Kurnool

టీడీపీ కార్యకర్త దారుణ హత్య

Updated By ManamSat, 11/10/2018 - 09:21
 • కళ్లలో కారం చల్లి, కత్తులతో దాడి...

 TDP worker Someswar Goud Brutally murder in Kurnool

కర్నూలు : జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పడగ విప్పింది. పాత కక్షల కారణంగా టీడీపీ కార్యకర్త సోమేశ్వర్ గౌడ్‌ను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే... దేవనకొండ మండలం కె.వెంకటాపురానికి చెందిన సోమేశ్వర్ గౌడ్‌ను పాత తగాదాలతో ప్రత్యర్థులు దారికాచి, దారుణంగా హతమార్చారు. శుక్రవారం రాత్రి కుమారుడు శివతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్న సోమేశ్వర్ గౌడ్‌‌పై అటాక్ చేశారు. కళ్లలో కారం చల్లి, కత్తులతో దాడికి పాల్పడ్డారు. 

ఈ సంఘటనలో శివ, స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడగా అతడి తండ్రి మరణించాడు. అంతకు ముందు తీవ్ర రక్తస్రావంతో పడిఉన్న సోమేశ్వర్ గౌడ్‌ను స్థానికుల సాయంతో శివ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే చనిపోయాడు. కాగా తన తండ్రి హత్యకు పాతకక్షలే కారణమని, నిందితులను కఠినంగా శిక్షించాలని అతడు డిమాండ్ చేశాడు. లేకుంటే తనకు కూడా ప్రాణహానీ ఉందని వాపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కర్నూలులో రేవ్ పార్టీ కలకలం

Updated By ManamFri, 11/09/2018 - 14:40
 • ఎరువుల కంపెనీ ఏజెంట్లకు విందు

 • మద్యం తాగి మహిళలతో అశ్లీల నృత్యాలు

 • గతంలోనూ రేవ్‌పార్టీ.. పట్టుకున్న షీ టీమ్

Rave partyకర్నూలు క్రైమ్: ఇన్నాళ్లూ హైదరాబాద్, బెంగుళూరు, తదితర మెట్రో నగరాలకే పరిమితమైన రేవ్ పార్టీలు కర్నూలుకు కూడా చేరుకుంటున్నాయి. నగరం నడిబొడ్డున బుధవారం జరిగిన రేవ్ పార్టీ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక శరీన్ నగర సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఎరువుల కంపెనీ ఒకటి తమ డీలర్లకు విందు ఏర్పాటు చేసింది.

నిర్ణీత సమయానికి అమ్మకాలు బాగా జరపడంతో.. ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలను తీసుకువచ్చి విందులో చుక్క, ముక్కతో పాటు మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ ఎంజాయ్ చేశారు. మద్యం తాగిన కొంతమందికి కిక్కు ఎక్కి నృత్యం చేస్తున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో గొడవ మొదలైంది.

దాంతో రేవ్ పార్టీని అర్ధాంతరంగా ముగించారు. గతంలో కూడా రాజవిహార్ సెంటర్లోని ఒక హోటల్లో ఫర్టిలైజర్ డీలర్లు రేవ్ పార్టీ ఏర్పాటు చేసి షీటీం పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. అప్పట్లో డీలర్లతో పాటు ఒక సీఐ కూడా అడ్డంగా దొరికిపోయి సస్పెండయ్యారు. ఆ ఘటన మరువకముందే నగరంలో మరో రేవ్‌పార్టీకి తెరతీయడం కల్లోలం రేపుతుంది.కర్నూలులో విద్యార్థిని గొంతు కోసిన టీచర్

Updated By ManamSat, 11/03/2018 - 13:14
Teacher Allegedly Slits Teen Throat For Rejecting His Advances

కర్నూలు : నగరంలో దారుణం చోటుచేసుకుంది. బంగారుపేటకు చెందిన ఓ విద్యార్థినిపై ఉపాధ్యాయుడు దాడి చేశాడు. రాక్ వెల్ హైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్న శంకర్ ... శనివారం ఉదయం విద్యార్థిని ఇంటికి వెళ్లాడు. ఆమెపై దాడి చేసి, బ్లేడ్‌తో విద్యార్థిని గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. దాడి అనంతరం శంకర్ తన గొంతు కూడా కోసుకున్నాడు. మద్యం మత్తులో అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

అయితే విద్యార్థిని అరుపులు విన్న స్థానికులు..శంకర్‌ను పట్టుకుని చెట్టుకు కట్టేసి, దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. 

ఉపాధ్యాయుడుపై సస్పెన్షన్ వేటు
బంగారుపేటలో 9వ తరగతి విద్యార్థిని దాడి చేసిన హిందీ పండిట్ శంకర్‌పై సస్పెన్షన్ వేటు పడింది.  మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఈవో ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి గంటా గాయపడిన విద్యార్థినికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.వణికిస్తున్న స్వైన్ ఫ్లూ

Updated By ManamTue, 10/23/2018 - 06:28
 • కర్నూలు జిల్లాలో 19 కేసులు 

 • రెండు వారాల్లో ఆరుగురి మృతి

 • మరో 13 మందికి వ్యాధి లక్షణాలు

 • ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం.. మందుల కొరత

KURNOOLకర్నూలు: కర్నూలు జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి వణికిస్తోంది. 19 మంది ఈ వ్యాధి బారిన పడగా, వారిలో ఆరుగురు మృతి చెందారు. మరో 13 మంది వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో వైద్య, ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. ఇంత జరుగుతున్నా ఆ శాఖ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన మొదలైంది. స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రమాదకరమే అయినా అప్రమత్తతతో మెలగడం ద్వారా మొదటి దశలోనే నివారించుకోవచ్చని వైద్యుల సూచిస్తున్నారు. అయితే ఆ దిశగా పలాంటి చర్యలు చేపట్టకపోవడం ఒకింత ఆందోళన కలిగించే విషయం.  జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి స్వైన్‌ఫ్లూ బాధితులకు చికిత్స నిర్వహిస్తున్నా, కావాల్సిన మందులు, మాస్క్‌ల కొరతపై ఉన్నతాధికారులు నివేదికలు పంపించినట్లు తెలుస్తోంది. బ్రాహ్మణకొట్కూరు ప్రాంతానికి చెందిన మహిళ ఈ నెల 8న జ్వరంతో బాధపడుతూ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. వైద్యుడు పరీక్షలు జరిపి మెరుగైన వైద్యం కోసం కర్నూలు సర్వజన ఆసుపత్రికి పంపారు. అప్పటికే పాములపాడు మండలం నుంచి మరో మహిళ ఇవే లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బ్రాహ్మణకొట్కూరుకు చెందిన మహిళ శుక్రవారం మృతి చెందారు. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలానికి చెందిన మరో మహిళ కర్నూలు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతా వరణం నెలకొంది. దీంతోపా టు సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి.  ఇవేకాక విషపూరిత జ్వరాలు విజృంభిస్తున్నాయి. వీటిపై ఆరోగ్య శాఖ ప్రత్యేక చొరవ చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి. 

అప్రమత్తత అవసరం :
జిల్లాలో స్వైన్‌ఫ్లూ రోజు రోజుకు విజృంభిస్తుండడంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం పంతైనా ఉంది. జిల్లాలోని పలు దేవాలయాల్లో, ఆర్టీసీ బస్టాండ్‌లలో, రైల్వే స్టేషన్‌లలో, సినిమా థియేటర్లలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వ్యాధి లక్షణాలపై అప్రమత్తం చేయడం పంతైనా అవసరం. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మాస్క్‌లు అందించి వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. 

చంద్రబాబు ఆరా :
కర్నూలు జిల్లాలో ఇప్పటికే స్వైన్‌ఫ్లూతో ఆరుగురు చనిపోగా, మరో 13 మంది చికిత్స పొందుతుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ పనితీరు పట్ల వెంటనే నివేదికలు అందించాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా పలాంటి నిర్లక్ష్యం వహించినా ఆ శాఖ అధికారులు బాధ్యత వహించాలని హెచ్చరించారు.రక్తమోడిన దేవరగట్టు

Updated By ManamSat, 10/20/2018 - 09:04

Several injured during Banni at Devaragattuకర్నూలు : కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టు రక్తమోడింది. బన్సీ ఉత్సవంలో కర్రల సమరంలో తలలు పగలి...రక్తం చిందింది. శ్రీ మాలమల్లేశ్వరుల స్వామి బన్ని ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శుక్రవారం ఉత్సవాలు ప్రారంభం కావడానికి ముందు వారు మూడు ఔట్లను పేల్చుతూ అర్థరాత్రి నెరణికి, కొత్తపేట, తాండ్ర గ్రామాలకు చెందిన భక్తులు అగ్గి దివిటీలతో, కాగడాలతో రింగు కర్రలను చేతిలో ధరించి డిర్ర్ గోబరాక్ అంటూ దేవాలయాన్ని చేరుకున్నారు.

ఉత్సవ విగ్రహాలను తీసుకుని అరనిమిషంలో కల్యాణకట్టకు చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఎల్లార్తి, సులువాయి, అరికెర, బిలేహులు గ్రామాల భక్తులు వారిని అడ్డుకోగా భీకరంగా కర్రల సమరం మొదలైంది. అనంతరం విగ్రహాలకు కల్యాణం జరిగి తిరిగి ఉత్సవాలను ఎదురు బసవన్నగుడికి చేరుకునేలోపు మరోసారి భీకరంగా కర్రల సమరం మొదలైంది. 

చాలామంది భక్తుల తలలు పగలగా, వైద్యులు వెంటనేవారికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను శమీ వృక్షం, పాదాలకట్ట, రాక్షపడికి చేరుకొన్నారు. తిరిగి శనివారం ఉదయం అయిదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ఉత్సవ విగ్రహాలు చేరుకోగా మరోసారి భీకర పోరు జరిగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే బన్సీ ఉత్సవాల్లో హింస లేకుండా జరుపుకోవాలని పోలీసులు, ప్రభుత్వం పిలుపునిచ్చినా, భక్తులు మాత్రం తమ ఆచార, వ్యవహారాలను వదిలిపెట్టడం లేదు. బన్సీ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. తలలు పగిలినా, రక్తం చిందినా వారు మాత్రం ప్రతి ఏడాది ఉత్సవాల్లో పాల్గొంటూనే ఉంటారు.గట్టుపై పట్టెవరిది?

Updated By ManamWed, 10/17/2018 - 23:11
 • రేపే దేవరగట్టులో కర్రల సమరం

 • గ్రామాలను జల్లెడ పట్టెన పోలీసులు

 • పట్టుడు కర్రలు, నాటు సారా స్వాధీనం 

 • ఉత్సవంగా జరుపుకోవాలన్న పోలీసులు

 • జైత్రయాత్రకు సిద్ధమవుతున్న ప్రజలు

 • భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

KURNOOLకర్నూలు: విజయ దశమి వచ్చిందంటే చాలూ.. అందరి కళ్లు దేవరగట్టు కొండపైనే పడతాయి. కారణం.. పండుగరోజు ఆర్ధరాత్రి శ్రీ మాళ మల్లేశ్వర స్వామిని దక్కించుకునేందుకు సమీప గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి సాగించే కర్రల సమరం చిన్న పాటి యుద్ధాన్నే తలపిస్తుంది. అర్ధర్రాతి నుంచి తెల్లవారు జాము వరకు సాగే ఈ కర్రల సమరంలో పదుల సంఖ్యలో గాయపడటం పరిపాటిగా మారింది. ఈ కర్రల సమరాన్ని నిరోధించేందుకు జిల్లా అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నా.. ప్రతి ఏటా ఆచారానిదే పైచేయిగా నిలుస్తోంది. మానవ హక్కుల సంఘాలు ఆదేశించినా ప్రజలు ఆచారంవైపే మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ ఏడాది రక్తపాతం తగ్గించేందుకు అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దేవరగట్టు సమీప గ్రామాలన్నింటిని జల్లెడ పట్టి పట్టుడు కర్రలు, నాటుసారా బట్టీలు ధ్వంసం చేశారు. ఉత్సవాల్లో పట్టుడు కర్రలు లేకుండా పాల్గొనాలని సూచిస్తున్నారు. అంతేకాక ప్రశాంతంగా జరిగేందుకు గట్టుపై అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్లు, బాడీ ఓన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం జరిగే ఈ సమరానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసిన వైనంపై ‘మనంన్యూస్’ ప్రత్యేక కథనం.. కర్నూలు జిల్లా హొళగుండ మండలం దేవరగట్టులో పార్వతి, పరమేశ్వరులు శ్రీ మాళ, మల్లేశ్వర స్వాములుగా కొలువుదీరారు. ప్రతి ఏటా దసరా పండుగ రోజున సమీప గ్రామాల ప్రజలు ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 14 నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఉత్సవాల్లో దసరా దశిమి రోజు నిర్వహించే బన్ని జైత్రయాత్ర ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీ మాల మల్లేశ్వర స్వామి అమ్మవార్లకు అనాధిగా రక్షకులుగా ఉన్న నెరణికి, నెరణికితాండ, కొత్తపేట గ్రామాలకు చెందిన భక్తులు వేలాది మంది బీరప్ప డోళ్ళు, తాళాలతో డు..ర్.్ర.ర్.్ర.గోఫరాక్ అంటూ కేకలు వేస్తు పరుగులు తీస్తు వస్తారు. దేవరగట్టు సమీపంలోని డోళ్ళు బండ వద్దకు చేరుకుని పాల భాష (ప్రమాణం) చేసుకుంటారు. అనంతరం కొండపై ఉన్న దేవాలయంలో స్వామి వార్లకు ఆలయ అర్చకులతో కల్యాణోత్సవం నిర్వహిస్తారు. స్వామి వార్ల విగ్రహ మూర్తులు, పల్లకీలను మోసుకుని ఆ గ్రామాల భక్తులు జైత్రయాత్రలో పాల్గొంటారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు అరికెర, ముద్దనగేరి, కురకుంద, బిళేహల్, నిట్రవట్ట, విరుపాపురం, సుళవాయి, ఎల్లార్తి తదితర గ్రామాల భక్తులు కర్రలు, అగ్గికాగడాలతో గోఫరాక్ అంటూ కేకలు వేస్తు ఆ మూడు గ్రామాల భక్తులకు అడ్డుగా వస్తారు. విగ్రహ మూర్తులు జైత్రయాత్రలో వెళుతున్న ఆ మూడు గ్రామాల భక్తులు కర్రలు, అగ్గికాగడాలతో తరిమికొడతారు. దీంతో పదుల సంఖ్యలో భక్తులకు తలలు పగలడంతో పాటు ఒళ్లు కూడా కాలిపోతుంటాయి. కర్రల సమరంగా ప్రసిద్ధి చెందిన ఈ బన్ని ఉత్సవం వెనుక అనేక పురాణగాథలు ఉన్నాయి.  

కూర్మావతారంగా వెలసిన మల్లేశ్వరుడు
పూర్వకాలం మణి అసురా, మల్లాసురా అనే ఇద్దరు రాక్షసులు.. లోకకల్యాణం కోసం తపస్సు చేసే రుషులను హింసిస్తూ తపస్సును భంగం కలిగంచేవి. ఆ రాక్షసుల భారీ నుంచి కాపాడలని రుషులు విష్ణువు వద్దకు వెళ్లి వేడుకుంటారు. విష్ణువు పరమేశ్వరుని ఆశ్రయించాలని చెప్తారు. అప్పుడు రుషులు పరమేశ్వరుని వద్దకు వెళ్తారు. రాక్షసుల నుంచి తమను కాపాడాలని కోరుతారు. అప్పుడు శివుడు గుర్రం మీద వచ్చి మార్తాండ బైరవునిగా మారి మణి అసురా, మల్లాసురా అనే ఇద్దరి రాక్షసులతో యుద్ధం చేస్తారు. ఇద్దరి రాక్షసులను సంహరిస్తారు. ఆయితే ఆరాక్షసులు మరణించే ముందు శివున్ని వరం ఇవ్వాలని కోరుతాయి. ప్రతి ఏటా విజయదశమి రోజున తమకు నరబలి ఇవ్వాలని కోరడంతో అందుకు సమ్మతించని శివుడు రక్తతర్పణం చేస్తున్నట్లుగా రాక్షసులకు చెబుతారు. శివుని ఆజ్ఞ మేరకు అప్పటి నుంచి ఉత్సవం రోజున నెరణికి గ్రామం కంచాబీర వంశానికి చెందిన గోరవయ్యల తోడ నుంచి రాక్షసపడి వద్ద రక్తతర్పణం చెయడం ఆచారం. శివుడు చేపాకారంలా ఉన్నా కొండ గుహలో కూర్మావతారంలో వెలిశారని ప్రతీతి. శివునికి వాహనం నంది ఆయితే ఇక్కడ అశ్వం(గుర్రం)కావడం విశేషం. ఈ పురాణ గాధ ఆధారంగా దేవరగట్టులో విజయదశమి రోజున బన్ని ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

భారీ పోలీసు బందోబస్తు
దసరా పురస్కరించుకుని ఈ ఏడాది కూడా బన్ని ఉత్సవం నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. బన్ని ఉత్సవంలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్రల సమరంలో పట్టుడు కర్రలు ఉపయోగించడం వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. ఉత్సవాన్ని ఉత్సవంగా నిర్వహించుకోవాలని, ఉత్సవం పేరుతో రక్తపాతం వద్దని సూచించారు. ప్రజలు ఆచారానికే పెద్ద పీట వేసే అవకాశం ఉండడంతో జిల్లా ఎస్పీ గోపినాథ్‌జెట్టి, డీఎస్పీ అంకినీడు ప్రసాద్‌తో పాటు దాదాపు వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవంలో అల్లర్లు, అరాచకాలు సృష్టించే 28 మందిపై బైండోవర్ కెసులు బనాయించినట్లు పోలీసులు తెలిపారు. దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాలను భక్తులు వియవంతం చేయాలని ఆలయం కమిటీ తాత్కాలిక చైర్మన్ బి.ముద్దుబసవనగౌడ కోరారు. ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఉత్సవాలకు ఆంధ్రా, కర్ణాటక ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హజరవుతారని తెలిపారు.కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Updated By ManamWed, 10/17/2018 - 09:22

Road Accident In Kurnoolకర్నూల్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూరు మండలం, పెద్ద హోతురు సమీపంలో ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. పిల్లలకు వెంట్రుకలు తీయించడానికి ఎల్లార్తి దర్గాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా కర్నూల్ నగరంలోని ఓల్డ్ టౌన్‌కు చెందిన వారీగా గుర్తించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారీ కాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదం వివరాలను జిల్లా అధికారులతో మాట్లాడి తెలుసుకున్న చంద్రబాబు.. గాయాలపాలైన వారికి తక్షణం వైద్య సాయం అందించాల్సిందిగా ఆదేశించారు.రాయలసీమవాసులకు ‘పిడుగు’ హెచ్చరిక

Updated By ManamWed, 09/26/2018 - 09:49

Thunder Strikeఅమరావతి: రానున్న 24 గంటల్లో రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూల్లో జిల్లాలకు ఈ ప్రభావం ఉందని తెలిపింది. అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ, వజ్రకరూర్, గుంతకల్.. కడప జిల్లాలోని లింగాల.. కర్నూల్ జిల్లాలోని హాల్వహర్వి, చిప్పగిరి మండలాలలో రాబోయే 24గంటల్లో పిడుగులు పడతాయని ఆ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమైన సందర్భాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.ఏపీకి ప్రత్యేక హోదాపై రాహుల్ హామీ

Updated By ManamTue, 09/18/2018 - 15:36
Will give special status to AP: Rahul Gandhi

కర్నూలు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. ఆయన మంగళవారం కర్నూలులోని  బైరెడ్డి కన్వెన్షన్ హాల్‌లో విద్యార్థులు, యువతతో ముఖాముఖీ అయ్యారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ..ఏపీకి కేంద్రం నుంచి ప్రత్యేక సాయం, మద్దతు అందాలన్నారు. ఉద్యోగాల కల్పనలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు. ఏపీలో స్వయం సహాయక సంఘాల పనితీరు బాగుందని, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.

ఉద్యోగాల కల్పనలో చైనా ముందుకు దూసుకుపోతుంటే భారత్ మాత్రం వెనకబడిపోయిందన్నారు. ప్రతిరోజు చైనా 50 వేల ఉద్యోగులు సృష్టిస్తే, మన దేశంలో మాత్రం కేవలం 450 ఉద్యోగాలు మాత్రమే లభిస్తున్నాయన్నారు. అలాగే 
మన దేశంలో చాలామంది పురుషులు..మహిళలను సమానంగా చూడరని, ఆ మైండ్ సెట్ మారాలని రాహుల్ అభిప్రాయపడ్డారు.

పురుషులతో పాటు స్త్రీ కూడా అన్నింటిలోనూ సామర్థ్యం ఉందని తాను విశ్వసిస్తానన్నారు. పురుషులు చేసే ఏ పని అయినా మహిళలు కూడా చేస్తారని రాహుల్ పేర్కొన్నారు.అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ కూడా కొంతమంది చేతిలో చిక్కుకుపోయిందని రాహుల్ విమర్శించారు.కర్నూలులో రాహుల్ పర్యటన

Updated By ManamTue, 09/18/2018 - 12:41
 • ఏఐసీసీ అధ్యక్షుడు హోదాలో ఏపీలో తొలిసారి పర్యటన

 • రాహుల్‌కు ఘన స్వాగతం పలికిన ఏపీ కాంగ్రెస్ నేతలు

 • మాజీ సీఎం దామోదర సంజీవయ్య కుటుంబీకుల పరామర్శ

Rahul Gandhi in kurnool

కర్నూలు : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య కుటుంబీకులను పరామర్శించారు. సంజీవయ్య కుటుంబీలను పరామర్శించిన ఆయన వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబీకులను కలుసుకున్నారు.

అనంతరం కర్నూలులోని బైరెడ్డి కన్వెన్షన్ హాల్‌లో విద్యార్థులు, యువకులతో రాహుల్ ముఖాముఖీ కానున్నారు. సాయంత్రం ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాహుల్ తో పాటు ఊమెన్ చాందీ, రఘువీరారెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

కాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక తొలిసారి రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న రాహుల్‌కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ముందుగా రాహుల్ గాంధీ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్నూలుకు బయల్దేరి వెళ్లారు. 

Related News