puri aakaash

'మెహ‌బూబా' రివ్యూ

Updated By ManamFri, 05/11/2018 - 13:39

mehboobaచిత్రం: మెహ‌బూబా
న‌టీన‌టులు: ఆకాశ్‌ పూరి, నేహా శెట్టి, షాయాజీ షిండే, మురళి శర్మ, అశ్వని, జ్యోతి రానా, టార్జాన్‌, షేక్‌ జునైద్‌, షయల్‌ ఖాన్‌, సురభి, రూప తదితరులు
సంగీతం: సందీప్‌ చౌతా, 
క‌ళ‌: జానీ షేక్‌
ఛాయాగ్ర‌హ‌ణం: విష్ణు శర్మ
కూర్పు: జునైద్‌ సిద్ధికీ
పాటలు: భాస్కరభట్ల
సమర్పణ: శ్రీమతి లావణ్య
నిర్మాణం: పూరి కనెక్ట్స్‌
ర‌చ‌న - దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
విడుద‌ల తేది: 11 మే 2018
నిడివి: 152 నిమిషాలు

 
పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ ప్రేమ‌క‌థా చిత్రాలు తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. 'మూగ‌ మ‌న‌సులు', 'జాన‌కి రాముడు', 'మ‌గ‌ధీర‌', 'మ‌నం' త‌దిత‌ర‌ చిత్రాలు ఈ నేప‌థ్యంలోనే రూపొంది.. తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసాయి. ఇదే జోన‌ర్‌లో తెర‌కెక్కిన మ‌రో ప్రేమ‌క‌థా చిత్రం 'మెహ‌బూబా'. త‌న త‌న‌యుడు ఆకాశ్ పూరిని క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ రూపొందించిన ఈ చిత్రం శుక్ర‌వారం తెర‌పైకి వ‌చ్చింది. ఈ సినిమాపై 'మనం' అందిస్తున్న స‌మీక్ష మీ కోసం..

క‌థాంశం
mehboobaహైద‌రాబాద్ అబ్బాయి రోష‌న్ (ఆకాశ్ పూరి), లాహోర్ (పాకిస్తాన్‌) అమ్మాయి ఆఫ్రీన్ (నేహా శెట్టి)కి చిన్న‌ప్ప‌ట్నుంచి త‌మ గ‌త జ‌న్మ తాలుకూ ఘ‌ట‌న‌లు క‌ల‌ల రూపంలో వెంటాడుతుంటాయి. అవి.. వాళ్ళు పెద్ద‌య్యాక కూడా కొన‌సాగుతుంటాయి. ఇదిలా ఉంటే.. ఓవైపు ఇంజ‌నీరింగ్ చ‌దివిన రోష‌న్ ఆర్మీలో చేర‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. మ‌రో వైపు.. పై చ‌దువుల కోసం ఆఫ్రీన్ హైద‌రాబాద్‌కు వ‌స్తుంది. త‌రుచుగా ఈ ఇద్ద‌రూ ఒకే చోట తిరుగున్న‌ప్ప‌టికీ.. ఎదురు ప‌డ‌ని సంద‌ర్భాలే ఉంటుంటాయి. ఓ సంద‌ర్భంలో.. ఆఫ్రీన్‌ను ఆక‌తాయిల నుంచి కాపాడుతాడు రోష‌న్‌. అయితే.. అక్క‌డా ఒక‌రినొక‌రు చూసుకోలేని ప‌రిస్థితే. తండ్రి ఆరోగ్యం బాగాలేద‌ని, ఓ సారి పాకిస్తాన్ వ‌చ్చి వెళ్ళ‌మ‌ని.. ఇంటి నుంచి ఫోన్ కాల్ రావ‌డంతో.. తిరుగు ప్ర‌యాణ‌మ‌వుతుంది ఆఫ్రీన్‌. అదే స‌మ‌యంలో ట్రెక్కింగ్ కోసం స్నేహ‌బృందంతో క‌లిసి హిమాల‌యాల‌కి వెళ్తున్న రోష‌న్‌కు రైల్‌లో ప‌రిచ‌య‌మ‌వుతుంది ఆఫ్రీన్‌. రౌడీమూక నుండి కాపాడినందుకు రోష‌న్‌కు థ్యాంక్స్ చెప్పి.. పాకిస్తాన్‌కు వెళ్ళిపోతుంది ఆఫ్రీన్‌. ఇక హిమాల‌యాల‌కు వ‌చ్చిన రోష‌న్‌కు.. అక్క‌డ ఆఫ్రీన్ పోలిక‌ల‌తో ఉన్న మధీర శ‌వం క‌నిపిస్తుంది. ఆమె చేతిలో ఉన్న‌ డైరీలో.. సైనికుడు గెట‌ప్‌లో ఉన్న త‌న ఫొటో చూసి షాక‌వుతాడు రోష‌న్‌. డైరీని బ‌ట్టి, వ‌చ్చే క‌ల‌ల‌ని బ‌ట్టి త‌మ బంధం జన్మ‌జ‌న్మ‌ల‌ద‌ని అర్థం చేసుకుంటాడు. ఈ నేప‌థ్యంలో.. హైద‌రాబాద్ రాక‌ముందే పెళ్ళి నిశ్చ‌యిమైపోయిన ఆఫ్రీన్‌ను రోష‌న్ త‌న సొంతం చేసుకున్నాడా? గ‌త జ‌న్మ‌లో వీరి ప్రేమ ఎందుకు ఫ‌లించ‌లేదు?  వంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ చిత్రం.

విశ్లేష‌ణ‌
పునర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో పూరీ జ‌గ‌న్నాథ్ రూపొందించిన తొలి చిత్ర‌మిది. రెండు జ‌న్మ‌ల్లోనూ ప్ర‌ధాన పాత్ర‌ల‌కు ఇండియా, పాకిస్తాన్ దేశాల‌తో ముడిపెట్ట‌డం అనే ఆలోచ‌న బాగుంది. గ‌త జ‌న్మ‌లో క‌బీర్ అనే పాకిస్తాన్ సైనికుడిగానూ.. ఈ జ‌న్మ‌లో సైనికుడు కావాల‌నే ఆశ‌యంతో ఉండి.. ఎట్ట‌కేల‌కు కెప్టెన్‌గా రిక్రూట్ అయ్యే భార‌తీయ సైనికుడు రోష‌న్‌గానూ ఆకాశ్‌ క‌నిపిస్తాడు. అలాగే గ‌త జ‌న్మ‌లో భార‌తీయ అమ్మాయి మ‌ధీర‌గానూ, ఈ జ‌న్మ‌లో పాకిస్తాన్ అమ్మాయి ఆఫ్రీన్‌గానూ నేహా క‌నిపిస్తుంది. అలాగే రెండు జ‌న్మ‌ల‌కు కూడా స‌రిహ‌ద్దులను, దేశాల మ‌ధ్య ఉండే వైరాన్ని ప్రేమ‌కు అవ‌రోధాలుగా చూపించ‌డం బావుంది. 1971 ఇండో - పాక్ వార్ నేప‌థ్యంలో సాగే ఫ్లాష్ బ్యాక్‌లో యుద్ధ స‌న్నివేశాల ప‌రిధి త‌క్కువే అయిన‌ప్ప‌టికీ.. వాటిని చూపించిన తీరు బాగుంది. హీరో పాత్ర‌లో పూరీ మార్క్ అక్క‌డ‌క్క‌డ క‌నిపించినా.. క‌థ‌, క‌థ‌నాలు ఆయ‌న గ‌త చిత్రాల‌కు భిన్నంగా సాగుతాయి. అలాగే పూరీ త‌న సినిమాల్లో హీరోయిన్‌ను ఇంత ప‌ద్ధ‌తిగా చూపించ‌డం బ‌హుశా ఇదే తొలిసారేమో. ఏదేమైనా.. ప్ర‌థ‌మార్ధాన్ని ఆస‌క్తిక‌రంగా మ‌లుచుకున్న ద‌ర్శ‌కుడు.. ద్వితీయార్ధాన్ని సాదాసీదాగా తీర్చిదిద్దారు. దానికి తోడు క‌థ‌నంలో వేగం లేక‌పోవ‌డం, ప్రేమ స‌న్నివేశాల్లో గాఢ‌త లేక‌పోవ‌డం.. ఈ సినిమాకి ప్ర‌తికూలంగా మారాయి. 'పులుల‌ను కాపాడుకోవ‌డం' అనే ఎపిసోడ్‌లో పూరీ మార్క్ డైలాగులు ఆక‌ట్టుకుంటాయి. అలాగే.. పోలీసు ద‌గ్గ‌ర హీరోయిన్‌ రోష‌న్ ఫోన్ నెంబ‌ర్ తీసుకునేట‌ప్పుడు వ‌చ్చే స‌న్నివేశం స‌రాదాగా ఉంది. అదేవిధంగా.. పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్ప‌మ‌న్న‌ప్పుడు హీరో చెప్పే డైలాగులు బాగున్నాయి. అదే స‌న్నివేశంలో 'అనామ‌కుడివైన నీకు నా కూతురుని ఎలా ఇవ్వ‌మంటాను' అని ముర‌ళీ శ‌ర్మ అడిగిన‌ప్పుడు.. 'త‌న కోసం మ‌ళ్ళీ పుట్టాను, ఆ కార‌ణం చాల‌దా' అని చెప్ప‌డం బాగుంది. ఇలాంటి స‌న్నివేశాలు మ‌రికొన్ని ప‌డిఉండే సినిమా గ్రాఫ్ మ‌రోలా ఉండేద‌నే చెప్పాలి. ఏదేమైనా.. ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన పూరీ చిత్రాల‌లో ఇది చెప్పుకోద‌గ్గ ప్ర‌య‌త్న‌మ‌నే చెప్పాలి. 

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే - రోష‌న్‌, క‌బీర్‌.. ఇలా రెండు పాత్ర‌ల్లోనూ ఆకాశ్ పూరీ మెప్పించాడు. ప్రేమ స‌న్నివేశాల‌తో పాటు పోరాట స‌న్నివేశాల‌లోనూ, ఎమోష‌న‌ల్ సీన్స్‌లోనూ ఆక‌ట్టుకున్నాడు. ప్ర‌తి స‌న్నివేశంలోనూ కాన్ఫిడెంట్‌గా క‌నిపించాడు. ఇక‌ పూరీ మార్క్ హీరోయిజం ఉన్న సీన్స్‌లో అత‌ని న‌ట‌న‌కి విజిల్స్ ప‌డ‌డం ఖాయం. క‌థానాయిక నేహా శెట్టి అందంగా క‌నిపించ‌డ‌మే కాకుండా రెండు పాత్ర‌ల్లోనూ న‌ట‌న ప‌రంగా వేరియేష‌న్ చూపించింది. ముఖ్యంగా ఆఫ్రీన్ పాత్ర‌లో చాలా క్యూట్‌గా ఉంది. షాయాజి షిండే, ముర‌ళీ శ‌ర్మ పాత్ర‌ల ప‌రిధి త‌క్కువే అయిన‌ప్ప‌టికీ  త‌మ శైలి న‌ట‌న‌తో అల‌రించారు. మిగిలిన న‌టులు కూడా ఓకే అనిపించుకుంటారు.

సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. సందీప్ చౌతా సంగీతంలో పాట‌ల‌న్నీ బాగున్నాయి. అయితే.. అన్నీ కూడా సంద‌ర్భోచితంగా వ‌చ్చే పాట‌లే కావ‌డంతో స‌గ‌టు ప్రేక్ష‌కుల‌కు ఇవి అంత‌గా క‌నెక్ట్ కాక‌పోవ‌చ్చు. నేప‌థ్య సంగీతం బాగా కుదిరింది. విష్ణు శ‌ర్మ కెమెరా వ‌ర్క్ బాగుంది. ముఖ్యంగా యుద్ధ స‌న్నివేశాల‌ను చూపించిన తీరు బాగుంది. ఎడిటింగ్, ఆర్ట్ వ‌ర్క్‌.. ఓకే అనిపిస్తాయి. పూరీ అందించిన మాట‌ల్లో 'త‌ను క‌నిపించిన‌ప్పుడు నా గుండె ఆగిపోయింది. వెళ్ళిపోతుంటే గుండె ప‌గిలిపోతున్న‌ట్లుగా ఉంది', 'క‌న్న‌తండ్రిని ఇంట్లో పెట్టుకుని ప‌క్కింటి వాడిని నాన్న అని ఎలా పిలుస్తావు బే', 'రెండు జ‌న్మ‌ల నుంచి రెండు ఆత్మ‌ల ఆరాటం ఇది', 'వాడు చావ‌లేదు.. చ‌చ్చుంటే ఈ గుండె ఆగిపోయేది', 'ప్రేమా యుద్ధం.. మొద‌లు పెట్ట‌డం సుల‌భం ఆప‌డం క‌ష్టం' వంటివి బాగున్నాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌
ఆకాశ్ పూరి న‌ట‌న‌
ప్ర‌థ‌మార్థం
యుద్ధ స‌న్నివేశాలు
ఛాయాగ్ర‌హ‌ణం
నేప‌థ్య సంగీతం
మాట‌లు
నిర్మాణ విలువ‌లు

మైన‌స్ పాయింట్స్‌
ద్వితీయార్థం
క్లైమాక్స్‌
ప్రేమ స‌న్నివేశాల్లో గాఢ‌త లేక‌పోవ‌డం

చివ‌ర‌గా.. స‌రి'హ‌ద్దు'ల ప్రేమ‌క‌థ‌
రేటింగ్‌: 2.75/5'మెహ‌బూబా' ట్రైల‌ర్ వ‌చ్చేసింది

Updated By ManamMon, 04/09/2018 - 17:14

mehabooba''స‌ల్మాన్ ఖాన్ జిందాబాద్‌.. షారుక్ ఖాన్ జిందాబాద్‌.. అమీర్ ఖాన్ జిందాబాద్‌.. అబ్దుల్ క‌లామ్ జిందాబాద్‌.. ఇన్సానియ‌త్‌ జిందాబాద్‌.. మొహబ్బ‌త్ జిందాబాద్‌.. మేరీ మెహ‌బూబా జిందాబాద్'' అంటున్నారు యువ క‌థానాయ‌కుడు పూరీ ఆకాశ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం 'మెహబూబా'. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ రూపొందించిన ఈ చిత్రంలో నేహా శెట్టి క‌థానాయిక‌గా న‌టించింది.  చాలా కాలం త‌రువాత సందీప్ చౌతా సంగీత‌మందిస్తున్న తెలుగు చిత్ర‌మిది. 1971 నాటి ఇండో - పాక్ వార్ నేప‌థ్యంలో సాగే  ప్రేమ‌క‌థా చిత్రంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 11న తెర‌పైకి రానుంది. కాగా, ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఈ రోజు (సోమ‌వారం) విడుద‌ల చేశారు.

ఆక‌ట్టుకునే విజువ‌ల్స్‌, డైలాగ్స్‌, నేప‌థ్య సంగీతంతో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఈ ట్రైల‌ర్‌ను తీర్చిదిద్దారు. ''దేశాన్ని ప్రేమించే మ‌న‌సు కేవ‌లం ఒక సైనికుడికే ఉంటుంది.. ఆ మ‌న‌సులో ఒక చిన్న స్థానం దొరికినా చాలు.. అస‌లు ఈ స‌రిహ‌ద్దుల‌నేవి లేకుంటే ఎంత బాగుండేది, మ‌మ్మ‌ల్ని చంపితే మ‌ళ్ళీ పుడ‌తాం.. మ‌ళ్ళీ మ‌ళ్ళీ పుడ‌తాం..'' వంటి డైలాగులు బాగున్నాయి. చూస్తుంటే.. కొడుకు కాంబినేష‌న్‌లోనూ పూరీ ఓ విజ‌యాన్ని న‌మోదు చేసుకునేలా ఉన్నారు.

పూరీ టూరింగ్ టాకీస్ ప‌తాకంపై నిర్మిత‌మైన ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ సంస్థ‌ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తోంది.

Related News