్ ముందుకు వచ్చారని, దీని వల్ల యంత్రాల ద్వారా కళాయిని ఎత్తేందుకు వీలవుతుందని ఆయన వెల్లడించారు.  

నవంబరులో గిరి ప్రదక్షిణ
అన్నవరం దేవస్థానానికి చుట్టూ గిరిప్రదక్షిణకు అవసరమైన రోడ్ల నిర్మాణాన్ని పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ సుమారు రూ.15 లక్షలతో నిర్మించినందున వచ్చే నెలలో పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తులకు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో తెలిపారు.

Related News