makutam

అమ్మ అంటే ధైర్యం!

Updated By ManamSat, 07/21/2018 - 05:59

తొమ్మిది నెలలు నేను ఆమె జీవితాన్ని పంచుకున్నాను. తన తిండి, తన నీళ్లు.. ఆఖరుకి తన ప్రాణవాయువు! ఒక్కసారీ ఆమె ఫిర్యాదు చేయలేదు. నా సొంత కళ్లతో ఈ ప్రపంచాన్ని చూడాలనే సమయం వచ్చిందని ఒకరోజు నిర్ణయించుకున్నా. దాంతో నా కారణంగా ఆమెకు నొప్పి మొదలైంది. నేను ఈ భూమ్మీద పడ్డ క్షణం, ఆమె నన్ను తన రెండు చేతుల్లోకి తీసుకొని, దేవుడు తనకిచ్చిన గొప్ప కానుకగా భావించుకొని ఆనంద బాష్పాలు రాల్చింది. ఆమె మా అమ్మ!

imageఇప్పుడు అమ్మకు యాభయ్యేళ్లు. ఆమె నవ్వితే చూసి తీరాల్సిందే. కొత్తవాళ్లు ఎవరైనా ఆమెను చూస్తే, చాలా సాధారణమైన మనిషనుకుంటారు. చీరకట్టులో అంత సింపుల్‌గా కనిపిస్తుంది. కానీ ఆమె ఎంతటి అసాధారణ వ్యక్తో నాకు ఊహ తెలిసినప్పట్నుంచీ తెలుసు. వైజాగ్‌లోని ఒక బెస్ట్ స్కూల్‌లో మా అక్కకు అడ్మిషన్ దొరికింది. నాకు దొరకలేదు. స్వతహాగా నేను బిడియస్తురాల్ని. అంత బాగా ఇంగ్లిష్ మాట్లాడలేను. అందువల్ల అడ్మిషన్ల కోసం జరిపే ఇంటర్వ్యూల్లో తడబడేదాన్ని. మూడేళ్ల పాటు అమ్మ నా కోసం అదేపనిగా పోరాడింది. ఆమె కూడా ఇంగ్లిష్‌లో ఎక్స్‌పర్ట్ కాదు. అయినా రాత్రింబవళ్లు నాకు ఆ భాష నేర్పించేందుకు కష్టపడింది. అప్లికేషన్ ఫారాల కోసం క్యూలో నిల్చొనేది. నాకు అడ్మిషన్ దొరికిందో, లేదోనని ఆత్రంగా స్కూల్ నోటీస్ బోర్డులో పెట్టే లిస్టులో వెతికేది. అసంతృప్తి చెందకుండా, నమ్మకం కోల్పోకుండా, నా కోసం తపించింది, నెగ్గింది. ఎట్టకేలకు నాకూ అదే స్కూల్‌లో అడ్మిషన్ దొరికింది.

ఫ్యాన్సీ డ్రస్ కాంపిటిషన్లంటే ఎంత సరదానో! అమ్మ నా కోసం ఓ అందమైన బ్లాక్ స్కర్ట్ కొంది. ఒకసారి ఆ స్కర్ట్ ధరించి,image హీల్స్ వేసుకొని, ఎయిర్‌ప్లేన్ స్టిక్కర్ ఉన్న క్యాప్ పెట్టుకున్నా. ఆ డ్రస్‌ను అసలు విప్పబుద్ధి కాలేదు. ఆ డ్రస్‌లోనే అమ్మ నన్ను ఓ పార్కుకు తీసుకెళ్లింది.  అక్కడ లాన్‌లో కూర్చోపెట్టి, ‘‘ఈ సాయంత్రం నేను మీ ఎయిర్ హోస్టెస్‌ని. ప్లీజ్.. మీ సీట్ బెల్టుల్ని బిగించుకోండి. మీ ఫ్లయిట్‌ను ఆస్వాదిస్తారని ఆశిస్తాను.’’ అంటూ నా చేత దాదాపు యాభై సార్లు పలికించింది. నేను బాగా చెప్పినప్పుడు ఎంత ఉద్వేగానికి గురయిందో!  స్టేజి మీద అలాగే చెబితే, ప్రేక్షకులు మెచ్చుకుంటారని ఆమె ఆశ. మరుసటి రోజు కాంపిటిషన్. స్టేజి మీదకు వెళ్లాను. జనం మధ్యలో కూర్చున్న అమ్మను చూశాను. ‘‘ఈ సాయంత్రం నేను.. మీ సీట్.. బెల్టుని. మీ ఎయిర్.. హోస్టెస్‌ని.. బిగించుకోండి.. ఆస్వాదించండి’’ అని తత్తరపడుతూ చెప్పాను, వణుకుతున్న గొంతుతో. ఆ మరుక్షణం నేనేం చెప్పానో గ్రహించి, పరుగెత్తుకుంటూ స్టేజి వెనక్కి వెళ్లి ఏడ్వడం మొదలుపెట్టా. మా అమ్మను తలదించుకునేటట్లు చేశాననీ, ఆమె ఇంక నా వంక చూడదనీ, మునుపటిలా నన్ను ప్రేమించదనీ.. ఏమేమో ఊహించుకున్నా. 

అప్పుడే.. నేనేదో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నట్లుగా.. నన్నెవరో కావలించుకున్నారు. చూస్తే.. అమ్మ! 
imageనేను తన వంక చూడగానే నవ్వింది.. ఎంతో ప్రేమగా! నీళ్లు నిండిన నా కళ్లను తుడిచింది. ఆమె ఒక్క మాటా మాట్లాడకపోయినా, స్టేజి మీద నేను చేసిన పనిని పట్టించుకోకుండా ఆమె నన్నెంతగా ప్రేమిస్తున్నదో ఆ క్షణాల్లో నాకు బాగా అర్థమైంది. ‘అన్‌కండిషనల్’ అనే మాటను అర్థం చేసుకొనే వయసు కాదు నాది. అప్పుడు నాకు తెలిసిందల్లా.. స్టేజి మీద నేను మంచి ఎయిర్ హోస్టెస్‌ని కాలేకపోయినా, ఇంటికి నేను హ్యాపీగా రావచ్చనీ, ఆ రోజు నేను స్టేజి మీద ఏం చేశానో.. ఆ విషయం ఎవరికైనా నవ్వుతూ చెప్పొచ్చనీ.

మా అమ్మ చాలా ధైర్యవంతురాలు. ఈ విషయం ఈ మధ్యే కనిపెట్టాను. మెడికల్ ఎగ్జామినేషన్‌లో ఆమె రొమ్ములో గడ్డ ఉందనీ, అది కేన్సర్‌గా మారవచ్చనీ తెలిసిన క్షణాల్లో హాస్పిటల్‌లో నేనూ ఉన్నా. కారులో నాన్న ముందు సీట్లో కూర్చుంటే, అమ్మా, నేనూ వెనుక సీటులో కూర్చున్నాం. మేం ఆమె వంక భావరహితంగా చూస్తూ, ఆమె ఎప్పుడు బరస్ట్ అవుతుందా.. అని ఎదురుచూస్తున్నాం. మా తలల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతుంటే, అమ్మ మాత్రం ఎలాంటి యాతనా లేకుండా, చాలా ప్రశాంతంగా కూర్చుంది.

మేం ఇంటికి చేరుకున్నాక, అప్పుడామె మమ్మల్ని వాటేసుకొని ఏడ్చేసింది. ఆమె దిగులు పడిందనే ఉద్దేశంతో ఆమెకేమీ కాదనీ, నయమై పోతుందనీ మేం ఓదార్చాం. ఆమె తలెత్తి, ‘‘కావచ్చు, నేను బాగానే ఉండొచ్చు. అది కాదు సమస్య. నా బాధంతా నా జుట్టు మొత్తం రాలిపోతుందనీ, అప్పుడు నాకు కేన్సర్ ఉందనే విషయం జనానికి తెలిసిపోతుందనీ. అప్పుడు నా కూతుళ్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు?’’ అంది. ఆఖరుకి తన జీవితంలోని అత్యంత క్లిష్ట క్షణాల్లోనూ, ఆమె మా గురించే ఆలోచిస్తుంటుందనీ అప్పుడు తెలిసింది. ఆమె ఎంతటి అపురూపమైన మనిషో తెలిసిన క్షణాలవి! ఆమెది వంశపారంపర్యంగా వచ్చే జబ్బు కాదనీ, మెనోపాజ్, హార్మోన్ సంబంధితమైందనీ, మీ అమ్మాయిల గురించి వర్రీ అవ్వొద్దనీ డాక్టర్ చెప్పాకే ఆమె ఊపిరి పీల్చుకుంది. అప్పుడే ఆమె ముఖంలో మళ్లీ ప్రశాంతత తిరిగొచ్చింది.

ఎవరైనా పెద్ద సర్జరీ అయ్యాక, స్పృహలోకి వచ్చినప్పుడు చెప్పే మొదటి మాటేమిటి? మా అక్క వంక చూస్తూ అమ్మ imageఅంది, ‘‘మీకు మీ అత్త (మేనత్త) మంచి భోజనమే పెట్టి ఉంటుందనుకుంటున్నా’’ అంది. మా అత్తయ్య ఆ రాత్రి హాస్పిటల్‌లోనే ఉంది, మాకు తోడుగా.  అక్క ‘‘అత్తయ్య అన్నం తీసుకొచ్చింది’’ అని చెప్పగానే, ‘‘అరే.. అన్నం తింటే మీ అత్తకు ఎసిడిటీ వస్తుంది’’ అని, నిద్రలోకి జారిపోయింది. అప్పుడక్కడ మా చుట్టూ ఉన్న డాక్టర్లు సైతం నవ్వేశారు. మేమంతా ఒకరి ముఖాలు ఒకరం చూసుకొని, ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్న ఆ దేవతను చూసి, హాయిగా ఊపిరి పీల్చుకున్న నాటి అనుభవాన్ని మాటల్లో చెప్పలేను.

కెమోథెరపీ శరీరాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే అది చెడు కణాల్నే కాదు, ఆరోగ్యవంతమైన కణాల్ని కూడా చంపేస్తుంది. అయినప్పటికీ మా అమ్మ ఉల్లాసాన్ని అదేమీ చేయలేకపోయింది. కేవలం ఒక కెమో అయ్యాక, అందులో ఎక్స్‌పర్ట్ అయినట్లే నమ్ముతూ వచ్చిందమ్మ. రెండో కెమో కోసం వెళ్లినప్పుడు, అక్కడ చుట్టూ ఉన్న పేషెంట్లతో ఏం తినాలో, ఏం తినకూడదో చెబుతూ, వాకింగ్ చెయ్యాలనీ, మెడిటేషన్ చెయ్యాలనీ, ఆరోగ్యం సమకూరుతుందనే నమ్మకం పెట్టుకోవాలనీ సలహాలిస్తూ వచ్చింది. తనకూ నయమవుతుందని గట్టిగా నమ్మింది. వాళ్లకు జీవితం మీద ఆశను కల్పిస్తూ, ‘‘అరే.. కేన్సర్‌లో ఏముంది! ఇవాళ చాలా మందికి మామూలుగా వచ్చేస్తోంది. మీరేమీ భయపడొద్దు. పాజిటివ్‌గా ఉండండి. అది మిమ్మల్నేమీ చెయ్యలేదు’’ అని చెబుతూ వచ్చింది.

మొదటి కెమో వల్ల ఏర్పడిన సైడ్ ఎఫెక్టులు ఓ వారం రోజుల దాకా ఉన్నాయి. నాలుగో రోజు కుటుంబమంతా కలిసి వేడుకలాగా చేసుకున్నాం. అమ్మ చాకొలేట్ కలర్ చీర కట్టుకొని మెరిసిపోయింది. ఐదో రోజు, ఇంట్లోని ముగ్గురు ఆడవాళ్లం - అమ్మ, అక్క, నేను - కలిసి సినిమాకి వెళ్లాం. అమ్మ గర్వంగా విగ్గు పెట్టుకొని వచ్చింది. పెట్టుకొనే ముందు దాన్ని నీట్‌గా దువ్వింది. క్లిప్పులు పెట్టింది. బయటకు హుందాగా నడిచి వస్తుంటే, ప్రపంచమే ఆమెకు స్వాగతం పలుకుతున్నట్లు తోచింది. గాలి కాస్త విసురుగా వీస్తే, విగ్గు చెదిరిపోకుండా జాగ్రత్తపడుతూ వచ్చిందమ్మ. సినిమాని మాకంటే ఎక్కువగా ఆస్వాదించింది.

అమ్మకు ఇలా ఉందని తెలిసి బంధువులు ఒక్కరొక్కరుగా వచ్చి, పలకరించి, సానుభూతి వ్యక్తం చేస్తుంటే మాకు చాలా కోపం వచ్చేసేది. చిత్రంగా అమ్మ ‘‘ఇప్పుడు నాకేమైందని బాధపడ్తున్నారు. ఇది నన్నేమీ చేయలేదు. నేనేం బాధపడ్డం లేదు. ఏం పర్వాలేదు’’ అంటే, ఆశ్చర్యపోవడం వాళ్ల వంతయ్యేది. జీవితాన్ని ఎలా జీవించాలో అక్కా, నేనూ నేర్చుకుంది అమ్మ దగ్గరనే. ముగ్గురం కలిసి జీవితాన్ని ఎంతగా ఆస్వాదించామో! మా కుటుంబానికి నావికురాలైన అమ్మ.. క్లిష్ట సమయాల్లోనూ గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. ఐ లవ్ యూ సో మచ్ అమ్మా!!
- కె. ఉషాకిరణ్రాహుకాల దీపం అంటే ఏమిటి?

Updated By ManamMon, 07/09/2018 - 23:08
  • దీనిని ఇంట్లో వెలిగించవచ్చా?

imageరాహుకాలం నిడివి రోజుమొత్తంలో తొంబై నిమిషాలు ఉంటుంది.  ఆ సమయంలో రాహుప్రీతి కోసం నిమ్మకాయను మధ్యకు తరిగి, రసం తీసివేయాలి. ఖాళీ అయిన నిమ్మకాయ డిప్పలో ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. నిజానికి నవగ్రహాలలో అందరికీ ఈ దీపాలు ఇష్టమైనవే. ఎవరి ముందు దీపారాధన చేసినా అన్నీ శివప్రీతి కలిగిస్తాయి. ఈ నిమ్మకాయ దీపాలను కార్తిక, మార్గశిర మాసాల్లో వెలిగించడం మంచిది. అందులోనూ సోమవారం నాటి ఉదయం 7.30 నుంచి 9.00 గంటల మధ్య కాలంలో చేయడం వల్ల సమస్త దోషాలూ నశిస్తాయి.

 శుభసమయం లేనప్పుడు ఏదైనా పని ప్రారంభించవలసి వచ్చినా, ప్రయాణం చేయవలసి వచ్చినా నిమ్మకాయలో రాహుకాల దీపం వెలిగించడం వల్ల తలపెట్టిన విఘ్నాలు రావని, విజయం పొందుతారని రుద్రయామళ తంత్రం చెబుతోంది. అయితే తెలుగు సంప్రదాయంలో రాహుకాలానికి పట్టింపులేదు.

- డా. అన్నదానం చిదంబర శాస్త్రి, ఆధ్యాత్మిక వేత్తబాల్యం బలవుతోంది!

Updated By ManamThu, 06/14/2018 - 20:10

స్కూలు.. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసే కలల ప్రపంచం! స్కూలు.. ఆడుతూ పాడుతూ, తుళ్లుతూ ఉన్నన్ని రోజులూ పిల్లలకు ఎన్నో మధుర జ్ఞాపకాల్ని అందించే అపురూప ప్రదేశం! స్కూలు.. నిన్నూ, నన్నూ, ఎందరినో తీర్చిదిద్దిన గొప్ప స్థలం!! ఎందరెందరో మేధావులు, శాస్త్రవేత్తలు, కవులు, రచయితలు, విద్యావేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు చదువును గురించి తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు.

Children school, Childhood age, children future, Makutamచదువంటే నేర్చుకోవడం. చదువంటే తెలుసుకొని ఆచరించడం. మనలోని జ్ఞానాన్ని వికసింపజేసుకోవడం. మన భావాలకు, ఆలోచనలకు రెక్కలు తొడగడం. తమలోని ఆలోచనలకు, అభిరుచులకు మెరుగు పెట్టుకోవడం. మనుషుల్లోని మృగత్వాన్ని తొలగించుకొని, ఋషిత్వాన్ని పెంపొందించుకోవడం. ప్రేమాభిమానాల్ని పంచుకోవడం, పెంచుకోవడం. మనుషుల్నీ, ప్రకృతినీ, సమస్త జంతుజాలాన్నీ ప్రేమతో అక్కున చేర్చుకోవడం. జీవన తత్వాన్ని అర్థం చేసుకోవడం! మనుషులకు కలిగే కష్టదశ ఏదని కళ్లులేని హెలెన్ కెల్లర్‌ను అడిగినప్పుడు, ‘‘కళ్లున్నా చూడలేకపోవడం’’ అని చెప్పారు. ఆమెకు కళ్లు లేకపోయినా ఎన్నో గ్రంథాలు రాశారు. ప్రపంచమంతా తిరిగారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఎంతో కృషి చేశారు. ‘‘ఐ యామ్ ఓన్లీ వన్ బట్ స్టిల్ ఐ యామ్ వన్. ఐ కాన్ట్ డు ఎవిరిథింగ్. బట్ స్టిల్ ఐ కెన్ డు సమ్‌థింగ్.

"On the whole that physical, emotional and ethical integration of an individual into a complete man is fundamental aim of education."
    l UNESCO

ఐ విల్ నాట్ రెఫ్యూజ్ టు డు సమ్‌థింగ్ ఐ కెన్ డు’’ అని ఆమె చెప్పారు. సృజనాత్మకంగా సాగాల్సిన విద్య ఇవాళ ప్రైవేటు పాఠశాలల స్థాయి దాటిపోయి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. వస్తువుల్ని తయారుచేసే పారిశ్రామికవేత్త సైతం మనుషుల్ని దృష్టిలో పెట్టుకొనే తయారుచేస్తాడు. కానీ ఇవాళ్టి విద్యా విధానంలో మానవ కోణం కానీ, మనిషి విలువలు కానీ, సామాజిక స్పృహ కానీ, నీతి నియమాలు కానీ లేనే లేవు. వ్యాపారం.. వ్యాపారం. లాభం, నష్టం. ఇదే ఇవాళ్టి విద్యార్థులకు శాపంగా పరిణమించిన విష సంస్కృతి. ఈ వ్యవస్థలో పిల్లలు మొండిగా తయారవుతారు. బడికి వెళ్లడానికి మొరాయిస్తారు.

అక్కడ వాళ్లకు ఇష్టమైంది లేకపోగా కష్టం కలిగించే ఎన్నో విధానాలుంటాయి. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమం దుర్బేధ్యమైన కోట గోడ. ఏ వయసు వాళ్లనైనా కథలు కదిలిస్తాయి. మహాత్మా గాంధీపై తల్లి చెప్పిన కథల ప్రభావం, టాల్‌స్టాయ్ కథల ప్రభావం ఎంతో ఉంది. అంబేద్కర్‌పై ఆయన ఉపాధ్యాయుడు చెప్పిన కథల ప్రభావం ఉంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, లాల్ బహదూర్ శాస్త్రి, సుబ్రమణ్య భారతి, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి గొప్పవాళ్లపై వాళ్ల ఉపాధ్యాయులు చెప్పిన కథల ప్రభావం ఎంతో ఉంది. కథల ద్వారా ఆలోచన, ఊహ, తర్కం, జ్ఞానం, అన్వేషణ వంటి అనేక శక్తియుక్తులు పిల్లల్లో పెరుగుతాయి.

నానాటికీ తీసికట్టు
Children school, Childhood age, children future, Makutamఇవాళ జరుగుతున్నదేమిటి? పుస్తకమంటే పాఠ్య పుస్తకమే. అదైనా పూర్తిగా చదివి అర్థం చేసుకుంటే మంచిదే. వాళ్లకా అవకాశం ఎక్కడ ఉంది? పాఠ్య పుస్తకం స్థానాన్ని గైడ్స్, మెటీరియల్స్ ఆక్రమించేశాయి. ఇంగ్లీష్ మీడియం పిల్లలకైతే ప్రశ్న, జవాబు మాత్రమే చదువు. ప్రశ్న కూడా తెలియకుండా జవాబే వాళ్ల మెదళ్ల నిండా కుక్కేస్తున్నారు. ఇంక పుస్తకాలకు చోటెక్కడ? గ్రంథాలయాలకు తావెక్కడ? అవగాహన కలిగిన చదువులకు చోటెక్కడ? ప్రభుత్వ పాఠశాలల పనితీరు నానాటికీ దిగజారిపోతున్నది. ప్రాథమిక, మాధ్యమిక విద్య.. ప్రేమతో, దయతో, అభిమానంతో సాగాల్సిన స్థాయి. అయితే బడుల్లో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ, డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. ఉపాధ్యాయుల్లో నిబద్ధత కొరవడడంతో ఎక్కడలేని అలసత్వం చోటు చేసుకుంటోంది.

సంవత్సరంలో ఎప్పుడు పిల్లలొచ్చినా బడిలో చేర్చుకోవాల్సిన ఉపాధ్యాయులు టీసీ లేదనీ, మధ్యలో వచ్చారనీ, ఆధార్ కార్డ్ లేదనీ.. రకరకాల కారణాలతో పిల్లలు బడిలో కాకుండా బడి బయట ఉండటానికి కారణమవుతున్నారు. ‘‘విద్యను నిర్బంధంగా బోధించాల్సిన అవసరం లేదు. అది పెరుగుదలతో ఒక భాగం మాత్రమే. దానికి సమాజానికి ప్రయోజనకరంగా తీర్చిదిద్దేవారే గురువులు’’ అంటారు జర్మన్ విద్యావేత్త ప్రోబెల్. ఒక మొక్కలో కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు ఎంత సహజంగా పెరుగుతాయో.. పిల్లలు కూడా తమ ఆలోచనలు, భావనలు యథేచ్ఛగా ప్రకటిస్తూ పెరగాలి. బడి ఒక పూలవనంలా ఉండాలని ఆయనంటారు.

ప్రేమాభిమానాలతో చెప్పాలి
Children school, Childhood age, children future, MakutamThe average teacher tells
The good teacher explains
The superior teacher demonstrates
The great teacher inspires

- విలియం ఆర్థర్ వార్డ్
బడికి వచ్చిన పిల్లల్లో సామాజిక, ఆర్థిక, కుటుంబ కారణాల రీత్యా ఎంతో భిన్నత్వం ఉంటుంది. అందర్నీ ఒకే గాటన కట్టేసి పాఠం చెప్పడం వల్ల సగానికి సగం మంది పిల్లలు తమకు చదువు రాదనుకొని డ్రాపవుట్లవుతున్నారు. ప్రతి పిల్లవాడిలోనూ అద్భుతమైన శక్తులుంటాయి. వాటిని గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తాడు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఐదు సంవత్సరాల పాటు పిల్లలు ఒకే బడిలో ఉంటారు. అలాంటప్పుడు వాళ్లకు చదవడం, రాయడం, సొంతంగా ఆలోచించడం నేర్పడం పెద్ద కష్టం కాదు. అలా నేర్పి హైస్కూల్‌కు పంపితే వాళ్లు కచ్చితంగా చదువులో ముందుకెళతారు. అయితే ఇవాళ జరుగుతున్న వాస్తవమేమంటే ప్రాథమిక పాఠశాలలో ఎక్కువ మంది చదువు రాకుండానే హైస్కూల్‌కు వెళ్తున్నారు. అక్కడా వాళ్లను పట్టించుకోకపోయినా, ఎలాగో పదో తరగతి పాసై బయటకు వస్తున్నారు. ఆ తర్వాత ఇటు పని చెయ్యడం రాక, అటు చదువూ రాక.. రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతున్నారు.

ఇంకాస్త ముందుకు వెళ్లిన ఉపాధ్యాయులు వాళ్ల పిల్లలు చదువుకొనే ప్రైవేటు పాఠశాలల్లో అనుసరించే ప్రశ్న-జవాబు పద్ధతిని అనుసరిస్తున్నారు. ఎక్కువ భాగం పాఠశాలల్లో గైళ్లు చూసి రాసే పద్ధతిలో హోమ్‌వర్క్ నడుస్తుంది. ప్రతి రోజూ ఏడు సబ్జెక్టులు హోమ్‌వర్క్ రాయడం కష్టం కావడంతో కొంతమంది పిల్లలు హోమ్‌వర్క్ వల్లనే బడి మానుకుంటున్నారు. అంటే చదవడం రానివాళ్లు కూడా ఈ చూసిరాత రాయక తప్పనిసరి కావడంతో చదువు మధ్యలో మానేస్తున్నారు. అంటే.. ఉపాధ్యాయులు కొట్టడం వల్ల కొంతమంది, చూసిరాతల వల్ల కొంతమంది బడి మానేస్తున్నారు. ‘‘చదువు చెప్పాలంటే దండించాల్సిన పనిలేదు. పిల్లల్ని ప్రేమాభిమానాలతో మచ్చిక చేసుకొని బోధించాలి. ఒక తల్లి తన బిడ్డల్ని ఎలా లాలించి, గారాబం చేసి పెంచుతోందో అలాగే టీచరు కూడా పిల్లల్ని చూడాలి’’ అంటారు ఆధునిక విద్యా పితామహుడిగా కీర్తిగాంచిన జోహాన్ అమోస్ కొమినియస్.

విలువల్లేని చదువు
ఒక దేశ విద్యా విధానం ఆ దేశపు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్దేశిస్తుందనీ, అందుకే దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందనీ అంటారు కొఠారీ. బడిలో నేర్చుకున్న పాఠాలే భవిష్యత్తును నిర్ణయించవనీ, బడి బయట నేర్చుకున్న విషయాలే వారి బాటను నిర్దేశిస్తాయంటారు సోక్రటీస్. ఎంతోమంది మేధావుల్ని, దేశభక్తుల్ని, రచయితల్ని, గొప్ప గొప్ప నాయకుల్ని కని పెంచి పెద్దజేసిన భూమి మనది. ఈ భూమి నాది, ఈ భాష నాది, ఈ నీరు నాది, సంస్కృతి నాదని ప్రాణానికి ప్రాణంగా కళ్లకద్దుకుంటూ ఎందరో మహానుభావులు సాగిపోయిన పుణ్యభూమి ఇది. మానవత్వంతో, ప్రేమతత్వంతో ఆప్యాయతా అనురాగాలు కలబోసుకొని ఒకరికొకరి మధ్య మానవ సంబంధాలతో మనుషులు నడయాడిన నేల ఇది. అలాంటి ఈ భూమ్మీద ఎలాంటి విలువలకూ చోటులేని విద్యతో పిల్లలు యువతగా మారి సమాజంలోకి అడుగు పెడుతున్నారు.

అలాంటి వాళ్ల నుంచి మనం ఆశిస్తున్నదేమిటి? కళ్లతో చూస్తున్నదేమిటి? మనిషి ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశమున్న రోజులివి. అలాగే అధఃపాతాళానికి తీసుకు వెళ్లడానికి అంతకంటే మరిన్ని ఆకర్షణలూ ఉన్న కాలం ఇదే. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పిల్లల్ని పెడదోవ పట్టిస్తోంది. ఇలాంటి సందిగ్ధ సందర్భంలో ఉపాధ్యాయుల బాధ్యత, విద్యారంగం బాధ్యత మరింత పెరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూల్లో, కాలేజీలో చేర్పించామని చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఇవాళ పిల్లలపై ఒత్తిడి మరింత పెరిగింది. మంచి స్కూలు, మంచి కాలేజీ, సెల్‌ఫోన్, మోటార్ బైక్, లాప్‌టాప్.. పిల్లల పాలిట మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. వీటి విషయంలో అందరూ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.

విష వలయం
పిల్లల్ని ర్యాంకుల, మార్కుల కర్మాగారాలుగా చూడడం వల్ల వాళ్లలో మానసిక ఒత్తిడి పెరిగిపోయి ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. విద్యలో సరైన దృక్పథం లేకపోవడం వల్ల పిల్లల్లో సహజంగా అభివృద్ధి చెందాల్సిన వాస్తవ దృక్పథం, ప్రయోగశీలత, సమస్యా పరిష్కార ఆలోచనా విధానం పెరగకపోవడంతో అర్ధంతరంగా ఎంతోమంది పిల్లలు తనువు చాలిస్తున్నారు. చదువనే మాట వినగానే పిల్లలతో పాటు తల్లిదండ్రులూ భయపడిపోతున్నారు. ఓ వైపు తమ పిల్లలు పోటీలో నెగ్గాలని కోరుకుంటున్న పెద్దలు.. స్కూళ్లల్లో, కాలేజీల్లో వరుసగా జరుగుతున్న ఘటనలు చూసి బెంబేలెత్తుతున్నారు. చదువనేది వ్యాపారమయ్యాక, సమాజం కెరీరిజాన్ని తలకెత్తుకున్నాక పిల్లలపై పడుతున్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. రోజు రోజుకూ పోటీ వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా పెంచేస్తూ తమ స్కూలు లేదా కాలేజీలో చదువుకున్న విద్యార్థులు మిగతా వాటికంటే ఎక్కువ ర్యాంకులు, ఎక్కువ మార్కులు సంపాదించుకున్నారని ఆయా యాజమాన్యాలు భారీగా ప్రకటనలు ఇస్తుండటం ఒత్తిడిని మరింతగా పెంచుతోంది. పరిస్థితులు ఏ స్థాయికి దిగజారాయంటే.. ఒక స్కూలులో ప్రతిభావంతులైన విద్యార్థులుంటే వాళ్లకు ఉచితంగా చదువు చెబుతామనీ, ఐఐటీ కోచింగ్ ఇప్పిస్తామనీ చెప్పి వాళ్లను తమ స్కూలుకు వచ్చేలా యాజమాన్యాలు చేసేంతగా! ఇలాంటి అనైతిక కార్యకలాపాల వల్ల కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలంటేనే ఏవగింపు కలుగుతోంది. వీటి చర్యల్ని అడ్డుకునే నాథుడు లేకపోవడమే విషాదం.

తమ పిల్లలకు ఐఐటీ సీటు వచ్చే అవకాశం లేదని తెలిసినా, మిగతా వాళ్లకంటే తగ్గకుండా ఉండాలనే ఆపేక్షతో తల్లిదండ్రులు ఐఐటీ కోచింగ్ ఇచ్చే కాలేజీల్లోనే బలవంతంగా పిల్లల్ని చేరుస్తున్నారు. తద్వారా వాళ్లపై ఒత్తిడి పెంచుతూ, తాము కూడా ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో ఇదొక విష వలయంలా మారిపోయింది. మరోవైపు తమ సామర్థ్యానికి మించి కష్టపడాల్సి రావడం పిల్లల్ని వేధిస్తోంది. ఫలితంగా కొంతమంది ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తూ భవిష్యత్తనేదే లేకుండా చేసుకుంటున్నారు. ఐఐటీల్లో లేదంటే మెడికల్ కాలేజీల్లో సీటు రాకపోతే.. తక్కువతనంగా భావిస్తుండటమే అన్ని అనర్థాలకూ మూలం.

మార్కులు-వివక్ష
ప్రతి ఒక్కరిలోనూ అనంతమైన శక్తి ఉంటుంది. అది తెలుసుకుని, ఆ శక్తిని వెలికితీసే క్రమంలో ఎంతో శ్రమపడాల్సి వస్తుంది. కొండల్ని పిండిచేసే శక్తి యువతలో ఉందనీ, దాన్ని ఉపయోగించుకుంటే గొప్పవాళ్లు కావడం ఏమంత కష్టం కాదనీ అంటారు వివేకానందుడు. పిల్లలకు గొప్పవాళ్లు కావడానికి అవసరమైన వాతావరణం కల్పించడమే మనం చెయ్యాల్సింది. ఇవాళ పిల్లలు ర్యాంకుల రోళ్లల్లో పడి రోదిస్తున్నారు. మార్కుల చట్రంలో పడి ముక్కలు చెక్కలవుతున్నారు. పిల్లలు పిచ్చివాళ్లవుతున్నారు. సమాజం నుంచి దూరమైపోయి దూరతీరాలకు సాగిపోతున్నారు. ప్రేమను పంచే ప్రపంచం తెలియకుండా పోతున్నారు. మనుషుల మధ్య సంబంధాలకు మరీ మరీ దూరంగా జరిగిపోతున్నారు. ఆనందానికి అర్థమే లేకుండా పోయింది. సంస్కృతి నీటి మీద రాతైపోయింది. భాష బతకలేక చావలేక కొట్టుకులాడుతోంది. మనిషి మట్టికొట్టుకుపోతున్నాడు. సంబంధాలు సర్వనాశనమవుతున్నాయి. విద్య వికాసం కోసం కాకుండా వినాశనానికి దారి తీస్తోంది. చదువులే పిల్లల్ని పనికిరాని వాళ్లుగా తయారు చేస్తున్నాయి. అకడమిక్ చదువులనేవి పిల్లలను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాల్సింది పోయి, వాళ్లలో ఆత్మన్యూనతా భావాన్నీ, అనారోగ్యకరమైన పోటీ వాతావరణాన్నీ రగిలిస్తున్నాయి. పాఠాల్ని అర్థం చేసుకొనేలా చెప్పాల్సిన టీచర్లు, లెక్చరర్లు.. బలవంతంగా వాటిని రుద్దుతుండటం వల్ల విద్యార్థులు చదువును ఆస్వాదించలేక పోతున్నారు.

క్లాసులు జరిగే సమయమంతా టార్చర్‌గా ఉంటోందని వాళ్లు భావిస్తున్నారు. మార్కుల ఆధారంగా విద్యార్థుల్ని విభజిస్తుండటంతో, ఈ వివక్ష కారణంగా ఎక్కువ మంది ఆత్మన్యూనతా భావానికి లోనవుతున్నారు. విద్యనేర్చి విజ్ఞానవంతులు కావాల్సిన వాళ్లు ఒత్తిడిని భరించలేక ఇళ్ల నుంచీ, హాస్టళ్ల నుంచీ పారిపోతున్నారు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఎంత అమానవీయంగా తయారవుతున్నా వ్యవస్థ చేష్టలుడిగి చూస్తోంది. ఇప్పటి పిల్లల్లో సామర్థ్యం, తెలివితేటలు ఎక్కువగానే ఉంటున్నాయి. అయినప్పటికీ వాళ్లు చాలా త్వరగా న్యూనతలోకి జారిపోతున్నారు. వాళ్లలోని వ్యాకులతను తొలగించేందుకు ఆరోగ్యకరమైన మార్గాన్ని మనం అనుసరించాలి. అందుకే మొదట పిల్లలతో ప్రవర్తించే తీరును తల్లిదండ్రులు మార్చుకోవాలి. 
- సెల్: 9949535695

‘‘పాపం పుణ్యం ప్రపంచ మార్గం
కష్టం సౌఖ్యం శ్లేషార్థాలూ
ఏమీ ఎరుగని పూవుల్లారా
అయిదారేడుల పాపల్లారా
మెరుపు మెరిస్తే వాన కురిస్తే
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే కూనల్లారా
మీదే మీదే సమస్త విశ్వం
మీరే లోకపు భాగ్య విధాతలు’’
- శ్రీశ్రీ

‘‘విద్యార్థులకు శారీరక, మానసిక శిక్షణ గరపడం కంటే వారికి ఆత్మ శిక్షణ గరపడం కష్టమనిపించింది. ఆత్మ శిక్షణకు మత గ్రంథాల సాయం నేను పొందలేదు. విద్యాభ్యాసంలో ఆత్మ శిక్షణ ఒక భాగమని టాల్‌స్టాయ్ ఆశ్రమంలో మా పిల్లలకు శిక్షణ జరిగే సమయంలో తెలుసుకున్నాను. శరీర సంబంధమైన శిక్షణ ఇవ్వాలంటే వ్యాయామం ద్వారా ఇవ్వాలి. బుద్ధికి పదును పెట్టాలంటే బుద్ధి చేత వ్యాయామం చేయించాలి. అలాగే ఆత్మ జ్ఞానం కలగాలంటే ఆత్మకు వ్యాయామం అవసరం.’’
- మహాత్మా గాంధీ

‘‘పాఠశాల అంటే కేవలం ఒక భౌతిక ప్రదేశం కాదు. అది పిల్లల ఆకాంక్షలకూ, అభివృద్ధికీ సంగమం. వారికిష్టమైన ప్రతి ప్రాణితో, ప్రతి వస్తువుతో, ప్రతి వాస్తవిక అంశంతో సాన్నిహిత్యం నెరపుకొనగల ఒక బహిరంగ ప్రపంచం. పాఠశాలక్కావలసింది బోధకులూ, మహోపాధ్యాయులూ కాదు. కోరినప్పుడు స్నేహ హస్తం అందించగల మంచి మిత్రులు.’’
- అరవిందుడు

‘‘మన పిల్లలకు జ్ఞానాన్ని అందించే సాధనమే బడి అనుకోవడం తప్పు. పాఠశాల అంతకంటే గొప్పది. స్వయం వ్యక్తిత్వం, స్వంత ఆశయాలు లేని మూసపోసిన వ్యక్తుల వల్ల సమాజం ముందుకు పోదు. పాఠశాల స్వంతంగా ఆలోచించగల, వ్యవహరించగల వ్యక్తుల్ని తయారుచెయ్యాలి. మంచి మాటలు చెప్పడం వల్లా, వినడం వల్లా కాదు వ్యక్తిత్వాలు రూపుదిద్దుకునేది. చేసే శ్రమ వల్లా, పని వల్లా మాత్రమే వ్యక్తిత్వాలు రూపొందుతాయి.’’
- ఆల్బర్ట్ ఐన్‌స్టీన్నన్ను చావనివ్వండి

Updated By ManamTue, 03/27/2018 - 01:54

మా ఊళ్లో సూర్యనారాయణ రాజుగారంటే తెలియని వాళ్లు లేరు. ఆజానుబాహుడు అంటే ఏంటో మాకు తెలిసింది ఆయన్ని చూసిన తర్వాతే. ఆరడుగులకు పైన మూడు నాలుగు అంగుళాల పొడవుంటారు. అప్పట్లో ఆయన ఎర్రటి ఎన్‌ఫీల్డ్ బండి మీద వెళ్తుంటే.. ఆ బండి ఆయన ముందు ఎలక పిల్లలా కనిపించేది. వాళ్లబ్బాయి శ్రీనివాసరాజు మా క్లాస్‌మేట్.

imageఅలాంటి రాజుగారు వెంటిలేటర్ మీద ఉన్నట్లు మా ఇద్దరి కామన్ ఫ్రెండ్ మోహన్ చెప్పడంతో శ్రీనుని పలకరిద్దామని ఊరు వెళ్లా. నరసాపురంలో అది పెద్ద ఆస్పత్రే. వైద్యులు బాగా నిపుణులు. నాకు తెలిసిన కొద్దిపాటి వైద్య పరిభాష ఉపయోగించి వాళ్లని సమస్య ఏంటని అడిగా. ‘పల్మనరీ ఎడిమా’ అని చెప్పారు. నయం కావడానికి ఎన్నాళ్లు పట్టొచ్చని అడిగితే.. ఏమీ చెప్పలేమన్నారు. రాజుగారు కాల్చిన సిగరెట్లు ఆయన ఊపిరితిత్తులను పూర్తిగా నాశనం చేశాయట. ‘మిగిలిన ఆర్గాన్లు కూడా సపోర్ట్ చేయాలి కదా, అప్పటివరకు వెంటిలేటర్ మీదే’ అని డాక్టర్లు చెప్పారు. బయటికొచ్చి శ్రీనుని కదిలిస్తే వాడు పూర్తి నిర్వేదంలో ఉన్నాడు. ‘‘ఇప్పటికే 15 రోజులైందిరా.. బెడ్ సోర్ కూడా వచ్చేలా ఉంది. నాన్నని ఇలా చూడటం కంటే ఆ డాక్టర్లకే చెప్పి ఏదైనా మందుంటే ఇచ్చి..’’ ఆ తర్వాత వాడి గొంతు పెగల్లేదు. 

మీరైనా చెప్పండి..
మాకు బాగా తెలిసిన ఒక లెక్చరర్ ఉండేవారు. కొడుకు పెళ్లికి కొద్ది రోజుల ముందు ఆయనకు కడుపులో బాగా నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్తే ఏం చెబుతారోనన్న అనుమానం.. కొత్త కోడలి గురించి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని మరోవైపు ఆలోచన రావడంతో అసలు డాక్టర్ దగ్గరకే వెళ్లలేదు. కొడుకు పెళ్లి అయిన రెండు నెలలకే ఆయనకు కేన్సర్ బయటపడింది. ఏడాది తిరిగేలోపే అది బాగా ముదిరిపోయింది. ఎంత ట్రీట్‌మెంట్ చేసినా ప్రయోజనం లేదు. చివరి రోజుల్లో ఆయన నరకయాతనimage అనుభవించారు. విపరీతమైన నొప్పి, ఒళ్లంతా మంటలు.. దానికి ఏ మందులు వాడినా ప్రయోజనం లేకపోవడం.. అలాంటి సమయంలో ఆయనను పలకరించడానికి వెళ్లాను. ఒకసారి నాతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి ఆస్పత్రిలో అందరినీ బయటకు పంపేశారు. ‘‘సార్.. మీరైనా డాక్టర్లకి చెప్పండి.. నేనీ నరకం భరించలేకపోతున్నాను. ఏదైనా ఇంజెక్షన్ ఇస్తే హాయిగా వెళ్లిపోతాను. ఇక్కడి నుంచి నేను సజీవంగా ఇంటికి వెళ్లనని నాకూ తెలుసు, వాళ్లకూ తెలుసు. అదేదో నేను ఇంత నరకం అనుభవించకుండా ముందే ఇస్తే నాకూ ప్రశాంతంగా ఉంటుంది.. నాకు చేయలేక ఇబ్బంది పడే వాళ్లకూ కాస్త రిలీఫ్ దొరుకుతుంది.. ప్లీజ్.. డాక్టర్లని ఏదోలా ఒప్పించండి’’ అని చేతులు పట్టుకుని చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. నాకూ కళ్లమ్మట ధారలా నీళ్లు కారిపోయాయి గానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అక్కడి నుంచి వచ్చేశాను. డాక్టర్లు ఏమీ చేయాల్సిన అవసరం లేకుండానే మూడో రోజున ఆయన ప్రాణాలు వదిలేశారు. ఇలాంటి సందర్భాలలోనే సరిగ్గా కారుణ్య మరణం అన్న విషయం గుర్తుకొస్తుంది. కానీ మన దేశంలో ఉన్న చట్టాల కారణంగా అది సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. వాళ్లంతా కూడా కారుణ్య మరణం కోసం ఎదురు చూసేవారే.

కారుణ్య మరణం గురించి అప్పటివరకు పేపర్లలో చదవడమే తప్ప, నిజంగా అలా ఎవరైనా కోరుకుంటారని మొదటిసారి తెలిసింది నాకు రాజుగారిని చూసిన తర్వాతే. ఆయన దగ్గరకు వెళ్లినపుడల్లా.. కళ్ల వెంట నీళ్లు కారుస్తూ, ఏదో చెబుదామని అనుకుంటున్నట్లుగా కనిపించేవారు. మాట్లాడదామంటే.. వెంటిలేటర్ అడ్డు. అది తీస్తే ప్రాణం నిలబడటం కష్టం. నోరారా తినడానికి లేదు. లేచి బండి నడపడం సాధ్యమే కాదు. ఇంకా ఎందుకిలా బతకడం అనే ఆయనకూ అనిపిస్తున్నట్లుంది. 

సరిగ్గా అప్పుడే పాసివ్ యుథనేషియా (పరోక్ష కారుణ్య మరణం)ను ఆమోదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్లు పేపర్లలో వచ్చింది. అందులో ప్రత్యక్షం, పరోక్షం కూడా ఉంటాయా అని అనుమానం తలెత్తింది. అవునట.. వెంటిలేటర్ లాంటి లైఫ్ సపోర్ట్ మిషన్ల ఆధారంగా మాత్రమే బతుకుతూ, అది కూడా జీవితం అత్యంత దుర్భరంగా ఉన్నవాళ్లకు ఆ మిషన్లు తీసేస్తే ప్రాణం పోతుందనుకుంటే అది పరోక్ష కారుణ్య మరణం అవుతుంది. కేవలం మిషన్ సపోర్ట్ ఉండబట్టి కొన ప్రాణం నిలబడుతుంది తప్ప శరీరంలో ఏ అవయవమూ సక్రమంగా పనిచేయదు. కళ్లు తెరిచి ఉన్నట్లుంటారు గానీ ఏమీ మాట్లాడలేరు. మనం చెప్పింది వాళ్లకు వినపడిందో లేదో.. అర్థమయ్యిందో లేదో కూడా తెలియదు. అలాంటప్పుడు బతికి ప్రయోజనం ఏంటన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. సరిగ్గా ఇలాంటి సందర్భాలలోనే గౌరవం లేని బతుకు బతకడం కంటే కనీసం గౌరవంగా చస్తేనైనా బాగుంటుందని అనిపిస్తుంది. సరిగ్గా సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయపడింది. ‘జీవించే హక్కు’ అంటే.. అందులో గౌరవంగా మరణించే హక్కు కూడా ఉంటుందని ‘కామన్ కాజ్’ అనే స్వచ్ఛంద సంస్థ వాదించింది. నిజమే మరి.. రోగాల బారిన పడి, శరీరం సహకరించక నానా ఇబ్బందులు పడుతూ, మన పని మనం చేసుకోలేని పరిస్థితుల్లో బతకడం కంటే.. హాయిగా చావడమే మేలని అనిపిస్తుంది. బతికినన్నాళ్లూ రాజాలా బతకాలి, సమయం అయిపోయిందనుకున్నప్పుడు ప్రశాంతంగా తనువు చాలించాలి. అంతే తప్ప జీవచ్ఛవంలా ఆస్పత్రి మంచం మీద పడుకుని కట్టె మాత్రమే ఉందనుకుంటే ప్రయోజనం ఏంటి? కారుణ్య మరణం గురించి కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక చర్చలు జరుగుతున్నాయి. రకరకాల సందర్భాలలో కారుణ్యమరణాన్ని ప్రసాదించమని కోరుకునేవాళ్లు ఉంటారు. ఇలా కోరుకునేవారిలో నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్లు కొందరైతే.. దుర్భర పరిస్థితిలో ఉండేవాళ్లు మరికొందరు. సుప్రీంకోర్టు చెప్పిన వాటిలో రెండు ప్రధానాంశాలున్నాయి. ఒకటి పాసివ్ యుథనేషియా.. అంటే పరోక్ష కారుణ్య మరణం, మరోటి సజీవ వీలునామా. ఇందులో మనం అంతా బాగా ఉండగానే భవిష్యత్తులో ఏదైనా తీవ్ర అనారోగ్యం వస్తే.. అప్పుడు వెంటిలేటర్ మీద పెట్టి నెలల తరబడి ఉంచకుండా మన చావు మనల్ని చావనివ్వాలని ముందుగానే ఒక వీలునామా రాసుకోవడం. మన శరీరం మీద మనకు పూర్తి హక్కులు ఉంటాయని చెప్పడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందుకు కూడా సుప్రీంకోర్టు తన ఆమోదం తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఇలా బాగున్న సమయంలో వీలునామా రాసి ఉండకపోతే, ఆ తర్వాత వాళ్లు చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు బాగా దగ్గరి బంధువులు.. అంటే సొంత కొడుకులు, కూతుళ్లు గానీ తల్లిదండ్రులు గానీ సంబంధిత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి తమ వాళ్లను బలవంతంగా బతికించొద్దని కోరే అవకాశం కూడా ఉంటుందట. 

42 ఏళ్లు కోమాలోనే..
arunaఅరుణా షాన్ బాగ్.. ముంబైలోని కేఈఎం (కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్) ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేవారు. అదే ఆస్పత్రిలో ఒక డాక్టర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. మరి కొన్నాళ్లలో పెళ్లి ఉందనగా.. ఒకరోజు రాత్రి డ్యూటీ ముగించుకుని యూనిఫాం మార్చుకుంటున్న సమయంలో వార్డుబాయ్ ఆమెపై అత్యాచారం చేసి, అరవకుండా మెడకు ఒక చైన్ కట్టేశాడు. ఎనిమిది గంటల పాటు మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటినుంచి 42 ఏళ్ల పాటు అదే ఆస్పత్రిలో కోమాలో ఉన్న ఆమెను ఆస్పత్రి సిబ్బంది, నర్సులు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆమెకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ పింకీ విరానీ అనే జర్నలిస్టు కోర్టును ఆశ్రయించినా.. అది సాధ్యం కాలేదు. చివరకు 42 ఏళ్ల తర్వాత అరుణ న్యుమోనియాతో మరణించారు. ఈ కేసు కారుణ్య మరణం గురించి దేశవ్యాప్త చర్చకు కారణమైంది. 
శ్రీకమల

శ్రుతిహాసన్‌కు మరణం ప్రసాదించండి..
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఒక కేసు వచ్చింది. న్యూరోఫైబ్రోమా అనే వ్యాధితో బాధపడుతున్న తమ కూతురు శ్రుతిహాసన్‌కు కారుణ్య మరణం ప్రసాదించాలని ఆమె తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. తమ కూతురు పడుతున్న నరకయాతనను కన్న తల్లిదండ్రులుగా తాము చూడలేకపోతున్నామని వాళ్లు కోర్టుకు మొరపెట్టుకున్నారు. తెట్టు గ్రామానికి చెందిన చినరెడ్డెప్ప, సునీతలకు శ్రుతితో పాటు మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కూలి చేస్తే తప్ప పూటగడవని ఆ కుటుంబం తమ కూతురి చికిత్సకు రూ. 3 లక్షలకు పైగా ఖర్చుపెట్టింది. అయినా ఫలితం లేదు. తమ కూతురికి కారుణ్య మరణం ప్రసాదించమని కోరుతూ చిత్తూరు జిల్లా మదనపల్లి రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి కేవీ మహాలక్ష్మికి వాళ్లు అర్జీ పెట్టుకున్నారు.

డిప్రెషన్ కూడా కారణమే
కారుణ్య మరణం కోరుకునేవారిలో రకరకాల వాళ్లుంటారు. కేన్సర్‌తో తీవ్రంగా బాధపడేవారు, కేవలం వెంటిలేటర్ మీద ఉండి ఫ్లూయిడ్లతోనే బతికేవారు, టెర్మినల్ కేసులలో మాత్రమే పరోక్ష కారుణ్య మరణానికి అనుమతి ఉంటుంది. పరోక్ష కారుణ్య మరణం అంటే అప్పటివరకు అందిస్తున్న చికిత్స ఆపేసి, వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేసి, ఆక్సిజన్ కూడా తీసేస్తారు. ఆ తర్వాత రోగి పరిస్థితిని బట్టి కొన్ని గంటల నుంచి రోజుల్లోపు మరణం సంభవిస్తుంది. అదే ప్రత్యక్ష కారుణ్య మరణంలో అయితే.. ముందుగా పేషెంటు అనుమతి తీసుకుని.. మెడికల్ బోర్డుకు రిఫర్ చేస్తారు. ఆ వ్యాధికి చికిత్స లేదని, ఎంత చేసినా ప్రయోజనం లేదని వాళ్లంతా నిర్ధారించి.. రోగి కూడా బాధ భరించలేకపోతున్నానని చెబితే అప్పుడు ఒక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా రోగికి మరణాన్ని ప్రసాదిస్తారు. కానీ ఇది ప్రస్తుతం మన దేశంలో అమలులో లేదు. ఒక రకంగా ఇది చట్టపరమైన హత్యే అవుతుంది. నిజంగా తీవ్రమైన వ్యాధులతో బాధపడేవాళ్లు కొంతమంది ఇలా కారుణ్య మరణాన్ని కోరుకుంటే.. ఇంకా చాలామంది పరిస్థితులను ఎదుర్కోలేక కోరుకుంటారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఫ్రస్ట్రేషన్ కారణంగా వాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి మరణాన్ని కోరుకుంటారు. అలాంటి వారు కోర్టుకు వెళ్లినా సాధారణంగా కోర్టులు వాళ్లను మానసిక వైద్యుల వద్దకు చికిత్సకు పంపుతాయి తప్ప వారికి కారుణ్య మరణాన్ని ఆమోదించవు. కారుణ్య మరణం కోరుకునేవారి మానసిక స్థితిని ముందుగా అంచనా వేసిన తర్వాత మాత్రమే అప్పుడు వైద్యపరంగా కూడా అన్ని అవకాశాలూ పరిశీలించి, ఇక మార్గాంతరం లేదనుకుంటే అప్పుడు ఆలోచిస్తారు. 
image

 

 

 

 

డాక్టర్ వెంకట సురేష్
సైకియాట్రిస్టుఆరోగ్యానికి హాస్యరసం

Updated By ManamSun, 03/18/2018 - 02:40

imageప్రపంచ నవ్వుల దినోత్సవం వచ్చిందంటే చాలు, దేశాన్నంతా కడుపుబ్బ నవ్వించడానికి కొందరు తయాైరెపోతారు. నవ్వు అనేది మానవ వికాసానికే కాదు, వ్యక్తిత్వ వికాసానికి కూడా పరాకాష్ఠ. అటు ఆధ్యాత్మికంగా చూసినా ఇటు భౌతికంగా చూసినా నవ్వు అనేది మానసిక, శారీరక ఆరోగ్యానికి మొదటి మెట్టు, చివరి మెట్టు. నవ్వును దృష్టిలో పెట్టుకునే పెద్దలు ఆనందో బ్రహ్మ అనే మాటను సృష్టించారనిపిస్తుంది. ఇంతకీ నవ్వుల దినోత్సవం (జనవరి 10) లేదా నవ్వుల పండుగ నాడు దేశ ప్రజలను నవ్వించేది ఎవరు? ఓ ఏడెనిమిది మంది హాస్య చతురులు, హాస్య ప్రముఖులు ఉన్నారు. వారు దేశం నలుమూలలా పర్యటిస్తూ స్టేజీలు ఎక్కేస్తూ లక్షలాది మందిని తమ సునిశిత హాస్యంతో, మిమిక్రీతో, హాస్య నటనతో నవ్వించేస్తుంటారు. ఇది వరకు జశ్పాల్ భట్టి అని ఉండేవారు గుర్తుందా? ఆయన లాగా అన్న మాట. అలా కడుపుబ్బ నవ్వించి జనాన్ని ఆనంద డోలికల్లో ఓలలాడించే ఏడెనిమిది మంది ప్రముఖ హాస్య చతురుల్లో అమృత్‌సర్‌కు చెందిన భారతీ (లింబాచియా) సింగ్ ఒకరు. ఈ 34 ఏళ్ల మహిళామణి రకరకాల జోకులతో జనాన్ని అటు ఛానల్స్‌లోనూ ఇటు స్టేజీల మీదా కడుపుబ్బ నవ్విస్తుంటారు. ఆమె మీ మీదా, నా మీదే కాదు, తన మీద తాను కూడా జోకులు వేసుకుంటుంటారు. హాలీవుడ్‌లో నాకో ఉద్యోగం ఇవ్వజూపారు. హాలీవుడ్ అని రాసున్న బోర్డు విరిగిపోయిందట. ఆ విరిగిన చోట నన్ను నిలుచోమన్నారు. అదే నా ఉద్యోగం.. అని ఆమె ఇరవై ఏళ్ల ‘ఛోటీ’ కుమారి సింగ్ అంతర్జాతీయ అవార్డ్ గెలిచి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇక్కడ అవార్డ్ గెలవడం ఆదర్శం కాదు. ఆ అవార్డ్ ఆమెను ఎందుకు వరించిందో.. ఆ కారణం ఆదర్శం. అడుగడుగునా కులాధిపత్యం రాజ్యం చేసే బిహార్‌లో అగ్రవర్ణమైన రాజ్‌పుట్ కులానికి చెందిన కుమారి.. సమాజంలో అట్టడుగున ఉన్న ముసహర్ కులాన్ని పైకి తీసుకురావడానికి చేస్తున్న కృషిని స్విట్జర్లాండ్‌కు చెందిన విమెన్స్ వరల్డ్ సమ్మిట్ ఫౌండేషన్ గుర్తించింది. ‘విమెన్స్ క్రియేటివిటీ ఇన్ రూరల్ లైఫ్ అవార్డ్’తో సత్కరించి, వెయ్యి అమెరికన్ డాలర్లను (సుమారు రూ. 65,000) బహుమతిగా అందజేసింది. 1994లో నెలకొల్పిన ఈ పురస్కారాన్ని అందుకున్న అతి పిన్న వయస్కురాలు కుమారీ సింగే! ఆమె ముద్దు పేరు ‘ఛోటీ’! ప్రపంచవ్యాప్తంగా సామాజికంగా అణగారివున్న గ్రామీణ జాతుల్లో జీవన ప్రమాణాల్ని మెరుగు పర్చేందుకు మహిళలు చేసే కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేస్తూ వస్తున్నారు. 

స్టేజీ మీదకు వచ్చీ రాగానే ఓ జోకు పేలుస్తారు. భారతీయలకు తమ మీద తాము జోక్స్ వేసుకోవడానికి ఇబ్బంది పడతారు. పాశ్చాత్య దేశాలలో అయితే, తమ మీద జోకులు వేయాలని, తమ గొంతును అనుకరించాలని వెంట పడతారు...అని అంటారు భారతీ సింగ్.
మరో హాస్య చతురురాలు 34 ఏళ్ల నీతీ పల్టా. ప్రపంచ నవ్వుల దినోత్సవంతో ప్రారంభమై, నెలకు కనీసం పది సార్లు స్టేజీ మీదకెక్కి హాస్య ప్రదర్శనలు ఇస్తారు పల్టా. ఢిల్లీలో ఈమె పేరు చెబితే చాలు, జనం నవ్వేస్తారు. ఆమె ప్రదర్శన ఉందని తెలిస్తే చాలు, జనం ఎంత ఖరీైదెనా టికెట్ కొనడానికి బారులు తీరుతారు. మగవాళ్ల మీద జోకులు వేయడంలో ఆమెకు ఆమే సాటి. ఇక డర్టీ జోక్స్, బరువు మీద జోక్స్, లావు మీద జోక్స్, సమాజం మీద జోక్స్ వేయడంలో ఆమెను మించినవారు లేరు. ఆమె ముందుగా స్క్రిప్ట్ తయారు చేసుకోరు. ఆశువుగా జోక్స్ వేసేస్తుంటారు. ఆమె ఒకసారి స్టేజీ ఎక్కారంటే కనీసం వంద జోక్స్ వేసి, జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేయందే స్టేజీ దిగరు. 

ఇక 39 ఏళ్ల వాసూ పిల్మానీ ఎక్కువగా తన మీదే జోక్స్ వేసుకుంటారు. దేశ నాయకుల మీద, రాజకీయ పార్టీల మీదా కూడా జోక్స్image వేస్తారు. ఆమె వేసే జోక్స్ విని అందరూ మనసారా నవ్వుకుంటారే తప్ప ఎవరూ బాధపడరు. తన భర్త మీదా, పిల్లల మీద కూడా జోక్స్ వేస్తారు. ఆమె స్థానిక జోక్స్ క్లబ్‌కు అధ్యక్షురాలు కూడా. ఈ క్లబ్ సభ్యులంతా సమావేశమై రోజుకు కనీసం రెండు వందల యాభై జోక్స్ వండుతుంటారు. నవ్వుకోండి, నవ్వండి, నవ్వించండి...అనేది వీళ్ల నినాదం, వీళ్ల సిద్ధాంతం. మరో హాస్య మహిళా మణి  అదితీ మిట్టల్ (30). హాస్య ప్రదర్శనలు, హాస్యావధానం నిర్వహించడంలో ఆమెను మించినవారు ఉండకపోవచ్చు. టీవీ ఛాన ల్స్‌లో ఎన్ని ప్రదర్శనలిచ్చారో లెక్క లేదు. మరో రెండేళ్ల వరకూ ఆమెకు తీరిక లేదు. అయినప్పటికీ ప్రపంచ నవ్వుల దినోత్సవం వచ్చిందంటే ఢిల్లీలోనో, ముంబైలోనో ప్రదర్శన ఇవ్వాల్సిందే.

హాస్య శిఖామణులు
ఇటువంటి కవెుడియన్స్‌కు హాస్యమనేది ఓ కళ. స్టార్ వన్‌లో 2008లో మొదటిసారిగా ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్ పోటీని నిర్వహించిన 27 ఏళ్ల సుగంధా మిశ్రా ప్రపంచమంతా తిరుగుతూ హాస్యం కోసం నిద్రాహారాలు కూడా మానేస్తుంటారు. నెలకు ఎంత లేదన్నా పది హాస్య ప్రదర్శనలు ఇస్తుంటారు. జనానికి ఆమెను చూస్తే చాలు నవ్వు వస్తుంది. ఆమె మాట్లాడే ప్రతి మాటా నవ్వు తెప్పిస్తుంటుంది. హాస్య ప్రపంచంలో ఆమెదో స్టార్ స్టేటస్. ఆమె మంచి కవి కూడా. ఆమె కవితల్లో కూడా హాస్యం వ్యక్తమవుతుంటుంది. పద్మిని అనే మరో 35 ఏళ్ల మహిళ కూడా జోక్స్ వేయడంలో చతురురాలు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమె సర్దార్జీ జోక్స్ మాదిరిగానే పంజాబీ మహిళల మీద కూడా చక్కని జోక్స్ వేసి నవ్విస్తుంటారు. జీవితాలను పురుషుల వైపు నుంచే కాదు, మహిళల వైపు నుంచి కూడా చూడగలిగితే జోక్స్‌కు కొదువ ఉండదని కూడా ఆమె అంటారు. 

కామెడీ క్లబ్బులు
image
ప్రపంచ నవ్వుల దినోత్సవం వస్తోందంటే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1600 కామెడీ క్లబ్బులకు చేతి నిండా, నోటి నిండా పని. ఈ క్లబ్బుల్లో సభ్యులుగా ఉండే సుమారు 16 వేల మంది హాస్యప్రియులు పార్కుల్లో, సమావేశ మందిరాల్లో, స్టేజీల మీదా చేరి జోకుల మీద జోకులు వేస్తుంటారు. హైదరాబాద్ నగరంలో కూడా 20కి పైగా లాఫ్టర్ క్లబ్బులు ఉన్నాయి. నిజానికి 1998 ప్రాంతంలో మొట్టమొదటగా ప్రపంచ నవ్వుల దినోత్సవాల్ని సృష్టించింది డాక్టర్ మదన్ కటారియా. ఆయనే మొదటి లాఫ్టర్ క్లబ్ వ్యవస్థాపకుడు కూడా. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా హాస్య యోగా ఉద్యమానికి అంకురార్పణ చేసింది కూడా ఆయనే. విశ్వవ్యాప్తంగా నవ్వుల ద్వారా స్నేహ సౌభ్రాతృత్వాలు పెంపొందించడానికి ఆయన విశేష కృషి చేశారు. సంవత్సరమంతా హాయిగా నవ్వుకోగలిగితే, హాస్యంతో తొణికిసలాడగలిగితే ప్రపంచ శాంతి దానంతటదే సాధ్యమవుతుందని ఆయన భావిస్తుంటారు. 

చాలా కాలంగా ప్రతి ఏటా మే నెల మొదటి ఆదివారం నాడు అనేక దేశాలలో ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. భారత్‌లాంటి మరికొన్ని దేశాల్లో మాత్రం జనవరి 10న ఈ నవ్వుల పండుగను జరుపుకుంటున్నారు. కటారియా ప్రారంభించిన లాఫ్టర్ క్లబ్‌లు బేషరైతెన ప్రేమ, హాస్యాల ద్వారా మానవాళినంతటినీ ఒక్క తాటి మీదకు తీసుకు రావచ్చని భావిస్తుంటాయి. లాఫ్టర్ క్లబ్‌లనేవి కుల మత, లాభాపేక్ష లేని సంస్థలు. ఆరోగ్యాన్ని, శాంతి సౌభాగ్యాలను, సుఖ సంతోషాలను పెంపొందింపజేయడమే వీటి ప్రధాన లక్ష్యం. ఆయన విప్లవాత్మక ఆలోచన లక్షలాది మంది జీవితాలను సమూలంగా మార్చేసింది. వారంతా సుఖ సంతోషాలతో జీవితం గడపడానికి దోహదం చేసింది. ప్రజలను కలపడానికి, కుల మత రహితంగా ప్రజలందరినీ ఒక్క చోటికి చేర్చడానికి నవ్వును మించిన సాధనం మరొకటి లేదు. కటారియాతో ఉంటే చాలు జీవితంలో మార్పు దానంతటదే వచ్చేస్తుంది. జీవితాన్ని సీరియస్‌గా తీసుకోవడమనేది ఎంత సిల్లీ విషయమో తెలిసివస్తుంది. బహుశా ఒక ఆధ్యాత్మికవేత్తకు కూడా జీవితాన్ని ఇంతలా మార్చడం సాధ్యం కాదేమో! హాస్యాన్ని ఒక యోగాగా తీర్చిదిద్దిన హాస్య ఆధ్యాత్మికవేత్త కటారియా. ఆయన ఎక్కడ  ఉంటే అక్కడ నవ్వులే

నవ్వులు
ఉదయమే లేచి ఏ పార్కుకో వెళ్లి అందరూ కలిసి నవ్వడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందంటారు ఆయన. ఓ వందమంది ఒకేసారి పెద్దపెట్టున నవ్వితే కాలుష్యం కూడా కరిగిపోతుందంటారు. ఆయన క్లబ్‌లో సభ్యులు ఓ రెండు వందల మందే ఉండొచ్చు. కానీ, ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లాఫ్టర్ క్లబ్బులతో సంబంధాలున్నాయి. ఆయన స్కైప్‌లో చూసి ఆయా క్లబ్బుల సభ్యులతో మాట్లాడి నవ్విస్తుంటారు. ఈ ప్రపంచంలో నవ్వుకోలేనంత సమస్యేమీ లేదంటారు. దేన్నీ సీరియస్ విషయంగా గుర్తించవద్దంటారు. రోజూ జోక్స్ చదవండి. జోక్స్ వినండి. జోక్స్ పంచుకోండి. మనసారా నవ్వండి. జీవితం పూర్తిగా మారిపోతుంది. జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఆయన డెన్మార్క్‌లోని కోపెన్‌హ్యాగెన్‌లో ఓ పది వేల మందితో నవ్వుల యోగా నిర్వహించి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు. నవ్వు.. నీలో మార్పు వస్తుంది. నీలో మార్పు వస్తే నీ చుట్టూ ఉన్న ప్రపంచమంతా మారిపోతుంది...అని ఆయన అంటారు. నవ్వు వల్ల మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని ఆయన చెబుతారు.

విశాఖపట్నంలో నిరుడు ప్రపంచ లాఫ్టర్ దినోత్సవం నాడు ఫ్రెండ్స్ కామెడీ క్లబ్, లాఫ్టర్ క్లబ్ కలిసి విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో హాస్య ప్రదర్శనను నిర్వహించాయి. ఏడు బృందాలు దాదాపు 30కి పైగా వెరైటీలతో జోక్స్ చెప్పి తెగ న వ్వించాయి. ఉత్తరాంధ్ర యాసలో జోక్స్ వేసినప్పుడు వందలాది జనం పడీ పడీ నవ్వారు. నవ్వడమే సరైన మందు, అనేక సమస్యలకు పరిష్కారం అనేది ఇక్కడ నిజైవెుపోయింది. థియేుటర్లలో, రైలు ప్రయాణాలలో, కోర్టుల్లో, విచిత్ర కుటుంబాలలో....హాస్యాన్ని ఎలా పండించవచ్చు, ఎలా వీక్షించవచ్చు అనేది ఇక్కడ ప్రదర్శన పూర్వకంగా నిరూపించారు. విశేషవేుమిటంటే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని నగరాల్లో ప్రతి ఆదివారం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ నవ్వుల దినోత్సవం నాడైతే ఇదంతా ఒక పండుగలా సాగిపోతుంది. జీవితంలోని చిన్న చిన్న సంఘటనలపై హాస్యాన్ని ఒలికించడం, అందరినీ నవ్వించడం ఈ క్లబ్బుల ఉద్దేశం...అని విశాఖపట్నంలోని ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ వ్యవస్థాపకుడు ఎం.వి. సుబ్రహ్మణ్యం అంటారు. ఈ ప్రశ్నకు బదులేదీ?

Updated By ManamSat, 03/17/2018 - 07:42

imageపూర్వం ఓ రాజుగారుండేవారు. ఆయనకు భోగ భాగ్యాలకేమీ కొదువ లేదు. అయితే, ఒక రోజున హఠాత్తుగా ఆయన మనసులో మూడు ప్రశ్నలు మెదిలాయి. అన్నిటి కంటే ముఖ్యైమెన సమయం ఏది? అందరి కన్నా ముఖ్యైమెన వ్యక్తి ఎవరు? చేయాల్సిన ముఖ్యైమెన పని ఏది?..

ఎంత ఆలోచించినా ఆయనకు ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు తట్టలేదు. ఆయునలో అసహనం, అసంతృప్తి పెరిగిపోయాయి. ఆయన తన మంత్రులందరినీ పిలిచి ఈ ప్రశ్నల్ని వాళ్ల ముందుంచి, సరైన సమాధానం చెప్పమన్నారు. మంత్రులు బాగా ఆలోచించి, మీరు రాజుగా పట్టాభిషేకం చేయించుకున్నప్పటి సమయమే ముఖ్యైవెున సమయం అని మొదటి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజ్యానికి మీరే రాజు కనుక మీరే ముఖ్యైమెన వ్యక్తి అని రెండో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇక మూడో ప్రశ్నకు సమాధానంగా వారు, మీరు రాజ్య విస్తరణ చేపట్టండి. అంతకంటే ముఖ్యైమెన పని ఇంకొకటి లేదని చెప్పారు. మూడు ప్రశ్నలకూ సమాధానాలు వచ్చాయి. అయితే, ఈ సమాధానాలు రాజుగారికి ఏమాత్రం నచ్చలేదు. ఆయన పుర ప్రముఖుల్ని, పండితుల్ని, ఆధ్యాత్మికవేత్తలను పిలిచి ఈ ప్రశ్నలకు సమాధానాలు అడిగారు. సరైన సమాధానం చెప్పినవారికి బహుమతి ఉంటుందని కూడా దండోరా వేయించారు. కానీ, సమాధానం చెబుతానన్న ప్రతివారూ తన తృప్తి కోసం చెబుతున్నారు తప్ప తాను నిజంగా తృప్తి పడే సమాధానాలు చెప్పడం లేదని ఆయన అర్థం చేసుకున్నారు. రాజ్యం పొలివేురల్లో ఓ చిట్టడవిలో జప తపాలలో మునిగి ఉన్న ఓ సాధువు ఆధ్యాత్మికంగా తల పండిన వ్యక్తి అని, ఆయన దగ్గర సమాధానం దొరకవచ్చని ఓ మంత్రి సూచించాడు. దాంతో రాజుగారు ఒంటరిగానే ఆ సాధువు దగ్గరకు బయులుదేరారు. అడవిలో ఓ ఎత్తయిన కొండ మీద ఉన్న గుహలో ఆ సాధువు ధ్యాన ముద్రలో కనిపించాడు. ఆయన ధ్యానానికి భంగం కలిగించడం దేనికనే ఉద్దేశంతో రాజుగారు చాలా సేపు నిరీక్షించారు. ఆయన ఎంత సేపటికీ కళ్లు తెరవలేదు. చూసీ చూసీ రాజుగారు అక్కడే నిద్రపోయారు. పొద్దున్నే నిద్ర లేచి చూసే సరికి ఆ సాధువు గుహలో లేరు.

రాజుగారు  బయుటికి వచ్చి ఆ కొండ ఎక్కి అక్కడి నుంచి తన రాజ్యం వైపు చూశారు. రాజ్యంలోని ప్రజలందరి సంక్షేమం తన మీద ఆధారపడి ఉంది కదా అనిపించింది. తాను క్షేమంగా ఉండడం ఎంత అవసరమో అని అనుకున్నారు ఆయన. ఇంతలో ఆయన భుజాల మీద ఎవరో తట్టినట్టు అనిపించి వెనక్కు తిరిగి చూశారు. సాధువు చిరునవ్వుతో నిలబడి ఉన్నారు. ‘‘ఏం రాజా ఏం ఆలోచిస్తున్నావు?’’ అని అడిగారు. 

కొంత కాలం నుంచి తనను ఓ మూడు ప్రశ్నలు మనసును తొలిచేస్తున్నాయని రాజుగారు ఆ సాధువుకు చెప్పారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన సాధువును కోరారు. సాధువు సరే అన్నారు. రాజుగారు మొదటి ప్రశ్న వేశారు. ‘‘అన్నిటికన్నా ముఖ్యైమెన సమయం ఏది?’’

సాధువు తడుముకోకుండా సమాధానం చెప్పారు. ‘‘ఇప్పుడు! ఇప్పుడంటే వర్తమానం. భవిష్యత్తు ముఖ్యం కాదు, గడిచిపోయినimage కాలం ముఖ్యం కాదు. ఈ క్షణంలో నువ్వెలా ఉన్నావనేది, ఎంత ఆనందంగా, ఎంత బాధ్యతగా ఉన్నావనేది ముఖ్యం. గతించిన కాలాన్ని తీసుకు రాలేం. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో, మనం ఏం కాబోతున్నామో చెప్పలేం. అందుకని వర్తమానమే, ఈ క్షణమే ముఖ్యం’’ అని సాధువు వివరించి చెప్పారు. 
రాజుగారు తృప్తి పడ్డారు. ఆయన తన రెండో ప్రశ్న అడిగారు. ‘‘అందరికన్నా ముఖ్యైమెన వ్యక్తి ఎవరు?’’. సాధువు సమాధానం చెప్పారు. ‘‘మీరే!’’ అన్నారు. 
‘‘నేనా!’’ అంటూ రాజుగారు ఆశ్చర్యపోయారు. ‘‘అవును మీరే. మీకు మీరే ముఖ్యం. మరో వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తే ముఖ్యం. మీరతను చెప్పేది సావధానంగా వినాలి. మరో వ్యక్తి లేనంత వరకూ మీరే ముఖ్యం. ఈ రాజ్య ప్రజల సంక్షేమం మీ మీద ఆధారపడి ఉంది. అందువల్ల మీరే ముఖ్యం. మీ గురించే మీరు తెలుసుకోవాలి’’ అని సాధువు వివరించారు. 
ఇక మూడో ప్రశ్న. ‘‘చేయాల్సిన ముఖ్యైమెన పనేది?’’. సాధువు మళ్లీ సమాధానం చెప్పారు. ‘‘ప్రజల పట్ల దయ కలిగి ఉండడం. వారి సంరక్షణ బాధ్యత తీసుకోవడం. వారిని కన్నబిడ్డల్లా చూసుకోవడం’’.. అని సాధువు వివరించి చెప్పారు. 
రాజుగారు ఆ సమాధానాలు విని సంతృప్తి చెందారు. సాధువుకు నమస్కరించి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోతుంటే సాధువు మరో మాట కూడా అన్నారు. ‘‘ఈ మూడు ప్రశ్నలకూ సమాధానాలు ఒక్కోసారి వ్యక్తిని బట్టి మారుతుంటాయి. మొదటి సమాధానం మాత్రం అందరికీ అన్ని వేళలా వర్తిస్తుంది’’.. అని చెప్పారు. రాజుగారు సంతోషించారు.  
చేతనదీర్ఘాయువు రహస్యం

Updated By ManamSat, 03/17/2018 - 07:42

imageప్రపంచంలో కొంతమంది వందేళ్లు, నూట పదేళ్లు కూడా బతుకుతుండటం చూసి, మనమంతా వాళ్ల వయసులో సగానికి కానీ అంతకంటే తక్కువకు కానీ రాలిపోతున్నప్పుడు వాళ్లు అంత కాలం ఎలా బతుకుతున్నారనే సందేహం మనకు కలిగి తీరుతుంది. జీన్స్ అనేవాటిని బట్టి ఆయువు ఉంటుందని విజ్ఞానశాస్త్ర పరిశోధకులు చెబుతుంటారు. అయితే ఇంకా ఏయే విషయాలు ఆయుష్షును పెంచుతాయి? మనస్తత్వం, మేధకు సంబంధించిన దృక్పథం కూడా కొంతవరకూ పనిచేస్తాయి. సాధారణంగా కులాసాగా, ధైర్యంగా ఉండే ఆశావాది ఎక్కువ కాలం బతుకుతాడు. విచారం, భయం, నిరాశతో కుంగిపోయేవాడు ఎక్కువ కాలం జీవించలేడు. 

థైరాయిడ్, పిట్యూటరీ గ్రంథులకు సంబంధించిన చికాకులు కానీ, అవకతవకలు కానీ.. మేధనూ, శరీరాన్నీ కూడా క్షీణింపజేస్తాయనే విషయం మనకు తెలిసిందే. పిట్యూటరీ గ్రంథులు దెబ్బతిన్నట్లయితే త్వరలోనే వార్థక్యం వస్తుంది. అందుచేత ఎండోక్రైన్ గ్రంథులకూ, మన విరోధియైన వృద్ధాప్యానికీ ఏదో దగ్గర సంబంధం ఉందనుకోవాలి. ఏమైనా మనకు ఉండే ఆర్థిక, సామాజిక సమస్యలు మనకెక్కువ కష్టాల్ని కలిగిస్తున్నాయని మనం నమ్మిననాడు సాధ్యమైనంత వరకు ఆ కష్టాల్ని దూరం చేసుకున్నట్లయితే జీవితం కొంతవరకు కులాసాగా ఉంటుంది. జీవితం ఆనందకరంగా ఉంటే ఆయువు కూడా అదే పెరుగుతుందని నమ్మాలి.ధ్యానంతో గుండె పదిలం!

Updated By ManamSat, 03/17/2018 - 07:42

imageధ్యానాన్ని సాధన చేసేవాళ్లలో గుండె జబ్బు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందా? అవుననే అంటున్నాయి పరిశోధనలు. ఈ పరిశోధనలు మన దేశంలో కాకుండా అమెరికాలో జరుగుతుండటం ఇక్కడ గమనార్హం. విపాసన, సావధాన ధ్యానం (మైండ్‌ఫుల్ మెడిటేషన్), జైన్ మెడిటేషన్, పారమార్థిక ధ్యానం (ట్రాన్సెండెంటల్ మెడిటేషన్) వంటి కూర్చొని చేసే సామాన్యమైన ధ్యానాల ప్రభావంపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. వాటి సమీక్ష ఆధారంగా గుండె సమస్యల కారకాలు, గుండె జబ్బుపై అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఒక శాస్త్రీయ ప్రకటన వెలువరించింది.

ఒత్తిడి, ఆందోళన, న్యూనత వంటి మానసిక రుగ్మతల్ని తగ్గించడానికీ, నాణ్యమైన నిద్రను కలిగించడానికీ, మొత్తంగా ఆరోగ్యంగా జీవించేందుకూ ధ్యానం ఉపకరిస్తుందనేది ఆ పరిశోధనల సారాంశం. గుండె సంబంధ వ్యాధులకు ప్రధాన కారకాల్లో ఒకటైన రక్తపోటును తగ్గించడానికి కూడా ధ్యానం సాయపడుతుంది. ధూమపానాన్ని వదిలేయడానికి తోడ్పడే ధ్యానం.. గుండెపోటు ప్రమాదాన్ని చాలావరకు తగ్గిస్తుంది. 

కాగా, గుండె జబ్బు ప్రమాదాన్ని నిలువరించడానికి అత్యుత్తమ ప్రమాణం గుండె ఆరోగ్య జీవనశైలిని అలవరచుకోవడమేనని ఆ ప్రకటన నొక్కి వక్కాణించింది. అంటే ధూమపానానికి దూరంగా ఉండటం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకర ఆహారం అనేవి ఈ జీవనశైలిలో భాగం. అలాగే అధిక రక్తపోటు, అధిక కొవ్వు, ఇతర గుండె సమస్యలకు మందులు తీసుకోవడం కూడా ముఖ్యమే. ఇవాళ ధ్యాన జ్ఞానం విరివిగా అందుబాటులో ఉంది కాబట్టి మెడిటేషన్‌ను సాధనచేసి మంచి ఫలితాలు అందుకోవడమే తరువాయి.పేగుబంధం తెగిపోయిన జాడ

Updated By ManamSat, 03/17/2018 - 07:38

imageఛత్ నీ యవ్వ ఏం ఊరది? ఊరు గురించి మాట్లాడుకోవడానికి ఏమున్నది? ఊరు ఊరి తీరున్నదా ఏమన్న. ఒకనాడు ఎట్లుండే?! ఇప్పుడెట్లయ్యింది! ఆ ఊరు గురించి తలుసుకుంటే సాలు కన్నీళ్లు ధార గట్టే బాధ కెలుకుతుంటది. అమ్మమ్మ ఊరంటే తియ్యని తీపి ముచ్చట్లు ఉండడానికి ఇప్పుడక్కడ బతుకు పుర్సత్‌గ లేదు. ఒక దోస్తు అడుగుతుండే ‘‘అన్నా మాది మీ అమ్మమ్మ ఊరు పక్కన్నే. ఎప్పుడొస్తరు’’ అని. ఏం చెప్పాలే. ఎప్పుడు పోతనో తెలియదు. ఈ ప్రశ్నకు లోలోపల ఒక అగ్ని పర్వతం బద్దలైంది.
ఎందుకంటే ఇప్పుడు అక్కడ అమ్మమ్మ లేదు. తాత లేడు. బండెడు బలగమున్నా, పలకరించే పరిస్థితి లేదు. అయినా ఆ ముసల్ది బతికున్నప్పుడు దాని విలువ తెలువలే. తాతకు తగ్గ జోడది. తాతకు రోషమెక్కువ. మా అమ్మమ్మకు ఓపికెక్కువ. అందుకే ఆ సంసార బండి కూలబడకుండా యేండ్ల కొద్ది నడిచింది. తాత పోయినంక, కొడుకులు తిండి పెట్టడానికి వంతులు పెట్టి తిప్పే బాధ వద్దనుకున్నదేమో, తాత చూపిన రోషంతోటే తనకో గుడిసె వేయించుకొని తన తిండి తానే వండుకున్నది. నాకిప్పటికీ గుర్తు. అలాంటి ఒంటరి సమయంలో నేను పోయినప్పుడు మీద పడి ఏడ్చిన జ్ఞాపకం. 

అవును దాని పేరు గ్యారవ్వ. నేను పెట్టుకున్న పేరు. అసలు పేరు నర్సవ్వ. నలుగురు బిడ్డెలకు.. అందరికి కొడుకులున్నరు. రోజూ ఎంబడే ఉండే కొడుకుల కొడుకులున్నరు.  అంతమంది ఉన్నా దానికెందుకో నా మీదనే పాణం. బిడ్డె కొడుకునని, తొల్సూరోన్నని ప్రేమతోటి గ్యారెలు చేసుకొని పట్టుకొచ్చేది. గ్యారెలు తెచ్చింది కాబట్టే దానిపేరు ‘గ్యారవ్వ’ అని పిలుచుకున్న. పూలదండల దారం పూలను కలిపినట్టు అందరిని కలిపి ఉంచింది అదే అని, అది సచ్చిపోయినంక ఎరుకయ్యింది.

‘ఏడు తరాలు’ రాసిన అలెక్స్ హేలీ తన మూలాలు వెతుక్కుంటూ పోయినట్టు నేను కూడా బయల్దేరిపోతే, నాకు ఎదురొచ్చి నిలబడేది ఈ ఊరే. మా గ్యారవ్వ ఊరు. పేరు కోనాపురం. ఊరనేమాట ఇనబడితే సాలు, ఎంటనే మనసుల మెరుస్తది. అన్ని ఊర్లకు ఉన్నట్టే ఈ ఊరుది కూడా బతికి చెడ్డతనమే. మా తాత యిల్లు ఎట్లా పడావు పడ్డదో, ఈ ఊరు కూడా అట్లనే ఖరాబయ్యింది. మా అమ్మను కన్నది, ఆ నాయినను కన్నది కాబట్టి నా బొడ్డు పేగు ఈ ఊరితోటే ముడిపడి ఉన్నది.

పసి పోరగానిగా ఉన్నప్పుడు ఊరికిపోతే బొచ్చెడు ముచ్చెట్లు చెప్పింది. చెర్లల్ల ఈతలు, ఈతపండ్ల వేటలు, బాయిల కాడ ఆటలు, కాల్చుకతిన్న కంకులు, జేబుల నింపుకున్న రేగ్గాయలు, చిమచింతకాయలు ఒకటేంది అనేకం పరిచయం చేసింది ఆ ఊరే. గొడ్డును కోసేకాడ పలుచటి తోలు తీసి, పగిలిన కుండ మూతకు కట్టి డప్పుచేసి ఇచ్చింది ఈ ఊరే. ఆ డప్పులు పగిలిపోతే, పోశవ్వతల్లి గుడెనుక చింతచెట్ల కింద పాత చాటల మీద దరువులేసి కొట్టి ఆడింది ఇక్కడే. రాతెండి బేషన్ బోర్లిచ్చి లయ కలుపుతూ దరువులు కొడుతూ, పండు వెన్నెల కింద అద్దుమరాత్తిరి దాకా పాటలు ఊట పారించి, సాయితగాళ్లను ఒక్కచోట చేర్చి ముచ్చట్లు చెప్పింది ఈ ఊరే. ఎన్ని నేర్పిందో ఈ ఊరు? ఈ ఊరికొచ్చిన ప్రతిసారీ బతుకు విలువను గురువు పాఠం చెప్పినట్టే ఇడమరిచి చెప్పింది.
ఎట్టితనం నుండి ఎడ్డితనం దాకా సాగిన జీవిత మలుపులకు, ఒక సజీవ సాక్షి ఈ ఊరే. నన్ను నమ్మురా నేను చూసుకుంటానని చెప్పి, మోసం చేసిన దొరల దాష్టీకానికి బలైపోయిన గుణపాఠం నేర్పింది ఈ ఊరే. ఒక్కపూట కూడా తిండికి లేక అల్లాడిన జీతగాళ్ల దీనగాథల బతుకునంతా కథగా నాయిన చెప్పింది ఈ ఊరు గురించే.

ఏందో ఊరు సూత్తాంటే సూత్తాంటెనే కట్టె సరుచుకు పోయింది. కంటె బొక్కలు తేలిన ముసల్ది అయిపోయింది. మనుషులు మనుషుల తీరు లేరు. ఎవ్వరి జీవితాలు నిలకడగా లేవు. దేనికోసమో పరుగులాట. ఎందుకోసమో వెతుకులాట. అరెకురం, ఎకురం భూములు కాళ్ల కింది నుండే కదిలిపోయినయి. అవసరాలకో, ఆపదలకో కొంచెం కొంచెంగా కరిగి పోయినయి. పనులు లేవు. పసులు లేవు. పచ్చి గుడంబ ఇచ్చే ఓదార్పులు ఒళ్లును కాదు ఇల్లును గుల్ల చేస్తుంటది. ఐదేళ్లకోసారి మా వాళ్లంతా లైన్లో నిలబడే ఓటర్లు తప్ప, సర్కారు, రాజకీయ పార్టీల దృష్టిలో మరేం కారు. గరీబీ హటావో అన్నోళ్లున్నరు. అంతా హైటెక్కు అన్నరు. దేశం ఎలిగిపోతుందన్నరు. ఇప్పుడు అంతా బంగారు తెలంగాణ అంటున్నరు. ఎందరు ఎన్ని అన్నా మా అమ్మమ్మ ఊరు మాత్రం ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యలేక పోయింది. సర్కారు బడి సతికిల బడ్డది. సీసీ రోడ్ల తీరు, సంక్షేమం మా వెలివాడను తాకకుండానే ఆగిపోయింది. మనిషెనుక మనిషి ఒక్కరొక్కరుగా మాయమైపోయారు. పండు ముసలోల్లు కాదు, పడుసు పోరగాళ్లు కూడా మటమటాన మాయమైపోయారు. పిట్టల లెక్క నేల రాలిపోయారు. యిండ్లు కళ తప్పినయి.

మా అమ్మమ్మ ఊరిలో మావాళ్లకు పెద్దగా ఆశలేం లేవు. ఆ పూటకు బతికుంటే చాలనుకోవడమే అక్కడ అతిపెద్ద ఆశ.  బంగ్లాలు, భవంతులు, బంగారాలు, పట్టుబట్టల మీద మోజు కాదు, ఆశ కూడా లేదు. ఈ పూట గడిస్తే, రేపటికి తెల్లారితే చాలుననుకునే తనం నాకిప్పుడు అడుగడుగునా కనిపిస్తున్నది. తెల్లారితే చాలుననుకొని బతికినోళ్ల బతుకులన్నీ తెల్లారిపోయిన విషాదానికి 
మౌనసాక్షి  ఆ ఊరే. ఔను.. ఈ ఊరే మమ్ముల కట్టుబట్టలతో పట్నం దారి పట్టించింది. అదే మంచిదైంది. లేకుంటే మా బతుకులు కూడా ఏమయ్యేటియో!!
     పసునూరి రవీందర్, 7702648825

Related News