tirumala

అష్ట బంధనం

Updated By ManamTue, 08/14/2018 - 07:20
 • మహా సంప్రోక్షణంలో మూడోరోజు కార్యక్రమం

 • అష్టదిక్కుల్లో సంధిబంధనం చేసిన రుత్వికులు

 • తగ్గిన వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం 

 • రోజుకు రూ. 3 కోట్ల నుంచి.. కోటి లోపే!

tirumalaతిరుపతి: కలియుగ వైకుంఠం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణంలో మూడో రోజు సోమవారం అష్టబంధన కార్యక్రమం జరిగింది. రుత్వికులు శాస్త్రోక్తంగా అష్టబంధన కార్యక్రమాలు నిర్వహించారు. గర్భాలయంలో మూలమూర్తి (ధ్రువమూర్తి) పటిష్ఠత కోసం విగ్రహం చుట్టూ కదలికలు లేకుండా దృఢంగా ఉండేందుకు ఎనిమిది వైపుల సంధిబంధనం చేయడాన్ని అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం అంటారు. వైఖానస ఆచార్యుల అధ్వర్యంలో సంప్రదాయ శిల్పాచార్యుల సహకారంతో అష్టబంధన ద్రవ్యాలను సేకరించి, ఆయాద్రవ్యాలకు సంబంధించిన దేవతలను ఆరాధించిన తరువాత అష్టబంధనం తయారుచేస్తారు. సోమవారం రుత్వికులు శాస్త్రోక్తంగా అష్టబంధన ద్రవ్యాలను సేకరించి, ఉదయం 6.00 గంటల నుంచి 12 గంటల వరకు, రాత్రి ఏడు నుంచి పది వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం శ్రీ వేంకటేశ్వరుని మూలమూర్తితో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకు అష్టబంధనాన్ని సమర్పిస్తారు. అష్టబంధనం గురించి భృగుమహర్షి  రచించిన భృగుప్రకీర్ణాధికారం గ్రంధంలో చెప్పిన విధంగా చేపట్టారు. భృగు మహర్షి అష్టబంధనం గురించి తెలియజేస్తూ ‘‘శంఖచూర్ణం, మధూచ్చిష్టం, లాక్షా త్రిఫలమేవచ, కాసీసం గుగ్గులుం చైవ చూర్ణం రక్త శిలాకృతమ్, మాహిషం నవనీతం చేత్యష్టబన్ధ ఇతి స్మృతః’’ అని అన్నారని అర్చకులు తెలిపారు. ఎనిమిది రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారు చేస్తారు. వాటిలో శంఖచూర్ణం 25.5 తులాలు, మధుజ (తేనె మైనం) 3.5 తులాలు, లాక్షా (లక్క) 3.75 తులాలు, గుగ్గులు (వృక్షపు బంక) 9 తులాలు, కార్పాసం (ఎర్రపత్తి) ఒక తులం, త్రిఫలం (ఎండిన ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ) 7.5 తులాలు, రక్తశిలాచూర్ణము (గైరికము) 7.5 తులాలు, మాహిషా నవనీతము (గేదె వెన్న) 15 తులాలు ఉంటాయి. వీటికి ఔషధ గుణాలు కూడా ఉన్నట్లు తెలిపారు. శంఖ చూర్ణంతో చంద్రుడిని, తేనె మైనంతో రోహిణీ, లక్కతో అగ్ని, గుగ్గులుతో చండ, ఎర్రపత్తితో వాయువును,  త్రిఫల చూర్ణంతో హరిని, గైరికముతో స్కందుడిని, గేదె వెన్నతో యముడిని ఆరాధిస్తారు. ముందుగా ద్రవ్యాలను శుభ్రపరిచి ఆచార్యుల సమక్షంలో సంప్రదాయ శిల్పులు రోటిలో వేసి, 30 నిముషాలు దంచుతారు. దంచగా వచ్చిన పాకాన్ని ముద్దగా చేసుకుని, గంటకు ఒకసారి చొప్పున ఎనిమిది సార్లు, అవసరమైనంత వెన్న కలుపుకుంటూ దంచుతారు. ఈ పాకాన్ని ముద్దలుగా తయారు చేసి, ఈ అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామి వారి పాదాల కింద అష్టదిక్కుల్లోను సమర్పిస్తారు. ఈ కార్యక్రమం సోమవారం పూర్తయింది. 

తగ్గిన శ్రీవారి హుండీ ఆదాయం
శ్రీవారి ఆలయంలో జరుగుతున్న ఆరు రోజుల మహాసంప్రోక్షణం కారణంగా శ్రీవారి హుండీ ఆదాయం బాగా తగ్గిపోయింది.  స్వామి వారి హుండీ ఆదాయం ఇన్నాళ్లూ సగటున రోజుకు మూడు కోట్ల రూపాయలు ఉండగా, ఆదివారం హుండీ ఆదాయం ఒక్కసారిగా 73 లక్షలకు పడిపోయింది. సోమవారం కోటి రూపాయలకు చేరుకున్నా, మంగళ బుధవారాల్లో  భక్తుల సంఖ్యను పూర్తిగా తగ్గించనున్నారు. దీంతో ఈ రెండురోజుల ఆదాయం మరింత తగ్గిపోయే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గత మూడు రోజులుగా  భక్తుల సంఖ్య కూడా విపరీతంగా తగ్గిపోయింది. ఎక్కువ మంది భక్తులకు దర్శించకునేందుకు అవకాశం ఇచ్చినా, అంత మంది భక్తులు తిరుమలకు రావడానికి సంకోచిస్తున్నారు. దీనికి కారణం గతంలో టీటీడీ అధికారులు చేపట్టిన అతి ప్రచారమేనని తెలుస్తోంది. సోమవారం నాటికి భక్తుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయి, అరగంటలో శ్రీవారి దర్శనం కల్పించేలా జరుగుతోంది.మహాసంప్రోక్షణ ఆరంభం

Updated By ManamMon, 08/13/2018 - 04:58
 • 12 ఏళ్ల విరామం తర్వాత కార్యక్రమం.. 300 గ్రాముల బంగారంతో కూర్చ

 • దర్భల కూర్చకు బదులు బంగారం.. బంగారు కలశంతో పాటు ప్రతిష్ఠాపన

 • కలశంలోకి దేవతామూర్తుల ఆవాహన.. రోజూ 6 గంటల నుంచి హోమాలు

 • ఈ నెల 16 వరకు కార్యక్రమాలు

imageతిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 16వ తేదీన మహాసంప్రోక్షణతో ఇవి ముగియను న్నాయి. ఉదయం ఒక హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహ వచనం, పంచగవ్యారాధన, వాస్తు హోమం, రక్షాబంధనం చేపట్టారు. శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణలో వినియోగించే బంగారు కూర్చను టీటీడీ సిద్ధం చేసింది. 300 గ్రాముల బంగారంతో దీన్ని తయారుచేశారు. సాధారణంగా వైదిక కార్యక్రమాల్లో అర్చకులు దర్భలతో చేసిన కూర్చలను వినియోగిస్తారు. కూర్చలోకి మంత్రావాహన చేసి వైదిక క్రతువులకు దాన్ని ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ మాత్రం బంగారు కూర్చను వాడుతుండటం విశేషం. శ్రీవారి మూలమూర్తిని ఆవాహన చేసిన బంగారు కలశంతో పాటు ఈ బంగారు కూర్చను యాగశాలలో ప్రతిష్ఠిస్తామని తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు.

కళాకర్షణ
రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని మూలవర్లతోపాటు ఉప ఆలయాల్లోని imageదేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం) లోకి ఆవాహన చేశారు. శ్రీవారి మూలమూర్తికి తల, నుదురు, ముక్కు, నోరు, గొంతు, రెండు భుజాలు, హృదయం, నాభి, కటి, మోకాలు, పాదాల్లో 12 జీవస్థానాలు ఉంటాయి. ఒక్కో జీవస్థానానికి 4 కళల చొప్పున మొత్తం 48 కళలు ఉంటాయి. ఈ 48 కళలను కుంభంలోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతో పాటు శ్రీ భోగశ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు, శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీ చక్రత్తాళ్వార్, శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారు, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు. ఉప ఆలయాల్లోని జయవిజయులు, ధ్వజస్తంభం, శ్రీ విష్వక్సేనుడు, శ్రీగరుడాళ్వార్, ప్రసాదం పోటులోని అమ్మవారు, లడ్డూపోటులోని అమ్మవారు, శ్రీ భాష్యకారులు, శ్రీ యోగ నరసింహస్వామి, శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారి శక్తిని కూడా కుంభంలోకి ఆవాహనచేసి యాగశాలకు తీసుకెళతారు. మొత్తం 18 వేదికలపై కుంభాలను కొలువుదీరుస్తారు. యాగశాలలో ప్రతిరోజూ నిత్య కైంకర్యాలతో పాటు ఉదయం 6 గంటల నుంచి హోమాలు నిర్వహిస్తారు.మహాసంప్రోక్షణకు అంకురార్పణ

Updated By ManamSat, 08/11/2018 - 11:41

Tirumalaతిరుమల: పన్నేండేళ్లకోసారి నిర్వహించే బాలాలాయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమానికి శనివారం సాయంత్రం టీటీడీ అధికారులు అంకురార్పణ చేయనున్నారు. ఇక ఆదివారం నుంచి ఈ నెల 16వరకు బాలాలాయ మహాసంప్రోక్షణ జరిపించనున్నారు. ఈ నేపథ్యంలో సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు అన్నీ ఆగమోక్తంగా నిర్వహిస్తారు.

మరోవైపు మహాసంప్రోక్షణ కార్యక్రమం నేపథ్యంలో శ్రీవారి ప్రత్యేక దర్శనాలు, వీఐపీ దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. నేటి నుంచి పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మొత్తం 14గంటల్లో సుమారు 50వేల మంది దర్శనం చేసుకుంటారని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ నెల 17 నుంచి శ్రీవారి సేవలు యథావిధిగా మొదలౌతాయని పేర్కొన్నారు.తిరుమల వెంకన్న సమాచారం

Updated By ManamFri, 08/10/2018 - 08:39

ttd

తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకన్న కొలువైన తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు 5 కంపార్ట్‌మెంట్లలో వేచి చూస్తున్నారు. సర్వదర్శనం, నడకదారి, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు ఉదయం 9 గంటలు నుంచి టైంస్లాట్ కింద టోకెన్లను జారీ చేయనున్నట్లు  టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. తిరుమలేశ్వరుడి ఉచిత దర్శనానికి 12 గంటలు, టైంస్లాట్, సర్వ, దివ్య దర్శనాలకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేశారు. కాగా గురువారం ఒక్కరోజే శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.26 కోట్ల ఆదాయం లభించింది.

ఇదిలా ఉంటే.. నేటి అర్థరాత్రి నుంచి శ్రీవారి టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం నేపథ్యంలో టోకెన్లను నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. రేపు మహాసంప్రోక్షణకు అంకురార్పణ జరుగనుంది. మహాసంప్రక్షణ సమయంలో భక్తులకు పరిమితి సంఖ్యలో మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుంది.

కాగా.. తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి 45 మంది ఉద్ధండ పండితులంతా ఇప్పుడిప్పుడే తిరుమలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే యాగశాలలో ఇటుకలు, ఎర్రమట్టితో 28 హోమగుండాలు నిర్మించి, వాటిని గోమయంతో అలికారు. 21 హోమ వేదికలు ఏర్పాటు అయ్యాయి. ఇక్కడి కరెంటు తీగలు, బల్బులు, సీసీ కెమెరాలను తొలగించి, వెలుతురు కోసం 1000 నెయ్యి దీపాలను ఏర్పాటు చేశారు.తిరుమల శ్రీవారి సమాచారం

Updated By ManamThu, 08/09/2018 - 08:35

TTD

తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. సర్వదర్శనం కోసం 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. సర్వ, నడకదారి, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు ఉదయం 9 గంటల నుంచి టైంస్లాట్ కింద టోకెన్ల జారీ చేస్తామని టీటీడీ ఓ ప్రకనటలో తెలిపింది. కాగా.. స్వామి వారి ఉచిత దర్శనానికి 12 గంటలు, టైంస్లాట్, సర్వ, దివ్య దర్శనాలకు 3 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మాత్రం కేవలం రెండు గంటల సమయం మాత్రమే పడుతోంది. కాగా.. బుధవారం ఒక్కరోజు శ్రీవారి హుండీ ద్వారా రూ.2.87కోట్లు.
 
ఇదిలా ఉంటే.. గురువారం అర్థరాత్రి నుంచి శ్రీవారి టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనున్నట్లు తెలిపింది. కాగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం నేపథ్యంలో టోకెన్లను నిలిపివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 11న మహాసంప్రోక్షణకు అంకురార్పణ జరుగనుంది. కాగా మహాసంప్రోక్షణ విషయమై అప్పట్లో పెద్ద గొడవ జరగడంతో చివరికి వెనక్కి తగ్గిన టీటీడీ పరిమితి సంఖ్యలో భక్తులను దర్శానికి అనుమతిస్తారు.తిరుమల శ్రీవారి సమాచారం

Updated By ManamThu, 08/02/2018 - 09:05

Lord Tirumala Venkanna Devotees Info

తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న ఉచిత దర్శనానికి 20 గంటలు, సర్వ, నడకదారి, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల్లోపు దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టనుంది. 

ఇదిలా ఉంటే.. బుధవారం ఒక్కరోజే 65,546 మంది భక్తులు దర్శించుకోగా.. 22,363 మంది తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.21కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. కాగా ఇవాళ సాయంత్రం నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.శ్రీవారికి రెండు ఉత్సవాలు

Updated By ManamWed, 08/01/2018 - 02:15
 • సెప్టెంబరులో సాలకట్ల బ్రహ్మోత్సవాలు

imageతిరుపతి: తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్  మంగళవారం ముఖ్య అధికారులతో సమావేశమై సమీక్షించారు. సెప్టెంబరు 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మో త్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేప ట్టడానికి చర్యలు తీసుకున్నారు. సమావేశంలో జిల్లా కలెక్టరు పీఎస్ ప్రద్యుమ్న,  ఎస్‌పి అభిషేక్ మహంతితో పాటు ఆర్టీసీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకునేలా చర్చించారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని, బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టనున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో ఎలాంటి రాజీకి తావు లేకుండా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు.  ఈసారి గరుడ సేవను సాయంత్రం ఏడు గంటలకే ప్రారంభిస్తామని, రాత్రి 12 గంటలకు ముగిసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్ల కోసం రూ. 4.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల కోసం దాదాపు 7 లక్షల లడ్డూలను సిద్ధం చేయిస్తున్నామన్నారు. అదనంగా 510 మరుగు దొడ్లు ఏర్పాటు చేస్తామని, 700 మంది పారిశుధ్య కార్మికులను నియమిస్తున్నామని తెలిపారు. గరుడసేవ రోజున తిరుమలకు ద్విచక్రవాహనాల అనుమతి రద్దు చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్టీసీ 165 కొత్త బస్సులను ఏర్పాటు చేస్తుందని, గరుడ సేవ రోజున 6500 ట్రిప్పులు తిరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  24 గంటల పాటు వైద్య సేవలను అందుబాటులో ఉంచుతున్నామని, 12 అంబులెన్సులను తిరుమలలో ఉంచుతున్నట్లు తెలిపారు. అన్నప్రసాదాలు, తాగునీరు,  పాలు, మజ్జిగ లాంటివి అందజేయడానికి మూడువేల మంది శ్రీవారి సేవకులతో పాటు, 1300 మంది స్కౌట్స్ సిబ్బందిని ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. వాహన సేవలలో పది రాష్ట్రాలకు చెందిన కళాకారులు  ప్రదర్శనలు ఇస్తున్నారన్నారు. 

బ్రేక్ దర్శనాలు రద్దు 
గరుడసేవ రోజున బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.  వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులకు కల్పించే ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నామని తెలిపారు. తిరుమల మాడవీధుల్లోను, ఇతర ప్రాంతాల్లోను ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జేఈఓలు కెఎస్.శ్రీనివాసరాజు, పోల భాస్కర్, ఆర్టీసీ ఆర్‌ఎం చెంగల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 చంద్రగ్రహణంతో ఆలయాల మూత

Updated By ManamFri, 07/27/2018 - 23:52
 • తిరుమలలో వెండివాకిలి మూసివేత

 • అన్ని ఆలయాల్లోనూ పూజల నిలిపివేత

 • తెల్లవారుజామున శుద్ధి.. పుణ్యాహవచనం

 • రాత్రి నుంచి తెల్లవారేవరకు గ్రహణప్రభావం

(తిరుపతి / విశాఖపట్నం / కర్నూలు): ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు ఏర్పడిన చంద్రగ్రహణం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాలు మూసేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన భూలోక వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయాన్ని శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మూసేశారు. చంద్రగ్రహణం రాత్రి 11.54 గంటలకు ప్రారంభం కావడంతో సాయంత్రం 5 గంటలకే మూసేశారు. చంద్రగ్రహణం శనివారం ఉదయం 3.49 గంటలకు ముగిసింది.
image
దీంతో.. తెల్లవారుజామున ఆలయం ద్వారాలు తెరిచి, సంప్రదాయాల ప్రకారం శుద్ధి, పుణ్యాహవచనం చేసి తెల్లవారుజామున 4.15 గంటలకు సుప్రభాత సేవతో భక్తులకు ప్రవేశం కల్పిస్తారు. ఆలయ ద్వారాలను మూసే కార్యక్రమంలో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఇన్‌చార్జి సీవీఎస్‌ఓ శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాధ్‌లతో పాటు, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయాన్ని మధ్యాహ్నం 3 గంటలకే మూసేశారు. కాణిపాకంలోని వరసిద్ధి వినాయక ఆలయం కూడా  సాయంత్రం 4 గంటలకు మూసేశారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర ఆలయం, తిరుపతిలోని కోదండ రామస్వామి ఆలయం, అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వర ఆలయాలను సాయంత్రం 4 గంటలకు మూసేయగా, శనివారం ఉదయం 5 గంటలకు తలుపులు తెరిచి, శుద్ధి కార్యక్రమాలు చేసి ఉదయం 8 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. 

విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పలు ముఖ్య ఆలయాలు, వాడవాడల్లో ఉన్న గుళ్లు కూడా గ్రహణం సందర్భంగా మూతపడ్డాయి. శుక్రవారం రాత్రి 11.52 నుంచి 1.50గంటల వరకూ గ్రహణం పట్టు కొనసాగింది. సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని మధ్యాహ్నం 2గంటలకు మూసేశారు. ఇసుకకొండ సత్యనారాయణస్వామి, కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం, సంపత్ వినాయక ఆలయం, కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయంతో పాటు సీతమ్మధారలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, షిర్డిసాయి ఆలయాలు మూతపడ్డాయి. గ్రహణం విడుపు కాలం శనివారం తెల్లవారు 3.48-3.56 నిమిషాల మధ్య ఉండటంతో తెల్లవారుజామున 5 గంటలకు ఆలయాలు తెరిచి సంప్రోక్షణ నిర్వహిస్తారు.  

శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం ద్వారాలను చంద్ర గ్రహణం కారణంగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు మూసేశారు. గ్రహణానంతరం శనివారం తెల్లవారుజామున 4.30 నిమిషాలకు ఆలయ ద్వారాలు తెరిచి శుద్ధి, సంప్రోక్షణ, స్వామి అమ్మవార్ల ప్రాతః కాల పూజలు జరిపించి, ఉదయం 7 గంటల నుంచి స్వామి అమ్మవార్ల దర్శనాలు, అర్జిత అభిషేకాలు, 7.30 నుంచి కుంకుమార్చనలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. గ్రహణం ఉండటంతో అన్ని శాశ్వత సేవలు నిలిపివేసి, ఉప ఆలయాలు, సాక్షి గణపతి, హఠకేశ్వరం, పాల ధార - పంచధార, శిఖ రేశ్వరం ద్వారాలు కుడా మధ్యాహ్నం 2 గంటలకు మూసేశారు.  

దుర్గమ్మ దర్శనం నిలిపివేత
చంద్రగ్రహణం సందర్భంగా విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం మధ్యా హ్నం 3 గంటలimage వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి ఆలయ అధికారులు అనుమతిచ్చారు. అనంతరం దర్శనాన్ని నిలిపి వేసి ఆలయ తలుపులు మూసివేసారు. శనివారం ఉదయం 10 గంటలకు భక్తులకు దుర్గమ్మ దర్శనం ఉంటుందని ఆలయ ఈవో ఎం.పద్మ తెలిపారు. గ్రహణం సందర్భంగా శుక్రవారం సాయంత్రం జరగాల్సిన త్రికాలర్చన, పంచహారతులు, దర్బారు సేవా, పల్లకీ సేవలతో పాటు శనివారం ఉదయం ఖడ్గమాల పూజ, త్రికాలర్చన, నవగ్రహ హోమం, రుద్రహోమం, చండీ హోమం, శాంతికల్యాణం, శ్రీ చక్రార్చన, లక్షకుంకు మార్చన సేవలు ఉండవని అధికారులు తెలిపారు.ఇవాళ శ్రీవారి ఆలయం మూసివేత

Updated By ManamFri, 07/27/2018 - 08:53

Tirumalaతిరుమల: చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం సాయంత్రం 5గంటల నుంచి తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. శనివారం ఉదయం 4.15 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహావచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 7.00 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. కాగా శుక్రవారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలతోపాటు పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. కాగా ఇవాళ గ్రహణం కారణంగా గురువారం సాయంత్రం నుంచే భక్తులను క్యూలైన్లలోకి అనుమతించడం లేదు. వెంకన్న దర్శనానికి తొమ్మిది రోజులు బ్రేక్

Updated By ManamSat, 07/14/2018 - 12:22

tirumala తిరుమల: కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి తొమ్మిది రోజుల బ్రేక్ పడనుంది. 12 సంవత్సరాల తరువాత చేయబోతున్న మహాసంప్రోక్షణ సందర్భంగా ఆగష్టు 9 నుంచి 17 వరకు తిరుమలలో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ పాలకమండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే సాధారణ సంప్రోక్షణలో కేవలం ఆలయం, ఆ పరిసరాలు మాత్రమే శుభ్రం చేయనుండా.. మహాసంప్రోక్షణలో గర్భాలయాన్ని కూడా శుభ్రం చేస్తారు. నూతన అష్టబంధన ద్రవ్యాన్ని తెప్పించి స్వామి కొలువైన పీఠం చుట్టూ వేసి.. దానికి బలపరుస్తారు. అయితే గతంలో మహాసంప్రోక్షణ సమయంలో దర్శనానికి అనుమతి ఇస్తుండగా.. ఈ సారి భక్తుల రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related News