వ‌ల‌స కార్మికుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆదుకోవాలి :  కిషన్ రెడ్డి 

వ‌ల‌స కార్మికుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆదుకోవాలి :  కిషన్ రెడ్డి 

పలు రాష్ట్రాల్లో పనుల కోసం వెళ్లిన వలస కార్మికులు, చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులను ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆదుకోవాల‌ని కేంద్ర హోంశాక స‌హాయ మంత్రి జి.కిష‌న్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా ఎటూ వెళ్లలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వ‌ల‌స కార్మికులు, చ‌దువుకునేందుకు వ‌చ్చిన‌ విద్యార్థుల‌ ఆలనాపాలనా చూడాల్సిన  బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని జి.కిషన్‌రెడ్డి ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. కార్మికులను పనిచేసే చోట ఉండనివ్వడం లేదని, సొంతూర్లకు వెళ్లేందుకు మార్గం లేదని, దీంతో ఆకలితో అలమటిస్తున్నారన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 
అలాగే, పలు నగరాల్లో చదువుకుంటున్న విద్యార్థులను వసతి గృహాల నిర్వాహకులు బయటకు పంపేస్తుండడంతో వారు కూడా దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వారి ఆహారం, వసతి, సామాజిక దూరం పాటించడానికి తగిన సౌకర్యాలు కల్పించవలసిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు భారత ప్రభుత్వ హోం శాఖ సూచనలు జారీ చేసింది.