Vijaya Sai Reddy

సభా రభస

Updated By ManamWed, 07/25/2018 - 01:07
  • హోదాపై దద్దరిల్లిన రాజ్యసభ

  • విభజన హామీలు నెరవేర్చండి

  • స్వల్పచర్చలో సభ్యుల డిమాండ్

PARLIAMENTన్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిం చే అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది. హోదా పై మంగళవారం జరిగిన స్వల్ప కాలిక చర్చలో టీడీపీ, కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల నేతలు కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం కూడా అదేస్థాయిలో దీటుగా సమాధానమి చ్చింది. రాజ్యసభలో మధ్యాహ్నం రెండు గంటలకు మొదలైన చర్చ దాదాపు సాయంత్రం ఆరు గంటల వరకు కొన సాగింది. మొదట టీడీపీ పార్లమెంటరీ నేత సుజనా చౌదరి చర్చను  ప్రారంభిస్తూ.. కేంద్రం విభజన హామీలను విస్మరించిందని, దాంతో రాష్ట్ర భవిష్యత్ అంధకారంలో పడిందని మండిపడ్డారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేవారు. ఏపీపై కేంద్ర వైఖరి సామూహిక దాడుల తరహాలోనే ఉందని, సహకార స్ఫూర్తిని కేంద్రం తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. 

సానుభూతితో వ్యవహరించాలి: ఆజాద్
కొత్తగా ఏర్పడిన ఏపీ పట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు గులాంనబీ అజాద్ అన్నారు. ఏపీతో తనకు ఎంతో అనుబంధం ఉందని, రాష్ట్రానికి చెందిన అనేక అంశాలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. తెలంగాణకున్న అవకాశాలు ఏపీకి లేవని, ప్రత్యేక తెలంగాణ కోరుకోవడం ఎంత సమంజసమో.. ఏపీ ప్రజలు హోదా కోరుకోవడం అంతే సమంజసమని ఆజాద్ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామని కేంద్రం అన్నదని, ప్యాకేజీ కింద రూ. 16 వేల కోట్లు ఇస్తామని చెప్పి కేవలం రూ. 400 కోట్లే ఇచ్చిందని అజాద్ ఆరోపించారు. అమరావతి నిర్మాణానికి కనీసం రూ. 10 వేల కోట్లు అవసరముండగా కేవలం రూ.1500 కోట్లే కేంద్రం ఇచ్చిందన్నారు. పసిబిడ్డ లాంటి ఏపీకి కేంద్రం చేయూతనివ్వాలని కోరారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: మన్మోహన్‌సింగ్
ఏపీ అభివృద్ధికి పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని కచ్చితంగా అమలు చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు ప్రధాని హోదాలో తాను హామీ ఇచ్చానని అన్నారు. తమ తర్వాత వచ్చిన ప్రభుత్వం హోదా హామీని అమలు చేయలేదని, నాడు పార్లమెంటులో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు.

ఏపీకి ప్రత్యేకహోదానే సంజీవని: విజయసాయి
ఏపీకి ప్రత్యేక హోదానే సంజీవని అని వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం సబబు కాదని, అందుకోసం గత నాలుగేళ్లుగా వైసీపీ పోరాడుతోందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని అని టీడీపీ నమ్మడం లేదని, వైసీపీ, కమ్యూనిస్ట్ పార్టీ, జనసేన పార్టీ నమ్ముతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు జీవన్మరణ సమస్య అని తెలిపారు. హోదా రాకపోవడానికి మొదటి ముద్దాయి బీజేపీ అని, రెండో ముద్దాయి టీడీపీ అని, మూడో ముద్దాయి కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తర్వాతి ప్రభుత్వాలు గౌరవించాలని, ఈ కారణంగానే విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ప్యాకేజీని అంగీకరించారుగా?: జీవీఎల్
ఏపీకి హోదా విషయంలో కేంద్రం ప్రభుత్వంపై కొన్ని పార్టీలు దుష్రపచారం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే హోదా అంశాన్ని ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. ప్యాకేజీని అంగీకరించిన తర్వాత హోదా మాట ప్రస్తావన ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. బీజేపీ వల్లే ఏపీకి పెద్ద ఎత్తున నిధులు, ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు. ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తూ ఏపీ అసెంబ్లీ కూడా తీర్మానం చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రెవెన్యూలోటు కింద ఏపీ ఈ ఐదేళ్లలో  రూ.22,130 కోట్లు అందుకుంటోందని జీవీఎల్ చెప్పారు. ఇక్కడ కేవలం యూటర్న్‌లు తీసుకోవడమే కాదని, చాలా టర్న్‌లు ఉన్నాయన్నారు. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 12 వేల ఎకరాలు సేకరించాల్సి ఉండగా, 2 వేల ఎకరాలే సేకరించారని అన్నారు. ఏపీకి మోదీ అందించిన వరం పోలవరం అని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని ఏపీ ప్రభుత్వానికి పబ్లిసిటీపైనే ఆసక్తి ఉందని చెప్పారు. బీమా పథకంపై కూడా ఏపీ ప్రభుత్వం ప్రజల్లో తప్పుగా ప్రచారం చేస్తోందన్నారు. అది చంద్రన్న బీమా కాదు మోదీ బీమా అని పేర్కొన్నారు. జీవీఎల్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు కాసేపు అడ్డుతగిలడంతో సభలో గందరగోళం ఏర్పడింది.

హోదా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం చెప్పిందా?: సీఎం రమేశ్
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రులు అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ మండిపడ్డారు. హోదా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం చెప్పిందా? అని కేంద్రాన్ని నిలదీశారు. ఇలా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం సిఫారసు చేసినట్లుగా రుజువు చేస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ప్రముఖ విద్యాసంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని, మరి ఏపీ విద్యార్థులు ఎక్కడికి వెళ్లి చదువుకోవాలని నిలదీశారు. ఏపీలో బీజేపీకి ఓట్లు , సీట్లు లేవు కనుకే ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. టీడీపీని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు యత్నిస్తోందని అన్నారు. సీఎం చంద్రబాబునాయడు 29 సార్లు ఢిల్లీకి వచ్చి మంత్రులను కలిశారని, కానీ ఒక్కపైసా విదల్చలేదన్నారు. కానీ ఇప్పుడేమో తాము యూటర్న్ తీసుకున్నామని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రధాని ఒక్కసారికంటే ఎక్కువగా ఎప్పుడైనా వచ్చారా? అని నిలదీశారు. హోదా ఇవ్వాలంటే అది ఉండాలి, ఇది ఉండాలని సాకులు చెబుతున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు.. ప్రధాని తిరుపతికి వచ్చినప్పుడు ఆ విషయం తెలియదా? అని ప్రశ్నించారు.

హామీలు నెరవేర్చాల్సిందే: కేకే
ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిందేనని టీఆర్‌ఎస్ ఎంపీ కేశవరావు అన్నారు. విభజన చట్టంలో ఏపీ, తెలంగాణకు ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేర్చాల్సిందేనన్నారు. విభజన హామీల అమలు విషయంలో తెలంగాణ కూడా నష్టపోయిందన్నారు. కాగా, విభజనతో నష్టపోయిన  ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఎస్పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చారని ఆయన సభకు గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని బీజేడీ ఎంపీ ప్రసన్న ఆచార్య కోరారు. అన్నాడీఎంకే ఎంపీ నవనీత కృష్ణన్ మాట్లాడుతూ.. ఏపీపై కేంద్రం వివక్ష చూపడం సరికాదన్నారు. నష్టపోయిన ఏపీని కేంద్రం న్యాయం చేయాలని కోరారు.చంద్రబాబు శ్రద్ధంతా అవినీతిపైనే

Updated By ManamMon, 06/25/2018 - 12:26

Vijayasai reddy అమరావతి: చంద్రబాబు శ్రద్ధంతా అవినీతిపైనే ఉందని, నాలుగేళ్లలో తండ్రి కొడుకులు రూ.3లక్షల కోట్లకు పైగా దోచుకున్నారని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లైనా వంశధార ఫేజ్-2 పూర్తి కాలేదని అన్న విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర కుంటుపడేలా చేసిన వ్యక్తి చంద్రబాబునే అని మండిపడ్డారు. చంద్రబాబును ఇంటికి పంపేందుకు జనం ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక పొత్తు విషయంలో జగన్‌దే తుది నిర్ణయమని, ప్రత్యేకహోదాకు సహకరించే పార్టీలకే వైసీపీ మద్దతిస్తుందని విజయసాయి రెడ్డి తెలిపారు. అలాగే ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన వారు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డిలకు టీటీడీ నోటీసులు

Updated By ManamWed, 06/13/2018 - 12:56
Vijaya Sai Reddy

తిరుమల: శ్రీవారి మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు, వైసీపీ నేత విజయసాయిరెడ్డిలకు తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థ(టీటీడీ) నోటీసులు జారీ చేసింది. పరువుకు భంగం కలిగేలా వారు చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో కోరింది. వివరణ ఇవ్వకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నోటీసులలో తెలిపింది.

కాగా గత కొన్ని రోజులుగా టీటీడీపై రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్నారు. టీటీడీలో రాజకీయాలు ఎక్కువ అయ్యాయని, స్వామి వారి నగలను అమ్మేశారని ఆయన ఆరోపణలు చేశారు. మరోవైపు టీటీడీకి చెందిన కొన్ని ఆభరణాలు సీఎం చంద్రబాబు నివాసంలో ఉన్నాయని విజయసాయి రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.పాదయాత్ర చేయనున్న విజయసాయి రెడ్డి

Updated By ManamSun, 04/29/2018 - 15:13

Vijaya Sai Reddy విశాఖపట్నం:  వైసీపీ అధనేత జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పాదయాత్రను చేయనున్నారు. మే 2వ తేది ఆయన పాదయాత్ర చేయనున్నట్లు వైసీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ తెలిపారు. ఆగనంపూడిలోని వైఎస్సార్ విగ్రహం వద్ద పాదయాత్ర ప్రారంభం కానుందని.. పెందుర్తి, విశాఖ పశ్చిమ, ఉత్తర, తూర్పు నియోజకవర్గాల మీదుగా దక్షిణ నియోజకవర్గానికి ఈ యాత్ర ఉండనుందని విజయ ప్రసాద్ తెలిపారు. యాత్రలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ప్రజా సమస్యలు తెలుసుకుంటారని పేర్కొన్నారు. ఇక మే 12న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు విజయ ప్రసాద్ వెల్లడించారు.
 టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు

Updated By ManamMon, 04/16/2018 - 09:01

Vijay Sai Reddy అమరావతి: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంతోమంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. వారంతా తమ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తిచూపుతున్నారని, వీరి విషయంలో జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. విశాఖ పాతగాజువాకలో వైసీపీ దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎర్రచందనం విక్రయిస్తే వచ్చే డబ్బుతో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. చైనాకు అటవీ కార్యదర్శిని పంపి రూ.10వేల కోట్ల రూపాయాలతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 29సార్లు ఢిల్లీ వెళ్లినా చంద్రబాబుకు ప్రత్యేకహోదా గుర్తురాలేదని.. అలాంటిది ఇప్పటికిప్పుడు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు, లోకేశ్ అవినీతిపైనా, వారికి సహకరించిన అధికారులపైనా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.బాబు లోకేశ్‌కు అన్ని 'అ' శాఖలు ఇచ్చారు

Updated By ManamTue, 04/03/2018 - 14:59

Vijaya Sai Reddy న్యూఢిల్లీ: నారా లోకేశ్‌కు చంద్రబాబు అన్ని 'అ' శాఖలు ఇచ్చారని.. అందులో అన్యాయం, అక్రమం, అవినీతి ఉన్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మాట్లాడిన ఆయన.. మమ్మల్ని విమర్శించడం కాదు, ముందు మీపై వచ్చిన ఆరోపణలు బదులివ్వండి అంటూ అన్నారు.

ఇక లోపాయికారి ఒప్పందం చేసుకునే నేర్పరితనం తనకు లేదని, హోదాపై ఎవరు డ్రామాలాడుతున్నారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. పోలవరం, రాజధాని, విదేశీ పర్యటనలు, కాల్ మనీ, సెక్స్ రాకెట్ అంశాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నామని.. మొత్తం 10 అంశాలపై చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే పవన్ చేసిన ఆరోపణలకు చంద్రబాబు, లోకేశ్‌లే సమాధానం చెప్పాలని విజయసాయి రెడ్డి అన్నారు.విజయసాయి వ్యాఖ్యలు దుర్మార్గానికి పరాకాష్ట: చంద్రబాబు

Updated By ManamWed, 03/28/2018 - 10:33

Chandrababu, Vijaya Sai Reddy అమరావతి: ఎవరికైనా తల్లిదండ్రులు దైవంతో సమానమని.. చనిపోయిన నా తల్లిదండ్రులను నిందించడం దారుణమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు, అతడి వ్యాఖ్యలు దుర్మార్గానికి పరాకాష్ట అని అన్నారు. తల్లిదండ్రులను నిందించడం భారతీయ సంప్రదాయామా? అంటూ ప్రశ్నించారు. అలాగే ప్రధాని కాళ్లకు మొక్కడం భారతీయ సంప్రదాయమా అని అడిగిన చంద్రబాబు.. ఇలాంటి వాళ్లను ప్రధాని కార్యాలయం చేరదీస్తోందని తెలిపారు. రాష్ట్రం, ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా సహిస్తానని పేర్కొన్నారు. ఇక ఎవరితోనూ రహస్య మంతనాలు జరపొద్దని.. పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసేలా వ్యవహరించొద్దని పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు.హోదా విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు

Updated By ManamThu, 03/01/2018 - 14:31

Vijaya Sai Reddy విశాఖపట్నం: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని వైసీపీ పోరాడుతుంటే.. టీడీపీ మాత్రం రోజుకో మాట చెబుతుందని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా కోరుతూ విశాఖ కలెక్టరేట్ వద్ద వైసీపీ ధర్నా నిర్వహించగా.. అందులో విజయ సాయి రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ సాయిరెడ్డి ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, హోదా విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హోదా ఉన్న రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధించాయని కానీ సీఎం చంద్రబాబుకు మాత్రం ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదంటూ మండిపడ్డారు. మరోవైపు వైసీపీ సమక్షంలో రాష్ట్ర కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి.
 

Related News