Thailand cave

ఒక గుహ.. వెయ్యి చేయూతలు

Updated By ManamMon, 07/23/2018 - 06:37

ప్రమాదం సంభవించినప్పుడు భయం ఆవహిస్తుంది. కానీ ఆ భయాన్ని తోసిరాజంటూ దాన్ని అధిగమించే అవకాశం కోసం వెదకడమే సిసలైన గుండె ధైర్యం. అదిగో.. ఆ గుండె ధైర్యం వల్లే పదమూడు జీవితాలు పునర్జన్మించాయి. 
ఆ పన్నెండు మంది పిల్లలు సహా, వారి గురువు కూడా తిరిగి పుట్టారు. 
 

image

23 జూన్ 2018, శనివారం.. ఎడతెరపి లేని వర్షం. 
ఆ రోజే పీరాపట్ సోంపియాంగై అనే కుర్రాడికి 17వ పుట్టినరోజు. అతని ముద్దు పేరు ‘నైట్’. యవ్వనంలో అడుగుపెట్టే ముందు ప్రతి యువకునికి ఈ 17వ పుట్టిన రోజు అపురూపమైంది. ‘నైట్’ కుటుంబం కుర్రాడి పుట్టిన రోజు కోసం ప్రత్యేకమైన కేక్‌ను తయారు చేసింది. ఆత్మీయులందరూ రంగురంగుల బహుమతుల్ని తెచ్చారు. ఉదయమే నైట్ ఇంటి నుంచి బయలుదేరాడు. 

అతనొక ఫుట్‌బాల్ క్రీడాకారుడు. స్థానిక ఫుట్‌బాల్ క్లబ్ ‘మూపా’ (వైల్డ్‌బోర్స్)లో నైట్ కూడా సభ్యుడు. ఆ రోజు తన స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాడతను. మిత్రుడి పుట్టిన రోజున ఏదైనా సాహసం చేయాలని అనుకున్నారంతా. ప్రాక్టీస్ పూర్తవగానే నైట్ సహా పన్నెండు మంది పిల్లలు, తమ ఫుట్‌బాల్ కోచ్ ఎక్పోల్ చాంటావోంగ్ (25)తో కలిసి థామ్ లాంగ్ పర్వతప్రాంతంలోని ఒక కొండగుహ దగ్గరికి వెళ్లారు. అంతే..! నైట్ కుటుంబం అతని కోసం రాత్రంతా ఎదురు చూసింది. అతనితో పాటు వెళ్లిన పిల్లలు, కోచ్ కూడా తిరిగి ఇళ్ళకు చేరుకోలేదు. ఆ రోజు నుంచి దాదాపు రెండు వారాలకు పైగా ప్రపంచమంతా ఆ పిల్లల కోసం ఆతృతగా ఎదురు చూసింది.

imageథాయ్‌లాండ్‌లో పన్నెండు మంది పిల్లలు, వారి కోచ్ ప్రమాదవశాత్తు ఒక కొండగుహలో చిక్కుకుపోవడం ప్రపంచంలో అందరి హృదయాల్ని కలచి వేసింది. ప్రమాదాలు జరగని రోజు, జరగని చోటు ఈ భూమ్మీద దాదాపు ఉండనే ఉండదు. కానీ ఈ ప్రమాదం మాత్రం దేశపుటెల్లల్ని చెరిపేసి, ప్రతి ఒక్కరిలోని మాతృత్వాన్ని నిద్రలేపింది. పదమూడు మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడినప్పుడు ప్రపంచమంతా ‘హమ్మయ్య!’ అంటూ ఊపిరి తీసుకుంది. ఇంతటి సంచలనానికి వేదికైన థామ్‌లాంగ్ పర్వతగుహను ఒక స్మృతిచిహ్నంగా అభివృద్ధి చేస్తామని థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రకటించిందంటే, మానవీయ విలువల రీత్యా ఈ సంఘటన ఎంతటి స్పందనకు కేంద్రబిందువుగా మారిందో అర్థం చేసుకోవచ్చు. థామ్‌లాంగ్ కొండగుహలో పిల్లలు చిక్కుకుపోయిన తరువాత వారిని రక్షించడం దాదాపు అసాధ్యమనే మాటలే ఎక్కువగా వినిపించాయి. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన గుండె నిబ్బరపు కథనం ఇది.

ఏం జరిగింది?
‘నైట్’ పుట్టినరోజునాడు పిల్లలంతా కలిసి, ఫుట్‌బాల్ ప్రాక్టీస్ పూర్తయిన తరువాత సైకిళ్ళ మీద, పంటపొలాల వెంట షికారుకెళ్లారు. వారితో పాటు కోచ్ చాంటావోంగ్ కూడా వెళ్లాడు. అలా సైకిళ్ళ మీద వెళుతూ, వెళుతూ కొండప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే మేఘావృతమైన ఆకాశం వర్షించడం మొదలు పెట్టింది. సన్నటి జల్లుల్లో తడుస్తూ అనుకున్న గమ్యానికి చేరాలన్న ఉత్సాహం మరింత బలపడింది. వారి గమ్యం థామ్‌లాంగ్ గుహ. థాయ్‌లాండ్‌లో సాహసికులందరికీ అదొక స్వప్నసీమ. 

తనలోని లోయల రహస్యాల్ని, శిఖరాల సందేశాల్ని ఆకాశానికి వినిపిస్తూ ఎదురుగా మాయ్‌సీ పర్వతం నిటారుగా imageనిలబడి ఉంది. పర్వతప్రాంతంలోని థామ్‌లాంగ్ గుహ దగ్గరికి రాగానే పిల్లలందరిలో కట్టలు తెంచుకున్న ఆనందం. సైకిళ్ళని, ఫుట్‌బాల్ షూలని, వెంట తెచ్చుకున్న అదనపు వస్తువుల్ని గుహ వాకిట్లోనే పడేసి, పొలోమని గుహలోకి ఒకటే పరుగు. గుహ లోపల ఎనిమిది కిలోమీటర్ల వరకు సజావుగా నడిచి వెళ్లిపోయారు. పోతూ పోతూ గుహ గోడల మీద కొత్తగా తమ టీమ్‌లోకి చేర్చుకోవాలనుకున్న ఫుట్‌బాల్ నేస్తాల పేర్లని చెక్కుకుంటూ వెళ్లారు. మసక చీకటి తెరలు జారుతున్నాయి. గుహలో చీకటి నెమ్మదిగా పేరుకుంటోంది. చేతుల్లో టార్చిలైట్లకి పని చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. గుహలో ఎక్కువ సేపు గడపాలని వాళ్ళు అనుకోలేదు, మహా అయితే ఒక్క గంట..! అలా అనుకున్న ఆ ఒక్క గంట.. రెండు వారాల వరకు తన పొడవైన చీకటి చేతుల్ని చాచి, వాళ్ళని కమ్మేసింది. నైట్ ఇంట్లో పుట్టినరోజు కేక్‌ను ఎవరూ ముట్టుకోలేదు. పిల్లవాడి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.

‘వైల్డ్‌బోర్స్’కి ఏమైంది?
థాయ్‌లాండ్, మయన్మార్‌ను వేరుపరుస్తూ పది కిలోమీటర్ల వరకు పరచుకున్న పర్వతశ్రేణి అది. థాయ్‌లాండ్‌లోని నాలుగవ అతిపెద్ద గుహల సముదాయం థామ్‌లాంగ్. విశ్రమించిన ఒక స్త్రీ ఆకారంలో ఉండే ఈ పర్వతశ్రేణి పూర్తి పేరు థామ్‌లాంగ్ కున్‌నామ్ నాంగ్నన్. ఎన్నో థాయ్ జానపద కథలు ఈ ‘విశ్రమించిన మహిళ’ చుట్టూ అల్లుకుని ఉన్నాయి. ఎన్నెన్నో జలధారలు ఈ పర్వతసానువుల మీద మోకరిల్లుతుంటాయి. అందం ఎంత ప్రమాదకరమైందో చెప్పడానికి ఈ థామ్‌లాంగ్ గుహలే ఉదాహరణ. ఎందరెందరో ఇప్పటికే ఈ పర్వత గుహల్లో కనుమరుగయ్యారు, కన్నుమూశారు. ముఖ్యంగా వర్షాకాలం ఈ గుహలు మరింత ప్రమాదకరంగా మారతాయి. వర్షాకాలంలో గుహలో పదహారు అడుగుల మేరకు వరద నీరు ఉప్పొంగుతుంది. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మాత్రమే గుహలోకి వెళ్లడానికి వీలుగా ఉంటుంది. అలాంటిది ఈ పిల్లలు జూన్ నెలలో ‘సరదా’ పడ్డారు. 

‘‘గుహలో నీరు నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంది. ఆ నీరు చాలా మడ్డిగా ఉంది. గుహలో చిమ్మచీకటి అలముకుంది’’ అని స్థానిక గైడ్ జాషువా మోరిస్ చెప్పాడు. గుహలో నీటి చుక్క కనబడనంత వరకే ఎవరి ప్రాణాలకైనా హామీ. ఒక్కసారి వరదపోటు మొదలైందంటే, గజ ఈతగాళ్లకు కూడా ప్రాణాలు నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. ఈ గుహలోకి సాహస యాత్ర చేయాలన్న ఆలోచన చాలా రోజుల నుంచే ఉన్నట్టుంది ఈ పిల్లలకి. వాళ్ళ వాట్సాప్ మెసేజ్‌లలో దీని మీద చర్చ కూడా సాగినట్టు తెలుస్తోంది. పిల్లలు గుహలో చిక్కుకు పోయిన విషయం తెలిసిన వారి కుటుంబాలు గుహముఖం దగ్గరికి చేరుకున్నాయి. అక్కడ వాళ్ళకి తమ పిల్లల సైకిళ్ళు, ఫుట్‌బాల్ షూలు, సంచులు దొరికాయి. తమ కలలపంటల క్షేమం కోసం కళ్ళు కాయలు కాసేలా వాళ్ళు ఎదురు చూడడం ప్రారంభించారు. 

‘ధ్యానమే’ ప్రాణదాత?
గుహలో లోతుకు వెళ్ళే కొద్దీ పిల్లలు ప్రమాదంలో చిక్కుకున్న సంకేతాల్ని పసిగట్టారు. అప్పటికే కొద్దిరోజులుగా కొండమీద కురుస్తున్న వర్షపు నీరంతా ఏదో ఒక మార్గం గుండా కిందికి ప్రవహించాలి. ఆ మార్గమే థామ్‌లాంగ్ గుహ. గుహలో వరదపోటు అంతకంతకూ పెరుగుతోంది. బయటికి వెళ్లిపోతేనే మంచిదని వాళ్ళకి అనిపించింది. తక్షణం బయటికి వెళ్లడానికి ఉద్యుక్తులయ్యారు. కానీ ఆ తొందరలో వాళ్ళు దారితప్పి మరింత లోపలికి వెళ్లిపోయారు. చుట్టూ చీకటి, ఎముకలు కొరికే చలి, ‘కాలం’తో సంబంధం తెగిపోయింది. గుహలోపల ఒక రాతి మీద అందరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఉండిపోయారు. ఆ కౌగిలిలో జీవితేచ్ఛ తప్ప మరో ప్రాణస్పందన లేదు. భయం ఆవరించింది. అయినా బతికి తీరాలన్న పట్టుదల పెరుగుతూనే ఉంది. తాము కూర్చున్న రాయి పక్కన ఉన్న గుహ గోడలో ఐదు మీటర్ల లోతుకు రాళ్ళతోనే చెక్కారు. ఒక అరలా తయారైందది. అందులో దాక్కున్నారు. ఫుట్‌బాల్ కోచ్ ఎక్పోల్ నిజజీవితంలో ఒక బౌద్ధ సన్యాసి కూడా! పిల్లలకు అప్పటికప్పుడు ‘ధ్యానం’ (మెడిటేషన్)లోని మెళకువల్ని నేర్పించాడు. గుహలో ఉన్న కొద్దిపాటి ప్రాణవాయువును పొదుపుగా వాడుకోవడమెలాగో, మానసికంగా ధృఢంగా ఉండడమెలాగో వారికి నేర్పించాడతను. ఆహారం లేదు. గుహ గోడల నుంచి బొట్టుబొట్టుగా కారుతున్న నీటితో దాహం తీర్చుకున్నారు. చేతిలో టార్చిలైట్లు వారికి చీకటి నుంచి రక్షణనిచ్చాయి. గుహగోడల్లో సున్నపురాయి ఎక్కువగా ఉండడం వల్ల ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అవసరమైన గాలి కూడా లభించింది. తీరని కష్టంలో కూడా అనుకూలమైన పరిస్థితుల్ని గుర్తించడమంటే ఇదే. ఎవరైనా కాపాడకపోతారా అన్న ఆశే మినుకుమినుకుమంటోంది!

‘ఎవరైనా ఉన్నారా, కాపాడతారా?’
గుహ లోపల జీవన్మరణ పోరాటం జరుగుతుండగానే, గుహ బయట పిల్లల్ని రక్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ‘థాయ్ నేవీ సీల్స్’ అనే ఉన్నత థాయ్ పోలీసు బృందాలు, ఇతర రక్షక బృందాలు, స్థానిక స్వచ్ఛంద కార్యకర్తలు అవిశ్రాంతంగా పిల్లల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకానొక గుహలోపల పిల్లలు నడచి వెళ్లిన ఆనవాళ్ళు దొరికాయి. కానీ వాళ్ళు సజీవంగా ఉన్నారా, లేరా అన్నది తెలియలేదు. వాతావరణం తన కాఠిన్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. మెలికలు తిరిగిన గుహమార్గం గుండా వెళ్లి పిల్లల ఆచూకీని వెదకడం ప్రాణాలతో చెలగాటమాడడమే. పైగా పొంగుతున్న వరద.. గుహలోపలి వరద ఉధృతి థాయ్ గజ ఈతగాళ్ళకు కూడా పెనుసవాలే! ఏం చేయాలో ఎవరికీ తోచడం లేదు. నీటిని తోడడానికి పైపుల్ని, గుహని తొలిచేందుకు ఉలుల్ని, ఇంకా ఎన్నెన్నో ఉపకరణాల్ని పోగు చేసుకుని ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం శూన్యం! పిల్లల స్నేహితుల్లో ఒకరికి తన స్నేహితులంతా కలిసి గుహలో వెళ్లాలనుకున్న చోటు గురించి మాట్లాడుకోవడం జ్ఞాపకం వచ్చింది. ఆ చోటే, పట్టాయా బీచ్. గుహలోపల ఉన్న ఒక చిన్న ఇసుకమేట. పిల్లలు అక్కడ దొరుకుతారా?

ప్రార్థనల వెల్లువ
గుహలోపల చావును చావుదెబ్బ కొట్టేందుకు అన్ని దారుల అన్వేషణ సాగుతుండగా, గుహ బయట పిల్లల కుటుంబాలు వారి కోసం ప్రతి రోజూ పడిగాపులు కాశాయి. ఫుట్‌బాల్ కోచ్ చాంటావోంగ్ నాయనమ్మ తుమ్ కాంటావోంగ్ ప్రతిరోజూ గుహ ముంగిట కొవ్వొత్తులు వెలిగించి, పండ్లని, ఫలహారాల్నీ ఉంచి, చేతులు జోడించి ప్రార్థించేది. ‘‘పిల్లల్ని ప్రాణాలతో మాకు అప్పగించాలని నేను ఈ గుహను పాలిస్తున్న దైవశక్తుల్ని ప్రార్థిస్తున్నా’’ అంటూ ఆమె కన్నీటితో చెప్పింది. క్రమంగా ఆ పిల్లలు చదువుతున్న పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు గుహ ముందు గుమికూడి, సామూహిక ప్రార్థనలు చేయడం మొదలైంది. పిల్లల బంధువులకు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారికి స్థానికులు విరాళాలు పోగు చేసి, అన్నపానీయాల్ని అందించడం ప్రారంభించారు. 

అంతర్జాతీయ సాయం
image28 జూన్,
గురువారం నాడు థాయ్‌లాండ్ గుహలో చిక్కిన పిల్లల్ని రక్షించేందుకు గుహ ముందు అంతర్జాతీయ సాయం అడుగు పెట్టింది. అమెరికా, బెల్జియం, స్కాండినేవియా, చైనా, ఆస్ట్రేలియాలకు చెందిన వైమానిక, సైనిక నిపుణులు పిల్లల్ని కాపాడే బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. జూలై ఒకటో తేదీన.. అంటే, పిల్లలు తప్పిపోయిన వారం రోజులకు వాళ్ళని కాపాడే పనిలో ఒక ముందడుగు పడింది. గుహలోపల ఒక అతిపెద్ద బొరియలోకి రక్షక నిపుణులు ప్రవేశించగలిగారు. ఇద్దరు బ్రిటిష్ డైవర్లు జాన్ వొలాంథెన్, రిక్ స్టాంటన్‌లు వరదకు ఎదురొడ్డి గుహలోకి ప్రయాణించారు. సహాయక బృందాలకు మార్గదర్శకంగా నిలిచి, ఎట్టకేలకు పట్టాయా బీచ్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా చీకటిగానే ఉంది. కానీ గాలి చొరబడే ప్రాంతమది. ఎక్కడ అలాంటి అవకాశం కనిపించినా వాళ్ళిద్దరూ అక్కడి గాలిని వాసన చూసే వాళ్ళు. పిల్లల ఆచూకీని కనిపెట్టేందుకు అదొక మార్గం. పిల్లల కోసం అరిచే వాళ్ళు. అలా కొన్ని వందల మీటర్ల దూరం ముందుకు వెళ్లాక, వాళ్ళ ప్రయత్నం ఫలించింది. పిల్లల ఉనికిని కనిపెట్టారు. కానీ అప్పటికే వారి టార్చిలైట్లు మొరాయించడం మొదలెట్టాయి. పిల్లల్ని లెక్కించారు.. కోచ్ సహా పదమూడు మంది! వాళ్ళిద్దరూ పిల్లలతో కాసేపు గడిపారు. వాళ్ళకి ధైర్యం చెప్పారు. తమతో తెచ్చుకున్న లైట్లని వారికి ఇచ్చేశారు. తిరిగి మళ్ళీ వస్తామని, ఆహారాన్ని తెస్తామని మాట ఇచ్చారు. పిల్లలతో తాము గడిపిన క్షణాల్ని కెమెరాల్లో బంధించారు. 

ఫలించిన ‘డాక్టర్’ వ్యూహం
పిల్లల్ని విజయవంతంగా కాపాడడంలో ఆస్ట్రేలియన్ డాక్టర్ రిచర్డ్ హారిస్ చేసిన సూచన ప్రధాన పాత్ర పోషించింది.image పిల్లల ఉనికిని గుర్తించిన తరువాత పంపుల సహాయంతో నీటిని తోడడం మొదలుపెట్టారు. అయినప్పటికీ పిల్లల్ని బయటికి తీసుకురావాలంటే, వాళ్ళని నీటి మధ్య నుంచే తేవలసి ఉంటుంది. అందుకే మొదటి 1.7 కిలోమీటర్ల దూరం వరకు పిల్లల్ని గజ ఈతగాళ్ళే మోసుకు రావలసి ఉంటుంది. తరువాత ఒకటిన్నర కిలోమీటర్ల దూరాన్ని పిల్లల్ని కర్రల మీద మోసుకు రావచ్చునన్న పథకం సిద్ధమైంది. ఈలోగా థాయ్ సైన్యం పిల్లల్ని రక్షించేందుకు అవసరమైన వెట్‌సూట్లు, ఫుల్‌ఫేస్ స్క్యూబా మాస్క్‌లు, అండర్ వాటర్ లైట్లు తదితర వస్తువుల్ని సిద్ధం చేశారు. వీటిలో ఫుల్‌ఫేస్ స్క్యూబా మాస్కుల్ని అమర్చడం క్లిష్టతరమైన పని. ఎందుకంటే అవి చిన్నపిల్లలకు సరిపోయేవి కావు. అలాంటివి థాయ్‌లాండ్‌లో ఉండవు కూడా! గుహలో చిక్కుకున్న పిల్లల్లో అత్యంత పిన్నవయస్కుడైన చానిన్ విబూన్‌రంగ్యుయోంగ్‌కి పదకొండేళ్ళు.

 ఈ పిల్లవాడిని రక్షించడమే కష్టం. నిజానికి థాయ్ అధికారులు వర్షాలు తగ్గేంతవరకు పిల్లల్ని గుహలో ఉంచడం తప్ప మరో మార్గం లేదని భావించారు. కానీ చాలా మంది నిపుణులు ఈ ఆలోచనను తిరస్కరించారు. అప్పటి దాకా గుహలో ఆక్సిజన్ పరిమాణం ప్రాణాల్ని నిలబెట్టుకునేందుకు చాలదు. అంతేగాక జూలై 7న గుహలో పెద్దయెత్తున వరద తాకిడి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు తరువాత పిల్లల్ని రక్షించడం అన్న మాటే ఉండదు. ఇంత ప్రమాదంలోనూ పిల్లలు పిల్లలే! వాళ్ళకి ఈ సమస్యలేమీ తెలియవు. ‘‘నేను డైవింగ్ చేయబోతున్నాను..’’ అంటూ ఉత్సాహంగా కేకలు పెట్టారు. పిల్లలకు ఈ లోగా మానసిక ఆందోళనను తగ్గించే మందుల్ని సరఫరా చేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఆస్ట్రేలియన్ డాక్టర్ రిచర్డ్ హారిస్ బలహీనంగా ఉన్న పిల్లల్ని మొదట తరలించాలని సూచించారు. ఎవర్ని ముందుగా తరలించాలో సూచిస్తూ కోచ్ ఎక్పోల్ ఒక జాబితా తయారు చేశారు. ముందుగా చానిన్ విబూన్‌రంగ్యుయోంగ్‌తో పాటు, మరో పిల్లవాణ్ణి తరలించారు. సహాయక చర్యల్లో ప్రధాన భూమిక నిర్వహించిన డానిష్ గజ ఈతగాడు క్లాస్ రాస్మూస్సేన్, థాయ్ గజ ఈతగాడు రూన్‌గ్రెట్ చాంగ్ వాన్యూన్‌లు పట్టాయా బీచ్‌కి చేరుకుని, మరో గజ ఈతగాని సహాయంతో పిల్లల్ని తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఆదివారం మధాహ్నం 2.30 గంటలకు ఒక గజ ఈతగాడు మొదటగా ఇద్దరు పిల్లల్ని పట్టాయా బీచ్‌కు చేర్చాడు. అక్కడి నుంచి ఏటవాలుగా, బురద మట్టితో కూడిన దారి వెంట కర్రల మీద వారిని గుహముఖ భాగానికి చేర్చే పని సవాలుగా మారింది. అయినా విజయం సాధించారు. సోమవారం అర్ధరాత్రికి పిల్లలందర్నీ విజయవంతంగా గుహ నుంచి బయటకు తీసుకు వచ్చారు. పిల్లలందర్నీ ఇలా బయటకు తెచ్చారో, లేదో.. గుహలో నీటి ప్రవాహ ఉధృతి కళ్ళముందే పెరిగి పోయింది. గుహ మొత్తం నీటిమయమై పోయింది. దీనికి దైవ సంబంధమైన కారణాన్ని ఎవరూ చెప్పక పోయినప్పటికీ, అందరి మనసులు ‘ధన్యవాదాల’తో నిండిపోయాయి. 

బలిదానం
imageఇంతటి అపాయకరమైన సందర్భంలో అందరి మనసుల్ని తేలిక పరుస్తూ, పిల్లలు సురక్షితంగా బయటికి వచ్చారు. కానీ వారిని రక్షించడం కోసం ఒకరు తన ప్రాణాల్ని బలిపెట్టక తప్పలేదు. ఆ వ్యక్తి థాయ్ మాజీ నేవీ సీల్ సార్జంట్ మేజర్ సమన్ గునన్ ఈ సహాయక చర్యల్లో ప్రాణాలు కోల్పోయి, విషాదాన్ని మిగిల్చారు. ముప్ఫై ఎనిమిదేళ్ళ గునన్ సైన్యం నుంచి పదవీ విరమణ చేసినప్పటికీ, పిల్లల్ని కాపాడేందుకు స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గుహలో తగినంత మోతాదులో ఆక్సిజన్‌ను నింపడానికి ఎయిర్ ట్యాంకుల్ని చేరవేస్తూ, పరుగెత్తి, పరుగెత్తి, శ్వాస అందక ఆయన కన్నుమూయడం అందరినీ కలచి వేసింది. గునన్ భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం సత్తాబ్ జిల్లాలోని సైనిక శిబిరానికి తరలించారు. అక్కడ ఆయనకు గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా థాయ్‌లాండ్ రాజు ఆదేశించారు.
 
పిల్లల్ని గుహ నుంచి నేరుగా
స్థానిక ఆసుపత్రికి తరలించి, వైద్యసహాయాన్ని అందించారు. వారిలో కొంతమందికి ఘనimage ఆహారాన్ని ఇవ్వకుండా, ద్రవాహారాన్నే ఇచ్చారు. కొందరు మాత్రం మొదటిరోజే బ్రెడ్, చాక్లెట్‌లు తిన్నారు. గుహలో చిక్కుకున్న పన్నెండు మంది పిల్లలు, వారి కోచ్‌ను సురక్షితంగా బయటకు తెచ్చే ఈ ఆపరేషన్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యిమందికి పైగా పాల్గొన్నారు. రష్యాలో జరుగుతున్న వరల్డ్‌కప్ ఫైనల్‌లో పాల్గొనాల్సిందిగా ‘ది వరల్డ్ సోకర్ ఫెడరేషన్’ పిల్లల్ని ఆహ్వానించింది. కానీ పిల్లలు ఇంకా తేరుకోలేదు. అందుకే ఈ వరల్డ్ కప్ ఫైనల్‌కి వాళ్ళని పంపడం లేదు. థాయ్ గుహలో జరిగిన ఈ సంఘటన ఆధారంగా హాలీవుడ్ చిత్రాన్ని నిర్మించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పిల్లలందరూ ‘థాయ్ కేవ్‌బాయ్స్’గా ప్రసిద్ధులయ్యారు!మానసిక దృఢత్వమే కాపాడింది

Updated By ManamThu, 07/12/2018 - 00:17

దాదాపు మృత్యుముఖంలోకి వెళ్లి ప్రాణాలపై ఆశ వదులుకున్న 12 మంది విద్యార్థులు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. థాయిలాండ్‌లోని ఒక గుహ లో చిక్కుకుపోయిన 12 మంది విద్యార్థులు, వారి కోచ్ దాదాపు 17 రోజులపాటు ఉండిపోయారు. గత నెల 23 న థాయిలాండ్‌లోని థామ్ లుయాంగ్ నాంగ్ గుహను సందర్శిచేందుకు కోచ్‌తో కలిసి వెళ్లారు. వారు గుహలోకి వెళ్లిన తరువాత వరదల కారణంగా తిరిగి బయటకు రాలేకపోయారు.

image


వారిని బయటకు తెచ్చేందుకు థాయ్ నావికాదళం అత్యంత సాహసికంగా వ్యవహరించింది. దశలవారీగా వారిని మూడు రోజుల్లో (8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు) తీవ్రంగా శ్రమించి బయటకు తీసుకొచ్చారు. వారికి ఆహారపదార్థాలు, అత్యవసర మందుల తో పాటు నిపుణులతో కలిసి లోపలికి వెళ్లిన థాయి సైనికులు సమన్వయంతో చేసిన కృషి ఎట్టకేలకు ఫలిం చింది. లోపల చిక్కుకుపోయిన ిపిల్లల కోసం ఆక్సిజెన్ సిలిండర్లను నడుంలోతు నీళ్లలో మోసుకెళ్లి వారికి అమర్చి మొదట నలుగురిని, తరువాత మరో నలుగురిని, చివరిరోజు (మంగళవారం) కోచ్ సహా ఐదుగురిని వెంటబెట్టుకుని తీసుకొచ్చారు. గుహ లో బందీలుగా ఉన్న వారికి ధైర్యవచనాలు చె బుతూ ముందు కొంతమంది సైనికులు దారితీయగా, వెనక మరికొంతమంది రక్షణ వలయంగా నిలిచి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.

ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశవేుమిటంటే దాదాపు 17 రో జుల పాటు పిల్లలు అంత ధైర్యంగా ఎలా ఉండగలిగారా అని! శారీరక ఆరోగ్యం కం టే వారి మానసిక ధైర్యానికి ప్రపంచవాసులంతా అభినందనలు తెలుపవలసిందే. ఈ కథ సుఖాంతం కావడానికి తొమ్మిది రోజుల ముందు బ్రిటన్‌కు చెందిన డైవర్లు జాన్ వోలన్‌థెన్, రిచర్డ్ స్టాంటన్ అత్యంత సాహసంగా గుహలో చిక్కుకుపోయిన పిల్లల యోగక్షేమాలను బయటి ప్రపంచానికి తెలియజేశారు. పొంచివున్న ప్రాణభయానికి లొంగిపోకుండా అన్నిరోజులు తట్టుకునే మానసిక ధైర్యం ఆ బాలలకు ఏ విధంగా వచ్చింది? అటువంటి భయం కర పరిస్థితుల ప్రభావం మానసిక ధైర్యంతో పాటు శారీరక ధైర్యం వారికి ఎక్కడి నుంచి వచ్చింది? 

గుహలో చిక్కుకు పోయిన వెంటనే పరిస్థితిని గమనించిన బాలురు తమకెదురైన ప్రాణభయాన్ని తెలుసుకున్నారు. వారిలో మానసిక పరిస్థితులపై చూపుతున్న ప్ర భావంతో పాటు వారి వెుదడుపై తీవ్ర ప్రభావం చూపిం దని వారు తెలిపారు. మానసికంగా తాము కుంగిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయని గ్రహించారు. చిక్కుకుపోయిన ప్రారంభ దినాల్లో తమ మెదడు స్తంభించే పరిస్థితు లు ఏర్పడుతున్నాయని గమనించారు. రానురాను జ్ఞాపకశక్తి కూడా తగ్గడం మొదైలెంది. గుండెదడ రెట్టింపైంది. అదే సమయంలో గుహ లోపలి వారికి ఎప్పుైడెతే ఆహారం, నీరు అందజేయబడిందో వారందరికీ బతుకుపై ఆశ చిగురించింది. అప్పటి నుంచి వారిలో ఆందోళన తగ్గి తా ము సురక్షితంగా బయటపడగలమనే ధైర్యం కలిగింది.

వారికి సరఫరా చేసిన ఆహారం, నీళ్లు తగ్గిపోవడం మొదైలెందో సహాయక చర్యలకు మరింత సమయం పడుతుందని బయటి ప్రపంచానికి స్పష్టైమెంది. మానవ శరీర మనుగడకు కొన్ని అత్యవసర అవసరాలు అవసరమని ప్రతి ఒక్కరికీ తెలుసు. తగిన ఆహారం, నీరు, వేడి అవసరమవుతుంది. మెదడు పనిచేయడానికి సున్నితమై న వాతావరణ పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుందని చాలామంది మరిచిపోతుంటారు. డీహైడ్రేషన్, ఆకలి, ని ద్రలేమితో అలసటతో ఒత్తిడిల కారణంగా మానవ మెద డు యథావిధిగా పనిచేయదు. ఈ పరిస్థితుల్లో సాధారణంగా ప్రజలు తీసుకునే తేలికపాటి నిర్ణయాలు సహజంగా ప్రమాదకరంగా ఉంటాయి. 

ఈ పరిస్థితుల్లో తాము డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా థాయి క్రీడాకారులు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. వాస్తవంగా వారిని లోపల ఎక్కడ ఉన్నారో గుర్తించే సమయానికి ఆకలితో నకనకలాడుతున్నారు. ఆహారం కోసం ఎదురుచూస్తూ వారు బలహీనంగా కనిపించారు. దీంతో ఆ పిల్లలు, వారి కోచ్ శారీరకంతో పాటు మానసికంగా కూ డా దృఢంగానే ఉన్నారని భావించారు. గుహలో కళ్లుపొడుకుచుకున్నా కనిపించని చీకట్లో వారు మానసికంగా ఎం తో దృఢంగా ఉన్నారని స్పష్టైమెన తరువాత మరింత ఉత్సాహంతో సహాయచర్యలు వేగవంతం చేశారు. 

కొన్ని విపరీత పరిస్థితుల్లో ప్రజలకు మానసికంగా తులనాత్మకత తరిగి, తమైపె తమకు న మ్మ కం సడలి, చివరకు ప్రాణాలు కోల్పో యే అవకాశాలున్నాయి. దీన్నే మానసిక మరణం అంటా రు. మొదట్లో ఎంతో పా జిటివ్ ధోరణితో త మను రక్షించే చర్యల కోసం ఈ క్రీడాకారుల ఎదురుచూశారు. ఇటువంటి పరిస్థితుల్లో పాజిటి వ్ ధోరణి ఇత ర సహాయక చ ర్యల కంటే అధికంగా ప్రభావం చూపుతుంది. ఇ దెంతో కీలకభూమిక పోషిస్తుంది. తాము త ప్పక బయటపడగలమనే ఆశాభావం వారిలో ఉండడం అత్యంతావశ్యకం. నిరాశావాద  ధోర ణి, ఆలోచనలు ఉత్సాహాన్ని హరించి నిస్సహాయతను ప్రేరేపిస్తుంది. గుహలో చిక్కుకుపోయిన మొద ట వారు ఎంతో ఉత్సాహంగా, ఒకరిపై మరొకరు జోక్ చేసుకుంటూ ఎంతో హుషారుగా కనిపించారు. 
పరిస్థితులకు సామాజిక మద్దతు లభిస్తే బాధితుల్లో మానసిక దృఢత్వం పెంపొందిస్తుంది. ఇలాంటి మద్దతు ఒక స్నేహితుడి ద్వారా కావచ్చు, కుటుంబ సభ్యుల నుం చి రావచ్చు. ఇలాంటి మద్దతు వారికెంతో సంతృప్తికరైమెన ధోరణిని పెంచుతుంది. తామున్న ప్రమాదకర స్థితిని గమనించి థాయి ఫుట్‌బాల్ క్రీడాకారులు ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడం ఫుటేజ్‌లో కనిపించింది. 

తుట్టతుదకు తీవ్ర శ్రమకోర్చిన తరువాత బయటపడిన థాయి క్రీడాకారుల్లో ఉత్తమైమెన స్ఫూర్తి కనిపించిం ది. వారిలో కనిపించిన పాజిటివ్ ధోరణిని గమనించిన తరువాత వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందు కు రెండు మార్గాలు కనిపించాయి. మొదటిది వారికి ఈ దేందుకుపయోగించే పరికరాలతో ఈత నేర్చుకోమని చెప్పడం, రెండోది... వర్షాకాలం ముగిసేవరకు వాళ్లను గుహలో ఉంచేందుకు ప్రయత్నించడం! రెండో పద్ధతి ము గియాలంటే నాలుగైదు నెలల కాలం పడుతుంది. మొద టి పద్ధతే శ్రేయస్కరమని థాయి సైనికులు భావించారు. ఇరుకైన దారిలో డైవర్లు, సబ్‌మైరెన్లు, పడవలు దీర్ఘకాలం నడవగలవు. 2010లో సముద్రంలో చిక్కుకుపోయిన 33 మంది చిలియన్ వైునర్లు దాదాపు 69 రోజుల పాటు నీళ్లలోనే గడిపిన విషయం విదితమే. 

ప్రస్తుతం గుహలో చిక్కుకుపోయిన 12 మంది క్రీడాకారులు, వారి కోచ్ బయటపడిన తరువాత వారు యథాతథ జీవనాన్ని కొనసాగించేలా చూడడం మరో ముఖ్య మైన అంశం. వారు ఎదుర్కొన్న తీవ్ర ప రిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యం లో బాధితులు మానసికం గా దృఢంగా తయారవడానికి మరికొంతకా లం పట్టే అవకాశమున్నదని భా విస్తున్నారు. సహజంగా ఒక భయం కర అనుభ వం ఎదు రైన తరువాత మానసింగా కోలుకోవాలంటే కొంతకాలం పడుతుందని ప్రజలు భావిస్తుంటారు. ఎప్పుడో 2010లో జరిగిన చిలియన్ చిన్నారుల వి షయంలో ఇప్పటికీ ఉద్యోగ నిర్వహణలో వారు సక్రమంగా నెరవేర్చలేకపోతున్నారని వార్తలు వస్తున్నాయి. అదృష్టవశాత్తు థాయి క్రీడాకారులు మానసికంగా దృఢంగానే ఉన్నారని, త్వరలోనే వారు వారివారి కార్యక్రమాలను యథాతథంగా నిర్వర్తించగలరని వైద్యులు చెప్పడం సంతోషకరైమెన అంశం.

- సరితా రాబిన్‌సన్
సైకాలజీ సీనియర్ లెక్చరర్, సెంట్రల్ లాంకైషెర్ యూనివర్సిటీ
(‘కన్జర్వేషన్’ సౌజన్యం)మరో నలుగురు విద్యార్థులు!

Updated By ManamMon, 07/09/2018 - 21:27
  • థాయిలాండ్ గుహ నుంచి వెలికితీత

  • మొత్తం 8 ఎనిమిది మంది బాహ్య ప్రపంచంలోకి..

imageబ్యాంకాక్: థాయిలాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న 13 మందిని బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా సాగుతోంది. సోమవారం మరో నలుగురు విద్యార్థులను సహాయకబృందం బయటకు తీసుకువచ్చింది. దాంతో దాంతో గుహ నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. సోమవారం వాతావరణం అనుకూలించడంతొ నలుగురు విద్యార్థులను వెలికి తీసుకురాగలిగామని అధికారులు తెలిపారు.

ఆదివారంనాటి రెస్క్యూ ఆపరేషన్‌లో నలుగురు విద్యార్థులను బయటకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 12 గంటలపాటు శ్రమించి నలుగురు విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. గుహ నుంచి బయటకు వచ్చిన వీరిని సైనిక హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ చేపట్టిన ఆపరేషన్‌లో నలుగురు పిల్లల్ని గుహ నుంచి బయటకు తీసుకురాగలిగారు.

గుహ నుంచి బయటకు తీసుకొచ్చిన నలుగురు చిన్నారుల్ని అధికారులు వెంటనే హెలికాప్టర్‌లో చియాంగ్ రాయ్ ప్రచనుక్రోహ్ ఆస్పత్రికి తరలించారు.  దక్షిణ థాయ్‌లాండ్‌లోని ఓ స్కూల్‌కు చెందిన వైల్డ్ బోర్స్ అనే సాకర్ జట్టు కోచ్‌తో పాటు 12 మంది విద్యార్థులు తామ్ లువాంగ్ గుహను జూన్ 23న సందర్శించారు. వీరు గుహలోకి వెళ్లగానే భారీ వర్షాలతో వరద పోటెత్తి ప్రవేశమార్గం మూసుకుపోయిన విషయం తెలిసిందే.గుహ నుంచి ఆరుగురు చిన్నారులు బయటకు..

Updated By ManamSun, 07/08/2018 - 20:02

Thailand cave, soccer coachథాయిలాండ్(మే సాయి): థాయిలాండ్‌లోని తామ్‌ లువాంగ్‌ గుహలో చిక్కుకుపోయిన 12 మంది బాలురులో ఆరుగురిని తాజాగా సహాయక బృందాలు రక్షించాయి. వీరితో పాటు వారి ఫుట్‌బాల్ కోచ్‌ కూడా ఉన్నారు. రెండువారాలకు పైగా గుహలో చిక్కుకుపోయిన వీరంతా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో దాదాపు 4కిలోమీటర్లు ప్రయాణించి ఎట్టకేలకు బయటపడ్డారు. ఆదివారం వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలను వేగవంతం చేసినట్టు థాయ్ అధికారులు వెల్లడించారు. ‘‘గుహలో చిక్కుకుపోయిన వారిలో ఆరుగురు సురక్షితంగా బయటకు వచ్చినట్టు నాకు సమాచారం అందింది. ప్రస్తుతం వారికి వైద్యసేవలు అందించేందుకు గుహవద్ద ఏర్పాటు చేసిన ఫీల్డ్‌ హాస్పటల్‌కు తరలించాము’’ అని చియాంగ్‌ రే ‌రెస్క్యూ టీంలో సీనియర్ సభ్యులు ఒకరు మీడియాకు తెలిపారు.

మిగతా ఆరుగురి కోసం గాలింపు.. 
Thailand cave, soccer coachమిగిలిన ఆరుగురు బాలురి ఆచూకీ తెలుసుకునేందుకు 13 విదేశీ గజఈతగాళ్లు, ఐదుగురు సభ్యులు గల ఎలైట్ నేవీ ఎస్ఈఏఎల్ యూనిట్ రంగంలోకి దిగి భారీ ఆపరేషన్ చేపట్టింది. మరోవైపు గుహలో వరదనీటి ఉద్ధృతి పెరిగిపోవడంతో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోతాయనే ఆందోళనతో మిగతావారిని రక్షించేందుకు కొండలను సహాయక బృందాలు తొలుస్తున్నాయి. గుహ పైభాగాన వందచోట్ల రంధ్రాలు చేశారు. కొండ పైభాగం నుంచి 600 మీటర్ల కింద వారంతా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. 13 వైద్య బృందాలను గుహ వెలుపల సిద్ధంగా ఉంచి బాధిత బాలురికి వైద్య సహాయం అందించేలా చర్యలు చేపట్టారు. అక్కడి నుంచి రక్షించిన బాలురుని హెలిప్యాడ్ సమీపంలో హెలికాఫ్టర్ల సాయంతో చియాంగ్ రాయ్ ప్రాచానుకోరహ్ ఆస్పత్రికి తరలించారు. 

Related News