Uttam kumar reddy

ఇందిరాగాంధీతో కేసీఆర్‌కు పోలికా?

Updated By ManamMon, 10/15/2018 - 05:20
 • కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ఉత్తమ్

 • కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, మాజీ నక్సలైట్లు

uttamహైదరాబాద్: ధీరవనిత ఇందిరాగాంధీతో దగుల్బాజీ.. దొంగల ముఠా నాయకుడు  కేసీఆర్‌కు పోలిక లేనేలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శిం చారు. ఆదివారం గాంధీభవన్ లో దాదాపు 200 మందికి పైగా మాజీ నక్సలైట్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, ఇందిరాగాంధీ అంతటి వ్యక్తి తన తండ్రి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ చెప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎవరినైనా పోల్చుకునేటప్పుడు అర్థం  ఉండాలని, ఏకంగా ఇందిరాగాంధీతో పోలుస్తారా ? మీ అయ్య నీచుడు...పొగరుబోతు...అని ఉత్తమ్ మం డిపడ్డారు.  దేశంలో భూసంస్కరణలు తెచ్చిన వ్యక్తి, బ్యాంకులను జాతీయం చేసిన ఉక్కు మహిళ, సామా జిక న్యాయానికి బాటలు వేయడంతో పాటు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహానేత ఇంది రాగాంధీ అని అభివర్ణించారు. ఎన్నికలు ఇంకా 53 రోజులు మాత్రమే ఉన్నాయని, ఈ కొద్దిరోజులు ఎన్ని కల ప్రచారంలోకి దూసుకుపోవాలని మాజీ నక్సల్స్ కు విజ్ఞప్తిచేశారు. గత  ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు మద్దతు ఇచ్చిన మీరు ఈసారి జరగబోయే  ఎన్నికల్లో  ఒక టా ర్గెట్ పెట్టుకుని పోరాడాలని,  త్యాగాలకు సిద్ధమై కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మిలిటెంట్ల సంక్షేమాన్ని చూసుకుంటుందని భరోసా ఇచ్చారు.

మిషన్ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణాల్లో 6 శాతం కమిషన్లు తీసుకున్నారా ? లేదా చెప్పాలని అపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్ సవాల్ చేశారు.  రాష్ట్రంలో 2 వేల మంది మాజీ మిలిటెంట్లు ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని మాజీ నక్సలైట్లు వట్టి వెంకటరెడ్డి అలియాస్ బారి, వడ్డె ఎల్లన్న అలియాస్ సుధాకర్, మహేందర్ అలియాస్ కుమార్, రాములు, చేవెళ్లకు చెందిన కాంగ్రెస్ నేత భీం భరత్ తదితరులు చెప్పారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని,ఆమె వల్లే రాష్ట్రం వచ్చిందన్నారు. అనంతరం పీఆర్ టీయూ నేత మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేసిన టీచర్లు, హెడ్మాస్టర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఫ్యామిలీ సీట్లపై కాంగ్రెస్ కార్లిటీ

Updated By ManamSat, 10/13/2018 - 17:07
 • ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మినహాయింపు

congress clarity

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఫ్యామిలీ పరి‘వార్’పై పార్టీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే సీటు ఇస్తామని స్పష్టం చేసింది. అయితే ఈ కండిషన్‌ నుంచి టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కోమటిరెడ్డి సోదరులకు మినహాయింపు లభించింది. కాగా కాంగ్రెస్ నేతలు తమతో పాటు తమ వారసులకు టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే అధిష్టానం మాత్రం ఒకరికి మాత్రమే అవకాశం కల్పిస్తామని తెలిపింది.

అలాగే తనకు మహేశ్వరం, తన కొడుకుకు రాజేంద్రనగర్ ఇవ్వాలని సబితా ఇంద్రారెడ్డి,  తన కుమార్తె స్నిగ్ధారెడ్డికి మక్తల్ సీటు కావాలంటున్న డీకే అరుణ.. భార్య పద్మినీరెడ్డికి సీటు కోరిన దామోదర రాజనర్సింహ, తనతో పాటు తన కుమారుడు రఘువీర్‌కు మిర్యాలగూడ సీటు అడుగుతున్న జానారెడ్డి, కొడుకు అనీల్ కుమార్‌కు ముషీరాబాద్ టికెట్ ఇవ్వాలంటున్న అంజన్ కుమార్ యాదవ్ పట్టుబడుతున్నారు.

ఇక ముఖేష్ గౌడ్ కూడా తన వారసుడు విక్రమ్ గౌడ్‌కు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. ఉత్తమ్, పద్మారెడ్డిలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావడంతో ఆ కుటుంబంలో ఇద్దరికి అవకాశం లభించినట్లు తెలుస్తోంది. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు సీటు ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. పొత్తులో చిత్తవుతున్న బీసీ నేతల టికెట్లు

Updated By ManamSat, 10/13/2018 - 03:33
 • సీట్ల సర్దుబాటుతో అభ్యర్థుల్లో గందరగోళం 

 • టికెట్టివ్వకున్నా బరిలో నిలుస్తామని సాంకేతాలు

 • కూటమిలో కుంపటి పెడుతున్న పంపకాలు

uttamహైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎత్తులను చిత్తు చేసేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ మహాకూటమిని ఏర్పాటు చేసింది అధికారం దిశగా అడుగుల వేసేందుకు ప్రయత్నాలు సాగిస్తుంది. నెలరోజుల నుంచి టీడీపీ, టీజేఎస్, సీపిఐ పార్టీలతో జతకట్టి సీట్ల పంపకంలో పార్టీల పెద్దలతో చర్చలు జరుపుతోంది. కానీ ఇప్పటివరకు సీట్లసర్దుబాటు ఏటూ తేలలేదు. చాలామంది గత నాలుగేళ్ల నుంచి నియోజకవర్గాలను అంటిపెట్టుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పొత్తుల విషయంలో బీసీ అభ్యర్థ్దులు బలంగా ఉన్న నియోజకవర్గాలు పొత్తుల్లో పెట్టి జారవిడిచేందుకు గుట్టు చప్పడు రాజకీయాలు చేస్తున్నారని బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బీిసీ నాయకులు భువనగిరి నుంచి పోతంశెట్టి వెంకటేశ్వర్లు, అందెల లింగయ్య, అలేరులో బూడిద భిక్షమయ్యగౌడ్, మునుగోడులో నారగోని రవికుమార్,పున్నం కైలాస్‌నేత, మహబూబ్‌నగర్ నుంచి చంద్రశేఖర్, పటాన్‌చెరులో  కార్పొరేటర్ శంకర్‌యాదవ్, రాజేంద్రనగర్ జ్ఞానేశ్వర్‌గౌడ్, ఇబ్రిహీంపట్నం క్యామ మల్లేష్, వేములవాడ మహేష్‌గౌడ్, ఖైరతాబాద్ నుంచి మధుకర్‌యాదవ్,అంబర్‌పేట ఆర్.లక్ష్మన్ యాదవ్, శ్రీకాంత్‌గౌడ్, ముషీరాబాద్‌నుంచి యువనేత అనిల్‌కుమార్‌యాదవ్, సికింద్రాబాద్ నుంచి పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, జనగాం పొన్నాల లక్ష్మయ్య, సిర్పూర్ కాగజ్‌నగర్‌లో గోసుల శ్రీనివాస్, మల్కాజిగిరి సురేష్‌యాదవ్‌లు, మిర్యాలగూడ పగిడి రామలింగయ్య ఈ సారి బరిలో నిలిచేందుకు ఇప్పటికే ప్రచార రథాలు సిద్ధ్దం చేసుకున్నారు. కానీ రోజుకో లిస్టు బయటకు లీకు కావడంతో సీటు దక్కించేందుకు పార్టీ పెద్దలతో ప్రయత్నాలు చేస్తున్నారు. తమ మిత్రపక్షానికి వెళ్లకుండా చూడాలని వేడుకుంటున్నారు. టీడీిపీ, టీజేఎస్ పార్టీలకు చెందిన నాయకులు తమకే సీటు వస్తుందని ప్రచారం చేసుకోవడంతో తమ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాలకు  నలుగురి అభ్యర్థ్దుల పేర్లు స్క్రీనింగ్ కమిటీ ఇచ్చారు. అదే రెడ్డి సామాజిక వర్గం నాయకుడు ఉన్న ఇన్‌చార్జిలుగా నియోజకవర్గాలకు ఒకరిపేరు పంపడంపై మండిపడుతున్నారు. తాజా మాజీ బీసీ ఎమ్మెల్యేలూ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అదే విధంగా టీడీిపీ నుంచి కోదాడ నుంచి బొల్లం మల్లయ్యయాదవ్, నల్లగొండ నుంచి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, ఉప్పల్‌లో వీరేందర్‌గౌడ్, దేవరకద్ర నుంచి ఎర్ర చంద్రశేఖర్, నాగార్జున సాగర్ కడారి అంజ య్య, అలేరు బరిలో బండ్రు శోభరాణి ఆశిస్తున్నారు. కానీ పొత్తుల కారణంగా వీరికి సీట్లుపై కాంగ్రెస్ బలంగా తమకే కావాలనడంతో కొన్నింటిని వదలుకునేందుకు పార్టీ పెద్దలు సిద్ధమైన్నట్లు తెలియడంతో వారంతా ఆందోళనకు గురైతున్నారు. టీజేఎస్ నుంచి ఎల్‌బినగర్‌లో పల్లె వినయ్‌కుమార్, మునుగోడులో లింగస్వామి, అంబర్‌పేట మధుసత్యంగౌడ్,కోదాడ నుంచి విద్యార్థి సంఘం నాయకులు మల్లెబోయిన అంజిబాబు పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. వీరికి పొత్తుల పోరులో త్యాగం చేయకతప్పదని పార్టీ పెద్దలు సూచిస్తుండటంతో తాము ఖచ్చితంగా బరిలో ఉంటామని హెచ్చరిస్తున్నారు. సీపీఐ నుంచి మునుగోడులో బరిలో పార్టీ సీనియర్ నాయకులు నెల్లికంటి అన్ని తానై పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.తానకు ఈసారి టికెట్ ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు.నాలుగు ధపాలు ఇక్కడ నుంచి సీపిఐ విజయం సాధించిందని సారి కూడా గెలుస్తామని పేర్కొంటున్నారు. పొత్తులో కాంగ్రెస్‌కు కేటాయిస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.80 గెలుస్తాం

Updated By ManamSat, 10/13/2018 - 03:04
 • మహాకూటమిదే అధికారం   

 • టీఆర్‌ఎస్‌కు 20 సీట్లే.. 12 బహిరంగ సభలకు సోనియా, రాహుల్ 

 • ఒకట్రెండు రోజుల్లో సీట్ల పంపకం.. మీడియాతో ఉత్తమ్ ఇష్టాగోష్టి 

uttamహైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమి 80 స్థానాల్లో గెలవబోతోందని, టీఆర్‌ఎస్ పార్టీ 20 సీట్లకే పరిమితమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 12 చోట్ల పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పాల్గొంటారని, సోనియాగాంధీ రెండు బహిరంగ సభల్లో పాల్గొంటారని  వెల్లడిం చారు. శుక్రవారం గాంధీభవన్ లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. 119  నియోజకవర్గాలలో పార్టీ పరి స్థితి,మహాకూటమి గెలుపు అవకాశాలపై సమీక్షిం చామని, ఈ సారి టీఆర్‌ఎస్ పరిస్థితి అత్యంత దారుణంగా  ఉండబోతోందన్నారు. మహాకూటమి సీట్లపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుందని చెప్పారు. గెలుపు ప్రాతిపధికగా టికెట్ల కేటాయిం పులు ఉంటాయని వివరించారు. మిత్రపక్షాలతో జరుగుతున్న చర్యలు మంచి వాతావరణంలో జరుగుతున్నాయని ఉత్తమ్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోతుందని తెలిసి చాలా మంది ఆ పార్టీకి చెందిన పెద్దోళ్లు తమతో మాట్లాడుతున్నారని, సరైన సమయంలో అతి త్వరలో  వారిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, వారిని చేర్చుకోవటం ద్వారా ఇప్పటికే పార్టీ టికెట్లను ఆశిస్తున్న వారికి నష్టం జరగదని ఉత్తమ్ భరోసా ఇచ్చారు. గత నాలుగేళ్లుగా తమను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మనుష్యులుగా కూడా చూడలేదని, నిజమైన రజాకార్ల వారసుడని తాము దగ్గరి నుంచి చూశామని, ఇక ఆయనతో కలిసి ఉండలేమని చెబుతున్నారని తెలిపారు.తాము పార్టీ పరంగా, స్వతంత్ర సర్వేల్లో కూడా టీఆర్‌ఎస్ 20 సీట్లకే పరిమితం కాబోతోందని, టీఆర్‌ఎస్ పార్టీ ప్రకస్తున్న సర్వేలన్నీ బోగస్ అని ఉత్తమ్ అభివర్ణించారు. 10 నియోజకవర్గాలను కలుపుకుని ఒక చోట సోనియా, రాహుల్ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం మీద 119 నియోజకవర్గాల ప్రజలకు అనుకూలంగా ఈ సభలు ఉంటాయన్నారు. సెటిలర్లు  ఉన్నప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో తమ ఎన్నికల ప్రచారం ఉంటుందని తెలిపారు. మహాకూటమి ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా ఖరారు కాలేదన్నారు. టికెట్లు కూడా ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. అశావహులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. గెలిచే అవకాశం, సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ టికెట్ల కేటాయింపులు ఉంటాయని స్పష్టతనిచ్చారు. ఒక కుటుంబానికి ఒక్క టికెట్ అనేది హైకమాండ్ పరిశీలనలో ఉన్న విషయం వాస్తవమేనని చెప్పారు. ఈ విషయంలో త్వరలో స్పష్టత ఇస్తామని అధిష్టానం తెలిపిందని చెప్పారు. మహాకూటమి కలిసి ప్రచారం చేస్తుందని, కూటమి పేరు కూడా  మారుతుందని ఉత్తమ్ తెలియజేశారు. టీఆర్‌ఎస్ నేతలు ఆశల పల్లకిలో ఉన్నారని, టీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు.

అమిత్ షా టూర్ ఓ డ్రామా ?
 అమిత్ షా టూర్ ఓ డ్రామాగా  ఉత్తమ్ అభివర్ణించారు. అమిత్ షా , కేసీఆర్ డ్రామాలోభాగంగానే ముందస్తు ఎన్నికలు వచ్చాయని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ వైస్ చైర్మన్, పెద్దనోట్లు, జీఎస్టీకి భేషరతుగా ఎందుకు మద్దతిచ్చారో కేసీఆర్ ప్రజలకు వివరించాల్సి ఉంటుందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.ఆర్టీసీ బతకాలంటే టీఆర్‌ఎస్‌కు గోరి కట్టాలి

Updated By ManamFri, 10/12/2018 - 07:14
 •  -మజ్దూర్ యూనియన్ ఆత్మీయ సభలో ఉత్తమ్

uttamహైదరాబాద్:  అప్పుల్లో ఉన్న టీఆస్‌ఆర్టీసీ బతకాలంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి గోరీ కట్టేందుకు కలసిరావాలని ఆర్టీసీ కార్మికులకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పోరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. గురువారం ఇక్కడ ఆర్టీసీ కళ్యాణమండపంలో తెలంగాణ జాతీయ  మజ్దూర్ యూనియన్ ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో ఉత్తమ్ మాట్లాడారు.ఈ సందర్భంగా కార్మికులకు ఎన్నికల వరాలు కురిపించారు. తెలంగాణ వస్తే ప్రజాస్వామిక తెలంగాణ వస్తుందని అందరం భావించామని, తీరా ఒక దురహంకారి చేతిలో తెలంగాణ బందీ  అయిందని  ఆరోపించారు. కేసీఆర్ రూపంలో నియంత పాలన, దుర్మార్గపు పాలన రాష్ట్రంలో సాగుతోందని ఆరోపించారు. గతంలో ఎన్నడూలేని విధంగా రాక్షసకాండ రాష్ట్రంలో సాగుతోందని, హక్కుల కోసం ప్రశ్నించే వారిని జైళ్లకు పంపే శాడిస్టు పాలన నడుస్తోందని, ధర్నాలు చేసుకునే హక్కును లేకుండా చేస్తోందని, ధర్నా చౌక్ ఎత్తివేశారని మండిపడ్డారు. ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడంలో ఆర్టీసీని మించింది లేదని,  ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆర్టీసీని బతికించుకునే చర్యలు తీసుకోకుండా కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వం అనుసరిస్తోందని,నష్టాలను సాకుగా చూపి సంస్థను మూసివేసే కుట్రలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాల్పడుతోందని ఉత్తమ్ నిప్పులు చెరిగారు. ప్రజల సొమ్ముతో అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్న అపద్ధర్మ సీఎం కేసీఆర్ కుటుంబం ప్రజల సమస్యలను విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల ఆరోగ్యం విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, వారి తల్లిదండ్రులకు సైతం ఇతర ఉద్యోగుల మాదిరిగానే పింఛన్లు పంపిణీ చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇసుక మాఫియా చేతిలో నేరెళ్లలో దళిత, బహుజనులు హింసకు గురయ్యారని,మద్దతు ధర అడిగినందుకు ఖమ్మంలో గిరిజనులకు బేడీలు వేసి జైలుకు పంపారని, కొత్తగూడెంలో గిరిజన మహిళలను వివస్త్రలను చేసి చెట్లకు కట్టేసి కొట్టారని ఉత్తమ్ విమర్శలు గుప్పించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, కార్మికుల హక్కులకై జరిగే పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు.ఈ సభకు మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు హనుమంతు ముదిరాజ్  అధ్యక్షత వహించారు.తేలని పంచాతి

Updated By ManamFri, 10/12/2018 - 01:24
 • కూటమిలో కొనసాగుతున్న ఉత్కంఠ

 • సీట్లపై ఆశావహుల ఎదురుచూపులు

 • పార్టీ బలాబలాలపై కోదండరాం లెక్కలు

kutamiహైదరాబాద్:  టీఆర్‌ఎస్ పాలనకు చరమగీతం పాడాలని ఏకైన లక్ష్యంగా ఏర్పాటైన మహాకూటమిలో సీట్ల సర్దుబాటు పంచాయితీ తేలడం లేదు. కాంగ్రెస్, సీపీఐ, జన సమితి, టీడీపీల టికెట్ల కేటాయింపు తుది దశకు రాకపోవడంతో నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంద. అధికార పార్టీ అన్నంవండి వడ్డిస్తే...ప్రతిపక్షాలకు మాత్రం అన్నం లేదు? కూర లేదు అన్న చందంగా వారి పరిస్థితులు ఉన్నాయి.  ఈ పంపకాల జాప్యంపై కూటమిలోని పార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎక్కడినుంచి పోటీ చేయాలన్న లెక్క లు తేలకపోవడమే తమను ప్రచారానికి దూరం చేస్తుందన్న అనుమానాలున్నాయి. ఇప్పటికే తమకు ఎన్ని సీట్లు కేటాయిస్తరో తేల్చాలంటూ..టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండ రాం మహకూటమి నేతలను గట్టిగానే నిలదీసినట్లు ఉమ్మడి భాగస్వామ్య పక్ష నేతలు చెప్తున్నారు. ఉమ్మడి అభ్యర్థ్ధులను ప్రకటించకపోవడంతోనే కూటమి దూకుడు ఇంకా షురూ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు కనిిపిస్తోంది. అమర వీరుల ఆశయాలు, ఉద్యమ ఆకాంక్షలు, నీళ్లు, నిధులు, నియామకాలలో భాగంగా సీఎంపీ హామీలు నెరవేర్చాలంటే, కూటమిలో అత్యంత సమర్ధుడిగా, క్లీన్ ఇమేజ్ ఉన్న కోదండ రామ్‌ను చైర్మన్‌గా చేసి సీట్లు ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని కూటమిలో మెజారిటీ పార్టీలు భావిస్తున్నాయని సమాచారం వినవస్తోంది. ఇందులో కాంగ్రెస్ మినహ టీజేఎస్, సీపీఐ, టీ.టీడీపీ పార్టీలు కోదండరామ్ పేరును బలంగా పట్టుబడు తున్నాయి. దీనిపై కాంగ్రెస్ కొంత గందరగోళంలో ఉండగా దానిపై నోరు మెదపడం లేదని వినికిడి. 

టీజేఎస్ కూటమిలో చేరకముందు మొదట యాబై సీట్లకు తమ ఆభ్యర్థ్ధులను ప్రకటించాలని భావించింది. అయితే, నియంతృత్వంతో ఉద్య మాలను, ధర్నాలను, అణచివే స్తూ ఉద్యమకారులపై, ప్రభుత్వ తప్పులను నిల దీసిన వారిపై అధి కార పార్టీ తప్పుడు కేసులు బనాయించి జైళ్లో వేస్తుందని ఆరోపి స్తొన్న సంగతి తెలిసిందే. దీంతో ఉద్యమ నేత , గులాబి పార్టీపై ఉద్యమం తీవ్రతరం చేసేందుకు జట్టుకు సిద్ధ్దపడుతూ ముందుకు వచ్చారు. అయితే, తాము కూట మిలో చేరే ముందు తమకు ఖచ్చితంగా 30 సీట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారన్న వార్తలు సైతం వినిపించాయి. కానీ కూటమిలో అతి పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం సింగిల్ డిజిట్‌కే టీజేఎస్‌ను పరిమితం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు సైతం జోరుగా షికారు చేస్తున్నాయి. కానీ, టీజేఎస్ రెండు డిజిట్లకు పైనా పెద్ద సంఖ్యలో ఇవ్వాలని డిమాండ్ తెరపైకి తెచ్చారని, లేదంటే, కూటమికి రాంరాం చేప్తారన్న ఊహగానాలు సైతం కూటమిని వెంటాడుతున్నట్లు సమాచారం. అయితే, ఇదే విషయంపై ఎవరికి ఎన్ని సీట్లు తీసుకోవాలో కోదండ రాం క్లారిటీ ఇచ్చారు. వారి సీట్ల సంఖ్య తేలితే కానీ కూటమి ముందడుగు వేయలేని పరిస్థితి ఉంది. మొత్తం 119 స్థానాల్లో ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్నదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం 98 స్థానాలకు తగ్గకుండా కాంగ్రెస్ పోటీ చేస్తామంటుండగా..టీటీడీపీ 12 స్థానాలు ఇస్తామని, తెలంగాణ జన సమితికి 6, సిపిఐకి 3 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రతిపాదనలు చేస్తున్నదని..ఇక, తాము 98 సీట్లు తీసుకుని మిగతా 21 సీట్లు భాగస్వామ్య పక్షాలకు పంపిణీ చేసేందుకు ప్రతిపాదిస్తున్నట్లు కూటమిలోని కొందరూ నేతలు చెప్తున్న మాట. కానీ కాంగ్రెస్ పప్పులేమీ ఉడికేలా కనబడడం లేదు. కాంగ్రెస్ ప్రతిపాదనను కూటమిలోని పార్టీలన్నీ అంగీక రించడంలేదు. దీంతో తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం అన్ని పార్టీలకు గౌరవం దక్కేలా ఒక ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు. ఆయన చెబుతున్న లెక్కల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 80స్థానాలకు సరిపెట్టుకోవాలంటు న్నారు. తెలంగాణ జన సమితికి 20 స్థానాలు ఇవ్వాలని ప్రతిపాదన చేస్తున్నారు. టీడీపీకి 15 స్థానాలు, సీపీఐకి నాలుగు స్థానాలు ఇస్తే అందరికీ గౌరవం దక్కుతుందని, కూటమి కుదురుతుందని కోదండరాం చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ చెబుతున్నదానికి కోదండరాం అడుగుతున్నదానికి ఏ మాత్రం పొంతన లేకుండా ఉండగా... తెలంగాణ జన సమితికి 20 సీట్లు తగ్గితే కష్టమన్నది కోదండరాం అభిప్రాయంగా కనిపిస్తొంది. కాంగ్రెస్ తామడిగినన్ని సీట్లి వ్వకపోతే ఎట్లా? అనే సందేహం అన్ని పార్టీలను వెంటాడుతోంది.నియంత కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి

Updated By ManamFri, 10/12/2018 - 00:34
 • పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ పిలుపు

 • వీహెచ్ ఇందిరా విజయరథం ప్రారంభం .. 14 వరకు తొలి విడత యాత్ర

uttamహైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను గద్దె దింపేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు కలిసికట్టుగా కృషి చేస్తున్నారని టీపీసీసీ ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. గురువారం గన్ పార్కులో పీసీసీ మాజీ చీఫ్ వి హనుమంతరావు చేపట్టనున్న ఇందిరా విజయరథం ప్రచార కార్యక్రమాన్ని ఉత్తమ్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు ఉత్తమ్‌తో పాటు విహెచ్, ఎఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్ క్రిష్ణన్ తదితరులు అమర వీరుల స్తూపంపై పుష్పగుచ్చాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్  మాట్లాడుతూ,  కేసీఆర్ రాక్షస పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విహెచ్ మాట్లాడుతూ, తన తొలి విడత యాత్ర  ఈ నెల 14 వరకు సాగిస్తున్నట్లు చెప్పారు. గజ్వేల్‌లో మొదలయ్యే యాత్ర మెదక్ పూర్వ జిల్లాలోని  నర్సాపూర్, సిద్ధిపేట,సంగారెడ్డి, పటాన్ చెరువు తదితర పట్టణాల్లో యాత్రను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యమన్నారు.

విజయరథాన్ని చూసి ఆశ్చర్యపోయిన  ఉత్తమ్ తదితరులు...
ఎన్నికల ప్రచారం కోసం విహెచ్ అన్ని హంగులతో రూపొందించుకున్న విజయరథాన్ని చూసి ఉత్తమ్‌తో పాటు పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు. బస్సులో బెడ్ రూం, టాయిలెట్, బాత్ రూంతో సహా 8మంది కూర్చునేందుకు వీలుంది. పైకెక్కి మాట్లాడేందుకు వీలుగా ఆటోమెటిక్ సదుపాయం కల్పించా రు. రెండు టీవీలను అమర్చారు. నాలుగు వైపులా మైక్ సదుపాయం కల్పించారు. 

అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు....
యాత్రకు ఉపయోగిస్తున్న వాహనం అనుమతి లేదని ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి ప్రేమలత, పోలీస్ అధికారులు డి రామారెడ్డి, చింతల సైదిరెడ్డి అడ్డుకున్నారు.ఈ విషయమై విహెచ్‌కు వారికి మధ్య వాగ్వాదం జరిగింది. అనుమతి కోసం ఎన్నికల అధికారులకు దరఖాస్తు చేశామని విహెచ్ చెప్పినప్పటికీ వాహనం ముందుకు సాగేందుకు అనుమతించలేదు. ఉదయం 12 గంటలకు బయలుదేరా ల్సిన వాహనం 1.25 గంటలకు సాగలేదు. ఎట్టకేలకు అనుమతి మంజూరు చేసినట్లు ఎన్నికల అధికారు లు తెలపడంతో పోలీసులు అనుమతించారు. 12.30 గంటలకు యాత్రకు విహెచ్ గజ్వేల్ బయలుదేరారు.ఉత్తమ్‌ కుమార్‌వి పగటి కలలు..

Updated By ManamThu, 10/11/2018 - 13:29
 • అమరావతి నుంచి వచ్చిన స్ర్కిప్ట్‌ను ఉత్తమ్ చదివారు

 • చంద్రబాబు మోచేతి కింద నీళ్లు తాగుతున్నారు

 • నాలుగు సీట్లు గెలవడం కోసం రాజకీయ వ్యభిచారం

Karne Prabhakar slams Uttam kumar reddy

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఎంఎస్ ప్రభాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో వారు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ఉత్తమ్ కుమార్ రెడ్డి అమరావతి నుంచి వచ్చిన స్ర్కిప్ట్‌ను చదివారు. టీడీపీకి కట్టుబానిసలమని ఉత్తమ్ రుజువు చేసుకున్నారు. విభజన హామీల అమలు కోసం టీఆర్ఎస్ ఎప్పటి నుంచో అడుగుతోంది.

హరీశ్ రావు సంధించిన 12 ప్రశ్నలపై ఉత్తమ్ డొంక తిరుగుడు సమాధానం ఇచ్చారు. నదీ జలాల పంపకంపై ఉత్తమ్‌కు కనీస అవగాహన లేదని తేలిపోయింది. సైన్యంలో కెప్టెన్‌గా పనిచేశానని చెప్పుకునే ఆయనకు కనీస పరిజ్ఞానం లేదు. నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు వస్తే పరిష్కరించడానికి అపెక్స్ బాడీ ఉంది. ఆ అపెక్స్ బాడీ ముందు చంద్రబాబు తెలంగాణ నీటి కేటాయింపులకు ససేమిరా అన్నారు. ఉత్తమ్ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబుకు వత్తాసు పలికారు. అన్ని అనుమతులున్న సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డుపడుతున్నారు.

ఉత్తమ్ దాన్ని సమర్థిస్తూ, అవివేకిలా చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారు. హరీశ్ లేఖకు స్పందిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నదని టీఆర్‌ఎస్ నిర్ధారించిందని అడ్డగోలుగా మాట్లాడుతూ పగటి కలలు కంటున్నారు. చంద్రబాబు ఎజెండానే కాంగ్రెస్ ఎజెండా అని ఉత్తమ్ చెప్పకనే చెప్పారు. అపుడు ఆంధ్రా కాంగ్రెస్ నేతల మోచేతి కింద నీళ్లు తాగారు. ఇపుడు చంద్రబాబు మోచేతి కింద నీళ్లు తాగుతున్నారు. 

తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టే కుతంత్రాల కూటమే మహాకూటమి. తెలంగాణ ప్రజల కోసమే ఆ అపవిత్ర కూటమిని ఎండగడుతున్నాం. తెలంగాణ ప్రజలు మహాకూటమికి సరయిన సమాధానం చెబుతారు. ప్రజలకు మహాకూటమి ప్రాతిపదికలు చెప్పాలి. కేవలం నాలుగు సీట్లు గెలవడం కోసం రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. మీ కుట్రలను తెలంగాణ సమాజం ఆమోదించదు. 

హరీశ్ రావు పన్నెండు ప్రశ్నలు ఏమున్నాయో కనీసం చదవకుండానే అమరావతి ఆదేశాలతో ఉత్తమ్ స్పందించారు. ఉత్తమ్ అజ్ఞానానికి చింతిస్తున్నాం. మేము గతంలో పెట్టుకున్న పొత్తులకు సిద్ధాంత ప్రాతిపదిక ఉంది. నల్గొండ జిల్లాలో దామరచర్ల పవర్ ప్లాంట్‌ను కోమటి రెడ్డి, ఉత్తమ్ వ్యతిరేకించడం దారుణం. తెలంగాణకు మేలు చేసే ప్రాజెక్టును వ్యతిరేకించడం సిగ్గు చేటు. కాంగ్రెస్ నేతలు ఎంత వ్యతిరేకించినా దామరచర్ల ప్లాంట్ కట్టి తీరుతాం.’ అని స్పష్టం చేశారు. మా గెలుపు ఖాయం

Updated By ManamThu, 10/11/2018 - 06:37
 • కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిన హరీశ్‌కు థాంక్స్ 

 • హరీష్ లేఖతో సీఎం దద్దమ్మ అని తేలింది..  కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో ఉత్తమ్ కుమార్

 • 100 సీట్లు సాధిస్తామనే టీఆర్‌ఎస్ మీ కల నెరవేరదు.. టీఆర్‌ఎస్ అడ్రస్ లేకుండా చేయడమే లక్ష్యం

 • చంద్రబాబు ఇంట్లో చేపల పులుసు తిన్నప్పుడు ఆయన వ్యతిరేకి అనిపించలేదా?..

 • 2009లో టీడీపీతో టీఆర్‌ఎస్ పొత్తుపెట్టుకున్నప్పుడు ఏమైంది మీ తెలంగాణ వాదం

uttamహైదరాబాద్:  టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, అపద్ధర్మ సీఎం కేసీఆర్ దద్దమ్మ.., దోపిడీదారు.., శరమ్ లేని వ్యక్తి.., అసమర్థుడు...,ద్రోహి..,తెలివితక్కువ వ్యక్తి అనీ టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు తనకు రాసిన లేఖలో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చేశారని అందుకే ఆయనకు థాంక్స్ చెబుతున్నట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. జరుగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తుందని, కానీ, టీఆర్‌ఎస్ పార్టీని తెలంగాణలో నామరూపాల్లేకుండా చేయాలనే లక్ష్యంతోనే ప్రజాస్వామ్య పరిరక్షమ కోసం , తెలంగాణను రక్షించుకునేందుకు సిద్ధాంత సారూప్యత ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు.  ఈ మేరకు బుధవారం కేసీఆర్‌కు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. మంత్రి హరీష్ లేఖకు సమాధానంగా ఈ లేఖ రాస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. హరీష్ లేఖతో  చంద్రబాబుతో పొత్తు వల్ల రేపు ఏర్పడబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అని స్పష్టమైంది..., మీ (కేసీఆర్ ) ఓటమి తప్పదు..,  టీఆర్‌ఎస్‌కు 100 సీట్లు రావని కూడా తేలింది..., కేసీఆర్ కలచెదిరింది..,, ఇక కేసీఆర్ పామ్ హౌస్‌కు పరిమితమయ్యే సమయం ఆసన్నమైంది.., తెలంగాణ ప్రజలకు స్వేచ్చ రాబోతోంది..,అనీ ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు. హరీష్ రావు రాసిన లేఖలో 12 ప్రశ్నలు సంధించారని, వాటిలో ఒక్కటి కూడా తెలంగాణకు పనికొచ్చే ప్రశ్నలేదని, సమాజానికి ఉపయోగపడే ప్రశ్న కూడా లేదనీ, ఆయన రాసిన లేఖలో కేసీఆర్ చేతకానితనం.., అసమర్థత..., పాలనావైఫల్యాలు.., దద్దమ్మ వేషాలను బయటపెట్టాయని హరీష్ విమర్శలను ఉత్తమ్ తిప్పికొట్టారు. రాజకీయాలలో పొత్తులు, కూటములు సహజంగా జరుగుతాయని, అధికారంలో ఉన్న మీరు, ప్రతిపక్షాల ఐక్యతను చూసి భయపడుతున్నారంటే, మీ ఓటమిని ఒప్పుకున్నట్లే... అని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.., కేసీఆర్ ఓటమి కూడా ఖాయమైందని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు జవాబుదారిగా వ్యవహరిస్తుందని, వారికే సమాధానం చెబుతుందని కూడా లేఖలో ఉత్తమ్ ఉటంకించారు. హరీష్ లేఖలో రాసిన అంశాలను చూస్తే తెలంగాణ ఉద్యమంలో ఇంత తెలివి తక్కువగా ఎలా ఉన్నారో?  ఇంత తెలివి తక్కువతో ముఖ్యమంత్రిగా ఎలా పాలించారో ? చూస్తే జాలేస్తుందనీ, మా ప్రజా కూటమి గురించి మీరు పడుతున్న ఆందోళన చూస్తుంటే మీ పాలన పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని, మీ పాలన బాగుంటే...,  ఈ నాలుగున్నరేళ్లలో ప్రజల కోసం పని చేసి ఉంటే.., కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకేందుకు ఆందోళన అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. 

2004 లో కాంగ్రెస్ తో, 2009 లో మహాకూటమి అంటూ టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కాంగ్రెస్ గెలిచిందని ఉత్తమ్ గుర్తు చేశారు. టీడీపీతో పొత్తు సందర్భంగా తెలంగాణ కోసం ఆ పార్టీ లేఖ ఇచ్చిందని చెప్పిన విషయం వాస్తవం కాదా ?  ఆప్పుడు మంచి పార్టీ అయితే, ఇప్పుడు టీడీపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్ అనీ, ఉద్యమం పేరుతో మీ నలుగురు కుటుంబ సభ్యులు తెలంగాణాను దోచుకున్నా..., యువత, విద్యార్థి,సబ్బండ వర్గాల ఉద్యమాన్ని గౌరవించి, అమరవీరుల త్యాగాలకు చలించి సోనియమ్మ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది  ఉత్తమ్ స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రమే తెలంగాణ సమస్యలకు పరిష్కారమని చెప్పిన మీరు.. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 శాతం పర్సంటేజ్ లు కమిషన్ రూపంలో తీసుకుని తెలంగాణ సంపదను దోచుకున్నారని, ఇప్పుడు మూఢ నమ్మకాలతో ముందుగానే పాలన చేతగాక దిగిపోయారని విమర్శించారు.  హరీష్ రావులేఖతోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తేలిపో యిందనీ, ఇక పొత్తులు షరతులా ? షరమ్ లేని పొత్తు లా అంటూ ప్రశ్నిస్తున్నారని,  2009 లో ఆంధ్రా పార్టీ అంటూ టీడీపీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సీపీ ఎం పార్టీలతో పొత్తు పెట్టుకోలేదా ? అధికారంలోకి వచ్చిన తర్వాత సిగ్గులేకుండా రాజకీయ ఫిరాయింపులకు పాల్పడ లేదా? తెలంగాణ వ్యతిరేకులు,ద్రోహులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావులకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు మీకు సిగ్గు షరమ్ గుర్తుకు రాలేదా ? తెలంగాణ వాదులను తరిమికొట్టిన మైనంపల్లి హన్మంతరావు, దానం నాగేందర్, తీగల కృష్ణారెడ్డి తదితరులను పార్టీలో చేర్చుకుని పెట్టపీట వేయడం సిగ్గనిపించలేదా ? తెలంగాణను వ్యతిరేకించిన మజ్లిస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు, తెలంగాణను ఒప్పుకోము.., రాయల తెలంగాణ కావాలని డిమాండ్ చేసిన ఎంఐఎం మా ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పుకున్నప్పుడు మీకు షరమ్ లేదా ? అని ఉత్తమ్ నిలదీశారు. టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తుపై ప్రశ్నించే హక్కు కేసీఆర్‌కు లేదని లేఖలో పేర్కొన్నారు.

కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, రెండు లక్షల కోట్ల అప్పులు, లక్ష కోట్ల అవినీతి, నేరాలలో నంబర్ 1, రాజకీయ ఫిరాయింపులు, రాజ్యాంగ విరుద్ధ పనులతో పాటు ప్రజాస్వామ్య వాదులు, శాంతియుత పోరాట శక్తులను  నిర్భంధించిన విషయాలే మీ పాలన గుర్తుకు తెస్తోందని పేర్కొన్నారు. చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని హరీష్‌రావు అనటం మీ చేతకాని తనానికి నిదర్శనమని, రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్త శుద్ది లేని తనానికి నిదర్శనమని, చంద్రబాబులో ఏమైనా మార్పు వచ్చిందా అని అంటున్నారని, కానీ, చంద్రబాబును చండీయాగానికి ముఖ్య అతిథిగా పిలిపించి సన్మానం చేసినప్పుడు ఆయనలో మార్పు కనబడలేదా? ఏ మార్పు వచ్చిందని అమరావతికి పిలిపించి చేపల పులుసు తిని వచ్చారు? ఏ మార్పు వచ్చిందని పరిటాల రవి కొడుకు పెళ్లికి పోయి టీడీపీ నేతలతో రహస్య  మంతనాలు జరిపారో  ముందుగా ప్రజలకు చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.  మీరు చేస్తే సంసారం..., కాంగ్రెస్ పొత్తుపెట్టుకుంటే ద్రోహం అవుతుందా ?  ఇదెక్కడి న్యాయం ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల విభజన, కరెంట్, పోలవరం, ప్రభుత్వ రంగ సంస్థల విభజం, హైకోర్టు విభజన అంశాలను కూడా హరీష్ తన లేఖలో ప్రస్తావించారని, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని తెలియదా ? మీరు మోడీ భజనలో మునిగితేలుతున్నారు.., ఆయనకు వంగి వంగి సలాములు కొడుతున్నారు.., రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ,నోట్ల రద్దు, జీఎస్టీలాంటి కీలకాంశాలలో బీజేపీ ప్రభుత్వాల కంటే ముందే ఎగబడి మద్దతు ఇచ్చారు కదా ? రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మోడీతో ఎందుకు పనులు చేయించుకోవటం లేదు ? సహారా, సీబీఐ కేసులకు భయపడి మోడీ ముందు మోకరిల్లారా ? మోడీతో ఎందుకు పోరాటాలు చేయటం లేదు ? కేంద్రంపై అవిశ్వాసానికి ఎందుకు మద్దతు ఇవ్వాలేదు ? చర్చకు రాకుండానే ఎందుకు అడ్డుకున్నారు ? ఇవన్నీ మీరు,బీజేపీ కలిసి తెలంగాణకు చేసిన ద్రోహం కాదా  ? అని ప్రశ్నించారు.పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేందుకు చంద్రబాబు 30 లేఖలు రాశారని చెప్పడం మీ చేతకాని తనానికి పరాకాష్ట ..తెలంగాణ ఎగువ రాష్ట్రం.., మనం కడుతుంటే చంద్రబాబు ఎలా  ఆపుతారో చెప్పాలని అడిగారు. 

ఖమ్మంలో ఏడుమండలాలు చంద్రబాబు గుంజుకున్నారని సిగ్గులేకుండా చెబుతున్నారని, తెలంగాణ సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న మీరు ఏడు మండలాలు పోతుంటే పోరాటాలు చేయలేరా ? చేతులు ముడుచుకుని దద్దమ్మలా కూర్చున్నారా? 460మెగావాట్ల సీలేరు ప్రాజెక్టు ఆంధ్రాలో కలుస్తుంటే, లక్షలాది దేవాలయ, అటవీ భూములు ఆంధ్రాలో కలుస్తుంటే కళ్లు మూసుకుని ఫామ్ హౌస్‌లో పండుకున్నారా ?  ఈ అంశాలలో కేంద్రం వద్ద పంచాయతీ పెట్టాలి ? మహారాష్ట్రతో గొప్ప ఒప్పందాలు చేసుకున్నామని గాడిదల మీద ఊరేగి గొప్పలు చెప్పుకున్న మీరు , పక్కనున్న తెలుగు రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోలేరా ?ఇదేనా మీ తెలివి..,దద్దమ్మలా ? సన్యాసులా ? చంద్రబాబు సీఎం, మీరూ ముఖ్యమంత్రి..,  ఒక ముఖ్యమంత్రి గుంజుకున్నారని అంటున్నారంటే మీరు దద్దమ్మ అని ఒప్పుకున్నట్లే కదా అని  ఉత్తమ్ నిలదీశారు.  తన లేఖలో గౌరవనీయులైన అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, నమస్కారములు అని ప్రారంభించి, మీ  ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ బహిరంగ లేఖను ముగించారు.33 మంది అభ్యర్థుల ఖరారు

Updated By ManamThu, 10/11/2018 - 06:37
 • క్యాండిడేట్లను ఫైనల్ చేస్తున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ

 • భక్తచరణ్ దాస్ అధ్యర్యంలో రోజంతా వడపోత.. ప్రచారం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ?

 • ఇద్దరు, ముగ్గురు దరఖాస్తు చేసిన సెగ్మెంట్లపై నేడు మళ్లీ పరిశీలన

telangana-congresహైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో అడుగు ముందుకు పడింది. టీపీసీసీ సమర్పించిన దరఖాస్తులను ఎఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ నేతృత్వంలో బుధవారం వడపోత జరిగింది. ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ డాక్టర్ రామచంద్ర కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.  నగర శివారులోని గోల్కొండ రిసార్టులో ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వడపోత జరిగింది. ముందుగా కాంగ్రెస్ పార్టీకి అందిన దరఖాస్తులను ఎఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్ క్రిష్ణన్ పరిశీలించారు. వాటిలో ఒక్కో దరఖాస్తు అందిన సెగ్మెంట్లను తొలుత స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ తోపాటు సభ్యులు శర్మిష్ట ముఖర్జీ, జ్యోతిమలి సెన్నిమలెకు అందజేశారు.  ఆ తర్వాత రెండు, మూడు దరఖాస్తులు అందిన వాటిని సమర్పిచారు.  ఒక్కొక్కరు 40 సెగ్మెంట్ల చొప్పున ముగ్గురు కలిసి 119 సెగ్మెంట్ల దరఖాస్తులను వేరు చేసి అప్పగించారు. దరఖాస్తుల్లో అభ్యర్థుల సీనియారిటీ, పార్టీ కోసం చేసిన కృషి, ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు తదితర అంశాలను బేరీజు వేసుకున్నారు. పొత్తులకై టీడీపీ, సీపీఐ, టీజేఎస్ అందించిన సీట్ల వివరాలను కూడా తెలుసుకున్నారు.  ఒకే దరఖాస్తు అందిన, వివాదం లేని 32  సెగ్మెంట్లను కమిటీ ఆమోదించినట్లు సమాచారం. ఈ విషయం ఉత్తమ్ దృష్టికి కూడా తీసుకుపోయారు. టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే 105 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నందున కాంగ్రెస్ పార్టీ కూడా ఈ 32 మంది అభ్యర్థులకు సమాచారాన్ని అందించి ప్రచారం చేసుకోవాలని కోరినట్లు సమాచారం.అయితే, టీపీసీసీ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. 

ఖరారైన అభ్యర్థుల వివరాలు... 
టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (హుజూర్‌నగర్ ), సీఎల్పీమాజీ నేత కె జానారెడ్డి (నాగార్జునసాగర్ ), ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క (మధిర), శాసనమండలిలో విపక్ష నాయకుడు మహ్మద్ అలీ షబ్బీర్ (కామారెడ్డి), డీకే అరుణ(గద్వాల), చల్లా వంశీచంద్ రెడ్డి (కల్వకుర్తి), ఎ రేవంత్ రెడ్డి (కొడంగల్),సునీతా లకా్ష్మరెడ్డి (నర్సాపూర్), జి చిన్నారెడ్డి (వనపర్తి), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), డాక్టర్ జే గీతారెడ్డి (జహీరాబాద్), కొండాసురేఖ (పరకాల), కోమటిరెడ్డి వెంకటరెడ్డి(నల్గొండ), శ్రీధర్ బాబు (మంథని), టి జీవన్ రెడ్డి (జగిత్యాల) , ఆరెపల్లి మోహన్ (మానకొండూరు), కెకే మహేందర్ రెడ్డి (సిరిసిల్ల),  దామోదర రాజనరసింహ (ఆంధోల్), మల్లు రవి(జడ్చర్ల), ఒంటేరు ప్రతాప్ రెడ్డి (గజ్వేల్), దొంతి మాధవరెడ్డి(నర్సంపేట), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి ), మర్రి శశిధర్ రెడ్డి (సనత్ నగర్), రేకా కాంతారావు (పినపాక), ప్రతాప్ రెడ్డి (షాద్ నగర్), ఇందిర (స్టేషన్ ఘన్ పూర్), సుదర్శన్ రెడ్డి (బోధన్ ), నాగం జనార్ధనరెడ్డి (నాగర్ కర్నూలు), వంశీకృష్ణ (అచ్చంపేట), ఎస్‌ఎ సంపత్ కుమార్ (అలంపూర్ ),పొన్నాల లక్ష్మయ్య (జనగామ ) ఉన్నారు. మరో 8 సెగ్మెంట్లలో అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం.

Related News